వెన్నపండు లేదా అవకాడో మధ్య మెక్సికో ప్రాంతానికి చెందిన పండు. పుష్పించే తరగతికి చెందిన దీనికి శాస్త్రీయంగా పెట్టిన పేరు పెర్సీ అమెరికా. వెన్నపండును ఇంగ్టీషులో అవకాడో లేక అల్లెగటర్ పీయర్, లేదా బటర్ ఫ్రూట్ అని పిలుస్తారు. అవకాడో కాయలు ఆకుపచ్చగా గాని నల్లగా గాని ఉంటాయి. మెత్తగా ఉండి తినడానికి కొద్దిగా ఆవు వెన్న రుచిగానూ, కొద్దిగా చిరు చేదుగానూ ఉంటాయి. వెన్నపూస దొరకనప్పుడు పసిపిల్లలకు వెన్నపండు ఎంతో శ్రేష్టమైన ఆహారం. అవకాడో గింజలను అనేక ఔషధాలలో వాడుతుంటారు.వెన్నపండ్లు సారవంతమైన ఎర్ర నేలల్లో బాగా పండుతాయి. వెన్నచెట్లను పెరూ, పోర్చుగీస్, మొరాకో, దక్షిణ ఆఫ్రికా, కొలంబియా, చిలీ, వియత్నాం, ఇండోనేషియా, శ్రీలంక, దక్షిణ భారతదేశం, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఫిలిప్పీన్స్, మలేషియా, మధ్య అమెరికా, కరేబియన్, మెక్సికో, కాలిఫోర్నియా, అరిజోనా, ప్యూర్టారికో, న్యూ మెక్సికో, టెక్సాస్, ఫ్లోరిడా, హవాయి, ఈక్వేడర్, ర్వాండా దేశాల్లో సాగు చేస్తున్నారు. అవరాడో విత్తనం నాటిన 4 నుండి 6 ఏళ్లకు వెన్నచెట్ల నుంచి కాయలు కోతకు వస్తాయి.
వెన్నపండులో క్రొవ్వు శాతం ఎక్కువగా ఉంటుంది. దీని గుజ్జును చికెన్, ఫిష్, మటన్ కూరల్లో, సాండ్ విచ్ ల్లో, సలాడ్లలో ఉపయోగిస్తారు. దక్షిణ భారత దేశంలో ఐస్ క్రీముల్లో, డెసర్ట్స్ లోను వాడతారు. వెన్నపండు గుజ్జును పంచదార కలిపిన పాలలో లేదా నీటిలో కలిపి జ్యూస్ గా తాగవచ్చు. వెన్నపండు గుజ్జు ఎల్ డీ ఎల్ కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది.హెచ్ డీ ఎల్ కొలెస్ట్రాల్ ను పెంచుతుంది. కేన్సర్, మధుమేహం, హైపర్ టెన్షన్లను అదుపు చేస్తుంది. అవకాడోలో పొటాషియం బాగా ఉంటుంది. బ్లడ్ ప్రెషర్ ను సమతుల్యంగా ఉంచుతుంది. అవకాడోలో ఫోలిక్ యాసిడ్ ఎక్కువగా లభిస్తుంది. మృదువైన జుట్టు కోసం అవకాడోను ఉపయోగించవచ్చు. అవకాడోలో పీచుపదార్థాలు అధికంగా ఉంటాయి, బరువు తగ్గడానికి అవి ఎంతగానో దోహదం చేస్తాయి. ఊబకాయం సంబంధ పలు వ్యాధుల ప్రమాదం అవకాడో తింటే తగ్గుతుంది. అవకాడోలో విటమిన్ ఇ పెద్ద మోతాదులో లభిస్తుంది. పోషక విలువలు బాగా ఉంటాయి. కాస్మొటిక్ పరిశ్రమలో అవకాడో పాత్ర చాలా ఎక్కువగా ఉంది.ఇన్ని లాభాలున్న అవకాడో సాగును తెలంగాణలోని సంగారెడ్డిలో ఔత్సాహిక రైతు డాక్టర్ మాధవరం శ్రీనివాసరావు విజయవంతంగా సాగుచేస్తున్నారు. శ్రీనివాసరావు సంగారెడ్డిలో డక్కన్ ఎగ్జోటిక్ ఫార్మ్స్ పేరుతో పలు విశేషమైన పంటలు సాగుచేస్తున్నారు. హాస్ రకం అవకాడో పంటను శ్రీనివాసరావు పండిస్తున్నారు. ఎక్కడెక్కడో విదేశాల్లో పండే అవకాడో మన ప్రాంతంలో పండుతుందా? అని అనుమానించే వారికి శ్రీనివాసరావు కృషి అర్థవంతమైన సమాధానం చెబుతుంది.
