‘గంగిగోవు పాలు గరిటెడైనను చాలు’  యోగి వేమన రాసిన పద్యంలోని వాక్యం ఇది. ఆవు పాలు కొంచెమైనా ఎన్నో లాభాలు, ప్రయోజనాలు ఉన్నాయని దాని అర్థం. ఒక్క దేశీ ఆవును పెంచుకుంటే నాలుగు ఎకరాల్లో వ్యవసాయం చేసినంత లాభదాయకం అనేది ఇప్పటి మాట. అదే డజన్ల కొద్దీ దేశీ ఆవులతో డెయిరీ ఫాం నిర్వహిస్తే.. ఆ రైతు పంట పండినట్లే. దేశీ ఆవుల పెంపకం దారులకు స్థిరంగా చక్కని ఆదాయం వస్తుందని చెప్పొచ్చు.దేశీ ఆవు పాలతో తయారైన పెరుగు, నెయ్యి మనుషులకు మంచి ఔషధాలుగా పనిచేస్తున్నట్లు పశు వైద్య శాస్త్రవేత్త డాక్టర్‌ సాయి బుచ్చారావు తెలిపారు. ఆవుపాల పెరుగు, వెన్నఆహారంగా తీసుకునే వారికి చక్కెర వ్యాధి నియంత్రణలో ఉంటుందని సాయి బుచ్చారావు వెల్లడించారు. డాక్టర్ సాయి బుచ్చారావు పదేళ్లుగా దేశీ గోజాతులపై విస్తృతంగా పరిశోధన చేస్తున్నారు.ఇంటిగ్రేటెడ్‌ ఫార్మింగ్‌ లో భాగంగా ఎనిమిది ఆవులతో మొదలుపెట్టిన దేశీ ఆవుల డెయిరీ ఫాంను ఇప్పుడు 120 ఆవులకు దాన్ని పెంచారు కృష్ణా జిల్లా గన్నవరం మండలం గొల్లనపల్లిలోని ఆదర్శ రైతు కాటూరి వెంకటేశ్వర ప్రసాద్‌. ‘కాటూరి డెయిరీ ఫాం’ పేరిట ఆయన దేశీ ఆవుల డైరీఫాం నిర్వహిస్తున్నారు. ఆర్గానిక్‌ వ్యవసాయానికి అనుబంధంగా ఎనిమిది దేశీ ఆవులను పెంచడం ప్రారంభించారాయన. నాలుగైదు ఏళ్లలో కాటూరి డెయిరీ ఫాంలో 120 ఆవులకు పెంచారు. వ్యవసాయం కన్నా డెయిరీ ఫాం ద్వారా ఎక్కువ ఆదాయం, లాభాలు సంపాదిస్తున్నట్లు వెంకటేశ్వరరావు చెబుతున్నారు. కాటూరి డెయిరీ ఫాంలో సాహివా, తార్ పార్కర్‌, రాతి, ఒంగోలు, గిర్‌ లాంటి దేశీ ఆవులను పెంచుతున్నారు.సుభాష్ పాలేకర్‌ చెప్పిన సహజసిద్ధ వ్యవసాయం చేసేందుకు ఎనిమిది సాహివా ఆవులతో వెంకటేశ్వరరావు దేశీ ఆవుల డెయిరీ ఫాం ప్రారంభించారు. జీవామృతం తయారు చేసుకునేందుకు తాను ఒంగోలు జాతి ఆవులను పెంచడం మొదలెట్టినట్లు వెల్లడించారు. వ్యవసాయానికి తోడ్పాటుగా ఉంటాయని, మన ఆరోగ్యానికి ఆవుపాలు మేలు చేస్తాయని, తద్వారా సమాజానికి ఉపయోగంగా ఉంటుందని తాను దేశీ ఆవుల పెంపకం ప్రారంభించినట్లు చెప్పారు. ఇప్పటికి 25 ఏళ్లుగా వెంకటేశ్వరరావు దేశీ ఆవుల డెయిరీ ఫాం నిర్వహిస్తున్నారు. ముందుగా వ్యవసాయానికి అనుబంధంగా ఆవుల్ని పెంచినా ఐదారేళ్లుగా ఆవుపాలు కూడా ఆయన ఉత్పత్తి చేస్తున్నారు.