పెరటితోట పెంపకం మన పూర్వీకుల నుండీ సహజసిద్దంగా వస్తున్న ఆనవాయితీ. ఈ ఆధునిక సమాజంలో కష్టానికంటే సుఖానికే ఎక్కువగా మొగ్గుచూపుతున్నాం మనం. ప్రస్తుత జనారణ్యంలో ఇంటి వద్ద ఖాళీ స్థలం ఉండే అవకాశమే ఉండడం లేదు. ఒక వేళ ఉన్నా సహజసిద్ధమైన నేలను సౌకర్యం పేరుతో సిమెంటుతో కప్పేసి కాంక్రీట్‌ జంగిల్ చేస్తున్నాం. పెరట్లో మొక్కలు పెంచుకుంటే రోజూ వాటికి చాకిరీ చేయాలని, ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తూ ఉండాలని అనుకుంటున్నాం మనం. అయితే.. పెరటి తోటతో మన శరీరానికి రోజూ చక్కని శారీరక శ్రమతో పాటు ఆరోగ్యం కలుగుతుందనే విషయాన్నే మరిచిపోయాం. విష రసాయనాలతో ఎవరో పండించిన పండ్లు, కూరగాయలు, ఇతర ఆహార దినుసులను డబ్బులు పోసి కొనుక్కోవడమే సులువైన పనిగా భావిస్తున్నాం. తద్వారా జబ్బుల్ని కొని తెచ్చుకుంటున్నాం అనేది నూటికి ఏ ఒక్కరో ఇద్దరో ఆలోచిస్తున్నారు. రోగగ్రస్తంగా మారిపోయిన ప్రస్తుత సమాజంలో పలువురిలో ప్రకృతి వ్యవసాయం, సహజ సిద్ధ ఆహారం, రోగాల బారి నుంచి తప్పించుకుని జీవించాలనే ఆలోచన ఇటీవలి కాలంలో పలువురిలో పెరిగింది. ఈ క్రమంలోనే అవకాశం ఉన్న అనేక మంది మిద్దెలపై తోటలు, పెరటి తోటల్లో ప్రకృతిసిద్ధమైన పంటలు పండించుకుంటున్నారు.అలా ప్రకృతిసిద్ధంగా తమ పెరట్లోనే సహజ పంటలు పండించుకుంటున్న ఔత్సాహిక రైతు అనుభవాలు తెలుసుకుందాం. ఎన్టీఆర్ జిల్లా, విజయవాడ రూరల్ మండలంలోని గూడవల్లిలో పొట్లూరి సాంబశివరావు 20 ఏళ్లుగా విష రసాయనాల ఊసే లేకుండా తమ పెరట్లో సహజసిద్ధంగా కూరగాయాలు, ఆకుకూరలు, పండ్లు పండించుకుంటున్నారు. ఇంటి ముందు ఉండే ఖాళీ స్థలంలో ఏదో ఒక మొక్క పెట్టుకోవడం తన చిన్నతనం నుండీ ఉండేదన్నారు. మనిషికి 60 ఏళ్ల వయస్సు దాటిన తర్వాత బయటికి అంతగా వెళ్లలేం. వాకింగ్‌, జాగింగ్ లాంటి వ్యాయామాలు చేసే అవకాశం అంతంత మాత్రంగానే ఉంటుంది. కానీ.. పెరట్లో తోట పెంచుకుంటే నిత్యం శరీరానికి అవసరమైనంత వ్యాయామం లభిస్తుంది. కాస్త పెద్ద మొత్తంలో పెరటితోటలో పంటలు పండించుకుంటే ఆర్థికంగా వెసులుబాటు కూడా వస్తుంది. మన ఇంటి కూరలు తింటే ఆరోగ్యంగా ఉంటాం. ఆస్పత్రికి వెళ్లాల్సి అవసరం రాదు. ఆస్పత్రికి పెట్టాల్సిన డబ్బుల ఖర్చు తగ్గిపోతుంది. ఇంకా ఎక్కువగా పంట చేతి వస్తే కొంత పంటను అమ్మినా చేతికి డబ్బులు వస్తాయి. ఇలా రెండు విధాలుగా పెరటితోట పెంపకంతో ఆదా, ఆదాయం రెండూ ఉంటాయి.