సహజంగా మెక్సికోకు చెందిన అవకాడోను తొలిసారిగా 1902లో బెంగళూరుకు తీసుకొచ్చినట్లు శ్రీనివాసరావు చెప్పారు. మెక్సికన్, గ్వాటిమాలన్, పశ్చిమ భారతదేశం అనే మూడు రకాల అవకాడోలు మనకు లభిస్తాయన్నారు. తెలంగాణ వాతావరణానికి వెస్ట్ ఇండియన్ రకం అవకాడో బాగా అనుకూలంగా ఉందన్నారు. మెక్సికన్ రకం ఆకు పొడవుగా ఉంటుంది. ఆకు వెడల్పుగా గుండ్రంగా ఉన్న అవకాడో వెస్ట్ ఇండియన్ రకం అని గుర్తించాలని చెప్పారు. వెస్ట్ ఇండియన్ రకం వేడి వాతావరణాన్ని కూడా తట్టుకుంటుంది. దీంట్లో 8 కన్నా తక్కు ఆయిల్ శాతం ఉంటుంది. గ్వాటిమాలన్ అవకాడో హైబ్రీడ్ రకం. దీంట్లో 18 వరకు ఆయిల్ శాతం లభిస్తుంది. మెక్సికన్ రకంలో అయితే.. 20 శాతానికి పైగా ఆయిల్ కంటెంట్ ఉంటుంది. అంతర్జాతీయ స్థాయిలో 80 శాతం వరకు హాస్ రకం అవకాడో పంట సాగు అవుతోంది. హాస్ రకం అవకాడోకు మార్కెట్ లో మంచి డిమాండ్ ఉందని శ్రీనివాసరావు వివరించారు.న్యూజిలాండ్, టాంజానియా, మెక్సికో, చిలీ, గ్వాటిమాలా నుంచి ప్రస్తుతం 1000 టన్నుల దాకా భారతదేశంలోకి దిగుమతి చేసుకుంటున్నామని శ్రీనివాసరావు వెల్లడించారు. అంటే.. మన దేశంలో పెద్ద మొత్తంలో అవకాడో వినియోగం జరుగుతోందన్నమాట. అదే మరో రెండు మూడు సంవత్సరాల్లో 3 వేల టన్నుల వరకు మన దేశంలో అవకాడో వినియోగం పెరిగే అవకాశం ఉందని మార్కెట్ లో అంచనాలు వస్తున్నాయి. అవకాడో ఆయిల్ ప్రస్తుత మార్కెట్ లో లీటరు రూ.1,500 ధర పలుకుతోంది.
భారతదేశ వాతావరణానికి అన్ని రకాలు అనుకూలం కాదనేది గుర్తుంచుకోవాలని శ్రీనివాసరావు చెప్పారు. అవకాడోలో చాలా రకాలు భారతదేశంలో అందుబాటులో ఉండవు. కొన్ని అవకాడో చెట్లు 38 డిగ్రీల ఉష్ణోగ్రత వరకు తట్టుకోగలవు. 38 నుంచి 42 డిగ్రీల వేడిని తట్టుకోగల రకాలు కొన్ని ఉన్నాయి. 43 నుంచి 47 డిగ్రీల దాకా కూడా తట్టుకుని ఫలాలు ఇచ్చే రకాలు కూడా ఉంటాయి. భారతదేశ వాతావరణం, భూమి, వర్షపాతం లాంటి అంశాలను బేరీజు వేసుకుని ఏ వెరైటీ మనకు అనుకూలమో దాన్ని ఎంపికచేసుకోవాలని శ్రీనివాసరావు సూచించారు. అవకాడో మొక్కలు తెచ్చుకోవడానికి ప్రస్తుతం దిగుమతి నిబంధనల వల్ల కొద్దిగా ఎక్కువ సమయం పడుతోంది. మంచి రకం అవకాడో మొక్కను దిగుమతి చేసుకోవడానికి ఏడాది పాటు వేచి ఉండాల్సి ఉంటుంది. శ్రీనివాసరావు అవకాడో మొక్కలను అధికారికంగా దిగుమతి చేసుకుని ఔత్సాహిక రైతులకు సరఫరా చేస్తున్నారు. అన్ని అనుమతులు, మార్గదర్శకాలు అనుసరిస్తూ 350 ఎకరాల్లో ఏడాదికి 60 వేల అవకాడో మొక్కలను సరఫరా చేయగల సామర్ధ్యంతో డక్కన్ ఎగ్జోటిక్ పార్మ్స్ ఉంది.
