దేశంలోని పలు ప్రాంతాల్లో సామాన్య రైతులు అసామాన్య విజయాలను సాధిస్తున్నారు. మంచి దిగుబడులతో అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. ఏపీలోని విశాఖ జిల్లా దుమ్రిగూడ మండలం అడప వలస గ్రామంలో రైతులు ప్రకృతి వ్యవసాయ పద్ధతులను అనుసరించిన రైతులు అత్యధిక దిగుబడులు సాధించి తోటి రైతులకు ఆదర్శంగా నిలిచారు. బురిడి భగత్‌ రామ్ అనే రైతు చిరుధాన్యపు పంట రాగిని సాగు చేసి ఎకరానికి ఏకంగా 14 క్వింటాళ్ల దిగుబడి సాధించి చూపారు. సాధారణంగా ఎకరానికి ఇక్కడ 4 క్వింటాళ్లు మాత్రమే దిగుబడి వస్తుంది. కానీ Watershed Support Services and Activities Network (WASSAN India) సహకారంతో శ్రీ పద్ధతిలో సాగిన సాగు వల్ల ఈ భారీ దిగుబడి సాధ్యమైంది. ఈ రైతు కుటుంబం తమ చేనులో రసాయనాలేవీ వాడకుండా పూర్తిగా జీరో బడ్జెట్ ప్రకృతి వ్యవసాయ విధానాలను అనుసరించింది. (బురిడి భగత్‌ రామ్ కుటుంబాన్ని పై చిత్రంలో చూడవచ్చు)

