క్యారెట్‌ లో యాంటి ఆక్సిడెంట్లు, విటమిన్లు, ఫైబర్‌ పుష్కలంగా ఉంటాయి. రోజూ ఒక క్యారెట్‌ తింటే దానిలో ఎక్కువగా ఉండే ఎ విటమిన్‌ కారణంగా కంటిచూపు మెరుగు పడుతుంది. క్యారెట్‌ లోని పీచుపదార్థం మనలోని అధిక కొవ్వును కరిగిస్తుంది. సోడియం అధిక రక్తపోటును నియంత్రిస్తుంది. జీర్ణక్రియ సాఫీగా జరుగుతుంది. ఎ విటమిన్‌ వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. కడుపులోని అల్సర్లు నయం అవుతాయి. శరీరంలోని వ్యర్థాలు బయటకు పోతాయి. జుట్టు, గోళ్లు బలంగా అవుతాయి. క్యారెట్ తింటే తక్షణ శక్తి లభిస్తుంది. గ్యాస్‌, మలబద్ధకం, ఎసిడిటీ లాంటి సమస్యలు క్యారెట్‌ తో నయం అవుతాయి. క్యారెట్‌ లోని బీటా కెరోటిన్ ఎ విటమిన్‌ గా మారి లివర్‌ లోని విష పదార్థాలను బయటికి పంపేస్తుంది. క్యారెట్‌ లోని విటమిన్లు, మినరల్స్‌, కెరోటినాయిడ్స్ వల్ల పురుషుల్లో వీర్యకణాల నాణ్యత పెరుగుతుంది. అన్ని సీజన్లలోనూ లభించే క్యారెట్‌ ను ఎన్నో పోషకాల గని అని చెప్పుకోవచ్చు. ఇలా ఎన్నో ప్రయోజనాలున్న క్యారెట్‌ కు ప్రపంచవ్యాప్తంగా భారీ డిమాండ్‌ ఉంది.విత్తనం విత్తడం ద్వారా క్యారెట్ పంట సాగు చేసుకోవాలి. పంట చేతికి వచ్చేందుకు సుమారు నాలుగు నెలలు పడుతుంది. అనుకూల పరిస్థితుల్లో ఈ పంట సాగు చేస్తే 70 నుంచి 80 రోజుల్లో కూడా పంట కోతకు వస్తుంది. క్యారెట్ విత్తనం మొలకెత్తిన తర్వాత 8 నుంచి 10 సెంటీమీటర్ల దూరంలో నాటుకోవాలి. క్యారెట్‌ పూర్తిగా ఎండలో పెరిగినా నీడను కూడా తట్టుకుంటుంది. క్యారెట్ పంటకు అనుకూలమైన ఉష్ణోగ్రత 16 నుంచి 20 డిగ్రీల సెల్సియస్‌. వదులుగా,  లోతు వరకు పొడిగా ఉండే ఇసుక నేలలు ఈ పంటకు అనుకూలం. లూజుగా ఉండే నల్లరేగడి నేలల్లో కూడా క్యారెట్ సాగు చేయొచ్చు. రాతి నేలలు క్యారెట్ పంట సాగుకు పనికిరావు అని రైతులు తెలుసుకోవాలని వ్యవసాయ శాస్త్రవేత్తలు, అనుభవం ఉన్న రైతులు చెప్పారు.

తెలంగాణ రాష్ట్రం చేవెళ్ల మండలం రేగడి ఘణపూర్‌ లోని పాపన్నగారి నరేందర్‌ రెడ్డి క్యారెట్ పంటను పదేళ్లుగా సాగు చేస్తున్నారు. డిగ్రీ చదువు పూర్తయిన తర్వాత నరేందర్ రెడ్డి కొంతకాలం పెస్టిసైడ్‌ సంస్థలో సేల్స్‌ ఆఫీసర్‌ గా ఉద్యోగం చేశారు. పదేళ్లుగా మూడు ఎకరాల్లో నరేందర్‌ రెడ్డి కరోడా రకం క్యారెట్‌ పంట సాగు చేస్తున్నారు. శాలిని కరోడా, జూబ్లీ కరోడా, షెఫాయ్‌ క్యారెట్‌ ను ఖరీఫ్ సీజన్‌ లో సాగుచేస్తారు.ఎకరం పొలంలో క్యారెట్‌ సాగు చేయడానికి 300 గ్రాముల ప్యాకెట్లు 8 నుంచి 10 ప్యాకెట్లు అవసరం అవుతాయి. అంటే సుమారు రెండు రెండున్నర కిలోల విత్తనాలు కావాలి. జీలకర్ర మాదిరిగా క్యారెట్ విత్తనాలు ఉంటాయి. ఒక ప్యాకెట్ విత్తనాల ఖరీదు రూ.650 నుంచి రూ.700 వరకు ఉంటుంది. 10 ప్యాకెట్ల విత్తనాలు వేసుకున్నా రూ.6 వేలు నుంచి 7 వేలు ఖర్చు అవుతుంది. చేవెళ్లలోని ఫెర్టిలైజర్ షాపుల్లో విత్తనాలు దొరుకుతాయి. దుక్కి దున్నేందుకు ఎకరానికి రెండు నుంచి మూడు వేలు ఖర్చవుతుంది.

