పూజల్లో వినియోగించేందుకు, అందంగా అలంకరించుకోడానికి అందరూ వాడేవి చామంతి పువ్వులు. పసుపు, తెలుపు, మెరూన్ రంగు, చిట్టి చేమంతులు ఇలా రకరకాల రంగుల్లో సైజుల్లో చామంతి పువ్వులు ఉంటాయి. మహిళల జడలు, కొప్పులో కూడా చామంతులతో అలంకరించుకుంటారు.చామంతిపువ్వులు సాధారణంగా చలికాలంలో మాత్రమే బాగా పూస్తాయి. నిండా పూసిన పూలతో చామంతి మొక్క చూడముచ్చటగా ఉంటుంది. చామంతి మొక్కల్ని నేలలో నాటి పెంచుకోవచ్చు. ఖాళీ స్థలం లేని వారు కుండీల్లో కూడా పెంచుకోవచ్చు. ఇంటి టెర్రస్ పైన, కారిడార్లలో, మెట్ల మీద, ప్రహారీ గోడమీద ఇలా ఎక్కడైనా చామంతి మొక్కల్ని పెంచుకోవచ్చు. చక్కగా పువ్వులూ పూయించుకోవచ్చు. ఇంటి పెరట్లోనూ, టెర్రస్ మీద చామంతి పూలు సాగు చేసేవారి నిర్వహణను బట్టి చామంతి పువ్వులు ఎక్కువ తక్కువ వస్తాయి. అయితే చామంతి సాగుచేసే రైతుల నిర్వహణ పద్ధతుల వల్ల ఏప్రిల్ నెల వరకు కూడా పువ్వుల దిగుబడి వస్తుంది.
శీతాకాలంలో మాత్రమే పూసే చామంతి పువ్వులను సీజన్ కాని వేళ కూడా పూసేలా చేసుకోవచ్చు. అన్ సీజన్ లో కూడా చామంతి పువ్వులు ఎలా పూయించుకోవచ్చో రత్నాస్ గార్డెన్ నిర్వాహకురాలు తన అనుభవంతో కొన్ని టిప్స్ చెప్పారు. చామంతి మొక్క పెంపకంలో ముందుగా చేయకూడనిది ఏంటో ఆమె వివరించారు. చామంతి మొక్కపైన, మొగ్గలు, పువ్వుల మీద నేరుగా పురుగుమందు గానీ, నీరు గానీ స్ప్రే చేయకూడదు. చామంతి మొక్క మొదలులో మాత్రమే నీరైనా, పురుగు మందయినా వేసుకోవాలి. చామంతి మొక్క మీద నేరుగా నీరు గానీ, పురుగుమందు కానీ స్ప్రే చేస్తే తర్వాత మొగ్గలు పువ్వులు వచ్చే అవకాశం తగ్గిపోతుంది.
ఎండిపోయిన చామంతి పువ్వులకు పేనుబంక లాంటిది లేకపోతే నేరుగా ఎరువుగా వాడుకోవచ్చు. పేనుబంక ఉంటే వాటిని కట్ చేసి దూరంగా పడేయాలి. లేదంటే చిన్నగా ఉంటే పేనుబంక పురుగులు చాలా వేగంగా మిగతా మొక్కకు విస్తరిస్తాయి. ఎంతో అపురూపంగా మనం పెంచుకునే చామంతి మొక్కకు పట్టేస్తాయి.
చామంతి మొక్కను పేనుబంక ఆశిస్తే.. సన్నని పుల్లతో గానీ, పెయింట్ వేసుకునే చిన్న సాఫ్ట్ బ్రెష్ తో గానీ, బేబీ టూత్ బ్రెష్ తో కానీ మొక్కను రాస్తూ పేనుబంకను దులిపేసి, చంపేయాలి. లేదా చేత్తో కూడా పేనుబంకను చంపొచ్చు. అప్పటికీ పేనుబంక పూర్తిగా నివారణ కాకపోతే.. ఎక్కువ ఎండలో మొక్కను పెడితే ఆటోమేటిక్ గా చనిపోతుంది. ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం చామంతి మొక్కను జాగ్రత్తగా చూసుకుంటే పేనుబంక నుంచి కాపాడుకోవచ్చు. చామంతి మొక్కకు మిల్లీ బగ్స్ కూడా ఆశిస్తాయి. వాటిని కూడా ఎప్పటికప్పుడు నివారించుకోవాలి. వీటిని చేత్తో తీసేయడమే మంచిది.
మనం పెంచుకునే మొక్కలకు అందించే పోషకాలనే చామంతి మొక్కకు కూడా వాడుకోవచ్చు. ఈ విధానాలు పాటిస్తే.. చామంతిపూలు ఏప్రిల్, మే, జూన్ నెల వరకు కూడా పూసే అవకాశాలు ఉంటాయని రత్నాస్ టెర్రస్ గార్డెన్ నిర్వాహకురాలు అనుభవంతో చెప్పారు. పెస్ట్ లేకపోతే చామంతి మొక్క చాలా ఆరోగ్యంగా పెరుగుతుంది. పెరిగిన మేరకు పువ్వులు కూడా సీజన్ కాకపోయినా బాగా విరగబూస్తాయి.
హైబ్రీడ్ చామంతి మొక్కలు ఒక్క సీజన్ వరకు మాత్రమే పూస్తాయని చెబుతారు. వాటిని కూడా సరైన సాగు పద్ధతి అనుసరిస్తే.. అన్ సీజన్ లో కూడా అవి చక్కగా పూస్తాయి. హైబ్రీడ్ మొక్క మొత్తం పూలతో నిండిపోవాలంటే సేంద్రీయ ద్రావణం వాడుకుంటే మంచిది. గానుగ ఆకు కషాయం చల్లుకుంటే హైబ్రీడ్ చామంతి మొక్కను క్రిమి కీటకాలు ఆశించే అవకాశం ఉండదు.
హైబ్రీడ్ చామంతి మొక్కకు పశువుల ఎరువు పచ్చిది వేయకూడదు. పచ్చి పేడ వేస్తే పురుగు తప్పకుండా వస్తుందని గ్రహించాలి. చామంతి మొక్కకు మట్టి నుంచి గానీ, పశువుల పచ్చి ఎరువు నుంచి గానీ పురుగు వస్తుంది. అందుకే పశువుల ఎరువును ఏమాత్రం పచ్చిగా లేకుండా బాగా ఎండబెట్టి వాడుకోవాలి. పేనుబంక ఉన్న ఏ మొక్క దగ్గరా చామంతి మొక్కను పెట్టకూడదు. చిట్టి చేమంతులని మరో రకం ఉంది. దాని ఆకుల అడుగు భాగంలో పేనుబంక కనిపిస్తుంది. చామంతి లేత చిగుర్లు, మొగ్గలకు పట్టి, వాటిలోని రసాన్ని పీల్చేస్తాయి. అందుకే ప్రతిరోజూ చామంతి మొక్కను జాగ్రత్తగా పరిశీలించుకోవాలి.
ఇలాంటి చిన్న చిన్న టిప్స్ ను జాగ్రత్తగా అనుసరిస్తే.. చామంతి మొక్కలు సీజన్ కాని వేళ కూడా బాగా పువ్వులు పూస్తాయి.