తెలంగాణ వాతావరణంలో అవకాడో పెరుగుతుందో లేదో అని కొంచెం అనుమానం ఉండేదని శ్రీనివాసరావు తెలిపారు. అయితే.. ఇప్పటికే తమ ఫార్మ్స్ లో అవకాడో మొక్కలు నాటి నాలుగేళ్లు అయిందని, అవి ఎంతో ఏపుగా ఎదుగుతున్నాయని చెప్పారు. అవకాడో మొక్కకు పూలు పూస్తాయా? లేదా అనుకున్నామని, అయితే మొక్క నాటిన రెండేళ్లకు తొలిసారి ఫ్లవరింగ్ వచ్చిందన్నారు. అయితే.. ఆ పూలు రాలిపోయాయన్నారు. మూడేళ్లకు అవకాడో మొక్కలకు 70 శాతం వరకు ఫ్లవరింగ్ వచ్చిందని వెల్లడించారు. అయితే.. 38 డిగ్రీల ఉష్ణోగ్రత వచ్చినప్పుడు పిందెలు రాలడం మొదలై 48 డిగ్రీలు వచ్చే సరికి పూర్తిగా రాలిపోయాయన్నారు. అంటే.. మన వాతావరణంలో అవకాడో సాగు విజయవంతం అవుతుందన్నారు. కాకపోతే.. మన వాతావరణానికి సూటయ్యే రకాన్ని ఎంపిక చేసుకుని సాగు చేస్తే.. ఈ బంగారు ఫలం నుంచి అధికాదాయం సాధించవచ్చన్నారు. 600 నుంచి 900 మిల్లీమీటర్ల వర్షపాతం వరకూ అవకాడో సాగు అనుకూల ఫలితాలిస్తుంది.
అవకాడో మూడు నుంచి నాలుగేళ్ల తర్వాతే పంట దిగుబడి మొదలువుతుంది. ఎకరానికి 200 నుంచి 220 వరకు అవకాడో మొక్కలను నాటుకోవచ్చు. అవకాడో పంట ప్రారంభమైనప్పటి నుంచి మామిడి మాదిరిగానే 60 నుంచి 70 సంవత్సరాల వరకూ చక్కని ఫలసాయం ఇస్తుంది. ఎకరం పొలంలో 8 నుంచి 10 టన్నుల దాకా దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది. అవకాడో కాయలు ఒకేసారిగా కాకుండా నెల నుంచి నెలన్నర సమయంలో మూడు నాలుగు సార్లుగా కోతకు వస్తాయి. మామిడిచెట్టు మాదిరిగానే నవంబర్, డిసెంబర్ నెలలో అవకాడో చెట్టుకు కూడా పూత వస్తుంది. కొన్ని రకాలు ఆగస్టులోను, మరికొన్ని అక్టోబర్ కూడా పూతపూస్తాయని శ్రీనివాసరావు వివరించారు. అవకాడో కాయ పండిన తర్వాత కూడా నెల నుంచి నెల నుంచి రెండు నెలల వరకూ చెట్టు నుంచి రాలిపోకుండా ఉండడం విశేషం. అంటే.. మార్కెట్ సరిగా లేదనుకున్నప్పుడు అవకాడో పండ్లను చెట్టు పైనే నిల్వ ఉంచుకునే వెసులుబాటు ఉంటుంది. అవకాడో పండును చెట్టు నుంచి కోసుకున్న తర్వాత మరో రెండు నెలల పాటు కోల్డ్ స్టోరేజిలో నిల్వ చేసుకోవచ్చు.
