పచ్చిమిర్చికి ప్రపంచ వ్యాప్తంగా ఎప్పుడూ మంచి డిమాండ్‌ ఉంది. ప్రతి ఇంటి వంటలోనూ పచ్చిమిర్చి వాడడం సర్వసాధారణం. రుతువులు, కాలాలతో సంబంధం లేకుండా ప్రతి రోజూ పచ్చిమిర్చి వాడుకుంటారు. చట్నీ నుంచి పప్పు వరకు పచ్చిమిర్చి వేయనిదే రుచి రాదు. ఘాటు, రంగు, రుచి కోసం ఆహార పదార్థాల్లో పచ్చిమిర్చిని వాడతారు.కాస్త కారంగా అనిపించినా మిర్చితో ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో ఉన్నాయి. ఆహారంలో రోజూ పచ్చి మిరపకాయలు తీసుకోవడం వల్ల రక్తనాళాల్లో అడ్డంకులు తొలగిపోతాయి. కొలెస్ట్రాల్‌ స్థాయిలు తగ్గుతాయి. గుండెకు మంచి పోషణ ఇస్తుంది. గుండెపోటు రాకుండా పచ్చిమిర్చి సాయపడుతుంది. పచ్చిమిర్చిలో విటమిన్ ఏ, బీ6, కాల్షియం, మెగ్నీషియం, ఫోలేట్‌, పొటాషియం, థయామిన్‌, ఐరన్‌, కాపర్‌ లాంటి మినరల్స్‌ పుష్కలంగా ఉంటాయి. పచ్చిమిర్చి మన శరీరంలోని కొవ్వును కరిగిస్తుంది. శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్‌ ఏజెంట్‌ లా పనిచేస్తుంది. ఊబకాయం, అధిక బరువు సమస్యలు పచ్చిమిర్చితో తగ్గిపోతాయి. రొమ్ము క్యాన్సర్‌, ప్రోస్టేట్‌ క్యాన్సర్‌, కొలొరెక్టల్‌ క్యాన్సర్‌, ఊపిరితిత్తుల క్యాన్సర్‌, గ్యాస్ట్రిక్‌ క్యాన్సర్‌, పాంక్రియాటిక్‌ క్యాన్సర్‌ లాంటి పలు క్యాన్సర్‌ కణాల నిరోధిస్తుంది. టైప్‌ 2 షుగర్ వ్యాధిని నియంత్రిస్తుంది. పచ్చిమిర్చిలో ఎక్కువ మోతాదులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు వృద్ధాప్య ఛాలను తగ్గిస్తుంది. రోగనిరోధక శక్తి ఇస్తుంది. పచ్చిమిర్చిని క్రమం తప్పకుండా తిన్న వారికి ఆర్థరైటిస్‌ నొప్పులు తగ్గుతాయని పలు అధ్యయనాలు, పరిశోధనల్లో స్పష్టం అయింది.మరి.. ఇన్ని లాభాలు, ప్రయోజనాలు ఉన్న పచ్చిమిర్చి సాగులో మెళకువలు, ఏయే కాలాల్లో పండిస్తే రైతుకు లాభదాయకంగా ఉంటుంది? సాగు విధానాలు ఎలా అనుసరిస్తే ప్రతిఫలం ఎక్కువగా ఉంటుందో తెలుసుకుందాం. పచ్చిమిర్చికి అనువైన వాతావరణం, ఎప్పుడు మిర్చిమొక్కలు నాటుకుంటే అధిక దిగుబడితో పాటు మంచి లాభాలు వస్తాయో చూద్దాం. వేసవి కాలంలో పచ్చిమిర్చి మొక్కలు నాటుకోవచ్చా? నాటుకుంటే ఏ రకం వంగడాలు నాటుకోవాలో తెలుసుకుందాం.మన దేశంలో జూన్‌ నెలలో నైరుతి రుతుపవనాలు ఉత్తరాంధ్ర, తెలంగాణ, రాయలసీమలో కొంతభాగం, అనంతపురం జిల్లాలో వస్తాయి. అందువల్ల జూన్ నెలలో ఆయా ప్రాంతాల్లో మిర్చి నాటుకుంటే అంతగా మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. అయితే.. దక్షిణ కోస్తా ఆంధ్ర, చిత్తూరు జిల్లా, తమిళనాడు ప్రాంతాల్లో జూన్‌ నెలలో పచ్చిమిర్చి నాటుకుంటే ఎక్కువ లాభాలు పొందవచ్చని వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు.నైరుతి రుతుపవనాల ప్రభావం తక్కువగా ఉంటుంది, వర్షాలు తక్కువ కురుస్తాయి. అడపా దడపా వర్షాలు కురిసినా అక్టోబర్, నవంబర్ వరకు వాతావరణ స్థితి ఇలాగే ఉంటుంది. కాబట్టి పచ్చిమిర్చి సాగుకు దక్షిణ కోస్తా, తమిళనాడు, చిత్తూరు అనువైన ప్రాంతాలు అని చెప్పుకోవచ్చు. ఈ ప్రాంతాల్లో వేసవి కాలంలో పచ్చిమిర్చి పంట వేసుకోవచ్చు. ప్యారట్‌ గ్రీన్‌ రంగులో మృదువుగా ఉండే వీఎన్ఆర్‌ 145 రకం పచ్చిమిర్చిని వేసవి కాలంలో పైన చెప్పిన ప్రాంతాల్లో అన్నదాతలు సాగు చేసుకుంటే ఫలితం ఎక్కువగా వస్తుంది. వీఎన్‌ఆర్‌ 145 రకం పచ్చిమిర్చి 12 నుంచి 16 సెంటీమీటర్ల వరకు వస్తుంది. 