చిలగడదుంప..  స్వీట్ పొటాటో.. చిన్నా పెద్దా అందరూ ఎంతో ఇష్టంగా తినే తియ్యని.. కమ్మని ఆహారం. చిలగడదుంపలో ఫైబర్‌ బాగా ఉంటుంది. విటమిన్‌ 6 అధికంగా లభిస్తుంది. చిలగడదుంప గుండెపోటు ప్రమాదాన్ని తగ్గిస్తుందని నిపుణులు చెబుతారు. ఇంకా విటమిన్‌ సి ఎక్కువగా చిలగడదుంపలో ఉండడంతో ఆహారంగా తీసుకున్న వారిలో రోగనిరోధక శక్తిని ఇస్తుంది. ఎముకలు, దంతాల ఆరోగ్యాన్ని పెంచుతుంది. మూత్రపిండాల వ్యాధులు, వాపులు, కండరాల తిమ్మిర్ల నుంచి చిలగడదుంప ఉపశమనం ఇస్తుంది. రక్తంలోని ఎర్ర, తెల్ల రక్తకణాలను ఎక్కువగా ఉత్పత్తి చేస్తుంది. రక్తహీనత రాకుండా రక్షిస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది.  మానసిక ఒత్తిడిని తగ్గిస్తుంది. చిలగడదుంప మన చర్మ సౌందర్యాన్ని పెంచుతుంది. చిలగడదుంపలో ఎ విటమిన్‌ సమృద్ధిగా ఉంటుంది. చిలగడదుంప తిన్న చిన్నపిల్లలు మొదలు పెద్దవారి వరకూ కంటి చూపును మెరుగుపరుస్తుంది. దీంట్లో ఎక్కువగా లభించే ఐరన్‌ వల్ల జుట్టు ఆరోగ్యంగా తయారవుతుంది.ఎన్నో పోషకాలు, మనకు మరెన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలిగించే చిలగడదుంపను కేవలం వ్యవసాయ క్షేత్రంలోనే కాకుండా టెర్రస్‌ మీద కూడా సులువుగా సాగుచేసుకోవచ్చు. ఆ వివరాలు తెలుసుకుందాం.ఎరువులు, విత్తనాలు ఇతర అవసరాలకు వినియోగించే పెద్ద ప్లాస్టిక్‌ సంచులు తీసుకోవాలి. ఆ సంచి ఒక వైపున మూడు వరసలుగా కత్తిరితో చిన్న చిన్న రంద్రాలుగా కత్తిరించుకోవాలి. ఆ సంచిలో 50 శాతం మట్టి, 20 శాతం కోడి పెంట, మరో 20 శాతం ధాన్యం పొట్టును కాల్చిన బూడిదను మిగతా 10 శాతం బియ్యంపై ఉండే పొట్టు అంటే తవుడును బాగా కలిపి, సంచుల్లో నింపుకోవాలి. ఈ మిశ్రమం నింపిన తర్వాత సంచి మూతిని కొద్దిగా లావు ఉండే ఇనుప తీగతో బిగించి కట్టాలి. ఆ తర్వాత టెర్రస్‌ పై వెడల్పు చెక్కలు వేసుకుని వాటిపై మిశ్రమం నింపిన బస్తాలను మనం కత్తించిన రంధ్రాలు కిందికి ఉండేలా పెట్టుకోవాలి.అరలీటర్‌ వాటర్ బాటిళ్లు తీసుకుని అడుగుభాగాన్ని జాగ్రత్తగా కట్‌ చేయాలి. అలాగే మూతకు, బాటిల్‌ చుట్టూ వేడి ఇనుపచువ్వతో  రంధ్రాలు చేసుకోవాలి. బస్తా పైభాగం మధ్యలో సీసా అడుగుభాగం పెట్టుకుని మార్క్‌ చేసుకుని సంచిని మార్క్‌ చేసిన భాగంతో కత్తిరించాలి. సన్నపాటి తాపీ లాంటి వస్తువును ఆ రంధ్రం నుంచి సీసా పట్టేంత మేరకు మట్టి మిశ్రమాన్ని తీసేయాలి. మట్టి తీసిన చోట మనం రెడీ చేసుకున్న సీసాను మూత భాగం కిందకి ఉండేలా పూర్తిగా చొప్పించాలి. ఆ తర్వాత సంచి పైభాగంలో రెండు వైపుల మూడేసి రంధ్రాలు