పంటల్ని పాడుచేసే క్రిమి కీటకాల నివారణకు ఎన్నో పద్ధతులు పాటిస్తూ ఉంటాం. అనేక రకాల విష రసాయనాలు వాడతాం. సహజ పద్ధతిలో తయారు చేసుకునే దశపర్ణి కషాయం, ఆవుపేడ, గోమూత్రంతో తయారు చేసే జీవామృతం, వేపనూనె లాంటివి వినియోగిస్తుంటాం. రసాయనాలు వాడాలంటే ఖర్చులు తడిసి మోపెడవుతాయి. రసాయనాలు వాడిన పంట ధాన్యాలు, పండ్లు, కూరగాయల్ని వినియోగిస్తే.. అనారోగ్య సమస్యలు వస్తున్నాయని ఇప్పుడు ప్రపంచం మొత్తం అర్థం చేసుకుంటోంది. ఇక సహజసిద్ధ క్రిమి నివారణ చర్యలు తీసుకునేందుకు దశపర్ణి కషాయం తయారు చేసుకోవాలంటే.. కాస్త శ్రమ ఎక్కువనే చెప్పాలి. వేపనూనె లాంటివి ఆరోగ్యానికి ఉపయోగపడేవే అయినా అవి కూడా కొద్దిగా ఖర్చుతో కూడినవే. ఎక్కువ డబ్బు ఖర్చు కాకుండా, తక్కువ శ్రమతో పంటలను ఆశించే క్రిమి కీటకాలను నిర్మూలించే అత్యంత సులువైన, ఎలాంటి అపాయమూ లేని కీటక నాశని మట్టి ద్రావణం గురించి తెలుసుకుందాం.కొద్దిపాటి పొలంలో సహజసిద్ధ వ్యవసాయం చేసేవారికి జీవామృతం, దశపర్ణి కషాయం, అగ్ని అస్త్రం, ఆముదం పిండి లాంటివి తయారు చేసుకోవడానికి పెద్దగా కష్టం ఉండకపోవచ్చు. కానీ.. పెద్దమొత్తంలో సహజ పంటల సాగు చేసేవారికి ఆయా క్రిమి కీటకాల నివారణ కోసం కషాయాలు తయారు చేసుకోవడం కాస్త ఖర్చు, మరికాస్త శ్రమ ఎక్కువగానే ఉంటుంది. అయితే.. ఆదర్శ రైతు, పద్మశ్రీ అవార్డు గ్రహీత చింతల వెంకటరెడ్డి రూపొందించిన మట్టి ద్రావణం తయారీ విధానం చాలా సులువు. మట్టి ద్రావణం తయారు చేసుకోవడానికి దూరాభారాలు వెళ్లక్కరలేదు. మన పొలంలో నుండే మట్టిని తీసుకుని ద్రావణం తయారు చేసుకోవచ్చు. పైగా మట్టి ద్రావణం క్రిమికీటకాల నివారణలో ఎంతో సమర్ధంగా పనిచేస్తోంది. ఈ వి షయం కొమురం భీం జిల్లా కౌటాల మండలం విజయనగరం గ్రామంలో ప్రకృతి వ్యవసాయం చేస్తున్న యువ రైతు దంపతులు సునంద, రవి అనుభవంతో చెబుతున్నారు. ఎనిమిది ఎకరాల్లో ఈ దంపతులు సహజసిద్ధ విధానం నవారా, దేశీయ వరి సాగు విజయవంతంగా చేస్తున్నారు. కంది, సోయాబీన్‌, కొర్ర, సజ్జ, రాగుల పంటలు కూడా పండిస్తున్నారు.