పంట పొలాలకు క్రిమి కీటకాలు, తెగుళ్లు ఇతర సమస్యలతో పాటు మరో అతి ప్రధానమైన సమస్య ఎలుకలు. పంట చేతికి వచ్చాక, రాక ముందు కూడా రైతన్నకు ఎలుకలు చాలా నష్టం కలిగిస్తాయి. ఎదిగే దశలో పైరును కొరికేయడం, పంట పండిన తర్వాత ధాన్యాలను ఎలుకలు కలుగుల్లోకి తీసుకుపోయి, దాచుకుని తింటాయి. ఎలుకల నివారణ కోసం రైతులు ఎలుకల బుట్టలు పెట్టిస్తారు. కలుగులను తవ్వించి ఎలుకల పట్టిస్తారు. ఎలుకలు ఉండే కలుగుల్లో పొగపెట్టి, రంధ్రాలను మూసేసి కూడా నివారించేందుకు కృషిచేస్తారు. ఇలాంటి విధానాలన్నీ చాలా ఖర్చు, శ్రమతో కూడుకున్నవని మన రైతులందరికీ తెలిసిన విషయమే.అయితే.. పెద్దగా శ్రమ లేని, అతి ఖర్చు తక్కువతో ఎలుకల నివారణ ఎలా చేసుకునే వీలు ఉందో కొన్ని టిప్స్ తెలుసుకుందాం. ఎలుకల నివారణను సులువుగా, అతి తక్కువ ఖర్చుతోనే చేసుకునే కొన్ని విధానాలను నగరం మాస్టారుగా ప్రసిద్ధి చెందిన రైతు అంజయ్య చెబుతున్నారు. అవేంటో చూద్దాం.కిలో రూపాయికే లభించే రేషన్‌ బియ్యాన్ని ఒక ప్లాస్టిక్‌ డబ్బాలో గానీ, ప్లాస్టిక్ బకెట్ లో గాని వేసుకోవాలి. ఉల్లిపాయను సన్నని ముక్కలుగా కోసి, బియ్యంలో వేసి చేతితో బాగా పిసికి కలపాలి. ఉల్లిపాయ అంటే ఎలుకలు ఇష్టపడతాయి కనుక ఉల్లిపాయ వాసన అన్ని బియ్యం గింజలకు బాగా పట్టుకునేదాకా చేత్తోనే కలపాలి. ఆ తర్వాత మంచి వాసన వచ్చే వేరుశెనగ నూనె గానీ, కిరాణా కొట్లలో దొరికే నవరతన్ ఆయిల్‌ ఇలా ఏదో ఒక ఆయిల్‌ కొద్దిగా వేసి ఒక చిన్న కర్రతో బాగా కలపాలి. బియ్యం, ఉల్లిపాయ ముక్కలు, ఆయిల్ మిశ్రమంలో కొద్దిగా విష ప్రభావం ఉంటుంది కనుక చేత్తో కలపకూడదు. ఎలుకల మందు కొద్దిగా వేసి కలపాలి. మందు ఎక్కువైతే రంగు బాగా మారిపోయి ఎలుకలు ఆ బియ్యం తినవు. తీసుకున్న బియ్యానికి సరిపడా కొద్దిగా రంగు వచ్చేలా మాత్రమే ఎలుకల మందు వేసి కర్రతోనే బాగా కలపాలి.ఎలుకలకు పొలంలో ఆహారం దొరకని సమయంలో ఈ బియ్యం గిజలను ఎలుకల కలుగులు ఉండే చోట అక్కడక్కడా పడేలా చల్లాలి. తయారు చేసుకున్న బియ్యం గింజలు చేత్తో కాకుండా ఒక ప్లాస్టిక్ సీసాను కత్తిరించుకుని, దానితో వేసుకుంటే మనకు వాటి విష ప్రభావం ఉండదు. బియ్యం మిశ్రమాన్ని గుట్టలు గుట్టలుగా వేయకూడదు. బియ్యం, ఉల్లి, నూనె, మందు మిశ్రమం ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. మంచు లేదా చిన్న చిన్న చినుకులు పడినా కూడా దీని ప్రభావం పోకుండా ఉంటుంది.