మిర్చి.. ప్రతి నిత్యం.. అన్ని ఇళ్లలో ఆహార పదార్థాల్లో వినియోగించే అతి ముఖ్యమైన పంట. రోజూ కొన్ని వేల టన్నుల మిర్చి ఆహారపదార్థాల తయారీకి అవసరం అవుతుంది. అలాంటి ముఖ్యమైన మిర్చి పంటకు క్రిమి కీటకాలు, తెగుళ్ల బెడద ఎక్కువనే చెప్పాలి. మిర్చి పంట సాగులో సస్యరక్షణ చర్యలు బాగానే చేయాల్సి ఉంటుంది. అయితే.. మిర్చి సాగులో ఎదురయ్యే సమస్యలు, ప్రకృతి విధానంలో రక్షణ చర్యల గురించి తెలుసుకుందాం.మిరప పంటకు దోమ, పురుగులు, తెగుళ్ల బెడద ఎక్కువగా వస్తుంటుంది. అలాంటి ఇబ్బందులకు ఆస్కారం లేకుండా మిర్చిపంటను కాపాడుకోవడానికి 45 రోజుల ముందే పొలంలో జనుము, జీలుగు లాంటి పచ్చిరొట్ట పైర్లు పెంచుకోవాలి. వాటికి పూత, పిందె వచ్చినప్పుడు భూమిలో బాగా కలిసేలా దున్నుకోవాలి. పచ్చిరొట్ట పైర్ల వల్ల నత్రజని, కర్బనం శాతం పెరిగి భూమి సారవంతం అవుతుంది. పంటకు ముందు భూమిలో ఎకరానికి పది ట్రాక్టర్ల దాకా పశువుల ఎరువు, ఒకటిన్నర క్వింటాళ్ల ఘనజీవామృతం, ఒకటిన్నర క్వింటాళ్ల వేపపిండి వేసుకోవాలి. అవన్నీ భూమిలో బాగా కలిసిపోయేలా దున్నుకోవాలి. ఇలా చేసుకుంటే భూమి సారవంతం అవుతుంది. దాంతో పాటు భూమిలో ఉండే తెగుళ్లను కూడా అరికట్టవచ్చు.మిరప మొక్కలు ఎదిగిన తర్వాత ఏ సమస్యకు ఎలాంటి ప్రకృతి సిద్ధమైన రక్షణ చర్యలు చేపట్టాలో తెలుసుకుందాం. మిరప మొక్కలు ఎండిపోవడానికి కారణం వేరుపురుగు. అలా వేరుపురుగు ఆశించకుండా ఉండాలంటే ముందుగానే బీజామృతంతో విత్తనాలను శుద్ధి చేసుకోవాలి. నారును బీజామృతంతో శుద్ధి చేసుకుని నాటుకుంటే కూడా వేరుపురుగును నివారించుకోవచ్చు. బీజామృతంతో శుద్ధి చేయడం వల్ల మొక్కకు వ్యాధి నిరోధక శక్తి కూడా పెరుగుతుంది. మిరపతోట చుట్టూ రక్షక పంటగా జొన్న, మొక్కజొన్న, కంది పంటలు వేసుకోవాలి. అవి పక్క పొలాల్లోంచి గాలి ద్వారా వచ్చే తెగుళ్లు, పురుగులను గోడలా నిలిచి అడ్డుకుంటాయి.మిరప సాగులో అంతర పంటలుగా బంతి, ఆముదం, ఉల్లి లాంటివి వేసుకుంటే రసం పీల్చే పురుగుల ఉధృతి తగ్గిపోతుంది. ఎకరం మిరప చేలో పది నుంచి పన్నెండు ఆముదం మొక్కల్ని నాటుకుంటే పొగాకు లద్దెపురుగు నివారణ అవుతుంది. ఎకరం మిరపతోటలో పది నుంచి ఇరవై లోపు జిగురు పూసిన పసుపు, తెలుపు పళ్లాలు పెట్టుకుంటే.. తామరపురుగు, తెల్లదోమ, పచ్చదోమ నివారణ అవుతాయి. అలాగే.. పురుగుల నివారణ కోసం ఎకరం మిరప తోటలో పది నుంచి పదిహేను పక్షి స్థావరాలు ఏర్పాటు చేయాలి. వాటిపై పక్షులు వాలి పంటలో ఉండే పెద్ద పెద్ద పురుగులను ఏరుకుని తినేస్తాయి. ఎకరం మిర్చితోటలో పది నుంచి పదిహేను లింగాకార బుట్టలు ఏర్పాటు చేసుకోవాలి. ఆ బుట్టల్లో ఉండే ఆడపురుగు ఆకర్షణలో పడి మగపురుగులు బుట్టలోకి వచ్చి చనిపోతాయి. దీంతో మిర్చి పంటలో పురుగుల ఉధృతి బాగా తగ్గిపోతుంది.