పంటలపై స్ప్రే చేసిన మట్టి ద్రావణంలోని మట్టిని తిన్న కాండం తొలిచే పురుగులకు అరగదు. దాంతో పురుగులు చనిపోతాయి. మట్టి ద్రావణం చల్లిన పొలంలో క్రిమి కీటకాల బెడద ఉండదు. మట్టి ద్రావణం స్ప్రే చేసిన మరుసటి రోజుకల్లా పురుగులు పంట మొక్కల ఆకుల మీదే పడి చనిపోయి, నల్లగా మాడిపోయి అంటుకుని ఉంటాయి. పురుగులు ఉన్నా లేకపోయినా.. వారానికి ఒకసారి ఈ మట్టి ద్రావణాన్ని స్ప్రే చేసుకుంటే మంచిదని సునంద- రవి దంపతులు వివరించారు. ఇందుకయ్యే ఖర్చు కేవలం ఆముదం నూనె, స్ప్రేచేసే కూలీలకు మాత్రమే అవుతుంది. కనుక పెద్దగా పెట్టుబడి పెట్టాల్సిన అవసరం ఉండదు. కేజీ ఆముదం నూనెను 30 కిలోల మట్టిలో కలుపుకుని పైరుపై స్ప్రే చేసుకోవాలన్నారు. వారానికి ఒకసారి మట్టి ద్రావణం స్ప్రే చేసుకుంటే పొలానికి వ్యాధులేవీ సోకే అవకాశం ఉండదు.మట్టి ద్రావణం తయారీ విధానం:

భూమిలోని మూడు అడుగుల లోపలి మట్టిని సుమారు 15 కిలోలు తీసుకోవాలి. పోభూమిపై ఉన్న మట్టిని 10 నుంచి 15 కిలోలు తీసుకోవాలి. మనం వేసే పంటల వేర్లు ఏవీ కూడా మూడు అడుగుల కన్నా లోపలికి వెళ్లవు. కాబట్టి లోపలి మట్టిలోని పోషకాలు అలాగే ఉంటాయి. భూమి లోపల నిల్వ ఉన్న పోషకాలను ఇలా పంటలకు అందివ్వగలుగుతామని సీవీఆర్‌ నిరూపించి చెప్పారు. ఇసుక శాతం ఎక్కువ ఉండే ఎర్రమట్టిని 30 కిలోలు తీసుకోవాలి. అదే ఇసుక శాతం తక్కువ ఉండి ఒండ్రు మట్టి ఎక్కువ శాతం ఉంటే 20 కిలోలు సరిపోతుంది. ఈ రెండు రకాల మట్టిని బాగా కలుపుకోవాలి. ఈ మట్టిని బాగా ఎండబెట్టిన తర్వాత మెత్తగా చేసుకుని నీటిలో కలిపిన తర్వాత పైన తేరుకున్న నీటిని స్ప్రే చేసినా చాల వరకు పురుగులు రెండు రోజుల్లో చనిపోతాయి. రెండు రకాల 30 కిలోల మట్టికి అర కిలో నుంచి కిలో ఆముదం నూనెను బాగా కలిసేదాకా కలుపుకోవాలి. ఆముదం ఘాటువాసకు పంటచేనులోకి దోమలు రావు. ఆముదం తిన్న అనేక పురుగులు కూడా జీర్ణం చేసుకోలేవు. పైగా ఆముదం వల్ల విరేచనాలు పట్టుకుని కూడా చాలా పురుగులు చనిపోతాయి. పైగా ఆముదంలో పాస్పరస్‌ లాంటి పోషకాలు ఉన్నాయి. అవి కూడా పంట బాగా ఎదిగేందుకు ఉపయోగపడతాయి.రెండు వందల లీటర్ల నీటిలో 30 కిలోల రెండు రకాల మట్టి, ఆముదం కలిపిన మట్టిని డ్రమ్ములో వేసి ఒక కర్రతో బాగా కలుపుకోవాలి. నీటిలో కలుపుకున్న మట్టి ద్రావణాన్ని వెంటనే స్ప్రే చేస్తే.. మట్టి పలుకులు స్ప్రే నాజిల్‌ లో అడ్డుపడాయి. పలుమార్లు రిపేర్‌ చేసుకోవాల్సి ఉంటుంది.  