అంజీర లేదా అత్తిపండులో మన శరీరానికి కావాల్సిన శక్తిని అందించే ఎన్నో పోషకాలు ఉన్నాయి. అత్తిపండులో పొటాషియం, సోడియం, ఫాస్పారిక్‌ యాసిడ్‌, విటమిన్లను అంజీర పండు కలిగి ఉంటుంది. అంజీరలో జింక్‌, మాంగనీస్, మెగ్నీషియం, ఐరన్‌ లాంటి ఖనిజాలు పుష్కలంగా లభిస్తాయి. అంజీరలో ఫైబర్‌ కూడా ఎక్కువే. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు చాలా ఎక్కువ. అంజీరపండు తింటే జీర్ణ వ్యవస్థ బలపడుతుంది. కడుపు ఉబ్బరం, మలబద్ధకాన్ని నివారిస్తుంది. కేలరీలు తక్కువ ఉండే అంజీర తిన్న వారి శరీర బరువు నియంత్రణకు ఉపయోగపడుతుంది.అంజీర తింటే రక్తప్రసరణ బాగా మెరుగవుతుంది. అంజీరలో లభించే ప్రోటీన్లు, విటమిన్లు, కాల్షియం, సల్ఫర్‌ లాంటి రోగ నిరోధకశక్తిని పెంచుతాయి. శరీర అలసట, బలహీనతను దూరం చేస్తుంది. మహిళల్లో రుతుక్రమాన్ని చక్కబరుస్తుంది. పురుషుల్లో వీర్యం అభివృద్ధి చెందేలా చేస్తుందని డాక్టర్లు చెబుతున్నారు. శరీరంలో హిమోగ్లోబిన్ స్థాయిలను పెంచడంలో అంజీర పండు ప్రధాన పాత్ర పోషిస్తుంది. అంజీరలో ఉండే పొటాషియం మన శరీరంలో చక్కెర స్థాయిలను చక్కగా నియంత్రిస్తుంది.

ఇన్ని ప్రయోజనాలున్న అంజీరను సాగు చేస్తే.. ఏడాది పొడవునా రైతన్నకు ఆదాయం తెచ్చిపెడుతుంది. అలాంటి అంజీర సాగు విషయాలు, కష్టనష్టాల గురించి తెలుసుకుందాం.జగిత్యాల జిల్లా లక్ష్మీపూర్‌ లో ఉపాధ్యాయుడు మల్లారెడ్డి అంజీర సాగులో మంచి అనుభవం గడించారు. బెంగళూరులోని ఒక నర్సరీ నుంచి మల్లారెడ్డి బ్రౌన్ టర్కీ రకం అంజీర మొక్కలను తెప్పించుకున్నారు. అంజీరలో ఇంకా పుణె, డయానా రకాలు కూడా ఉన్నాయి. బ్రౌన్ టర్కీ రకం ఫ్రూట్ సైజు కాస్త ఎక్కువ వస్తుంది. దాని రంగు కూడా ఆకర్షణీయంగా ఉంటుంది. పండు రుచి, నాణ్యత కూడా బాగుంటాయి. పండు తెంపిన తర్వాత రెండు మూడు రోజులైనా చెడిపోదు.

మల్లారెడ్డి 600 బ్రౌన్ టర్కీ రకం అంజీర మొక్కల్ని ఒక్కొక్కటి రూ.60కి తెప్పించుకుని రెండు ఎకరాల్లో 2020 మార్చి నెలలో నాటుకున్నారు. మొక్కకు మొక్కకు మధ్య 7 అడుగులు, వరుసకు వరుసకు మధ్య 12 అడుగుల దూరం ఉండేలా నాటినట్లు మల్లారెడ్డి వివరించారు. అంజీర మొక్కల్ని నాటుకునే ముందుగా భూమిని రెండు మూడు సార్లు చక్కగా దుక్కి దున్నించాలి.  మొక్కల్ని రెండు అడుగుల లోతూ, ఒక అడుగు వెడల్పుం గుంతలు తీసి, వాటిలో నాటుకోవాలి. గుంతలో వర్మీ కంపోస్టు, వేపపిండి, పశువుల ఎరువు వేసుకుంటే మొక్క బాగా ఏపుగా ఎదుగుతుంది. చీడపీడల బాధ అంజీర సాగులో ఉండదు. అంజీర మొండిమొక్క. రైతులు ఎవరైనా సులువుగా సాగుచేసుకోవచ్చు. అంజీర మొక్కకు నీటి సరఫరా ఎక్కువ అవసరం. నీటి లభ్యత తక్కువ ఉండే చోట కంటే సమృద్ధిగా ఉండే ప్రాంతాల్లో అంజీర పంట దిగుబడి ఎక్కువ వస్తుంది. నీటి సరఫరా ఎంత ఎక్కువగా ఇస్తే అంత త్వరగా మొక్క ఏపుగా ఎదుగుతుంది. సేంద్రీయ వ్యవసాయ విధానంలో సాగు చేస్తే అంజీర మొక్కలు బాగా పెరుగుతాయి. అంజీర మొక్కలకు అడ్డదిడ్డంగా పెరిగే కొమ్మలను ఎప్పటికప్పుడు ప్రూనింగ్‌ చేసుకుంటే ఫలితం మరింత మెరుగ్గా ఉంటుంది. క్రమం తప్పకుండా సేంద్రీయ ఎరువులు వేస్తూ, నీటిని సరిపడినంతగా సరఫరా చేసుకోవాల్సి ఉంటుంది.అంజీర మొక్క నాటిన తర్వాత ఆరు నెలలకే క్రాప్ మొదలవుతుంది. రెండు ఎకరాల్లో ప్రతి రోజూ సగటున 10 నుంచి 15 కిలోల అంజీర పండ్లు దిగుబడి వస్తున్నాయని మల్లారెడ్డి వెల్లడించారు. తోట దగ్గరకు వచ్చిన వినియోగదారులకు కిలోకు రూ.100 చొప్పున అమ్ముతున్నట్లు తెలిపారు. మిగతా పండ్ల మొక్కల మాదిరిగా అంజీరకు సీజన్ అనేది ఉండదు. ఏడాది పొడవునా కాయలు కాస్తూనే ఉంటుంది. పండ్లను ఇస్తూనే ఉంటుంది. కొత్త ఆకు వచ్చి, దాని మొదట్లో నేరుగా పిందె ఏర్పడుతుంది. అంజీరలో పూత అనేది ఉండదు. అంటే ప్రతి ఆకుకు ఒక పిందె తయారవుతుంది.