1.2 సెంటీమీటర్ల నుంచి 1.4 వరకు లావు ఉంటుంది. ఈ రకం మిర్చిని ఫిబ్రవరి నుంచి జూన్‌ నెలల మధ్యకాలంలో వేసవి పంటగా మొదటిసారిగా నాటుకోవచ్చు. రెండో పంటగా అక్టోబర్‌ లో కూడా వీఎన్‌ఆర్‌ 145 రకం మిర్చిని నాటుకునేందుకు అనువైన రకంగా నిపుణులు వెల్లడించారు. ఎఫ్‌ 1 హైబ్రీడ్ రకం ఇది. మొక్క నాటిన 50 నుంచి 55 రోజుల లోగా పంట మొదటి కోత వస్తుంది. వీఎన్‌ఆర్‌ 145 మిర్చి పంటకు నల్లరేగడి, ఎర్రరేగడి, నీటిని నిల్వ ఉంచుకునే నేలలు అనువైనవి. క్షారభూముల్లో ఈ మిర్చి పంటకు అస్సలు పనికిరావు.వేసవి కాలపు మిర్చి పంటగా వేసుకునేందుకు నామ్‌ ధారి సీడ్స్‌ వారి ఎన్‌ఎస్‌ 1101 రకం కూడా అనువైన రకం అని వ్యవసాయ నిపుణులు సూచించారు. ఈ రకం మిర్చి 7 నుంచి 8 సెంటీమీటర్ల పొడవు పెరుగుతుంది. నున్నగా, ముదురు ఆకుపచ్చ రంగులో ఉండే ఈ రకం మిర్చి ఆకర్ణణీయంగా ఉంటుంది. ఈ రకం మిర్చి కాయ చర్మం పల్చగా ఉంటుంది. ఇది ఎర్రమిర్చిగా, పచ్చిమిర్చిగా కూడా వాడుకునేందుకు పనికొస్తుంది. మొక్క నాటిన 75 రోజుల్లో పంట కోతకు వస్తుంది. దీన్నే ఎండుమిర్చిగా పండించాలనుకుంటే 80 నుంచి 85 రోజుల్లో కోసుకోవచ్చు. వైరస్‌ ను,  థ్రిప్స్‌ ను ఇది బాగా తట్టుకుంటుంది.వీఎన్ఆర్ 978 ఎప్‌ 1 హైబ్రీడ్ చిల్లీ కాయలు బాగా పొడవుగా ఎదుగుతాయి. 20 నుంచి 24 సెంటీమీటర్ల దాకా ఎదుగుతాయి. 1.3 నుంచి 105 సెంటీమీటర్ల వెడల్పు వస్తుంది. దీని రంగు చిలకాకు పచ్చ రంగు. ఈ రకం మిర్చి మొక్కల్ని సాలుకు సాలుకు మధ్య మూడు అడుగులు, మొక్కకు మొక్కు మధ్య ఒకటిన్నర అడుగుల దూరం ఉండేలా నాటుకోవాలి. ఈ విధంగా మొక్కల్ని నాటుకున్నప్పుడు మంచి దిగుబడి వస్తుంది. వీఎన్‌ఆర్‌ ఉన్నతి కూడా ఎఫ్‌ 1 రకం హైబ్రీడ్‌ రకం. ఈ రకం విత్తనాలు 10 గ్రాముల ప్యాకెట్లలో లభిస్తాయి.  మొక్కలు నాటిన 40 నుంచి 45 రోజుల్లో పంట కోతకు వచ్చేస్తుంది. అత్యధిక దిగుబడి ఇచ్చే రకం ఈ పచ్చిమిర్చి. దీని కాయ పొడవు 9 నుంచి 11 సెంటీమీటర్ల వరకు ఉంటుంది. ఈ రకం మిర్చి మొక్కలు బాగా ఎదగాలంటే నాటిన తొలి రోజుల్లో మంచి పోషకాలు వాడాల్సి ఉంటుంది. పశువుల ఎరువు ఎక్కువగా చల్లుకోవాలి. దూరపు ప్రాంతాలకు ఎగుమతి చేయడానికి ఈ రకం మిర్చి అనువైనది.వేసవిలో పచ్చిమిర్చి సాగు చేయాలనుకునే వారు ఏప్రిల్ నెల నుంచి నారు పోసుకోవచ్చు. ఏప్రిల్‌ లో నారు పోస్తే.. మే నెల మధ్యలో నారు నాటుకునేందుకు వస్తుంది. నారును జాగ్రత్తగా పెంచుకుని మే నెల 15 తేదీ తర్వాత నాటుకుంటే.. అడపా దడపా కురిసే వానలతో మిర్చి మొక్కలు బాగా పెరుగుతాయి. మిర్చి సాగుకు వాటర్ మేనేజ్ మెంట్‌ బాగుండాలి. వేసవిలో మిర్చి పంట చేతికి వచ్చేలా సాగు చేసుకుంటే మంచి ధర పలికే అవకాశం ఉంది. తద్వారా మంచి లాభాలు కూడా పొందవచ్చు.

 

 

 

 

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here