సోనాలి జాతి కోళ్లు మేత కొంచెం తింటాయి. ఎదుగుదల ఎక్కువగా ఉంటుంది. సోనాలి జాతి కోళ్లకు మార్కెట్‌ లో డిమాండ్‌, ధర బాగా ఉంటుంది. దేశంలో ఉన్న వందలాది జాతి కోళ్లలో సోనాలి జాతి ఒకటి. రెడ్‌ ఐలాండ్‌, రెడ్ ఫాక్స్, ఫయోమీ కోళ్ల సంకరజాతి సోనాలి కోళ్లు. దేశీ నాటుకోళ్లలో ఉండే లక్షణాలే వీటిలోనూ ఉంటాయి. అన్ని పర్యావరణ పరిస్థితులను తట్టుకునే లక్షణాలు సోనాలి కోళ్లకు ఉంటుంది. సోనాలి కోళ్ల పెంపకంలో ప్రత్యేకంగా ఎక్కువ శ్రద్ధ, శ్రమ తీసుకోవాల్సిన అవసరం ఉండదు. మంచి ఆదాయం వస్తుంది. సోనాలి కోళ్ల పెంపకం, షెడ్ల నిర్మాణం, పెంపకంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటో తెలుసుకుందాం.సోనాలి జాతి కోడిపిల్ల ఒక రోజు వయస్సు  నుంచి కూడా మనం తెచ్చుకుని పెంచుకోవచ్చు. ఒక్కో కోడిపిల్లకు రూ.35 ధర ఉంటుంది. వెయ్యి పిల్లల్ని తెచ్చుకుని పెంచుకోవాలనుకుంటే.. పిల్లల కోసం రూ.35 వేలు ఖర్చవుతుంది. వీటిని పెంచేందుకు తొలిసారిగా వేసుకునే షెడ్‌ కు 3 లక్షల రూపాయల వరకు ఖర్చు వస్తుంది. వెయ్యి సోనాలి కోడి పిల్లల్నిపెంచాలనుకుంటే ప్రాథమికంగా చేయాల్సిన ఖర్చు రూ,3,35,000 ఉంటుంది. షెడ్‌ చాలా కాలం ఉంటుంది కనుక ఆపైన పెంచుకునే సోనాలి కోళ్ల బ్యాచ్‌ లకు షెడ్‌ ఖర్చు ఉండదు. కేవలం కోడిపిల్లల కొనుగోలు, మేత, ఆరోగ్య రక్షణ, మెయింటెనెన్స్‌ కు మాత్రమే ఖర్చవుతుంది. సోనాలి కోడిపిల్లలు తెలంగాణలోని ఘట్‌ కేసర్‌ దగ్గర ఏదులాబాద్‌ హ్యాచరీ నుంచి కొనుగోలు చేసుకోవచ్చు.సోనాలి కోడిపిల్లలు పెరిగి పెద్దవి కావడానికి 120 నుంచి 130 రోజుల సమయం పడుతుంది. ఆ సమయానికి ఒక్కో కోడి ఒకటిన్నర లేదా కిలో 750 గ్రాముల దాకా బరువు ఉంటుంది. మామూలుగా అయితే.. చికెన్ షాపుల వాళ్లే సోనాలి కోళ్లను తీసుకుపోతారు. అయితే.. ఒకేసారిగా ఆదాయం చేతికి రావాలంటే మాత్రం ట్రేడర్లకు అమ్ముకోవాలి. సోనాలి కోళ్లను అమ్మేందుకు స్వయంగా మార్కెట్‌ ను వెదుక్కోవాల్సిన అవసరం అంతగా ఉండదు.సోనాలి కోళ్ల కోసం మార్కెట్లో ఆసీల్ ఫీడ్‌ ప్రత్యేకంగా దొరుకుతుంది. దానికి జొన్నలు, మొక్కజొన్నలు కూడా కలుపుకుని మేతగా వేసుకుంటే.. ఖర్చు తక్కువ అవుతుంది. మామూలుగా కోళ్లకు వేసే మేత కిలో 35 నుంచి 40 రూపాయల వరకు ఉంటుంది. చిన్న కోడిపిల్లలకు వేసే స్టార్టర్‌ మేత తక్కువ రేటు ఉంటుంది. పెద్దయ్యాక కొద్దిగా ఎక్కువ ఖర్చు అవుతుంది. కోళ్లను స్వేచ్ఛగా బయట వదిలిపెడితే మేత కోసం పెట్టే ఖర్చు కొంత తగ్గించుకోవచ్చు. అజోలా వేసుకుంటే కోళ్ల మేతకు అయ్యే ఖర్చు 30 నుంచి 40 శాతం తగ్గిపోతుంది. అజోలా పెంచేందుకు చిన్న చెరువు ఏర్పాటు చేసుకోవాలి. రాజేంద్రనగర్‌ అగ్రికల్చర్‌ యూనివర్శిటీలో కిలో రూ.50కి అజోలా దొరుకుతుంది. ఓ పది కిలోల అజోల మదర్‌ కల్చర్‌ తెచ్చుకుని నీటిలో వేసుకుంటే వారం రోజుల్లోనే తయారవుతుంది. మనం వేసిన అజోలా పది రోజుల్లోనే రెట్టింపు తయారవుతుంది.