మధ్యప్రదేశ్ – ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రాల మధ్య విస్తరించి ఉండే ప్రాంతం బుందేల్ ఖండ్. ఝాన్సీ నగరం బుందేల్‌ ఖండ్‌లోనిదే. ప్రతి ఏడాదీ ఎండాకాలంలో ఇక్కడ నీటి ఎద్దడితో జనం సతమతమౌతూ ఉంటారు. నిరుడు ఒకపక్క కరోనా సంక్షోభం కొనసాగుతుండగా మరోపక్క బుందేల్‌ఖండ్‌లో నీటికి కరువొచ్చిపడింది. గుక్కెడు నీటి కోసం అంగలార్చే ఈ ప్రాంతంలో గుర్లీన్ చావ్లా అనే 23 ఏళ్ల యువతి స్ట్రాబెర్రీలను పండించి అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తారు. చివరికి ప్రధాని నరేంద్ర మోదీని కూడా. ఝాన్సీకి చెందిన గుర్లీన్ చావ్లా ఒక లా గ్రాడ్యుయేట్. పుణేలోని ఇండియన్ లా సొసైటీ లా కాలేజీలో చదువుకున్నారు.
కరోనా లాక్‌డౌన్ సమయంలో ఇంటికి వచ్చి ఉన్నప్పుడు ఈ అమ్మాయి ఒక హాబీగా మిద్దెపంట ప్రారంభించారు. టెర్రాస్‌పై టొమాటోల వంటి కూరగాయలతో పాటు కొన్ని రకాల పండ్ల మొక్కలనూ పెంచారు. అయితే స్ట్రాబెర్రీలంటే తనకెంతో ఇష్టం. పుణేలో ఉన్నప్పుడు స్ట్రాబెర్రీలు బాగా తినేవారు. దీంతో సరదాగా వాటిని కూడా పెంచాలని గుర్లీన్ చావ్లా అనుకున్నారు. 2020 మేలో పుణేలోని ఓ నర్సరీకి వెళ్లి 15 స్ట్రాబెర్రీ మొక్కలను తెచ్చుకున్నారు. కోకోపిట్ (కొబ్బరి) బ్యాగుల్లో వాటిని నాటి, రోజూ నీరు పోయడం మొదలుపెట్టారు. కొన్ని వారాల్లోనే 10 మొక్కలకు స్ట్రాబెర్రీలు కాసాయి. అయితే అవి సైజులో కాస్త చిన్నవిగా ఉండి పూర్తి స్థాయిలో పెరగలేదు. స్ట్రాబెర్రీ రైతులు కొందరిని సంప్రదిస్తే కోకోపిట్ బ్యాగుల్లో వాటిని పెంచకూడదని సలహా ఇచ్చారు. దీంతో మిద్దెపై కాకుండా నేలపైనే వాటిని పెంచితే బాగుంటుందని గుర్లీన్‌కు తోచింది. దాంతో తన తండ్రి కొన్నేళ్ల కిందట కొనుగోలు చేసి ఉంచిన భూమిలో వాటిని పెంచడం ప్రారంభించారు.

