తరతరాలుగా వారిది వ్యవసాయ కుటుంబం. ఆ కుటుంబానికి చెందిన హర్షత్‌ విహారి అనేక మంది రైతు బిడ్డల మాదిరిగానే ఇంజనీరింగ్‌ విద్య పూర్తిచేశాడు. అయితే.. చిన్నప్పటి నుంచీ వ్యవసాయం, సాగు విధానాలను చూస్తూ పెరిగిన హర్షత్‌ కు ఆ వ్యవసాయం అంటేనే ఆసక్తి. అందుకే తాత తండ్రుల నుంచి వస్తున్న సంప్రదాయ సాగు విధానాల్లో కాకుండా కాసింత వెరైటీగా ఆలోచించాడు ఈ బీటెక్ పట్టభద్రుడు. వరిపంటలో కొత్త దారిని ఎంచుకున్నాడు. అది కూడా ఆదాయానికి ఆదాయం, ఆరోగ్యానికి ఆరోగ్యం ఇచ్చే విధానంలో విజేతగా నిలిచాడు. కొత్త కొత్త వ్యవసాయ విధానాలను నలుగురికీ పరిచయం చేసే క్రమంలో షార్ట్ ఫిల్ములు తీసి ఔత్సాహిక రైతులకు ప్రదర్శించి, ప్రోత్సహిస్తున్నాడు. అందుకే నెల్లూరు జిల్లా పటేల్‌ నగర్‌ వాసి వేటగిరి హర్షత్‌ రెడ్డి ‘స్టార్‌ ఫార్మర్‌’గా పేరు పొందాడు.పూర్వీకులందరూ వ్యవసాయంపైనే ఆధారపడి జీవించినా.. తాను మాత్రం ఈ రంగంలో ఏదో ఒక కొత్త విధానంలో సాగు చేయాలని హర్షత్‌ నిర్ణయించుకున్నాడు. ఇలాంటి మంచి సంకల్పంతో చింతల వెంకటరెడ్డి (సీవీఆర్‌) విధానంలో వరి సాగు ప్రారంభించాడు. కేవలం మట్టి, నీటితోనే వరిని సాగుచేయడం ఈ విధానం ప్రత్యేకత. మట్టి- నీటితో ద్రావణం తయారు చేసుకుని, ఆ ద్రావణాన్ని పైరుపై పిచికారి చేయడం ఈ విధానంలో విశేషం. 200 లీటర్ల డ్రమ్ములో 20 నుంచి 30 కిలోల మట్టి, నీటితో ఈ ద్రావణం తయారు చేసుకోవాలి. భూమిలో రెండు నుంచి మూడు అడుగుల లోపలి మట్టి తీసుకుని ఈ ద్రావణం సిద్ధం చేసుకోవాలి. రెండు అడుగుల లోపలి మట్టిలో జిగురు ఉంటుంది. ఆ మట్టిని, నీటిని డ్రమ్ములో వేసి బాగా కలిసేలా తిప్పాలి. అలా తిప్పిన నీరు మరో 15 నిమిషాల్లో తేరుకుని తేట పైకి తేలుతుంది. ఆ తేటను వరిపొలంలో స్ప్రే చేసుకోవాలి. వరి మొక్కలపై సన్నని ధారగా పడిన ద్రావణాన్ని తిన్న ఎలాంటి పురుగైనా చనిపోతుంది. ఇదే మట్టి ద్రావణంలోని ప్రత్యేకత. ఒక వేళ వరిలో పురుగుల బెడద ఎక్కువగా ఉంటే.. మనం చెప్పుకున్న ద్రావణంలో అర లీటర్ నుంచి లీటర్ వరకు ఆముదంనూనె కలుపుకుంటే ఫలితం మరింత బాగా ఉంటుంది. దీంతో వరిని ఆశించే పురుగుల నివారణ కోసం పురుగుల మందులు కొట్టాల్సిన అవసరం రాదు. అంటే.. అందరికీ ఆరోగ్యాన్నిచ్చే సహజసిద్ధంగా మంచి ఆహారం పండించినట్లే కదా అంటాడు హర్షత్‌ విహారి.విష రసాయనాలతో పండించిన ఆహార ధాన్యాలు తినడం వల్ల అందరి ఆరోగ్యాలు పాడైపోతున్నాయని, ఆరోగ్యంగా ఉండాలంటే మంచి ఆహారం తినాలని, మంచి ఆహారం కావాలంటే మంచి ఆరోగ్యాన్నిచ్చే పంటలు పండించాలని హర్షత్‌ చెప్పాడు. అందుకే తాను ప్రకృతి వ్యవసాయ విధానంలో సహజసిద్ధంగా పంటలు పండిస్తున్నట్లు వెల్లడించాడు. వరి ఎదుగుదల కోసం అందరూ యూరియా, పొటాష్‌ లాంటి రసాయన ఎరువులు