వినాయక చవితి, దసరా, దీపావళి, దేవీ నవరాత్రులు, బతుకమ్మ.. ఏ పండుగ వచ్చినా మన దేశంలో పువ్వులను ఎక్కువగా వాడుతుంటాం. ముఖ్యంగా దసరా, దీపావళి, బతుకమ్మ, దేవీ నవరాత్రుల సమయాల్లో పూల వినియోగం మరీ ఎక్కువగా ఉంటుంది. మండపాల అలంకరణలో అత్యధికంగా వినియోగించే పూలలో బంతి, చేమంతి, గులాబీ తదితర రకాలను బాగా వినియోగిస్తుంటాం. మిగతా పూల కన్నా సైజులో పెద్దవిగా కనిపించే బంతిపూలను అధికంగా వాడుతుంటారు. అలాంటి బంతి సాగు వివరాలు, లాభ నష్టాలు తదితర విషయాలు తెలుసుకుందాం.బంతిపూల సాగు మూడు నుంచి నాలుగు నెలలు ఉంటుంది. విత్తనం నుంచి నారు తయారు చేసుకుని, మొక్కలు నాటిన తర్వాత పంట నాలుగు నెలల్లో చేతికి వస్తుంది. బంతితో పాటు మునగను కూడా అంతర పంటగా సాగు చేసుకుంటే మరింతగా లాభాలు ఆర్జించవచ్చని తెలంగాణ రాష్ట్రం మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లా మూడుచింతలపల్లి మండలం కొల్తూరు రైతు సత్యనారాయణ రాజు చెబుతున్నారు. ఆయన 40 ఎకరాల్లో రకరకాల పూలు, మునగ, ఆగాకర, చిక్కుడు, దొండ, వంకాయ, కాకర లాంటి పలు రకాల కూరగాయలు సాగు చేస్తున్నారు. అస్తగంధ బంతి, మునగ మొక్కలను ఒకేసారి నాటుకుంటే.. బంతి పంట ముగిసిన తర్వాత మునగ సాగు దిగుబడి కూడా వస్తుందని చెప్పారు.బంతి విత్తనం కొనుగోలు చేసి, నర్సరీలో నారు తయారు చేయించుకుని, 21వ రోజున మొక్కలు తెచ్చుకుని నాటుకోవాలి. బంతిమొక్క నాటిన తర్వాత 70 రోజులకు పూలు కోతకు వస్తాయి. ఒక ఎకరంలో సుమారు 7,500 బంతి మొక్కలు నాటుకుంటే మొక్క ఎదుగుదల, దిగుబడి బాగుంటుంది. నర్సరీలో ఒక్కో బంతి విత్తనాన్ని మొక్కగా తయారుచేసి, 21 రోజులు పెంచి ఇచ్చేందుకు 50 పైసలు చార్జి తీసుకుంటారు. ఒక బంతి విత్తనం రూపాయి 70 పైసలు ఉంటుంది. మొత్తానికి మనం బంతిమొక్క నాటుకునే 21 రోజులకు 2 రూపాయల 30 పైసలు ఖర్చు వస్తుంది.  ఎకరం పొలంలో బంతి మొక్కలు నాటుకునే సమయానికి సుమారు రూ.17 వేలు అవుతుంది. దాంతో పాటు ఎకరంలో బంతిమొక్కలు నాటేందుకు కూలీల ఖర్చు రూ.800 నుంచి రూ.1000 వరకు అవుతుంది.బంతి మొక్కలు నాటుకునే సాలుకు సాలుకు మధ్య 7 అడుగుల దూరం ఉండాలి. అడుగు వెడల్పు ఉన్న బోదె మీద అటు ఇటు రెండు వరుసల్లో బంతి మొక్కలు నాటుకోవచ్చు. మొక్కలు నాటడానికి ముందే బోదెపై ఇన్‌ లైన్‌ డ్రిప్‌ వేసుకోవాలి. బంతి పంటకు మల్చింగ్‌ అవసరం రాకపోవచ్చు. బంతి సాగు మొదలైనప్పటి నుంచి పంట చేతికి వచ్చే వరకు మొక్కల మధ్య పెరిగే కలుపును రెండు మూడు సార్లు తీసుకోవాలి. బంతి మొక్కలు చిన్నగా ఉన్నప్పుడు ట్రాక్టర్‌ కు రొటావేటర్‌, కల్టివేటర్‌ వేసుకుని కలుపును సులువగా తీయవచ్చు. మొక్కలు పెద్దవైతే సాళ్ల మధ్య ట్రాక్టర్ తిరిగే అవకాశం ఉండదు. ట్రాక్టర్‌ వెళ్లలేని లేని సమయంలో బంతి మొక్క మీద కలుపు మందు పడకుండా డూమ్‌ వేసుకుని స్ప్రే చేసుకోవాలి. ఎకరా బంతి