క్యారెట్ విత్తనాలు పొలంలో చల్లుకునే ముందు భూమిని బాగా దున్నుకోవాలి. ట్రాక్టర్ కల్టివేటర్‌ తో కూడా దున్నుతున్నారు. గతంలో క్యారెట్ విత్తనాలు మడులుగా కట్టి నీరు పారించే వారు. ఇప్పుడు డ్రిప్‌ విధానం సులువుగా ఉంది. డ్రిప్‌ విధానంలో మధ్య మధ్యలో స్ప్రింక్లర్ల ద్వారా ప్రతి క్యారెట్ మొక్కకు సక్రమంగా నీరు సరఫరా చేసుకోవచ్చు. దుక్కి, బోదెలు, డ్రిప్‌ పరుచుకున్న తర్వాత క్యారెట్ విత్తనం చల్లుకోవాలి. విత్తనం సన్నగా, చిన్నగా ఉంటుంది కాబట్టి ఇసుకలో కలుపుకుని చల్లుకోవాలి. విత్తనం ప్యాకెట్‌ విప్పి గంట పాటు సంచి మీద పోసి ఉంచి, కాస్త ఎండిన తర్వాత ఇసుకలో కలుపుకుని చల్లుకోవాలి. విత్తనం చల్లిన 12 నుంచి 15 రోజుల్లో మొలక వస్తుంది.పంట పూర్తయ్యాక వీలైనంత వరకు చేత్తో లాగేసుకోవాలి. లాగినా రాని క్యారెట్ దుంపల్ని నాగలితో దున్ని, ఏరుకోవచ్చు. పంట చేతికి వచ్చిన ఐదారు రోజుల్లో మొత్తం పంటను భూమి నుంచి బయటికి తీసేయాలి. క్యారెట్‌ పంట తీసేసిన తర్వాత 15 నుంచి 30 రోజులు భూమిని అలాగే వదిలిపెట్టాలి. మే, జూన్ నెలల్లో క్యారెట్ విత్తనం చల్లుకుంటే వర్షాలు ఎక్కువ కాబట్టి దిగుబడి అంతగా రాదు. నవంబర్‌ నుంచి జనవరిలో సంక్రాంతి పండుగ లోపు విత్తనం నాటుకుంటే క్యారెట్‌ సైజు, రంగు, రుచి బాగా ఉంటాయని నరేందర్ రెడ్డి చెప్పారు.

అర ఎకరం భూమిలో నవంబర్‌ నెలలో విత్తనం నాటుకున్న నరేందర్ రెడ్డికి ఫిబ్రవరి రెండో వారానికి 80 కిలోల చొప్పున 150 బస్తాల దిగుబడి వచ్చింది. అంటే సుమారు 13 నుంచి 14 టన్నుల దిగుబడి వచ్చిందని చెప్పారు. ఒక ఎకరంలో 20 నుంచి 25 టన్నుల క్యారెట్‌ దిగుబడి వస్తుంది. సక్రమ వ్యవసాయ పద్ధతులు పాటిస్తే 20 టన్నుల క్యారెట్ దిగుబడికి ఢోకా ఉండదు. ఒక్కొక్కటి 100 గ్రాముల బరువు తూగితే దాన్ని మంచి పంటగా పరిగణించాలి. క్యారెట్ పంటకు డ్రిప్‌ విధానంలో ప్రతిరోజూ క్యారెట్ మొక్కలకు నీటిని సరఫరా చేయొచ్చు. నేలలో పదునును బట్టి రోజు విడిచి రోజు రెండు గంటల పాటు నీరు ఇచ్చినా సరిపోతుంది. రెండు అంగుళాల నీరు పోసే ఒక బోరుతో ఐదు ఎకరాల్లో క్యారెట్ పంటకు నీరు సరఫరా చేసుకోవచ్చు.