సాధారణంగా డెయిరీ ఫాం నిర్వహించేవారు ఆవులను ఒక షెడ్‌ లో కట్టిపెట్టి పెంచుతారు. అయితే.. వెంకటేశ్వరరావు ఆవులను ఫ్రీ రైజింగ్‌ అంటే ఆవులు తోటలో స్వేచ్ఛగా తిరిగి, సహజసిద్ధంగా ఎదిగేలా చేశారు. ఈ విధానంలో ఆవులు ఏమాత్రం వత్తిడికి గురికావు అని చెప్పారు. తమ వ్యవసాయ క్షేత్రం చుట్టూ ఇనుప కంచె వేసి, ఆవులు ఆ క్షేత్రంలో వాటికి నచ్చిన చోట ఉండేలా, నచ్చినప్పుడు మేత తినేలా ఏర్పాటు చేశారు. ఆవు పేడ, గోమూత్రంతోనే క్షేత్రంలో వాటికి కావాల్సిన పచ్చిక పెరుగుతుందని చెప్పారు.మొదట్లో ప్రతి మూడు నాలుగు నెలలకు ఒకసారి వెంకటేశ్వరరావు బయటి నుంచి ఒక బ్యాచ్‌ ఆవుదూడలు తెచ్చుకున్నారు. వాటికి సూపర్ నేపియర్‌, వరిగడ్డి, సోయా పొట్టు, వేరుసెనగ కట్టు మేతగా వేస్తారు. తమ దేశీ ఆవుల డెయిరీ ఫాంలో తాజా పాలకు లీటర్‌ 120 రూపాయల ధర పలుకుతుంది. కాటూరి డెయిరీ ఫాంలో పూటకు 120 లీటర్ల స్వచ్ఛమైన ఆవుపాలు ఉత్పత్తి అవుతున్నాయి. సగటున ఒక్కో ఆవు నుంచి 4 నుంచి 5 లీటర్ల పాలు దిగుబడి వస్తున్నాయి.బయటి నుంచి తెచ్చుకున్న ఆవులను నిర్బంధించినట్లు ఒక చోట కట్టేసి ఉంచడం కన్నా స్వేచ్ఛగా వదిలితేనే అవి త్వరగా అంటే రెండు మూడు నెలల్లోనే స్థానిక వాతావరణానికి అలవాటు పడతాయి. ఆవులను కట్టేసి ఉంచితే పాల దిగుబడి తగ్గిపోతుందని వెంకటేశ్వరరావు అనుభవంతో చెబుతున్నారు. ఏ కాలంలో అయినా ఆవులు తేలిగ్గానే అలవాటు పడతాయి. ఎండ వేడిగా ఉంటే ఏదో ఒక చెట్టుకిందకు వెళతాయి. చలికి తట్టుకుంటాయి. వర్షాకాలంలో మాత్రం ఆవులు సేదదీరేందుకు షెడ్‌ అవసరం అవుతుంది.సాహివా ఆవు చూడడానికి అందంగా ఉంటుంది. పాల దిగుబడి ఎక్కువగా ఇస్తుంది. కాస్త అందం తక్కువైనా రాతి జాతి ఆవులు కూడా పాల ఎక్కువగానే ఇస్తాయి. అయితే.. బయటి నుంచి తెచ్చుకున్న నెల రోజుల్లోనే ఆయా వాతావరణానికి అలవాటు పడే గుణం రాతి జాతి ఆవుల్లో ఉంటుంది. అదే సాహివాలు అలవాటు పడేందుకు మూడు నాలుగు నెలలు సమయం తీసుకుంటాయి. తార్ పార్కర్‌ జాతి ఆవులు సున్నితంగా ఉంటాయి. మన వాతావరణానికి అలవాటు పడేందుకు ఆరు నుంచి ఎనిమిది నెలల సమయం తీసుకుంటాయి. ఏ జాతి ఆవు అయినా.. మన వాతావరణానికి అలవాటు పడిన తర్వాత మాత్రమే తన పూర్తి సామర్ధ్యంలో పాలదిగుబడి ఇస్తుందని వెంకటేశ్వరరావు చెప్పారు.