తాటికాయలు లభించే సీజన్ లో కూడా ఎలుకల నివారణ చాలా సులువుగా చేసుకోవచ్చు. తాటికాయలంటే ఎలుకలకు చాలా ఇష్టం. తాటికాయను అవి కొంచెం కొంచె పీక్కుని తింటాయి. తాటికాయను ఎలుక పీకిన చోట రెండు వైపులా జెల్‌ రూపంలో లభించే ఎలుకల మందును కొద్దిగా రాయాలి. మందు పూసిన తాటికాయను వాడేటప్పుడు దాని చుట్టు పక్కల ఎక్కువ తాటికాయలు లేకుండా చూసుకోవాలి. ఎలుకకు ఒక లక్షణం ఉంది. తాటికాయను పీకి తిన్న చోటనే మళ్లీ వచ్చి తింటుంది. అందుకే మందును ఎలుక పీకిన దానికి అటూ ఇటూగా రాత్రి 7 లేదా 8 గంటల మధ్య పూస్తే.. తప్పనిసరిగా మళ్లీ వచ్చి ఎలుక కొరుకుతుంది. మందు ప్రభావంతో అది మరణిస్తుంది. ఈ జెల్ మందు ట్యూబు కేవలం రూ.20 కే దొరుకుతుంది కనుక ఈ విధానం కూడా తక్కువ ఖర్చుతోనే అయిపోతుంది.ఒక మట్టి కుండలో ముందుగా నీరు పోసి ఎసరు పెట్టాలి. దాంట్లో బియ్యం మాదిరిగానే నీటికి తగినంత మోతాదులో ధాన్యం పోసుకోవాలి. ధాన్యం ఉడికి, లావుగా అయి, పైనున్న పొట్టు చిట్లుతుంది. అన్నం ఇగరబెట్టినట్లే కుండలో నీరు పూర్తిగా అయిపోయే దాకా ఉడకనివ్వాలి. ధాన్యం ఉడికిపోయి దించే ముందు ఒక సీసా మూతతో గుళికలు వేయాలి. గుళికల వాసన ఎక్కువగా రాని విధంగా మాత్రమే గుళికలు వేసుకోవాలి. ఇలా ఉడకబెట్టిన ధాన్యాన్ని ఎండలో వేసి పూర్తిగా ఎండబెట్టాలి. అంటే ధాన్యం ఉడకబెట్టక ముందు మాదిరిగా గింజలపై పొట్టు మళ్లీ మూసుకుపోయేలా ఎండబెట్టాలి. ఎండిన వడ్లను తప్పకుండా జల్లించాలి. ఎందుకంటే.. గుళికలను ఇసుకలాంటి వాటితో తయారు చేస్తారు. ధాన్యంతో పాటు గుళికల మందు ఉడికిన తర్వాత ఇసుక, దాని వాసన అలానే ఉంటుంది. అందుకు ధాన్యాన్ని తప్పకుండా ఇసుక పోయేలా జల్లెడలో వేసుకుని జల్లించాలి. ఇలా తయారు చేసుకున్న గుళికల వడ్లను ఎలుకలు ఎక్కువగా తిరిగే చోట్ల కొద్ది కొద్దిగి చల్లుకోవాలి. వడ్లను ఎలుకలు బాగా ఇష్టంగా తింటాయి. గుళికల మందు వడ్లను తిన్న ఎలుకలు తప్పకుండా చనిపోతాయి. పొలంలో ఎలుకల బుట్టలు పెట్టే వారు కూడా బుట్టల్లో వడ్లు, లేదా ఉల్లిపాయ ముక్కలే వేయడం గమనించే ఉంటారు. గుళికల వడ్లలో కూడా సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కల్ని కూడా కలుపుకుంటే ఫలితం మరింత ఎక్కువగా ఉంటుంది. ఇలా తయారు చేసిన మందు ఆరు నెలల వరకు కూడా నిల్వ ఉంటుంది.ఎండు రొయ్యలు, ఎండు చేపలు, వేగించిన వేరుసెనగపప్పును ఎలుకలు బాగా ఇష్టపడతాయి. వీటికి ఎలుకల మందు కలిపి పెట్టినా ఎలుకలను నివారించుకోవచ్చు. వీటి వాసనకు ఎలుకలు బాగా వస్తాయి. కాకపోతే ఇది కాస్త ఎక్కువ ఖర్చుతో కూడిన పని.ఇంకో విధానం చూద్దాం.. సెనగపిండి, తవుడును ఎలుకలు బాగా ఇష్టంగా తింటాయి. 