గుర్లీన్ చావ్లా పండించిన స్ట్రాబెర్రీస్

స్ట్రాబెర్రీ సాగులో మెళకువలు

తన సాగులో భాగంగా స్ట్రాబెర్రీల పెంపకంపై ఆమె అధ్యయనం చేయడం మొదలుపెట్టారు. కాస్త వదులుగా, నీరు అంతగా నిల్వ ఉండని నేలల్లో స్ట్రాబెర్రీ బాగా పెరుగుతుందని గమనించారు. అలాగే తక్కువ ఉష్ణోగ్రత ఉండే వాతావరణంలో వాటి పెరుగుదల ఎక్కవని గ్రహించారు. స్ట్రాబెర్రీల సాగుకు యాజమాన్యపద్ధతులేవీ పెద్దగా పాటించనవసరం లేదనీ, వాటికి చీడపీడల బెడద తక్కువనీ గుర్లీన్‌కు అర్థమైంది. అలా మొదలైంది తన స్ట్రాబెర్రీ సాగు. ఇప్పుడు ఆమె 1.5 ఎకరాల విస్తీర్ణంలో వాటిని పెంచుతూ లాభసాటిగా విక్రయిస్తున్నారు కూడా. అంత నీటి ఎద్దడి ఉన్న ప్రాంతంలో సైతం స్ట్రాబెర్రీలను గుర్లీన్ చావ్లా పెంచడం విశేషం.
గుర్లీన్ తండ్రి ఝాన్సీకి కొన్ని కిలోమీటర్ల దూరంలో, అప్పుడెప్పుడో ఏడెకరాల భూమిని కొనుగోలు చేశారు. కొనడమైతే కొన్నారు కానీ ఆ భూమిని ఎలా ఉపయోగించుకోవాలో వారికి తెలియలేదు. ఆ భూమిలో రైతులు లోగడ కూరగాయలు పండించేవారని గుర్లీన్‌కు తెలిసింది. దీంతో ఆ భూమిని స్ట్రాబెర్రీ సాగుకు సిద్ధం చేసేందుకు గుర్లీన్ ఆర్గానిక్ వ్యవసాయ నిపుణులను సంప్రదించారు. నీరు నిల్వ ఉండకుండా ఉండడం కోసం మట్టిని వరుసలుగా కాస్త ఎత్తు పోయించి గట్లలాగా తయారు చేసుకున్నారు. డ్రిప్ పెట్టించారు. 1.5 ఎకరాల భూమిని ఇలా సిద్ధం చేసుకున్నారు. ఆ తర్వాత పుణే వెళ్లి 20 వేల స్ట్రాబెర్రీ పిలకలను కొనుగోలు చేశారు. 2020 నవంబర్ రెండో వారంలో వాటిని పొలంలో నాటారు. ఈ మొక్కలకు రోజూ 10 నిమిషాల పాటు మాత్రమే నీరు అందిస్తూ వచ్చారు. 2020 డిసెంబర్ 25కల్లా గుర్లీన్ పొలంలో స్ట్రాబెర్రీల కాత మొదలైంది. కానీ మొదటి కాత చిన్నగా ఉండడంతో 12 కిలోల స్ట్రాబెర్రీలను ఇంటి అవసరాల కోసం వాడుకున్నారు.

యుపి సీఎం యోగి ఆదిత్యనాథ్‌తో గుర్లీన్ చావ్లా

పంట పండింది…

2020 డిసెంబర్ 28నాటికి రెండోకాత వచ్చేసింది. ఈసారి పూర్తి సైజులో పండాయి. మరో 12 కిలోల కాత వచ్చింది. వీటిని బంధుమిత్రులకు, ఇరుగు పొరుగువారికి ఇచ్చారు గుర్లీన్. అప్పటి నుంచి గుర్లీన్ పంట పండింది. సూపర్ మార్కెట్లు, పండ్ల దుకాణాలు, రెస్టారెంట్లను సంప్రదించి ఆమె తన స్ట్రాబెర్రీలను నేరుగా సరఫరా చేయడం ప్రారంభించారు. Jhansi Organics పేరుతో ఆమె ఒక వెబ్‌సైట్‌ కూడా నిర్వహించడం మొదలుపెట్టారు. ప్రతిరోజూ 60 నుంచి 65 కిలోల దాకా స్ట్రాబెర్రీలను ఆమె పండిస్తున్నారు. ఒక్కో కిలో రూ. 300దాకా పలుకుతోంది. గతంలో ఎక్కడెక్కడి నుంచో స్ట్రాబెర్రీలు తెప్పించుకునే రెస్టారెంట్లు, దుకాణాలు ఇప్పుడు గుర్లీన్ నుంచే వాటిని కొనుగోలు చేస్తున్నాయి. గుర్లీన్ స్ట్రాబెర్రీలు తాజాగానూ, రుచికరంగానూ ఉండడం దీనికి కారణం. ఈ స్ట్రాబెర్రీలతో మిల్క్‌ షేక్‌లు, పేస్ట్రీలు, ఐస్‌క్రీమ్‌లు వంటివి తయారు చేస్తారు.