సాంబశివరావు పెరటితోటలోని మొక్కలన్నీ మండిపోతున్న ఎండాకాలంలో కూడా పచ్చగా, చూడముచ్చటగా ఉంటుంది. అందుకు ఆయన ఎలాంటి విధానాలు అవలంబిస్తున్నారో కనుక్కుందాం. సాంబశివరావు పెరట్లోని గోంగూర మొక్కలు విత్తనం నాటినప్పటి నుండి 45 రోజుల్లో ఏడు నుండి ఎనిమిది అడుగుల ఎత్తు వరకు పచ్చగా ఏపుగా ఎదిగాయి. అంతకు మించి ఎత్తు పెరగకుండా పై చిగుళ్లను తెంపితే.. ఆ మొక్క కింది భాగంలో అనేక కొమ్మలు కొత్తగా వస్తాయి. తద్వారా కూడా మనకు గోంగూర ఆకులు ఎక్కువ లభిస్తాయి. మొక్కలకు సన్నని కట్టెలు పాతి సపోర్ట్‌ గా ఉంచితే అవి పది అడుగుల ఎత్తు కూడా ఎదుగుతాయి.సహజసిద్ధంగా పెంచే ఏ ఆకు కూరకైనా వేసవి కాలంలో తెగుళ్లు, చీడపీడల బెడద ఉండదని సాంబశివరావు అనుభవంతో చెప్పారు. వర్షాకాలంలో ఆకు కూరలో పెద్దగా ఎదిగినా తెగుళ్ల బెడద ఉంటుంది. వేసవి కాలంలో ఆకుకూరల పెంపకం చాలా సులువుగా ఉంటుంది. తమ పెరటితోటలో సాంబశివరావు తోటకూర, బచ్చలి, గోంగూర ఇలా అనేక రకాల ఆకుకూరలు వేసవి పంటగా గత 20 ఏళ్లుగా పెంచుకుంటున్నారు.రసాయన ఎరువులు వాడితే మొక్కలు పెళుసుగా తయారవుతాయని, అదే పశువుల ఎరువులు, సహజసిద్ధంగా తయారు చేసుకున్న ఆర్గానిక్‌ ఎరువులు వాడితే మొక్కలు మృదువుగా, పచ్చగా ఏపుగా ఎదుగుతాయని సాంబశివరావు చెప్పారు. గొర్రెలు, మేకలు, ఆవులు, గేదెల ఎరువులు, మినప, పెసర పొట్టుల్ని కూడా ఎరువుగా మొక్కలకు వాడితే పచ్చగా చూసేందుకు అందంగా, ఆకర్షణీయంగా మొక్కలు ఎదుగుతాయన్నారు. వాటిలో ఏది అందుబాటులో ఉంటే దాన్ని తడవ తడవకు మార్చి మార్చి మొక్కలకు వేస్తూ ఉంటే ఫలితం మరింత అధికంగా ఉంటుంది. ఇలాంటి సహజ ఎరువుల మొక్కలకు వేసినప్పడు చీడపీడలు అంతగా రావు. అదే రసాయన ఎరువులు వాడితే చీడ పీడలు ఎక్కువగా వస్తాయి. సహజ ఎరువులు వాడిన మొక్కల ఆకుల్లో కాని, కాండాలకు గానీ ఎక్కడా ఒక్క మచ్చ కూడా కనిపించదు. మొక్కలు ఆసాంతమూ పచ్చగా ఉంటాయి.పెరటితోటలో ఆకు కూరలు, కాయగూరల విత్తనాలు నాటుకునే ముందు సాంబశివరావుకు బాగా అందుబాటులో ఉండే పేడ ఎరువును భూమిలో వేస్తారు. కోకోపిట్ లాంటివేవీ ఆయన వాడరట. పొలంలోని నల్లమట్టిని తీసుకుని, దానిలో ఒక్క గడ్డ కూడా లేకుండా బాగా ఎండబెట్టి, బియ్యంపిండి మాదిరిగా మెత్తగా నలిపి, దానికి పశువుల పేడ కలిపి విత్తనం నాటుకునే చోట వేసుకుంటే మొక్కల వేరు వ్యవస్థ చాలా బాగా వస్తుందన్నారు. తద్వారా మొక్కలు కూడా పచ్చగా, ఏపుగా ఎదుగుతాయి. దిగుబడిని కూడా ఎక్కువగా ఇస్తాయి. నల్లమట్టి, పశువుల ఎరువు సమపాళ్లలో కలుపుకుంటే.. ఎరువతో ఎక్కువ వేడి ఉంటుందని, దాంతో మొక్కకు నీళ్లు ఎక్కువగా పోయాల్సి వస్తుంది. అయితే.. 70 శాతం మెత్తటి నల్లమట్టి 30 పాళ్లు పశువులు ఎరువు వేసుకుంటే మంచిదని అనుభవంతో సాంబశివరావు తెలిపారు.