రాజేశ్‌ కుమార్‌ వృత్తిరీత్యా ఎలక్ట్రికల్‌ ఇంజనీర్‌. చదువు, ఉద్యోగరీత్యా దేశంలోని అనేక ప్రాంతాల్లో రాజేశ్‌ నివసించాడు. రాజేశ్‌ ఎక్కడ ఉన్నా.. ఎక్కడ తిరిగినా అతని మనసు మాత్రం తన పూర్వీకుల వ్యవసాయ క్షేత్రం వైపు, సొంత ఇంటి వైపే లాగేస్తుండేది. రాజేశ్‌ తాతగారు తమ ఇంటిని, వ్యవసాయ క్షేత్రాన్ని ఎంతో శ్రమకోర్చి నిర్వహించేవారు. రాజేశ్‌ తన బాల్యంలో తాతగారితో వ్యవసాయ క్షేత్రంలో ఎంతో సమయం గడిపేవాడు. మొక్కలు నాటడంలో తాతగారికి సహాయపడేవాడు. అదే క్షేత్రంలోని మట్టిలో రాజేశ్‌ ఆడుకునేవాడు. ఆ మట్టిలో ఆడుకోవడం అంటే రాజేశ్‌ కు ఎంతో ఇష్టం. ఉద్యోగ రీత్యా కోల్‌ కతా, చెన్నైలాంటి నగరాలకు వెళ్లాడు కానీ తమ తాతగారి ఇల్లు మాదిరిగా తన మనసుకు నచ్చే నివాసాన్ని మాత్రం ఎక్కడా నిర్మించుకోలేదు. ఇక 2012లో రాజేశ్‌ కు పాట్నా బదిలీ అవడంతో తనలోని దశాబ్దాల కలను నిజం చేసుకునే అవకాశం వచ్చింది.రాజేశ్‌ తాతగారి ఇల్లు ఫుల్వాడిలో ఉంది. అందులోనే ప్రస్తుతం రాజేశ్‌ కుటుంబం నివసిస్తోంది. ఆ ఇంటి వద్ద 7 వేల చదరపు అడుగుల తోట ఉంది. ఆ తోటలో రాజేశ్‌ తండ్రి, బాబాయిలు ఒకప్పుడు సాంప్రదాయ పంటలు పండించేవారు. అయితే.. వారికి ఉద్యోగాలు రావడంతో పంటలు పండించడం మానేశారు. బాల్యం నుంచీ తమ ఇంట్లో ఉన్న జ్ఞాపకాలతో ప్రభావితుడైన 31 ఏళ్ల రాజేశ్‌ కాంక్రీట్‌ జంగిల్‌ లాంటి ఫుల్వాడిలో పచ్చని పంటల మధ్య స్వర్గం లాంటి చిన్న ఇల్లు నిర్మించుకున్నాడు. తమ ఇంటి తోటలో రాజేశ్‌ మామిడి, లిచి, జామ, ఉసిరి, నిమ్మ, కొబ్బరి, బత్తాయి, అరటి లాంటి అనేక మొక్కల్ని నాటాడు. తమ ఇంటి వద్దే ఓ చిన్న ఆర్గానిక్‌ వ్యవసాయ క్షేత్రం ఏర్పాటు చేసుకోవాలనే తన కలలో భాగంగా ఇలా పలు రకాల మొక్కలు నాటాడు. ఒక్కో రకానికి సంబంధించి రెండు మూడు వెరైటీల మొక్కలు వేశాడు. దాంతో పాటుగా తమ తోటలో కొంతమేర లివింగ్‌ ఏరియాగా ఏర్పాటు చేశాడు. అక్కడే చిన్న చిన్న గెట్‌ టు గెదర్లు నిర్వహించుకుంటారు. తమ తోటలోని ఈ లివింగ్‌ ఏరియా అంటే తనకు ఎంతో ఇష్టమైన ప్రదేశం అని రాజేశ్‌ ఆనందంగా చెబుతాడు.రాజేశ్‌ తమ తోటలో పండ్ల మొక్కలతో పాటు కాలానుగుణంగా దిగుబడులు ఇచ్చే 20 నుంచి 25 రకాల  కూరగాయల మొక్కల్ని కూడా పెంచుతున్నాడు. ఈ మొక్కలన్నింటిని కేవలం సేంద్రీ విధానంలో పెంచుతున్నాడు. ఎలాంటి రసాయనాలు వినియోగించకుండా సహజసిద్ధంగా తయారు చేసిన సేంద్రీయ ఎరువులనే వాడుతున్నాడు. నాలుగు కాలాల పాటు ఆరోగ్యం బాగుండాలంటే సహజసిద్ధ పంటలతోనే సాధ్యం అంటాడు రాజేశ్‌. తమ తోటలో పండిన కూరగాయల్ని ఇరుగుపొరుగు కుటుంబాల వారికి కూడా పంచిపెడుతుంటాడు.

ఇక రాజేశ్‌.. తమ తోట మధ్యలో ఓ చెరువు కూడా తవ్వించాడు. తోట మధ్యలో చెరువు తవ్వించాలనే ఆలోచన తాను కోల్‌ కతాలో ఉన్నప్పుడు తనకు వచ్చిందంటాడు. ప్రతి బెంగాలీ ఇంటి వద్ద తప్పనిసరిగా ఒక చిన్న చెరువు ఉంటుందని, ఆ విధానాన్నే తానూ అమలు చేశానని రాజేశ్‌ చెప్పాడు. తమ చెరువులో చేపలు పెంచుతున్నాడు. తమ చెరువులో పెరిగిన చేపల్ని కూడా రాజేశ్‌ స్నేహితులు, బంధువులకు ఇస్తుంటాడు. ఇకపై చేపల్ని విక్రయించాలని రాజేశ్‌ భావిస్తున్నాడు. అలాగే అరుదైన ఆవులు, కోళ్లు, కుందేలు, కుక్క జాతులను కూడా రాజేశ్‌ తన ఫాంహౌస్‌ లో పెంచుతున్నాడు.రాజేశ్‌ తోటలోని మొక్కలకు ఆయన నాలుగేళ్ల కూతురు కూడా ప్రతిరోజూ నీళ్లు పోస్తూ తండ్రికి సహాయపడుతుంది. ఆమెకు కూడా తోట పనిలో, మొక్కలకు నీళ్లు పోయడంలో ఎంతో ఆనందం పొందుతోందంటాడు. తోట పనిలో తనకు సహాపడుతున్న కూతుర్ని చూసుకుని రాజేశ్‌ ఎంతగానో మురిసిపోతున్నాడు. తన తాత నుంచి తనకు వచ్చిన తోటపని అలవాటు ఇప్పుడు తన కూతురికి కూడా రావడంతో చెప్పలేనంత ఆనందంలో మునిగిపోతున్నాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here