తోటలో ఒకసారి కలుపు తీయడానికి ఎకరానికి 25 నుంచి 30 మంది కూలీలు అవసరం అవుతారు. కలుపుతీసే ఒక్కో కూలీకి రోజుకు 300 రూపాయలు చెల్లించాలి. అంటే.. ఎకరం బంతి తోటలో ఒకసారి కలుపు తీసేందుకు రూ.7,500 నుంచి రూ.8 వేలు వరకు ఖర్చవుతుంది. ఎకరం పొలంలో బంతిపూలు తెంపడానికి 20 నుంచి 25 మంది కూలీలు కావాలి. పూలు తెంపే కూలీలకు సుమారు ఆరు నుంచి ఏడు వేలు ఖర్చు అవుతుంది.బంతి సాగు చేసే పొలంలో ముందుగా నాగలితో దున్నుకోవాలి. లేదా కల్టివేటర్‌ వేసుకోవచ్చు. బోదెలు వేసుకోడానికి కట్టర్ బ్లేడ్‌ వినియోగించాలి. తర్వాత డ్రిప్ పరుచుకోవాలి. ఆ తర్వాత బంతి మొక్కలు నాటుకోవాలి. సొంత ట్రాక్టర్ ఉన్న రైతుకు దుక్కి దున్నేందుకు ఎకరానికి ఐదారు వేలు ఖర్చు అవుతుంది. కిరాయి ట్రాక్టర్‌ పెట్టుకుంటే మరికొంత ఎక్కువ ఖర్చు వస్తుంది బంతి చేనుకు ఎరువుల పెంట దుక్కిలోనే వేసుకోవచ్చు. పశువుల పెంట వేయకపోతే.. డీఏపీ, 14:35:14 లాంటి ఎరువులు వాడాల్సి ఉంటుంది. బంతి మొక్క చిన్నగా ఉన్నప్పుడే మొదట్లో ఎరువు వేసుకోవాలి. మొక్క పెద్దది అయ్యాక మొదలు వద్ద చేతితో ఎరువు వేసుకోలేం.  ఆ సమయంలో ఎకరానికి ఒక బస్తా చొప్పున 19:19:19 ఎరువును డ్రిప్‌ ద్వారా సరఫరా చేయాలి. బంతి మొక్కలకు కాల్షియం నైట్రేట్‌ ఒకసారి వాడుకుంటే సరిపోతుంది.బంతి పంటకు వర్షాలను బట్టి తెగుళ్లు వచ్చే అవకాశం ఉంది. ఒకసారి కస్టోడియా, మరోసారి సాపు లాంటి తెగులు మందు, పురుగు మందు స్ప్రే చేసుకోవాలి. బంతిపంటను లద్ది, పచ్చ, రబ్బరు పురుగులు ఆశిస్తాయి. వాటి నివారణకు అవసరమైన మందులు కలుపుకుని స్ప్రే చేసుకోవాలి. మైక్రో న్యూట్రింట్‌ నానో గోల్డ్‌ ను బంతి మొక్కలపై మూడుసార్లు స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది. మొక్క నాటిన పదో రోజు నుంచి 45 రోజుల్లోగా ఒకసారి, 50 రోజులకు మరోసారి నానో గోల్డ్‌ స్ప్రే చేసుకుంటే సరిపోతుంది. నానోగోల్డ్ స్ప్రే చేస్తే బంతి మొక్క బాగా ఏపుగా ఎదుగుతుంది. బంతిపువ్వు కూడా పెద్దగా తయారవుతుంది. దాంతో అధిక ఆదాయం లభిస్తుంది. ఎకరం బంతి సాగులో నానో గోల్డ్‌ స్ప్రే చేయడానికి ఐదారు వేలు ఖర్చు అవుతుంది. బంతి మొక్కలకు పువ్వు ఉన్నప్పుడు వర్షం కురిస్తే.. పువ్వు మీద మచ్చ రాకుండా మందు స్ప్రే చేసుకోవాలి. మబ్బులు ఉంటే కూడా బంతి మొక్కలపై పురుగు వస్తుంది. అప్పుడు పురుగు మందు చల్లాల్సి ఉంటుంది.బంతిపూల పంట ఎకరానికి 5 నుంచి 6 టన్నుల దాకా వచ్చే అవకాశం ఉంది. కిలో బంతిపూలకు 50 నుంచి 60 రూపాయల మధ్య ధర లభిస్తుంది. దసరా సీజన్‌ లో కిలో బంతిపూలకు 80 నుంచి 90 రూపాయలు కూడా పలికే అవకాశం ఉంది. రిటైల్ గా అమ్ముకునే రిస్క్ వద్దనుకుంటే పువ్వులను మనమే కోసి ఇచ్చేలా పొలం వద్దకే వ్యాపారులు వచ్చి కొనుగోలు చేస్తారు. కిలో బంతి పూలను సుమారు 40 నుంచి 50 రూపాయలకు వారు తీసుకుంటారు. కొద్ది మొత్తంలో బంతి సాగు చేసుకుని హోల్‌ సేల్‌ వ్యాపారులకు కాకుండా రిటైల్‌ గా అమ్ముకుంటే ధర మరికాస్త ఎక్కువే ఉంటుంది. హోల్‌ సేల్‌ మార్కెట్‌ కు వేసినప్పుడు రైతుకు కిలో బంతిపూలకు ఒక్కోసారి రూ.40, మరోసారి రూ. 