అందుకే మట్టి, ఆముదం నూనె నీటిలో కలిపిన తర్వాత పది నుంచి పదిహేను నిమిషాలు అలాగే ఉంచేయాయి. నీటిలోని మట్టి డ్రమ్ములో కిందికి దిగిపోతుంది. తేటగా ఉన్నా ద్రావణం పైన తేరుతుంది. పైగా మట్టిలో ఉన్న పోషకాలన్నీ నీటిలో బాగా కలిసిపోతాయి. డ్రమ్ములో పైన తేరిన నీటిని మాత్రమే తీసుకుని స్ప్రే చేసుకుంటే స్ప్రే నాజిల్‌ సమస్యలు రావు. క్రిమి కీటకాలు నాశనం అవుతాయి. ద్రావణంలో కలిసిపోయిన పోషకాలు మొక్కలకు బాగా చేరుకుని ఏపుగా ఎదుగుతాయి. మట్టి ద్రావణాన్ని మొక్క మొత్తం తడిసేలా స్ప్రే చేసుకోవాలి. ఎందుకంటే.. ఎక్కడైనా మొక్క తడవని ప్రదేశంలో ఉన్న పురుగులు చనిపోవు. రసాయన పురుగుమందులు చల్లినట్లు కాకుండా వర్షం వచ్చినప్పుడు మొక్క ఎంత బాగా తడుస్తుందో.. ఆ మాదిరిగా ప్రతి ఆకు నుంచి మట్టి ద్రావణం కిందికి జారేలా స్ప్రే చేసుకోవాలి. ఆముదం ఘాటు కారణంగా ఆకులపై ఉండే పురుగుల గుడ్లు కూడా నాశనం అవుతాయి.మట్టి ద్రావణాన్ని ప్రతి వారం రోజులకు ఒకసారి స్ప్రే చేస్తూ ఉంలే క్రిమి కీటకాలు, పురుగుల బెడద అనేదే పంటకు ఉండదు. దోమ, చీడ, పచ్చపురుగు, లద్దెపురుగు, దోమలు, మిడతలు, బంక, పిండి నల్లి లాంటివన్నీ పూర్తిగా నివారణ అవుతాయి. దశపర్ణి కషాయం స్ప్రే చేసినా తగ్గని పిండి నల్లి మట్టి ద్రావణం వల్ల పూర్తిగా నివారణ అవుతుంది. మూడు అడుగుల లోతు మట్టిలో జిగట ఉంటుంది, ఆముదం కూడా జిగురుగా ఉంటుంది కనుక మట్టి ద్రావణం ఆకులకు బాగా పట్టుకుంటుంది. ఒకవేళ మట్టి ద్రావణం స్ప్రే చేసిన వెంటనే వర్షం వచ్చినా దాని ప్రభావం తగ్గిపోయే అవకాశం ఉండదని సునంద తన అనుభవంతో వివరించారు.విత్తన శుద్ధి కూడా మట్టి ద్రావణంతో చేసుకుంటే మరింత మేలు అను సీవీఆర్‌ నిరూపించి చెప్పారు. దాని వల్ల వ్యాధుల ప్రభావం లేకుండా విత్తనం మొలకెత్తుతుంది. మట్టి ద్రావణాన్ని ఏ కాలంలో అయినా మొక్కలకు, పైర్లకు స్ప్రే చేసుకోవచ్చు. మట్టి ద్రావణాన్ని ఒకసారి ఒక వైపు నుంచి మరోసారి మరోవైపు నుంచి స్ప్రే చేసుకుంటే మొక్కలు అన్ని వైపులా ద్రావణం చక్కగా అంటుకుంటుంది. తద్వారా క్రిమి కీటకాలు, వ్యాధుల బెడద ఉండదు. మొక్కలు గాని, వరి పైరు గానీ మరేదైనా కానీ ఏపుగా ఎదుగుతుంది. మంచి పంట దిగుబడి వస్తుంది. మట్టి ద్రావణంలోనే పోషకాలు ఉన్నాయి కాబట్టి పైన డీఏపీ, యూరిలా లాంటి ఎరువులు వేయాల్సిన అవసరం ఉండదు. తద్వారా కూడా రైతుకు డబ్బు ఆదా అవుతుంది.మరింకేం.. ఖర్చు తక్కువ, ప్రమాదం లేనిది, పోషకాలతో కూడినది, క్రిమి కీటకాలను నాశనం చేయడంలో అత్యంత సమర్థంగా పనిచేసే మట్టి ద్రావణంతో వ్యవసాయం చేస్తే మరింత మేలు, లాభదాయకంగా ఉంటుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here