మిరప ఆకులు ముడతలు పడినప్పుడు ఏం చేయాలో చూద్దాం. మిర్చి ఆకు ముడత తెగులులో కిండ ముడత, పైముడత, బొబ్బర ముడత అనే మూడు రకాలు ఉంటాయి. ఎకరానికి మూడు లీటర్ల నీమాస్త్రం స్ప్రే చేస్తే కింద ముడతను నివారించవచ్చు. ఎకరానికి మూడు లీటర్ల ఉమ్మెత్త కషాయం స్ప్రే చేస్తే పైముడత పోతుంది. ఉమ్మెత్త- తూటి ఆకు కషాయాన్ని ఎకరానికి మూడు లీటర్ల చొప్పున వారానికి ఒకసారి స్ప్రే చేస్తే మిర్చి ఆకుల్లో వచ్చే బొబ్బర ముడతను నివారించుకోవచ్చు. ఎకరానికి మూడు లీటర్ల చొప్పున వేపపిండి ద్రావణం కానీ, గానుగ పిండి ద్రావణం కానీ చల్లుకుంటే మిర్చి పూత, పిందె రాలిపోవడాన్ని నివారించుకోవచ్చు.ఆవుపేడ, గోమూత్రం కలిపిన ద్రావణం ఎకరానికి ఐదు లీటర్లు స్ప్రే చేసుకుంటే ఎక్కువగా ఉన్న ఆకుమచ్చ తెగులు తగ్గిపోతుంది. ఎకరానికి ఆరు లీటర్ల పుల్లని మజ్జిగను స్ప్రే చేస్తే.. మిర్చి మొక్కల్లో పండు ఆకు తెగులు నివారణ అవుతుంది. సీతాఫలం- కలబంద కషాయాన్ని ఎకరానికి ఐదు లీటర్లు స్ప్రే చేస్తే.. కొమ్మకుళ్లు, ఆకు కుళ్లును నివారించుకోవచ్చు. ఎకరానికి ఐదు లీటర్ల పుల్లని మజ్జిగ స్ప్రే చేస్తే బోడె తెగులు తగ్గిపోతుంది. మిరప మొక్కలను సెనగపచ్చ పురుగు, పెద్ద పురుగు ఎక్కువగా ఆశించినప్పుడు బ్రహ్మాస్త్రాన్ని కొట్టుకోవాలి. వాటి బెడద మరీ ఎక్కువగా ఉంటే అగ్నాస్త్రాన్ని స్ప్రే చేసుకోవాలి.మిరప మొక్క బలంగా, ఏపుగా ఎదగాలంటే.. 200 ద్రవజీవామృతాన్ని ముందుగా స్ప్రే చేసుకోవాలి. ఆ తర్వాత 15 రోజులకు ఒకసారి ద్రవజీవామృతాన్ని నీళ్లతో కలిపి మొక్కలకు పారించాలి. మిర్చి పంటలో పూత, పిందె రాలిపోకుండా ఉండాలంటే.. పూత బాగా రావడానికి, పూత పిందెగా మారేందుకు.. ఎకరంలో 700 మిల్లీ లీటర్ల చేప- బెల్లం ద్రావణం కానీ, కోడిగుడ్డు- నిమ్మసరం గానీ పిచికారి చేసుకోవాలి. మిరపకాయ మంచి రంగు రావడానికి, కాయలో గింజ, గుజ్జు బరువు పెరగడానికి సప్తధాన్యాంకుర కషాయాన్ని వాడుకోవాలి.సహజసిద్ధమైన ఇలాంటి సస్య రక్షణ చర్యలు పాటిస్తే.. మిర్చి రైతులకు దిగుబడి బాగా పెరుగుతుంది. ఆదాయమూ ఎక్కువ వస్తుంది. తద్వారా లాభాలు కూడా రాబట్టుకోవచ్చని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ వ్యవసాయశాఖ ప్రకృతి వ్యవసాయ విభాగం నిపుణులు సూచిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here