నరేందర్‌ రెడ్డి తన పొలంలో క్యారెట్ పంట బలంగా రావడానికి ఎకరానికి రెండు బస్తాల డీఏపీ ఎరువు వాడుతున్నట్లు చెప్పారు. నత్రజని, ఫాస్పరస్‌, పొటాషియం మాత్రమే కాకుండా సల్ఫర్, జింక్‌, ఐరన్‌ లాంటి సూక్ష్మ పోషకాలు కూడా క్యారెట్ పంట సాగుకు అవసరం అవుతాయని నరేందర్ రెడ్డి చెప్పారు. రసాయనాలు లేకుండా ఆర్గానిక్‌ విధానంలో పంట సాగు చేయాలనుకుంటే ఆవు పేడ, పశువుల ఎరువు కూడా ఏడాదికి ఒకసారి వాడుకోవచ్చు. దీని కోసం రూ. 20 నుంచి రూ.30 వేల వరకు ఖర్చవుతుంది. డీఏపీ, సూక్ష్మ పోషాల కోసం ఎకరానికి సుమారు రూ.4 వేలు వరకు ఖర్చు వస్తుంది. క్యారెట్‌ సాగుభూమిలో కలుపు తీసిన తర్వాత యూరియా, 13:0:45 లేదా 14:35 గానీ 10:26 అంటే నైట్రోజన్‌, ఫాస్పరస్‌, పొటాష్‌ సమపాళ్లలో ఉండేలా పంటకు వేసుకోవాలి. రెండోసారి వేసే ఎరువులకు దాదాపు రూ.5 వేలు వరకు ఖర్చవుతుంది. క్యారెట్ విత్తనం, దుక్కి దున్నేందుకు రూ.15 వేలు ఖర్చవుతుంది.క్యారెట్ పంటకు చలికాలంలో బూడిద తెగులు వస్తుంది. క్యారెట్ మొక్క మొలిచినప్పటి నుంచే పురుగులు ఆశిస్తాయి. ఈ పురుగు ఆశించినప్పడు క్యారెట్ దుంప చీలిపోతుంది. పుచ్చు వచ్చినట్లు అవుతుంది. దీంతో క్వాలిటీ తగ్గిపోతుంది. ఇలాంటి క్యారెట్ దుంపల్ని వినియోగదారులు ఇష్టపడరు. పెస్ట్‌ మేనేజ్‌ మెంట్ సరిగా ఉంటే పురుగు నివారణ సక్రమంగా జరుగుతుంది.మొక్క మొలిచినప్పుడు తొలుత 3జీ లేదా క్లోరో గుళికలు చల్లుకుంటే పురుగులు ఆశించే అవకాశం ఉండదు. లేదా పెరిగిన టెక్నాలజీలో ఇంకా చాలా రకాల పురుగు నివారణ మందులు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. వాటిని సరైన అవగాహనతో, వ్యవసాయ నిపుణుల సూచనల మేరకు వాడుకోవచ్చు. విత్తనం చల్లిన 24 గంటల్లో గడ్డి నివారణ కోసం గాలిగాన్‌ వాడుకోవాలి. కొందరు పెండిమిథాల్‌ వాడుతుంటారు. వీటిని వాటిన నెలరోజుల దాకా భూమిలో గడ్డి మొలవదు. అప్పటికి క్యారెట్ మొక్క ఎదిగిపోతుంది. ఆ తర్వాత మొలిచే గడ్డి నివారణ కోసం శ్రంకర్‌ మెట్రిబుజన్‌- ఏజిల్‌ కలిపి స్ప్రే చేస్తే గడ్డి మొత్తం పోతుంది. ఒక పంట కాలంలో ఒకసారైనా మనుషులతో కలుపు తీసుకుంటే మేలు అని నరేందర్‌ సూచించారు.రెండు మూడు అంగుళాల కన్నా దగ్గరగా విత్తనం పడితే.. క్యారెట్‌ దుంప పుష్టిగా రాదు. సన్నగా అవుతుంది. సన్నగా ఉన్న క్యారెట్‌ కు మార్కెట్‌ ధర కూడా ఎక్కువ రాదు. క్యారెట్ మీడియం సైజుకు మార్కెట్‌ లో మంచి గిరాకీ ఉంటుంది.