30 రావచ్చు. ఒక్కోసారి 20 రూపాయలకు కూడా ధర తగ్గిపోవచ్చు.వాతావరణ పరిస్థితులు అనుకూలిస్తే బంతిపూలకు మంచి ధరే వస్తుంది. కర్ణాటక, మహారాష్ట్ర నుంచి పువ్వు దిగుమతి అయినప్పుడు స్థానిక బంతిపూలకు ధర కాస్త తక్కువ పలుకుతుంది. బంతిపూలు కోసిన సమయంలో వర్షం కురిసినా ధర రాదు. పెట్టిన పెట్టుబడి రాకపోగా నష్టం కూడా వచ్చే ప్రమాదం ఉంటుందని రైతులు గమనించాలి.బంతిపూలు కోసిన తర్వాత మొక్కల్ని తీసేయడం వల్ల అంతర పంట మునగ మొక్క బాగు ఎదుగుతుంది. మునగాకును ఎండబెట్టి పౌడర్‌ గా చేసి అమ్మవచ్చు. మునగాకులో అనేక పోషకాలు, ఔషధ గుణాలు ఉన్నాయి. మునగాకుకు ప్రపంచ వ్యాప్తంగా మంచి డిమాండ్‌ ఉంది. లేదా మునగకాయ పంటగానూ ఉంచుకోవచ్చు. కొంత మునగాకు పంటగాను, మరికొంత మునగకాయ సాగు చేసుకుంటే లాభదాయకంగా ఉంటుందని వ్యవసాయ శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. మునగ మొక్కకు మొక్కు మధ్య ఏడు అడుగుల దూరం ఉండేలా నాటుకోవాలి. బంతి మొక్కలు నాటిన సాళ్లలో ఒకదాన్ని విడిచి మరో సాలులో మునగమొక్కలు నాటాలి. బంతి మొక్కలు తీసేసిన తర్వాత మునగ మొక్కపై శ్రద్ద పెడితే ఏపుగా ఎదుగుతాయి. వాటి నుంచి దిగుబడి కూడా ఎక్కువగా వస్తుంది.బంతి పంట రైతులు సాగు చేసుకోడానికి అనుకూలమైందని సత్యనారాయణరాజు చెబుతున్నారు. వర్షాలు కురవడంపై బంతి సాగులో లాభ నష్టాలు కనిపిస్తాయి. చిన్న సన్నకారు రైతులు బంతి సాగు చేసుకుంటే మంచిదే. చిన్న మొత్తంలో బంతి సాగు చేసుకునే రైతులు కూలీల మీద ఆధారపడనక్కరలేదు. సొంత మనుషులే పనులు చేసుకోవడం ద్వారా రిటైల్‌ గా అమ్ముకోవడం ద్వారా ఎక్కువ లాభాలు కనిపిస్తాయి. పండుగ సీజన్లలో బంతిపూలు వచ్చేలా సమయం చూసుకుని మొక్కలు నాటుకుంటే మేలు అని సత్యనారాయణరాజు చెప్పారు. వాతావరణ పరిస్థితులు, డిమాండ్‌ ను గమనించుకుని బంతి సాగు చేసుకుంటే లాభాలు వస్తాయి.ఒక ఎకరం పొలంలో బంతి సాగుకు 50 నుంచి 55 వేల దాకా ఖర్చు వస్తుంది. వాతావరణం అనుకూలంగా ఉంటే పెట్టుబడి కొంత తగ్గుతుంది. ఎకరం పొలంలో ఐదు టన్నుల బంతి పూలు దిగుబడి వస్తే.. కిలో కనీసం 40 రూపాయల ధర పలికినా రెండు లక్షల ఆదాయం ఉంటుంది. ఖర్చులు, ఇతరత్రా అన్నీ కలుపుకుని రూ.75 వేలు పెట్టుబడి పెట్టినా.. నాలుగు నెలల్లో తక్కువలో తక్కువ చూసుకున్నా లక్ష నుంచి లక్షా పాతిక వేలు లాభం కనిపిస్తుంది. అయితే.. వీటికి వాతావరణ పరిస్థితులు, వర్షాలు, మార్కెట్ డిమాండ్‌, మనం పంట కోసే సమయం లాంటి అంశాల ఆధారంగా లాభాలు లేదా నష్టాలు ఆధారపడి ఉంటాయని గమనించాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here