మొక్కజొన్న సాగులో కష్టం తక్కువ.. ప్రతిఫలం ఎక్కువ. చీడపీడల బెదడ తక్కువ. డిమాండ్ ఎక్కువ. సస్యరక్షణ చర్యలు పెద్దగా చేపట్టక్కర్లేదు. నిర్వహణ కూడా చాలా సులువు. పెట్టిన పెట్టుబడికి నష్టం రాదు. లాభదాయకంగా ఉంటుంది. అవసరం అయితే.. పశువులకు దాణాగా అమ్ముకున్నా మొక్కజొన్నతో లాభమే. మొక్కజొన్న అందరికీ ఆరోగ్యాన్నిస్తుంది. అనేక రకాలుగా ఆరోగ్య ప్రదాయిని అని మొక్కజొన్న గురించి చెప్పుకోవచ్చు.ఫైబర్‌ ఎక్కువగా ఉన్న ఆహార పదార్థాల్లో మొక్కజొన్న ఒకటి.  దీంట్లో విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు కూడా అధికంగా ఉన్నాయి. ఐరన్‌, ఫోలిక్‌ యాసిడ్‌, విటమిన్‌ బీ 12 ఎక్కువగా ఉండే మొక్కజొన్న తింటే ఎర్ర రక్తకణాల పెరుగుదల సమర్ధంగా ఉంటుంది. బలహీనంగా ఉన్నవారికి మొక్కజొన్న ఎక్కువ శక్తిని ఇస్తుంది. మొక్కజొన్న నెమ్మదిగా జీర్ణం అవుతుంది కనుక ఎక్కువ సమయం మనకు శక్తిని ఇస్తుంది. 100 గ్రాముల మొక్కజొన్నలో 21 గ్రాముల పిండిపదార్థం ఉంటుంది. మొక్కజొన్న మెదడు, నాడీ వ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తుంది.మొక్కజొన్న నుంచి 10 గ్రాముల రెసిస్టెంట్‌ స్టార్చ్‌ తీసుకుంటే గ్లూకోజ్‌, ఇన్సులిన్‌ రియాక్షన్లను గణనీయంగా తగ్గిస్తుంది. ఫైబర్ ఎక్కువగా ఉండడం వల్ల డయాబెటిక్ రోగుల్లో చక్కెర స్థాయిలు క్రమంగా తగ్గుగాయి. నెమ్మదించిన రక్త ప్రవాహాన్ని వేగవంతం చేస్తుంది. కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది. మొక్కజొన్నలో కెరోటినాయిడ్లు ఉంటాయి. కంటి చూపును మెరుగు పరుస్తుంది. మన బరువును నియంత్రించడంలో మొక్కజొన్న బాగా ఉపయోగపడుతుంది. ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టే ప్రపంచంలో అత్యధిక ప్రాచుర్యం ఉన్న ధాన్యాల్లో మొక్కజొన్న నిలిచింది.ఇలాంటి మొక్కజొన్న సాగులో కష్టనష్టాలు, సాగు విధానాలు, సస్య రక్షణ, నిర్వహణ విషయాల గురించి తెలుసుకుందాం.  మొక్కజొన్న సాగులో కష్టం తక్కువ, లాభం ఎక్కువ ఉందని రంగారెడ్డి జిల్లా మాడ్గుల మండలం కుర్మేడు రైతు నాదిరి రవి చెప్పారు. రవి మూడేళ్లుగా పొలం కౌలుకు తీసుకుని గంగ కావేరి మొక్కజొన్న పంట సాగు చేస్తున్నారు. అంతకు ముందు రవి పత్తి, మిర్చి లాంటి పంటలు సాగు చేశారు. అయితే.. మొక్కజొన్న సాగుతో తాను లాభపడినట్లు తెలిపారు.మొక్కజొన్న సాగుకోసం ముందుగా భూమిని రెండుసార్లు దుక్కి దున్నుకోవాలి. దుక్కి దున్నేటప్పుడే పశువుల ఎరువు కలుపుకుంటే సరిపోతుంది. ఆపైన అవసరం అనుకుంటేనే ఎరువులు వేసుకోవచ్చు. పశువుల ఎరువు దుక్కిలో వాడుకుంటే రసాయన ఎరువుల జోలికి వెళ్లకపోయినా పరవా లేదు. దుక్కి దున్నిన తర్వాత మట్టిని బోదెలుగా చేసుకోవాలి. సాలుకు ఇరు వైపులా మొక్కజొన్న విత్తనాలు అర అడుగు దూరంలో నాటుకోవాలి. 