ఎలా సాగుచేయాలంటే…

రాగులను కొన్ని ప్రాంతాల్లో తైదలు అని కూడా పిలుస్తారు. శ్రీ (ఎస్.ఆర్.ఐ – సిస్టమ్ ఆఫ్ రైస్ ఇంటెన్సిఫికేషన్) పద్ధతిలో రాగుల సాగు ఎంతో లాభదాయకం. ఛత్తీస్‌గఢ్‌ గిరిజన రైతులు గత కొంతకాలంగా శ్రీ వరి సాగు పద్ధతిలో రసాయనిక ఎరువులు, పురుగుమందులు వాడకుండానే రాగిని సేంద్రియ పంటగా సాగు చేస్తూ ఎకరాకు 12 నుండి 15 క్వింటాళ్ల దాకా దిగుబడి సాధిస్తున్నారు. శ్రీ పద్ధతిలో రాగి పంట సాగుకు స్థానిక వంగడాలను ఎంచుకుంటే చీడపీడలు, తెగుళ్లను తట్టుకుంటాయి. ఈ సాగులో ముందు దుక్కి బాగా దున్ని ఎకరాకు రెండు టన్నుల పశువుల ఎరువు వేసుకోవాలి. జనుము లేదా జీలుగ వంటి పచ్చిరొట్ట పైర్లను జూలైలో సాగు చేసుకుని బాగా కలియ దున్నితే భూమి సారవంతమవుతుంది. వాలుకు అడ్డంగా చాళ్లను ఏర్పాటు చేసుకుంటే నేల కోతను అరికట్టవచ్చు. రాగి సాగుకు ఎకరాకు 300-400 గ్రాముల విత్తనాలు సరిపోతాయి. ముందుగా విత్తనాలను నీటిలో వేసి పైకి తేలిన తాలును తొలగించాలి. లీటరు నీటిలో 35 ఎం.ఎల్. పంచగవ్యను కలిపి విత్తనాలను 8 గంటలు నానబెట్టి బీజామృతంతో విత్తన శుద్ధి చేయాలి. తేమ ఆరిన తర్వాత విత్తనాలను ఇసుక లేదా వర్మీ కంపోస్టుతో కలిపి సమానంగా విత్తుకోవాలి. విత్తడం ముగిశాక బెడ్‌పై వర్మీ కంపోస్టు లేదా చివికిన పశువుల ఎరువును వేయాలి. ఘన జీవామృతం వేస్తే చాలా మంచిది. అలాగే విత్తిన మూడు రోజుల్లోపు లీటరు జీవామృతాన్ని 10 లీటర్ల నీటిలో కలిపి బెడ్‌పై పిచికారీ చేయాలి. ఉష్ణోగ్రత 35 డిగ్రీలకన్నా ఎక్కువ ఉంటే షేడ్‌నెట్‌ను వాడాలి. 15-20 రోజుల నారును మాత్రమే నాటుకోవాలి.
15-20 రోజుల వయసున్న నారును వేర్లు తెగకుండా పీకి బోదె మధ్యలో నాటుకోవాలి. సాళ్లు, మొక్కల మధ్య దూరం 10 అంగుళాల దూరం ఉండాలని వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు. రెండు చాళ్ల మధ్యలో ఘన ఘన జీవామృతం వేసుకోవాలి. మొక్కలను పైపైనే నాటుకుని, పాదు చుట్టూ కొంచెం మట్టిని కుప్పగా వేయాలి. చేతితో గట్టిగా అదమడం కూడదు. ఆ తర్వాత 10-12 రోజులకోసారి పైపాటు చేసి కలుపును ఏరివేయాలి. అంతర కృషి చేసిన వెంటనే జీవామృతం అందించాలి. తెగుళ్లను నివారించేందుకు వెల్లుల్లి + అల్లం ద్రావణం, రసం పీల్చే పురుగుల నివారణకు ఎకరానికి 10 లీ. నీమాస్త్రం 100 లీ. నీటిలో కలిపి పిచికారీ చేయాలి. ఈ తరహా సేద్యంతో ఎకరాకు 10-12 క్వింటాళ్ల దిగుబడి వస్తుందని ఛత్తీస్‌గఢ్ గిరిజన రైతులు రుజువు చేశారు. మరింత మెరుగైన యాజమాన్య చర్యలతో 15-20 క్వింటాళ్ల దిగుబడి సైతం పొందవచ్చునని వ్యవసాయ నిపుణులు చెబుతున్నారు. సంప్రదాయ పద్ధతి కాకుండా శ్రీ పద్ధతిలో సాగు చేస్తే రెండింతల దిగుబడి పొందవచ్చునని అనేక అనుభవాలతో రుజువైంది. ఏడాదిలో జూలై ఆఖరు వరకు నార్లు పోసుకోవచ్చు. ఆగస్టు మూడో వారం వరకు పంటను నాటుకోవచ్చు.

ఎంతో మేలు చేసే రాగి

రాగి శాస్త్రీయ నామం Eleusine coracana. ఆఫ్రికన్ మిల్లెట్ అని కూడా అంటారు. ఇంగ్లీషులో finger millet గా వ్యవహరిస్తారు. ఇది ఇథియోపియా నుండి వచ్చి ప్రపంచమంతా వ్యాపించింది. మెథియోనైన్ అనే అమినో యాసిడ్ రాగిలో పుష్కలంగా ఉంటుంది. కార్బోహైడ్రేట్, మినరల్స్, కాల్షియం, ఫైబర్ కూడా ఉంటాయి. వంద గ్రాముల రాగి ధాన్యం 328 కేలరీల శక్తిని ఇస్తుంది. ఆఫ్రికా తర్వాత రాగి ఎక్కువగా పండేది ఇండియాలోనే. ఏపీ, తెలంగాణ, రాజస్థాన్, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు, ఉత్తరాఖండ్, గోవా రాష్ట్రాల్లో రాగి విరివిగా సాగు అవుతోంది. రాగులతో తయారు చేసే సంప్రదాయ వంటలు మధుమేహం, రక్తపోటు వంటి వ్యాధులను నివారిస్తాయి. ఎండాకాలంలో మజ్జిగతో కలిపి రాగుల జావ తాగడం వల్ల వడదెబ్బ తగలకుండా ఉంటుంది.

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here