రైతులకు సకాలంలో ఎలాంటి ఇబ్బందులూ లేకుండా రుణ సదుపాయం కల్పించేందుకు వీలుగా వ్యవసాయదారులను సంస్థాగత రుణంతో అనుసంధానం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రైవేటు రంగ రుణవ్యవస్థతో పోల్చుకుంటే ప్రభుత్వరంగ బ్యాంకులు, ద్రవ్యసంస్థల నుండి సమకూర్చే సంస్థాగత పరపతి చౌకగా అందుబాటులో ఉండటం వలన రైతుల పంట ఉత్పత్తి వ్యయంతో దీనికి ప్రత్యక్ష సంబంధం ఉంటుంది.
గత కొన్ని సంవత్సరాలుగా ఈ క్షేత్ర స్థాయి రుణ వితరణ చెప్పుకోదగిన పురోగతి కనబరచిందని ప్రభుత్వం పేర్కొంది. ఇది నిర్దేశించుకున్న లక్ష్యం కంటే ఎక్కువగానే నమోదు అవుతోందని తెలిపింది. క్షేత్ర స్థాయి రుణం 2013-14లో రూ. 7.30 లక్షల కోట్లు కాగా 2019-20 సంవత్సరానికి అది రూ. 13.92 లక్షల కోట్లకు చేరి 40.5% వృద్ధి నమోదైంది. కాగా, 2020-21 సంవత్సరానికిగాను వ్యవసాయ రుణ లక్ష్యాన్ని రూ.15 లక్షల కోట్లుగా నిర్ణయించారు. అదే ధోరణి కొనసాగిస్తూ తరువాత కూడా కేటాయింపులకు రంగం సిద్ధమైంది. కోవిడ్ 19 సంక్షోభ సమయంలోనూ రుణ పంపిణీలో పురోగతి కొనసాగడం విశేషం. జనవరి 2021 నాటికి రైతుల క్షేత్రస్థాయి రుణ వితరణలో 76% లక్ష్యం సాధించగలిగారు.
మన దేశ వ్యవసాయ రంగంలో ప్రధానంగా చిన్న, సన్నకారు రైతులే ఎక్కువ. వీరి సంఖ్య 1970-71 లో 491 లక్షలు ఉండగా 2015-16 నాటికి అది 1,260 లక్షలకు చేరింది. అంటే, వీరి సంఖ్య 156% పెరిగిందన్నమాట. 2010-11 నుంచి 2019-20 వరకు క్షేత్ర స్థాయి రుణం లబ్ధిదారుల్లో చిన్న, సన్నకారు రైతుల పెరుగుదల 17.8%. అలాగే మొత్తం క్షేత్రస్థాయి రుణంలో చిన్న, సన్నకారు రైతుల వాటా 2010-11లో 35% ఉండగా అది 2021-22లో 52% మేరకు పెరిగింది.
2013-14 నుంచి 2020-21 కాలంలో క్షేత్రస్థాయి రుణప్రవాహాన్ని దృష్టిలో పెట్టుకొని 2021-22 సంవత్సరానికిగాను పరపతి సదుపాయాన్ని రూ.16.5 లక్షల కోట్లుగా నిర్ణయించారు. రైతులకు వడ్డీ చెల్లింపు పథకం కింద ప్రభుత్వం రైతులకు రూ. 3 లక్షల దాకా స్వల్ప కాలిక రుణం ఇస్తుంది. దీనిమీద వడ్డీ కేవలం ఏడాదికి 4% మాత్రమే ఉంటుంది. ముందుగా పంటరుణం మీద 7% వడ్డీ ఉండగా సకాలంలో చెల్లించిన వారికి 3% వడ్డీ రాయితీ ఇస్తారు. ఫలితంగా వడ్డీ రేటు 4% గా ఉంటుంది.
కేంద్ర ప్రభుత్వం కిసాన్ క్రెడిట్ కార్డులను సంతృప్త స్థాయికి చేర్చటానికి 2020 ఫిబ్రవరి 10 న మొదటి దశ ప్రత్యేక కార్యక్రమం చేపట్టగా ఇది ఏప్రిల్‌లో పూర్తయింది. కాగా, రెండో దశ జూన్ వరకూ కొనసాగింది. దీని కింద ఇప్పటివరకు 1.87 కోట్ల కిసాన్ క్రెడిట్ కార్డులను జారీచేశారు. అర్హులైన రైతులకు దీని మంజూరు పరిమితి రూ. 1.76 లక్షల కోట్లు. అదే విధంగా ప్రభుత్వం పశుగణాభివృద్ధి, మత్స్యాభివృద్ధి రైతులకు కూడా కిసాన్ క్రెడిట్ కార్డులను విస్తరించింది. అలా వారికి కూడా వడ్డీ మినహాయింపు ప్రయోజనం కల్పిస్తున్నారు.
2021-22లో క్షేత్రస్థాయి రుణ లక్ష్యాన్ని రూ. 16.5 లక్షల కోట్లకు పెంచటం ద్వారా రైతుల సంస్థాగత రుణాలకు సంబంధించిన రాయితీలు కూడా పెరుగుతాయి. దీంతో రైతుల అప్పుల మీద వడ్డీల భారం తగ్గి, ఆదాయం కూడా రెట్టింపు అవుతుంది. అందుబాటు వడ్డీకే రుణం లభించడం వలన రైతులు కూడా ఆధునిక వ్యవసాయ విధానాలు అవలంబిస్తారు. ఈ సుస్థిర వ్యవసాయ రుణ ప్రభావం వల్లనే కరోనా సంక్షోభ సమయంలోనూ దేశంలో వ్యవసాయ రంగం చురుగ్గా కొనసాగి మెరుగైన వృద్ధి నమోదైంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here