ఒక సోనాలి కోడిపిల్లను ఎదిగే వరకు పెంచేందుకు 180 నుంచి 200 రూపాయలు ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఈ ఖర్చులోనే మేత, వ్యాక్సిన్‌, మెయింటెనెన్స్ అన్నీ కలిసి ఉంటాయి. సోనాలి కోడి తయారయ్యాక ఒకటిన్నర కిలోల బరువు వస్తే.. మార్కెట్‌ లో దానికి 160 నుంచి 260 వరకు కూడా వచ్చే అవకాశం ఉంది. కిలో 160 రూపాయలకు అమ్మినా కిలోనర కోడికి 240 రూపాయలు వస్తుంది. ఒక్కో సోనాలి కోడి నుంచి కనీసం 40 రూపాయలు లాభం వస్తుంది. ట్రేడర్‌ కాకుండా స్థానిక చికెన్‌ షాపులకు అమ్మితే 10 నుంచి 20 రూపాయలు అధికంగా ధర పలుకుతుంది.సోనాలి కోళ్లను ఏడాది పాటు కూడా పెంచవచ్చు. ఆరు నెలల వయస్సు నుంచి ఇవి గుడ్లు పెడతాయి. ఇక్కడే ఒక నష్టం కూడా ఉంటుంది. ముదిరిపోయిన వీటిని వినియోగదారులు తీసుకునే అవకాశాలు తగ్గిపోతాయి. పైగా మేత ఖర్చు కూడా ఎక్కువైపోతుంది. అందుకే ఈ జాతి కోళ్లను నాలుగు నెలలకు మించి రైతులు పెంచరని అనుభవజ్ఞులు చెబుతారు. మాంసం కోసం పెంచుకునే సోనాలి కోళ్లను షెడ్లలోనే పెంచుతారు. వీటి నుంచి పందెం కోళ్లను పెంచాలనుకుంటే చెట్ల కింద ఆరుబయట వదిలిపెట్టుకోవచ్చు.ఈ జాతి కోళ్లకు ఉదయం, సాయంత్రం మేత వేసుకుంటే సరిపోతుంది. సోనాలి జాతి కోళ్లు బ్రాయిలర్‌ కోళ్ల మాదిరిగా నేలమీదే ఉండవు. పైకి బాగా ఎగురుతాయి. అందుకే డ్రింకర్స్‌ లో కాకుండా మాన్యువల్‌ గానే వీటికి నీళ్లు ఉదయం సాయంత్రం తప్పనిసరిగా పెట్టుకోవాల్సి ఉంటుంది. మేతను ఫీడర్లలో వేసుకోవచ్చు. సోనాలి కోళ్ల ఫారాన్ని ఉదయం, సాయంత్రం తప్పకుండా శుభ్రం చేసుకోవాలి.సోనాలి జాతి కోళ్లకు కొరేజా వ్యాధి వచ్చే వీలుంది. వేరే ఇబ్బందులేవీ ఈ జాతి కోళ్లకు వచ్చే అవకాశాలు తక్కువ. కోరేజీ వ్యాధి సోకిన కోడి కళ్లు వాచిపోతాయి. ముక్కు నుంచి చీముడు కారుతుంది. నోటి నుంచి సొల్లు కారుతుంది. ఈ లక్షణాలు కనిపించినప్పుడు దానికి కొరేజా వ్యాధి వచ్చినట్లు గుర్తించాలి. కొరేజా అంటు వ్యాధి కనుక ఏ కోడికి ఈ వ్యాధి వచ్చినా వెంటనే వైద్యుడి సలహాతో నివారణ మందులు వాడాలి. లేదంటే ఒక్క రాత్రిలోనే మరో పది కోళ్లకు ఈ వ్యాధి వ్యాపించే ప్రమాదం ఉంది. ప్రతిరోజు ఉదయం ప్రతి కోడిని పరిశీలించుకోవాలి. వాటి పెంట ఎలా ఉందనేది కూడా గమనిస్తే వ్యాధిని గుర్తుపట్టవచ్చని వైద్య నిపుణులు చెప్పారు.