వాడతారు. కానీ హర్షత్ మాత్రం అలాంటి విష రసాయనాలకు బదులుగా ‘మొలకల ద్రావణం’ వాడతానని చెప్పాడు. ఎకరా వరి పొలంలో వాడేందుకు మొలకల ద్రావణం తయారీ విధానం చెప్పాడు హర్షత్. రెండు కిలోల వడ్లు, రెండు కిలోల గోధుమలు సరిపోతాయి. వాటిని నీళ్లలో నానబెట్టి, మండి కట్టాలి. చిన్న చిన్న మొలకలు వచ్చిన తర్వాత వాటిని మిక్సీలో వేసి పేస్ట్‌ చేసుకోవాలి. వడ్తు, గోధుమల మొలకల పేస్టును 200 లీటర్ల నీటిలో 20 నుంచి 30 కిలోల మట్టిని, బాగా కలిపి వరిపై స్ప్రే చేసుకుంటే మొక్కలు బాగా ఏపుగా, పచ్చగా నిగనిగలాడుతూ ఎదుగుతాయి. వరి దుబ్యుకు పిలకల సంఖ్య కూడా బాగా ఎక్కువగా వస్తుంది. ఈ ద్రావణాన్ని ముప్పై రోజుల్లో పది రోజులకు ఒకసారి చొప్పున స్ప్రే చేసుకోవాలని హర్షత్‌ వివరించాడు. చీడపీడల బెడద ఎక్కువగా ఉంటే నెలలో నాలుగు సార్లు కూడా స్ప్పే చేసుకోవచ్చన్నాడు.వరి సాగులో మిగతా విధానాలతో పోలిస్తే.. సీవీఆర్‌ విధానంలో పెట్టుబడి చాలా తక్కువ ఉంటుంది. రసాయన ఎరువులు, పురుగు మందుల కోసం వేలకు వేలు ఖర్చు చేయాల్సి వస్తుంది. అయితే.. సీవీఆర్‌ పద్దతిలో వరి సాగు కోసం ఎకరాకు కేవలం రూ.12 వేలు మాత్రమే పెట్టుబడి అవుతుందని హర్షత్‌ వివరించాడు. అయితే.. రాబడి మాత్రం లక్ష రూపాయల వరకు వచ్చే అవకాశం ఉందంటాడు హర్షత్‌. తక్కువ పెట్టుబడి పెట్టి, ఎక్కువ రాబడి సాధించడం సీవీఆర్ విధానంలో సాధ్యం అంటాడు హర్షత్‌. సుభాష్ పాలేకర్ సహా పలు రకరా ప్రకృతి వ్యవసాయ విధానాలు ఉన్నాయని, అయితే.. సీవీఆర్ విధానం రైతుకు సులభంగా మరింత ఖర్చు తక్కువతో అవుతుందని చెప్పాడు.సీవీఆర్ పద్ధతిలో ఆర్గానిక్ వ్యవసాయం చేయాలనుకునేవారు ముందు ఓ అర ఎకరం పొలంలో వరి సాగు చేస్తే.. అనుభవం వస్తుందని, దీంట్లో ఉన్న సులువు ఏంటో తెలుస్తుందంటా హర్షత్‌. ఈ అనుభవంతో అంచెలంచెలుగా ఈ విధానంలో వరి సాగు చేసుకుంటే మంచిదని సలహా ఇచ్చాడు.సీవీఆర్‌ విధానంలో హర్షత్ వరి సాగు చేస్తే.. మూడు పుట్ల ధాన్యం దిగుబడి వచ్చిందని తెలిపాడు. మామూలు పద్ధతుల్లో చేస్తే.. మూడు నుంచి నాలుగు పుట్ల వరకు దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది. వేలాది రూపాయల పెట్టుబడితో చేసిన సాగులో మూడు నుంచి నాలుగు పుట్ల దిగుబడి తీస్తే.. అతి తక్కువ ఖర్చుతో మూడు పుట్ల వరి దిగుబడి సాధించడంతోనే రైతు విజయం మొదలైందంటాడు. ఈ పద్ధతిలో పండించిన బియ్యానికి మార్కెట్లో కిలోకు 70 రూపాయల వరకు ధర పలుకుతుందన్నాడు. ప్రకృతి సిద్ధంగా పండించిన ధాన్యానికి వినియోగదారుల నుంచి భారీ డిమాండ్‌ కూడా ఉందని చెప్పాడు హర్షత్‌. యువతరం కూడా ప్రకృతి వ్యవసాయం వైపు రావాలని హర్షత్‌ ఆహ్వానిస్తున్నాడు.

 

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here