స్ట్రాబెర్రీ ఫెస్టివల్

స్ట్రాబెర్రీ వినియోగంపై అవగాహన కల్పించేందుకు గుర్లీన్ 2021 జనవరిలో నెల పాటు స్ట్రాబెర్రీ ఫెస్టివల్ నిర్వహించారు. స్ట్రాబెర్రీలతో ఏమేం తయారుచేసుకోవచ్చో తెలియజెప్పడం ఈ ఫెస్టివల్ ఉద్దేశ్యం. స్ట్రాబెర్రీ డ్రింక్స్‌, డిషెస్ గురించి ఆమె విస్తృతంగా ప్రచారం చేశారు. స్ట్రాబెర్రీ క్రంబుల్ బార్స్, స్ట్రాబెర్రీ క్రీమీ వేఫర్స్, స్ట్రాబెర్రీ కస్టర్డ్ టార్ట్, స్ట్రాబెర్రీ కప్ కేక్స్, స్ట్రాబెర్రీ జామ్, స్ట్రాబెర్రీ పిజ్జా, స్ట్రాబెర్రీ శాండ్‌విచ్ వంటి తినుబండారాలను గుర్లీన్ తన వెబ్‌సైట్ ద్వారా విక్రయిస్తున్నారు. అంతేకాదు, స్ట్రాబెర్రీ సాగు మెళకువలను కూడా చెప్పి ఆమె పదుగురినీ స్ట్రాబెర్రీ పెంపకం దిశగా ప్రోత్సహిస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ 2021 జనవరి 31న తన “మన్‌ కీ బాత్‌” రేడియో ప్రసంగంలో గుర్లీన్ విజయాలను ప్రస్తావించారు. దీంతో ఇప్పుడు దేశంలో ఆమె పేరు మార్మోగుతోంది. గుర్లీన్ వినూత్నంగా నెలరోజుల పాటు స్ట్రాబెర్రీ ఫెస్టివల్‌ను నిర్వహించడాన్ని మోదీ ప్రస్తావించి ప్రశంసించారు. నీటి ఎద్దడిగల బుందేల్ ఖండ్ వంటి ప్రాంతంలో స్ట్రాబెర్రీలను సాగు చేయడం, ఫెస్టివల్స్ సైతం నిర్వహించడం విశ్వాసాన్ని నింపి, మన వ్యవసాయదారుల్లో ఉత్సాహాన్ని పెంచిందని ఆయన వ్యాఖ్యానించారు. మరోవైపు ఉత్తర్ ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ కూడా గుర్లీన్‌ను కలుసుకుని ఆమె కృషిని ప్రశంసించారు.
స్ట్రాబెర్రీలే కాకుండా మిగతా ఐదున్నర ఎకరాల భూమిలో గుర్లీన్ కూరగాయలు, పండ్లు కూడా పెంచుతున్నారు. బ్రాకోలీ, కాబేజ్, కాలీఫ్లవర్, టొమాటో, బొప్పాయి, అవకాడోలను ఆమె సాగుచేస్తున్నారు. అన్నీ ఆర్గానిక్ పద్ధతుల్లో పండించేవే. దీంతో గుర్లీన్ ప్రారంభించిన “ఝాన్సీ ఆర్గానిక్స్‌”కు మంచి ఆదరణ లభిస్తోంది. కొత్తగా ఆలోచించే గుర్లీన్ వంటి యువతులు నేటి యువతకు స్ఫర్తిదాయకంగా నిలుస్తారు.

ఆసక్తిగలవారు మరిన్ని వివరాలకు ఈ క్రింది చిరునామాను సంప్రదించవచ్చు.
Jhansiorganics
gurdeep@jhansiorganics.com
Phone: 088531 11944
https://jhansiorganics.com/

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here