ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుని సుస్థిర వ్యవసాయ అభివృద్ధి విధానాలను అభివృద్ధి పరిచే దిశలో భారతీయ వ్యవసాయ పరిశోధన మండలి (ICAR), కృషి విజ్ఞాన్ కేంద్రాలు (KVK) సంయుక్తంగా పలు చర్యలు చేపట్టాయి. ఇందులో భాగంగా ICAR 63 సమీకృత వ్యవసాయ నమూనాలను (Integrated Farming System- IFS) రూపొందించింది. ఈ నమూనాల రూపకల్పనలో 18 రాష్ట్రాలకు చెందిన వ్యవసాయ విశ్వవిద్యాలయాలు, వివిధ రైతుసంస్థలు పాలుపంచుకున్నాయి. ఈ నమూనాలు దేశంలోని 26 రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు అనువుగా ఉంటాయని భారతీయ వ్యవసాయ పరిశోధన మండలి ప్రకటించింది. ఈ వ్యవసాయ నమూనాలు రాగల మూడు, నాలుగేళ్లలో రైతుల ఆదాయాన్ని రెండు నుండి మూడు రెట్ల వరకు పెంచగలవని భావిస్తున్నారు.
ఇదిలావుండగా దేశంలోని 12 రాష్ట్రాలకు అనువుగా ఉండే 51 ఆర్గానిక్ పంటల విధానాలకు కూడా భారతీయ వ్యవసాయ పరిశోధన మండలి రూపకల్పన చేసింది. ఆయా పంటలను సేంద్రియ పద్ధతుల్లో ఎలా సాగు చేయాలో ఈ విధానాలు ప్రామాణికంగా వివరిస్తాయి. వీటి ద్వారా రైతుల ఆదాయం పెరగడమే కాకుండా పంటల సాగు విస్తీర్ణం కూడా పెరుగుందని అంచనా వేస్తున్నారు. అంతేగాక, ఇవి అంతర పంటల సాగుకు దోహదపడతాయనీ, పంటల పెట్టుబడి వ్యయాలను సైతం 30 నుంచి 72 శాతం దాకా తగ్గిస్తాయనీ భావిస్తున్నారు. మరోవైపున ఈ నమూనాల వల్ల రాగల ఐదేళ్లలో 22 శాతం దాకా భూసారం పెరుగుతుందని ICAR విశ్వసిస్తోంది. ఈ విధానాల అమలు వల్ల సగటున ఏటా 400 నుండి 950 వరకూ మానవ పని దినాలు కూడా పెరగగలవని అంచనా.
ప్రస్తుతానికి ఆయా రాష్ట్రాల్లో, జిల్లాస్థాయిలో 722 కృషి విజ్ఞాన్ కేంద్రాల ద్వారా ఈ సరికొత్త వ్యవసాయ నమూనాలను చేపట్టారు. గత సంవత్సర కాలంలో కృషి విజ్ఞాన్ కేంద్రాలు 16.82 లక్షల మంది రైతులకు ఈ సుస్థిర వ్యవసాయ నమూనాలకు సంబంధించిన శిక్షణనిచ్చాయి. అనంతరం 183.66 లక్షల మంది రైతులను ఇందులో భాగస్వాములుగా చేసి నిరుడు 10 లక్షలకు పైగా వ్యవసాయ పరిశోధన కార్యక్రమాలు నిర్వహించాయి. 2.44 లక్షల పంట భూముల్లో వివిధ రకాలైన పైర్లపై వీటిని ప్రత్యక్షంగా ప్రయోగించి చూశారు. ఇంకోవైపు 2019-20 నుండి దేశంలోని 8,220 హెక్టార్లలో 441 కృషి విజ్ఞాన్ కేంద్రాల భాగస్వామ్యంతో “పరంపరాగత్ కృషి వికాస్ యోజన” (PKVY) ను అమలు చేస్తున్నారు. ఇందులో భాగంగా 22,240 మంది రైతులకు ఆర్గానిక్ వ్యవసాయంలో తగిన శిక్షణనిచ్చారు.
కాగా, ప్రతికూలమైన వాతావరణాన్ని, చీడపీడలను సైతం తట్టుకుని నిలిచే పంట రకాలపై ICAR పరిశోధనలు నిర్వహిస్తోంది. ఇలా గత ఆరేళ్లలో 910 రకాల పంటల వంగడాలను ICAR అభివృద్ధి పరిచింది. వీటిలో 37 వెరైటీలు వరదలను, అతివృష్టినీ తట్టుకుని నిలవగలిగేవి కాగా, 137 రకాలు అనావృష్టినీ, నీటి ఎద్దడినీ తట్టుకుని పెరగగలవని ICAR తెలిపింది. ఈ వంగడాలను ICAR విడుదల చేశాక వాటి సర్టిఫికేషన్ ప్రక్రియకు, మార్కెటింగ్ ఏజెన్సీల గుర్తింపుకు మూడు నుంచి నాలుగేళ్ల కాలం పడుతుంది.
హరిత ఎరువులు, బయో ఫర్టిలైజర్లు, కంపోస్టులు, ఆయిల్ కేక్‌లు, వెర్మి కంపోస్టులు, బయో పెస్టిసైడ్లు, పంటల పోషకాల వంటివి ఈ నమూనా ప్యాకేజీల్లో భాగంగా ఉంటాయి. భోపాల్‌లోని ICAR-IISS భూసారాన్ని పెంచే పలు బయో ఎరువులను తయారుచేసింది. ఇవన్నీ క్రమంగా ఆర్గానిక్ రైతులకు అందుబాటులోకి రానున్నాయి. మొత్తంమీద దేశంలో మున్ముందు ఆర్గానిక్ వ్యవసాయ విధానాలకు మరింత ప్రాధాన్యం పెరుగుతుందని భావించవచ్చు.
(రాజ్యసభలో ఒక ప్రశ్నకు 2021 ఫిబ్రవరి 5న కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ లిఖిత పూర్వకంగా ఇచ్చిన సమాధానం ఆధారంగా)

ఆసక్తిగలవారు మరిన్ని వివరాలకు ఈ క్రింది చిరునామాను సంప్రదించవచ్చు.
Public Relations Officer
Phone: 91-11-25843301
https://icar.org.in/
Indian Council of Agricultural Research
Krishi Bhavan, Dr. Rajendra Prasad Road, New Delhi-110001.

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here