అంజీర మొక్క మనకు అందుబాటులో లేనంత ఎత్తు ఎదిగిపోకుండా వారానికి ఒకసారి పైన ఉండే చిగుళ్లను కత్తిరించుకోవాలి. అలా కత్తిరించిన చోట కొత్తగా కొమ్మలు వస్తాయి. అలా మొక్క గుబురుగా, ఎక్కువ కొమ్మలతో నిండిపోతుంది. దీంతో కూడా పంట దిగుబడి మరింత పెరుగుతుంది. అంజీర మొక్క ఎత్తు పెరిగిపోతుంటే దానికి ఎక్కువగా కొమ్మలు రావు. అందుకే ఎత్తులో ఉన్న చిగుళ్లను కట్‌ చేయాలని మల్లారెడ్డి వివరించారు.అంజీర పండ్లను మార్కెట్ కు తీసుకెళ్తే దళారులు తక్కువ ధర ఇస్తారు. కిలోకు రూ.50కి అటూ ఇటూగా వారు ధర నిర్ణయిస్తారు. అవే పండ్లను వినియోగదారులకు రూ.150 నుంచి రూ. 200 వరకు అమ్ముకుంటారు. దాంతో వినియోగదారులకే ఆ లాభం కలిగించాలని తానే తన తోట వద్ద తక్కువ ధరకు అమ్ముతున్నట్లు మల్లారెడ్డి తెలిపారు. తమ చుట్టుపక్కల ఏ రైతు ఏ పంట పండించినా వాటికి కిలోకు వంద రూపాయల ధర రావడం లేదని, కేవలం తాను పండిస్తున్న అంజీర పండ్లకే ఇంత ధర పలుకుతోందన్నారు. అంటే రైతుకు మంచి లాభాలు తీసుకొచ్చే పంట అంజీర అని ఆయన చెప్పారు.అంజీర మొక్కలు నాటుకున్నప్పుడు మాత్రమే ఖర్చు ఉంటుంది. ఆ తర్వాత కేవలం సేంద్రీయ ఎరువులు, నీటి సరఫరాకు అయ్యే ఖర్చులు మాత్రమే ఉంటాయి. ఇంతకు మించి అదనంగా ఎలాంటి ఖర్చు ఉండదు. అంజీర పండ్లను తెంపడం కూడా చాలా సులువు. ఒక మనిషి గంట నుంచి రెండు గంటల్లో రెండు ఎకరాల్లోని అన్ని మొక్కల నుంచి పండ్లను తెంపుకోవచ్చని మల్లారెడ్డి అనుభవంతో చెప్పారు. అంటే అంజీర పండ్లు తెంపడానికి కూలీల అవసరం కూడా ఉండదని, రైతే స్వయంగా చేసుకోవచ్చన్నారు. పొలంలో గడ్డి పెరిగినా అంజీర మొక్కకు ఏ విధమైన ఇబ్బందీ ఉండదు. అదే మిగతా పంటలకైనే కలుపు తీయడానికి కూలీల ఖర్చు అవుతుంది. అంజీర తోటలో కూలీల అవసరం ఉండదు.వర్షాకాలంలో అంజీర మొక్క ఆకులకు రెడ్ రస్ట్ అనేది వచ్చే అవకాశం ఉంది. ఈ ఒక్క డిసీజ్ తప్ప మరే డిసీజ్‌ అంజీరలో తాను చూడలేదని మల్లారెడ్డి వెల్లడించారు. రెడ్ రస్ట్‌ వల్ల కూడా అంజీర మొక్కకు ఎలాంటి నష్టమూ రాదన్నారు. ఎందుకంటే రెడ్ రస్ట్ పట్టిన ఆకు కొన్ని రోజులకు దానంతట అదే రాలిపోతుందని, దీనికి ఎలాంటి పురుగు మందులు కొట్టాల్సిన అవసరం లేదని చెప్పారు.కొత్తగా రైతు ఎవరైనా అంజీర పంట సాగు చేయాలనుకున్నప్పుడు ముందుగా మార్కెట్‌ ను కొద్దిగా అధ్యయం చేయాలని మల్లారెడ్డి సూచించారు. అంజీర పండుకు వినియోగదారులు ఉన్నారా? పండుకు డిమాండ్ ఉందా? మార్కెట్లో ఎంత ధర పలుకుతుంది? అనే విషయాలను అవగాహన చేసుకోవాల్సి ఉంటుంది. మనం అంజీర పంట వేయాలనుకున్నప్పుడు మన ప్రాంతంలో ఇతర రైతుఉల ఈ పంట సాగు చేయడం లేదనుకున్నప్పుడు ఉత్సాహంగా అంజీర సాగు చేయవచ్చని మల్లారెడ్డి సలహా ఇచ్చారు.

 

అంజీర సాగులో మరిన్ని వివరాలు రైతు మల్లారెడ్డిని 99598 68192 నంబర్ లో సంప్రదించవచ్చు.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here