200 గ్రాముల సిమెంట్‌ కు 400 గ్రాములు సెనగపిండి లేదా వేగించిన వేరుసెనగ పిండి, తవుడు మిశ్రమం బాగా కలుపుకోవాలి. ఆ మిశ్రమానికి కొద్దిగా ఎలుకల మందు కలిపి పెడితే ఎలుకలు వాటి వాసనకు బాగా తింటాయి. ఈ మిశ్రమాన్ని ఒక చెంచాతో చిన్న పేపర్ ప్లేటులోనో లేదా చిన్న చిన్న పొట్లాలు కట్టి వేసినా ఎలుకలు తింటాయి. పొట్లాలను ఎలుకలు కన్నంలోకి ఎత్తుకుపోయి పిల్లలతో సహా తిని చనిపోతాయి. మార్కెట్లో లభించే గ్యాస్ బిళ్లలు తెచ్చి, కొద్దిగా తడిపి ఎలుకల కలుగుల్లో వేసి, వాటిని పూడ్చేసినా ఎలుకల నివారణ జరుగుతుంది. ఎలుకలు టమోటా కూడా బాగా ఇష్టపడతాయి. తాటికాయకు పూసిన ఎలుకల మందు జెల్ ను చిన్న చిన్న టమోటా ముక్కలకు కలిపి అవి తిరిగే చోట వేసినా తిని చనిపోతాయి.కొబ్బరి డొక్కుల విధానం కూడా ఎలుకల నివారణకు బాగా పనిచేస్తుంది. చిన్నపాటి వర్షం కురిసినా, మంచు ఎక్కువగా పడినా కొబ్బరి డొక్కుల విధానంలో మందు పవర్‌ అలాగే ఉంటుంది. అదెలాగో చూద్దాం. తోలు, పీచు తీయని కొబ్బరికాయను చివరి వరకు నిలువుగా చీల్చాలి. అయితే రెండు ముక్కలు విడిపోకుండా ఉండాలి. ఒక ముక్కకు అడుగు భాగంలో చిన్న రంధ్రం చేసి దాంట్లో కర్రముక్కను గుచ్చాలి. కర్రముక్కను పొలంలో ఎలుకలు తీరిగే చోట నేలలో గుచ్చాలి. కొబ్బరి చెక్క నేలపైన ఉండాలి. రెండు చెక్కలు బాగా చీలి ఉన్న చోట కింది ముక్కకు ఒక మేకు కొట్టాలి. అంటే పైన ఉన్న కొబ్బరి చెక్క కింద ఉన్న ముక్కను పూర్తిగా మూసేయకుండా ఎలుక దాంట్లోకి దూరేందుకు కావాల్సిన ఖాళీ ఉండేలా మేకు కొట్టాలి. పైన ఉన్న కొబ్బరి చెక్క మేకుపైన ఆగి నిలిచి ఉండాలి. కింద ఉన్న కొబ్బరి చెక్క లోపల తయారు చేసుకున్న ఏ రకం మందు మిశ్రమాన్ని అయినే వేయాలి. రుచికరంగా తయారు చేసిన మందును ఎలుక తిని, చనిపోతుంది. ఈ విధానంలో కొబ్బరి చెక్కలో ఉన్న మందు వర్షం వచ్చినా, మంచు కురిసినా పవర్‌ తగ్గిపోకుండా చాలా రోజులు ఉంటుంది.ఖాళీ కూల్‌ డ్రింక్‌ సీసాలో పావు కిలో వేరుసెనగ పప్పులు వేసుకోవాలి. ఎక్కువ వాసన లేకుండా గుళికలు నానబెట్టిన నీళ్లు పోయాయి. వేరుసెనగ పప్పులపైన చూపుడు వేలంత ఖాళీ ఉండేలా గుళికల నీరు పోసుకోవాలి. ఏడు లేదా ఎనిమిది గంటల తర్వాత గుళికల నీరు పీల్చుకుని పప్పులు సీసా నిండిపోయేలా ఉబ్బుతాయి. వాటిని పూర్తిగా ఆరిపోయి మళ్లీ మామూలు పప్పుల్లా అయ్యే దాకా ఎండబెట్టాలి. ఇలా ఎండబెట్టిన గుళికలనీటితో కలిసిన వేరుసెనగ పప్పులు కూడా ఎలుకల నిర్మూలనకు బాగా పనిచేస్తాయి.అతి తక్కు ఖర్చుతో పొలాల్లోని ఎలుకల నివారణ లేదా నిర్మూల కోసం రకరకాల పద్ధతులను సూచిస్తున్న నగరం మాస్టారు నుంచి మరిన్ని వివరాలు కావాలంటే ఫోన్ నెంబర్‌: 9676474139 లో సంప్రదించవచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here