ఒకసారి మట్టి, ఎరువు కలిపి కుండీలో వేశామనో, మొక్క పెంచిన భూమిలో వేశామని ఊరుకోకూడదన్నారు. కుండీలో మట్టిని కింద పోసి, దాంట్లో గడ్డలు ఉంటే బాగా ఎండబెట్టి, మెత్తగా నలిపేసి, పశువుల ఎరువు కలుపుకోవాలన్నారు. మొదటిసారి కుండీలో మొక్క పెట్టినప్పుడు మట్టి, ఎరువుతో ఏపుగా ఎదుగుతుంది. చక్కని దిగుబడి ఇస్తుంది. ఏడాది తర్వాత అదే కుండీలో మళ్లీ మొక్క పెడితే ముందుగా ఎదిగినంత ఆరోగ్యం, పచ్చగా ఎదిగే అవకాశం ఉండదు. ఎందుకంటే.. అప్పటికి ఆ కుండీలోని మట్టిలో, పశువుల ఎరువులో ఉండే సారం తగ్గిపోతుంది. అందుకే ప్రతి ఏటా కుండీలో మట్టిని కిందపోసి, ఎడ్డబెట్టి పశువుల ఎరువు కలిపి బాగా మెత్తగా చేసుకుంటే మళ్లీ వేసే మొక్క కూడా అంతే బాగా, బలంగా ఎదుగుతుంది.పెరటి మొక్కలకు చీడ పీడలు రాకుండా నియంత్రించేందుకు సాంబశివరావు ఒక డబ్బా గోమూత్రానికి ఏడు డబ్బాల నీటిని కలిపి చల్లుతారు. ఆవు మూత్రం క్రిమి కీటకాలను చంపేస్తుంది. అందుకే గోమూత్రాన్ని ఉన్నది ఉన్నట్లు చల్లితే మొక్కలు కూడా చనిపోయే ప్రమాదం ఉంది. అందుకే ఒకటికి ఏడు వంతుల నీరు చొప్పున కలపాలన్నారు. రసాయన ఎరువులు వాడినప్పుడు మొక్కకు తీపిదనం వస్తుందని, దాంతో తెగుళ్లు రావడానికి ఆస్కారం ఉందన్నారు. అదే మట్టి, పశువుల ఎరువు వాడితో మొక్కలో స్వీట్ నెస్ రాదని, తద్వారా తెగుళ్లు వచ్చే అవకాశం ఉండదన్నారు. ఒకవేళ కొద్దిగా చీడపీడలు ఆశించినా గోమూత్రంతో నివారించుకోవచ్చని వివరించారు.మొక్కలకు సాయంత్రం 5 గంటల తర్వాత గోమూత్రం చల్లినా, నీరు పెట్టినా మంచిదని సాంబశివరావు చెప్పారు. మొక్కకు కావాల్సిన దానికంటే కూడా ఎక్కువ నీరు కొందరు పోస్తారని, దాంతో మొక్కలు చనిపోతాయన్నారు. మొక్క ఎదిగే పద్ధతిని బట్టి, దాని మొదట్లో ఉన్న మట్టిని బట్టి ఎంత నీరు పోయాలనేది తెలుసుకోవాలన్నారు. కుండీల్లో మొక్కలకు ప్రతిరోజూ నీళ్లు పోయాల్సిన అవసరం లేదన్నారు. మొక్కకు ఎక్కువ నీరు పోస్తే నేల అయితే భరిస్తుంది కానీ, కుండీలో మొక్క తట్టుకోలేదన్నారు. కుండీలో నీరు బయటికి వెళ్లక వేరు వ్యవస్థ కుళ్లిపోయి మొక్క చచ్చిపోతుంది. అయితే.. ఇతర కాలాల్లో కంటే వేసవి కాలంలో మాత్రం కుండీల్లో మొక్కలకు రోజూ నీరు పోయవచ్చని చెప్పారు.కొత్తగా పెరట్లో గానీ, కుండీల్లో కాని మొక్కలు పెంచాలని ఉత్సాహంగా ముందుకు వచ్చేవారికి సాంబశివరావు ఇచ్చే సలహా ఏంటంటే.. మొక్కలకు మనం ఎంత సమయం కేటాయించగలం అనేది నిర్ణయించుకోవాలి. మొక్కలు పెట్టేశాం.. పెద్దగా పట్టించుకోకపోయినా అవి బాగా ఎదగలేదని, దిగుబడి సరిగా లేదని నిరాశ పడకూడదన్నారు.  ఒకేసారి పెద్ద మొత్తంలో కుండీల్లో మొక్కలు పెట్టేసి నష్టపోయేకన్నా.. ఓ పది కుండీల్లో ముందుగా మొక్కలు వేసుకుంటే.. ఏమి చేయాలో ఆ మొక్కలే ఎలా పెంచాలో మనకు నేర్పుతాయన్నారు. పెరట్లో మొక్కల పెంపకాన్ని ప్లాన్ ప్రకారం, పరిశుభ్రంగా చేసుకుంటే మరింత లాభదాయకంగా ఉంటుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here