ఎకరం పొలంలో క్యారెట్ పంట సాగు చేయాలంటే విత్తనాలు, దుక్కికి కలిపి రూ.15 వేలు ఖర్చతుంది. ఎరువులకు రూ.5 వేలు, పురుగు మందులకు రూ.5 వేలు వరకు ఖర్చు రావచ్చు. ఎకరంలో మనుషులతో కలుపు తీయడానికి రెండు నుంచి మూడు వేలు అవుతుంది. మొత్తం మీద రూ.25 నుంచి రూ.30 వేలు వరకు ఒక ఎకరంలో క్యారెట్‌ పంట పండించేందుకు పెట్టుబడి పెట్టాలి. క్యారెట్ పంట తీయడానికి కూలీలకు ఒక రోజుకు మూడున్నర నుంచి రూ.4 వేలు వరకు ఖర్చవుతుంది.  పదిమంది కూలీలు 15 బస్తాల వరకు అంటే వెయ్యి నుంచి 12 వందల కిలోల పంట తీయగలుగుతారు. భూమి నుంచి తీసిన తర్వాత మట్టిని తొలగించడానికి క్యారెట్లను వాటర్ మిషన్‌ లో వేసి తిప్పుకోవాలి. నీటిలో శుభ్రం చేసిన క్యారెట్‌ రంగు కూడా ఆకర్షణీయంగా ఉంటుంది. తద్వారా ధర కూడా బాగా పలుకుతుంది. ఎక్కువ భూమిలో క్యారెట్ పండించే వారు క్లీనింగ్ మిషన్ తీసుకోవచ్చు. అది దాదాపు లక్ష రూపాయల్లో లభిస్తుంది. అదే కిరాయి మిషన్‌ లో క్టీన్‌ చేయాలంటే ఒక బస్తాకు రూ.40 తీసుకుంటారు. ఒక టన్ను క్యారెట్ ను భూమి నుంచి తీసి శుభ్రం చేయడానికి సుమారు రూ.4 వేలు ఖర్చవుతుంది.సిద్ధం చేసిన రైతులు హైదరాబాద్‌ లోని గుడిమల్కాపూర్‌, బోయిన్ పల్లి మార్కెట్లకు తరలిస్తారు. రైతు పండించిన రైతుకు కిలోకు 20 నుంచి 25 రూపాయల ధర పలుకుతుంది. పది టన్నుల క్యారెట్ భూమి నుంచి తీసి శుభ్రం చేయడానికి రూ.50 వేల దాకా ఖర్చవుతుంది. ఒక ఖాళీ సంచి ఖరీదు రూ.60 ఉంటుంది. మార్కెట్‌ కు తీసుకెళ్లే రవాణా చార్జీలు దూరాన్ని బట్టి అవుతాయి.ఒక ఎకరం నుంచి 25 టన్నుల క్యారెట్ దిగుబడి వస్తే.. టన్నుకు రూ.22 వేల చొప్పున రూ.5,50,000 ఆదాయం వస్తుంది. జనవరి, ఫిబ్రవరి నెలల్లో అయితే.. క్యారెట్ కిలోకు 60 నుంచి 70 రూపాయల ధర కూడా పలుకుతుందని నరేందర్ రెడ్డి వెల్లడించారు. కిలో రూ.20 ధర వచ్చినా పెట్టిన ఖర్చుకు రెట్టింపు లాభం వస్తుంది. అంతకు ధర తగ్గింతే మిగిలేది ఉండదన్నారు. ఎకరం భూమిలో క్యారెట్‌ పంట మొత్తం ఖర్చు లక్ష నుంచి లక్షా 20 వేలు అయినా.. 20 టన్నులే పంట దిగుబడి వచ్చినా కిలో 20 రూపాయల చొప్పున రూ.4 లక్షల ఆదాయం వస్తుంది. అంటే అంతకు మించి దిగుబడి వచ్చినా, ధర ఎక్కువయ్యే కొద్దీ లాభం పెరుగుతుందని నరేందర్‌ రెడ్డి వివరించారు.

ఒక్కోసారి మార్కెట్‌ లో ధర లేకపోతే పంటను రైతులు మార్కెట్లో పడేసి వెళ్లిన సందర్భాలు కూడా ఉన్నాయి. ధర మరీ తక్కువగా 10 రూపాలయే ఉంటే.. పంటను దున్నేసి పశువులకు మేతగా వేసిన ఘటనలు కూడా ఉన్నాయి.ఖరీఫ్‌ కాలం జూన్‌ లో పంట వేసుకుంటే.. మూడు నెలలకు వినాయక చవిత సమయంలో వచ్చే పంటకు ధర బాగుంటుంది. దిగుబడి 5 నుంచి 10 టన్నుల మధ్యలోనే ఉంటుంది. సెప్టెంబర్, అక్టోబర్‌ నెలల్లో క్యారెట్ విత్తనం చల్లుకుంటే పంట దిగుబడి ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. పెట్టుబడి ఖర్చు, పురుగుల బెడద, వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేకపోయినా తట్టుకోగల రైతులు క్యారెట్ పంట సాగు చేస్తే లాభదాయకంగానే ఉంటుంది. ధరలు కాస్త అటూ ఇటూగా కిలోకు రూ.20 రూపాయలు దొరికినా ఎకరం క్యారెట్ పంటకు లక్ష రూపాయల దాకా లాభం వచ్చే అవకాశం ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here