సోనాలి జాతి కోడి పిల్లల్ని ముందుగా వరిపొట్టు వేసి, దానిపై పట్టా వేసుకుని పెంచుకోవాలి. అవి కొద్దిగాపెద్దవి అయ్యాక పట్టా తీసేస్తే వరిపొట్టుపైనే కోళ్లు పెరుగుతాయి. సోనాలి కోడిపిల్లలకు షెడ్‌ లో తప్పకుండా 32 నుంచి 35 డిగ్రీల ఉష్ణోగ్రత ఉండేలా చూసుకోవాలి. గ్యాస్‌ హీటర్లతో కాని, బొగ్గు పొయ్యిలతో కూడా కోడిపిల్లలకు వేడి ఉండేలా చూసుకోవచ్చు. సోనాలి కోడిపిల్లల్ని తెచ్చిన్నప్పుడు 20 రోజుల పాటు రాత్రి పగలు నిరంతరం జాగ్రత్తగా చూసుకోవాలి.అసీల్ క్రాస్‌, సోనాలి బ్రీడ్‌, డీపీ క్రాస్‌ ఇలా చాలా రకాల జాతుల కోళ్లు ఉన్నాయి. అయితే.. సోనాలి జాతి కోళ్లకు మార్కెట్లో ఎక్కువ డిమాండ్ ఉంటుంది. అసీల్ క్రాస్‌ కోళ్లు ఎక్కువ ఆహారం తింటాయి. నాలుగు నెలల్లో ఇవి నాలుగు నుంచి ఐదు కిలోల ఆహారం తీసుకుంటాయి. అదే సోనాలి కోడి నాలుగు నెలల్లో రెండున్నర నుంచి మూడు కిలోలు మాత్రమే తింటాయి. రేటు కూడా మిగతా వాటికంటే ఎక్కువ కాబట్టి సోనాలి కోళ్ల పెంపకంలో లాభం కూడా అధికంగానే ఉంటుంది.కొత్తగా సోనాలి జాతి కోళ్లను పెంచాలనుకునే రైతులు కనీసం వెయ్యి పిల్లలతో ఫాం ప్రారంభించుకుంటే మంచిదని యాదాద్రి భువనగిరి జిల్లా గుడిమల్కాపురం ఆదర్శ రైతు లింగారెడ్డి చెప్పారు. వెయ్యి కోళ్లను ఒక్కరే సులువుగా సాదుకోవచ్చన్నారు. సోనాలి కోళ్లకు ఎండాకాలంలో అయితే మూడుసార్లు నీరు మార్చుకోవాల్సి ఉంటుంది. చలికాలంలో షెడ్‌ చుట్టూ పట్టాలు కిందికి దింపేస్తే సరిపోతుంది. ఎండాకాలంలో అయితే.. వేడి ఎక్కువైపోయి గ్యాస్ వచ్చేసి, కోళ్లకు కళ్ల మంట వస్తుంది. అందుకే షెడ్‌ కు ఒక వైపు పట్టాలు దింపితే సరిపోతుంది. చిన్న సోనాలి కోడిపిల్లలు చలికి వణుకుతాయి. అప్పుడు షెడ్లలో లైట్లు, బొగ్గుల వేడి పెట్టుకోవాలి. సోనాలి కోళ్లకు మూడు సార్లు వ్యాక్సిన్ వేస్తారు. పిల్లల్ని తెచ్చిన 5వ రోజు, 14వ రోజు, 21వ రోజు కంటిలో ఐ డ్రాప్స్ గానీ, నోటిలో గాని వ్యాక్సిన్‌ వేసుకోవాలి. ఆ తర్వాత వ్యాక్సిన్ వేసే అవసరం రాదు.సోనాలి జాతి కోళ్లు 0.2 శాతమే మరణించే అవకాశం ఉంది. అవి కూడా చనిపోకుండా చూసుకుంటే ఆ రైతు శ్రద్ధగా చూసుకున్నట్లు చెప్పాలి. ఒక కోడి చనిపోయినా, ఒకటి అసాధారణంగా కనిపించినా, దానికి వచ్చిన వ్యాధి ఏమిటో తెలియకపోతే వెంటనే వైద్యుడ్ని సంప్రదించాలి. దానికి ల్యాబ్‌ లో పరీక్ష చేయించి, మందులు వాడాలి. మనం పెంచుకునే విధానం, శ్రద్ధ కారణంగా సోనాలి కోళ్ల పెంపకంలో అధిక లాభాలు సాధించవచ్చు.

సోనాలి కోళ్ల పెంపకంలో మరిన్ని వివరాల కోసం.. 9848333833 నెంబర్‌ లో లింగారెడ్డిని అడిగి తెలుసుకోవచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here