రైతుల నుండి పశువుల పేడను సేకరించే పథకాన్ని ప్రారంభించాలని వ్యవసాయంపై ఏర్పాటైన స్టాండింగ్ కమిటీ కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేసింది. 2021 మార్చి 9 లోక్‌సభలో ప్రవేశపెట్టిన స్టాండింగ్ కమిటీ నివేదిక రైతుల ఆదాయం పెంచేందుకు తీసుకోవలసిన చర్యలను సూచిస్తూ ఈ మేరకు సిఫారసు చేసింది. ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం అమలు చేస్తున్న ఆవు పేడ సేకరణ పథకం ‘గోధన్ న్యాయ్ యోజన’ (Godhan Nyay Yojana) ను స్థాయీ సంఘం ప్రత్యేకంగా తన నివేదికలో ఉటంకించింది.
2021-22 సంవత్సరానికిగాను వ్యవసాయ, సహకార, రైతు సంక్షేమ శాఖలకు సంబంధించిన (నిధుల) పద్దులను ఈ స్టాండింగ్ కమిటీ పరిశీలించింది. రైతుల నుండి నేరుగా పశువుల పేడను సేకరించడం వల్ల వారి ఆదాయం పెరుగుతుందనీ, దీని ద్వారా రైతుల ఉపాధి అవకాశాలను మెరుగుపరచవచ్చుననీ కమిటీ పేర్కొంది. అంతేగాక, విచ్చలవిడిగా వీధుల్లో పశువులు తిరుగాడే సమస్యను పరిష్కరించడానికి కూడా ఇది తోడ్పడగలదని కమిటీ నివేదిక అభిప్రాయపడింది. మన దేశంలో పశువుల సంఖ్య విస్తారంగా ఉన్నందున మరింతగా సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించడం అవసరమని నివేదిక సిఫారసు చేసింది.

ఛత్తీస్ గఢ్‌లో ఆవుపేడ కొనుగోలు

ఈ చర్యల్లో భాగంగా పశుసంవర్ధక శాఖ, పాడిపరిశ్రమ శాఖల సమన్వయంతో రైతుల నుండి పశువుల పేడను సేకరించే పథకాన్ని ప్రారంభించాలని కమిటీ సిఫారసు చేస్తోంది… అని నివేదిక పేర్కొంది. ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం రైతుల నుండి ఆవు పేడను కిలోకు రూ. 2 చొప్పున చెల్లించి కొనుగోలు చేస్తోందనీ, వర్మి కంపోస్టుగా ప్రాసెస్ చేసిన తర్వాత ఆ ఎరువును కిలోకు రూ. 8 చొప్పున తిరిగి అవసరం ఉన్నవారికి అమ్ముతోందనీ ఈ నివేదిక ఉదాహరించింది. (ఛత్తీస్ గఢ్ రాష్ట్రంలో రైతులకు అదనపు ఆదాయం కల్పించడం కోసం ‘గోధన్ యోజన’ కింద వ్యవసాయదారుల నుండి ఆవుపేడను కొనుగోలు చేస్తోంది. 2020 జూలైలో దీన్ని ప్రారంభించారు)
ఈ సిఫారసు చేయడానికి ముందు, బిజెపి సభ్యుడు పర్వతగౌడ చందనగౌడ గడ్డిగౌడర్ నేతృత్వంలోని స్టాండింగ్ కమిటీ రైతుల నుండి పశువుల పేడను కొనుగోలు చేసే పథకాన్ని ప్రారంభించాలని వ్యవసాయ మంత్రిత్వ శాఖ అధికారులను కోరింది.
ఇదిలావుండగా, వ్యవసాయ శాఖ నిధులను పూర్తిగా ఖర్చు చేయకుండా తిరిగి అప్పగించడంపై కమిటీ అసంతృప్తి వ్యక్తం చేసింది. దీని వల్ల ప్రభుత్వ పథకాల అమలు దెబ్బతింటుందని కమిటీ అభిప్రాయపడింది. 2019-20, 2020-21 సంవత్సరాల్లో కేంద్రవ్యవసాయ శాఖ వరుసగా రూ. 34,517.70 కోట్లు, రూ. 17,849.89 కోట్ల (తాత్కాలికం) మేరకు నిధులను ఖర్చు చేయకుండా తిరిగి అప్పగించడం జరిగిందని కమిటీ తెలిపింది.
“లక్ష్యాలను సాధించడానికి, రైతులకు ప్రయోజనం చేకూర్చడానికి వివిధ పథకాల కింద అందుబాటులో ఉన్న నిధులను గరిష్ఠంగా వినియోగించుకోవాలని కమిటీ భావిస్తోంది. ఈ అంశంపై రాష్ట్ర ప్రభుత్వాలు, ఇతర సంబంధిత సంస్థలను సంప్రదించి వ్యవసాయ శాఖ తగిన చర్యలు చేపట్టాలని కమిటీ సిఫారసు చేస్తోంది” అని స్థాయీ సంఘం నివేదిక పేర్కొంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here