రాతి జాతి ఆవులు తొందరగా సెటిల్ అవడమే కాకుండా మిగతా జాతి ఆవుల మాదిరిగానే ఎక్కువ పాలు ఇస్తాయి. వీటిని పెంచేందుకు ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకునే అవసరం ఉండదు. ఆరోగ్యం, ఆహారం విషయంలో మిగతా జాతి ఆవులకు కాస్త ఎక్కువ శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. అయితే.. రాతిజాతి ఆవులకు అంత కేర్ తీసుకునే అవసరం లేదు. ఆవులకు గారాబం చేసి, మాలిష్ చేసి, ఆహారం తినిపించ వద్దంటారు వెంకటేశ్వరరావు. ఆకలి తీర్చుకోవడానికి దేనికదే ఆహారం కోసం పాకులాడాలంటారు. మిగతా ఆవులతో పోటీ పడి తన ఆహారం తాను తినేలా పెరిగితేనే ఆరోగ్యంగా, బలంగా తయారవుతుంది.ఆవు ఒక్కదాన్ని కాకుండా కనీసం రెండు మూడింటిని కలిపి తెచ్చుకుంటే అవి ఒక జట్టుగా ఉంటాయి. తర్వాత తెచ్చుకునే ఆవులతో అవి ముందు కాస్త దూరంగానే ఉంటాయి. తర్వాత కలిసిపోతాయి. అయితే.. ఏ బ్యాచ్‌ లో ఉండే ఆవులు ఆ బ్యాచ్‌ తోనే ఎక్కువగా కలిసి ఉంటాయి. ఆవులను పాలు పితికేటప్పుడు, ఏడెనిమిది నెలల చూలిగా ఉన్నప్పుడు మాత్రం కట్టేసి ఉంచాలని వెంకటేశ్వరరావు చెప్పారు. నీటి తొట్లలో నీరు, ఆహారం తొట్లలో ఆహారం వేసి ఉంచుతామని, వేటికి ఆకలైతే అవి వచ్చి ఆహారం తిని, నీరు తాగి మళ్లీ స్వేచ్ఛగా క్షేత్రంలోకి వెళ్లిపోతాయన్నారు. ఎక్కువ పాలు ఇచ్చే ఆవులకు మాత్రం పాలు పితికే సమయానికి కాస్త ముందుగా కట్టేసి ఎక్కువగా దాణా పెట్టాల్సి ఉంటుందన్నారు.ఆవులకు ఒక్కోసారి ఫుట్‌ అండ్ మౌత్ వ్యాధి వచ్చే అవకాశం ఉంది.. అలాంటి ఇబ్బంది వచ్చినప్పుడు మిగతా ఆవులకు కూడా ఫుట్‌ అండ్ మౌత్‌ వ్యాధి సోకుతుంది. కొద్ది రోజులు ఆ వ్యాధితో ఆవులు ఇబ్బంది పడినా ఆ వ్యాధి దానంతట అదే తగ్గిపోతుందని వెంకటేశ్వరరావు వివరించారు. ఒక్కోసారి లంపీ వ్యాధి కూడా సోకే అవకావం ఉందన్నారు. ఆవుల్లో ఇమ్యూనిటీ అధికంగా ఉంటుంది కాబట్టి మందులు వాడాల్సిన అవసరం అంతగా ఉండదు. ఏదైనా ఒక ఆవు మరీ నీరసం అయినప్పుడు మాత్రం పశు వైద్యుడ్ని సంప్రతించాల్సి ఉంటుంది. లేగ దూడలకు రెండేళ్ల వయసు వచ్చే వరకు డీ వార్మింగ్‌ చేయాలి. రెండేళ్లు దాటిన ఆవుదూడలకు డీ వార్మింగ్‌ చేయక్కర్లేదు.

ఆవులకు కావాల్సిన వనరులు కల్పించి వదిలేస్తే సరిపోతుంది. వాటి కోసం ప్రత్యేకంగా మనం ఎక్కువ శ్రద్ధ తీసుకోవాల్సిన పని ఉండదు. ఆవులను స్వేచ్ఛగా తిరగనిస్తే పాల దిగుబడి ఎక్కువగా వస్తుంది. వాటి జాతి సంపద కూడా సహజసిద్ధంగా పెంచుకుంటాయి. తద్వారా రైతుకు ఆదాయం, లాభం బాగా వస్తాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here