8 కిలోల మొక్కజొన్న విత్తనాలు ఎకరాకు సరిపోతాయి. నాలుగు కిలోల మొక్కజొన్న విత్తనం ప్యాకెట్‌ సుమారు 12 వందల రూపాయలు పడుతుంది. అంటే 8 కిలోల విత్తనాలకు రూ.2,400 ఖర్చు అవుతుంది. కొంచెం ఖర్చుకు వెనకాడని రైతు అయితే.. డ్రిప్ ఇరిగేషన్ విధానం విత్తనం నాటక ముందే ఏర్పాటు చేసుకోవచ్చు. లేదా నీటి సదుపాయం ఉన్న చోట అయితే.. బోదెల ద్వారా కూడా సాగునీటిని మొక్కలకు అందించవచ్చు. మొక్కజొన్న నాటిన ఐదు రోజులకు మొలకలు వస్తాయి. విత్తు నాటిన 45 రోజుల నుంచి కంకులు వస్తాయి. 105 రోజులకు మొక్కజొన్న పంట చేతికి వచ్చేస్తుంది. డ్రిప్ వేస్తే.. రైతుకు కష్టం మరింత తక్కువ ఉంటుంది. పంట కూడా ఎకరాకు 40 క్వింటాళ్ల వరకు దిగుబడి వచ్చే అవకాశం ఉంది.మొక్కజొన్నకు వేరే పురుగులు, తెగుళ్లు రావు. అయితే.. మొయిలాల పురుగు ఒకటి వచ్చే అవకాశం ఉంది. దాని నివారణ కోసం విత్తనంవేసిన నెల రోజుల్లోపల హితోరా, కుపిలింగ్‌ లాంటి మొయిలాల పురుగుమందు వేసుకోవాలి. అలా రెండుసార్లు మొయిలాల పురుగు మందు వేసుకుంటే మొక్కజొన్నకు పురుగుల బెడద తప్పుతుంది. మొక్కజొన్న కంకి ఈనే దశకు వచ్చిందంటే పురుగు బెడద ఉండదు.మొక్కజొన్న పంట విక్రయానికి పెద్దగా శ్రమ పడక్కర్లేదు. డెయిరీ ఫాంలు, కోల్లఫాంలు నిర్వహించే రైతులు వచ్చి మొక్కజొన్న పంటను కొనుగోలు చేసి, కోసుకుని వాళ్లే తీసుకుపోతారు. అంటే.. మొక్కజొన్న కోత, రవాణా ఖర్చులు కూడా రైతుకు ఉండవు. ఎకరం భూమిలో మొక్కజొన్న సాగుకు ఖర్చు సుమారు 20 వేల రూపాయలు వస్తుంది. అందులోనే దుక్కి, బోదెలు కొట్టడం, విత్తనాల ఖర్చు, నాటిన కూలీల ఖర్చు, నీటి సరఫరాకు అయ్యే ఖర్చు, మందుల ఖర్చు అన్నీ ఇందులోనే సరిపోతాయి. ఎకరంలో మొక్కజొన్న సుమారు 35 క్వింటాళ్ల వరకు దిగుబడి వస్తుంది. ఆ మొత్తం అమ్మితే.. 40 నంచి 50 వేలు దాకా ఆదాయం ఉంటుంది. అంటే సుమారు 25 నుంచి 30 వేల వేల వరకు లాభం వస్తుంది. మొక్కజొన్న పొలంలో కలుపు వస్తే.. రూ.17 వందలు ఖరీదు ఉండే గడ్డిమందు కొడితే సరిపోతుంది. ఆ మందు ఒకటిన్నర ఎకరాలకు సరిపోతుంది.మొక్కజొన్న వేసవికాలం పంటగా సాగు చేయాలంటే.. డిసెంబర్ నెలలో విత్తనాలు నాటుకోవాలి. వానాకాలం పంటగా వేసుకోవాలంటే.. జూన్, జులై నెలల్లో విత్తులు వేసుకోవాలని రైతు రవి వెల్లడించారు. కేవలం రెండు సీజన్లు అనే కాకుండా నీటి సౌకర్యం సరిగా ఉంటే అన్ని కాలాల్లోనూ మొక్కజొన్న పంట పండించుకోవచ్చు. ఏడాదిలో మూడు పంటలు కూడా మొక్కజొన్న పంట తీయవచ్చు.ఒక్క మనిషితో మొక్కజొన్న సాగు నిర్వహణ సులువుగా చేసుకోవచ్చని రైతు నాదిరి రవి తన అనుభవంతో వివరించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here