కొన్ని రకాలు అవకాడో పండ్లు ఏప్రిల్ మే నెలల్లోనే కోతకు వస్తాయి. మరికొన్ని మధ్యంతర రకాలు సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లోను, నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి నెలల్లో కూడా పంట కోతకు వచ్చే అవకాడో రకాలు కూడా ఉన్నాయి. అందుకే మిక్స్ డ్ వెరైటీలను ఎంపిక చేసుకుని సాగు చేస్తే.. రైతుకు ప్రయోజనం ఉంటుందని శ్రీనివాసరావు సలహా ఇచ్చారు. లామ్ హాస్, ఎటింగర్, పింగటన్ రకాల అవకాడోలు వేడి వాతావరణానికి అనుకూలం అన్నారు. అవకాడో కాయ పండుగా మారినప్పుడు పచ్చదనం నుంచి నల్లగా మారుతుంది. అంటే అది పక్వానికి వచ్చిందని గ్రహించాలన్నారు.
ప్రస్తుతం ఎక్కువ మంది రైతులు అవకాడో మొక్కలు తీసుకోకపోవడం వల్ల ఒక్కో మొక్కకు రూ.2,500 నుంచి 3,000 వరకు ధర ఉందని శ్రీనివాసరావు వెల్లడించారు. ఎందుకంటే దిగుమతి చేసుకునే మొక్కకు కొన్న దేశంలోని రూ.1,500 వరకు ధర ఉంటుందని, దానికి అదనంగా రవాణా ఖర్చులు, 20 శాతం వరకు మొక్కలు చనిపోయే అవకాశం ఉంటుంది. దాంతో పాటు అవకాడో మొక్కను ఏడాది పాటు క్వారంటైన్ లో ఉంచాలి. పైగా ఏడాది పాటు అవకాడో మొక్కను క్వారంటైన్ లో ఉంచిన తర్వాత మాత్రమే అవకాడో మొక్కను నాటుకోవచ్చని ప్రభుత్వం అధికారింగా ప్రకటిస్తుందన్నారు. 12 నెలల పాటు క్వారంటైన్ లో మెయింటెయిన్ చేయడానికి కూడా ఖర్చు అవుతుంది. ఈ ఖర్చులు అన్నీ కలుపుకుని ఒక్కో మొక్కకు వేలు ధర పెట్టాల్సి వస్తోందన్నారు. రైతులతో కలిసి జాయింట్ వెంచర్ గా అవకాడో మొక్కల్సి పెంచితే ఖర్చు తగ్గి అటు రైతుకు ఇటు దిగుమతి దారుడికి ప్రయోజనం ఉంటుందని శ్రీనివాసరావు వివరించారు.
అవకాడో మొక్కకు ఎక్కువ ఎరువులు వేయాల్సి అవసరం ఉండదన్నారు. మామిడి మొక్కకు వేసిన విధంగానే అవకాడో మొక్కకు వేసుకుంటే సరిపోతుంది. మామిడి పంట మాదిరిగానే అవకాడో సాగు చేసుకోవచ్చని శ్రీనివాసరావు తెలిపారు. కాకపోతే నీటి పారుదల వ్యవస్థ చక్కగా ఉండాలి. రైతుకు సాంకేతికంగా అవగాహన ఉండాలి. మొక్కల్ని నాటిన విధానం సరిగా ఉండాలి. మామిడి చెట్టుకు వచ్చే లాంటి చీడ పీడలే అవకాడోకు కూడా వస్తాయి. మామిడి రక్షణ చర్యలు తీసుకున్నట్లే అవకాడోలో కూడా తీసుకుంటే సరిపోతుంది. అయితే.. మామిడి కన్నా అవకాడో పంట ద్వారా పది రెట్లు ఎక్కువగా లాభాలు ఉంటాయి. అవకాడో కిలో రూ.100కు అమ్మినా రూ.8 నుంచి 10 లక్షల దాకా ఆదాయం లభిస్తుంది.