చేసుకోవాలి. రంధ్రాల్లో ముందుగా సన్నని ఇనుపచువ్వతో మట్టిలో రంధ్రం చేసుకుని, ఆ రంధ్రాల్లో చిలగడదుంప మొక్క కొమ్మల్ని కత్తిరించుకుని ఒక్కో రంధ్రంలో ఒక్కొక్కటి గుచ్చాలి. ఆ తర్వాత మనం మట్టం కట్ చేసి బస్తాలో చొప్పించిన సీసాలో అది నిండే వరకూ నీళ్లు పోయాలి. మనం పోసిన నీరు సీసాకు పెట్టిన చిన్న చిన్న రంధ్రాల ద్వారా చాలా రోజుల వరకూ బస్తాలోని మట్టికి సరఫరా చేస్తుంది. మట్టి నిరంతరం తేమగా ఉండేలా చూస్తుంది.రెండు నెలల తర్వాత మనం నాటిన చిలగడదుంప కొమ్మలు బాగా ఎదిగి సంచి పైభాగం మొత్తం కమ్మేస్తాయి.  అలా సంచిపై పెరిగిన చిలగడదుంప కొమ్మల్ని సంచి పై భాగంతో రెండు మూడూ అంగుళాల పైకి కట్‌ చేసి తొలగించాలి. ఆ తర్వాత సంచి లోపలి మట్టి మిశ్రమంలో చక్కగా తయారైన చిలగడదుంపలు బయటకు తీసుకుని నీటితో శుభ్రంగా కడిగి ఉడకబెట్టుకుని కానీ, నిప్పుల మీద కాల్చుకుని కానీ, లేదా రసంగా తీసుకుని కానీ ఆహారంగా తీసుకుంటే మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.చిలగడదుంప పంటను టెర్రస్‌ మీద పండించుకునే విధానంలో ఎరువులు, పురుగుమందులు వాడాల్సిన అవసరం ఉండదు. అంటే దాన్ని మనం సహజసిద్ధంగా పండిస్తున్నాం. దాంతో రసాయనాల వాడకం వల్ల వచ్చే అనారోగ్య సమస్యలు మన దరికి చేరవు. ఆర్గానిక్‌ పద్ధతిలో అందులోనూ మన ఇంటి అవసరాల కోసం వినియోగించుకునే చిలగడదుంపల్ని టెర్రస్‌ మీద కొద్దిపాటి స్థలంలో కూడా పండించుకోవచ్చు. పెద్దగా శ్రమ ఉండదు. ఖర్చు కూడా అంతగా అయ్యే అవకాశం లేదు. ఆరోగ్యానికి ఆరోగ్యం. టెర్రస్ మీద చిలగడదుంపల సాగును హాబీగా కూడా చేసుకోవచ్చు.చిలగడదుంపను ఉడకబెట్టి గానీ, నిప్పులపై కాల్చి కానీ తింటారు. చిలగడదుంపైన ఉండే పొట్టును తీసేసి తింటుంటారు. ఆరోగ్యాన్ని అభిలషించే వారు పొట్టును తీసేయకుండా చిలగడదుంపను తింటే మరింత మేలు అని నిపుణులు చెబుతున్నారు. చిలగడదుంపపై ఉంటే పొట్టులో కెరటినాయిడ్స్‌ అనే పోషకాలు ఉంటాయి. కెరటినాయిడ్స్ నోరు, ఫ్యారింగ్స్‌, ఊపిరితిత్తుల క్యాన్సర్ నివారణగా ఎంతగానో తోడ్పడతాయని పరిశోధనల్లో తేలింది. చిలగడదుంపపై ఉండే పొట్టులో బీటా కెరోటిన్‌ అనే మరో పోషకం, ఈసోఫేగల్‌ క్యాన్సర్‌ నే నివారిస్తుందని పరిశోధనల్లో వెల్లడైంది. మనం తీసుకునే ఆహారం చక్కగా జీర్ణం అవడానికి సహకరించే జీర్ణవ్యవస్థకు సంబంధించిన అన్ని రకాల క్యాన్సర్ల నివారణకు తోడ్పడుతుంది. అందుకే చిలగడదుంపపైన ఉండే పింక్‌ రంగు పొట్టును తీసిపారేయకుండా తింటే మరింత ఆరోగ్యప్రదాయినిగా ఉంటుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here