దేశంలోని అనేక చిన్న పట్టణాల్లో కొన్నేళ్లుగా క్రమేమీ కొత్త సాగు విధానం విస్తరిస్తోంది. దాంతో సాధారణ సాగు విధానం కన్నా అధిక ఆదాయం లభిస్తోంది.. అది కూడా వారం వారం చేతికి ఆదాయం కూడా వస్తోంది. అదే మల్టీ లేయర్‌ ఫార్మింగ్‌. కొద్దిపాటి నేలలో ఒకటి కన్నా ఎక్కువ పంటలు సాగుచేయడమే మల్టీలేయర్‌ సాగు విధానం. మల్టీలేయర్‌ పంటల సాగు విధానం ప్రాచుర్యంలోకి రావడంలో ఆకాశ్‌ చౌరాసియా కృషి ఎన్నదగినది. మల్టీ లేయర్‌ సాగుపై ఈ 32 ఏళ్ల ఆకాశ్‌ చౌరాసియా 80 వేల మంది రైతులకు చక్కని ఆచరణాత్మక శిక్షణ ఇచ్చాడు. మరో 12 లక్షల మంది రైతులను కూడా మల్టీలేయర్‌ ఫార్మింగ్‌ లో అవగాహన కల్పించాడు. దాంతో 20కి పైగా జాతీయ స్థాయి అవార్డులు ఆకాశ్‌ సొంతమయ్యాయి. దీంతో ఆకాశ్‌ చౌరాసియాకు అధిక ఆదాయంతో పాటు అవార్డుల పంట కూడా పండింది. చౌరాసియా తాను లాభపడడమే కాకుండా తన గ్రామంలోని ఇతర రైతులకు కూడా అధికాదాయం వచ్చేలా చేశాడు.

మధ్యప్రదేశ్‌ లోని బుందేల్‌ ఖండ్‌ ప్రాంతంలోని ఓ చిన్న పట్టణం సాగర్‌ లోని ఓ తమలపాకు వ్యవసాయ కుటుంబంలో పుట్టాడు. డాక్టర్‌ అవ్వాలనే కల కంటూ ఆకాశ్‌ పెరిగాడు. మనుషులకు అనారోగ్యం రావడానికి కారణం మనం తినే ఆహారం, తాగే నీరు అనే విషయం ఆకాశ్‌ కు బాగా అర్థం అయింది. అనారోగ్యం సమస్యను వ్యవసాయం ద్వారా పరిష్కరించాలని నిర్ణయించుకున్నాడు. వ్యవసాయం చేయాలనే నిర్ణయానికి వచ్చిన తర్వాత ఆకాశ్‌ అనేక మంది రైతులతో మాట్లాడాడు. వారు ఎదుర్కొంటున్న నీరు, ఎరువుల సంబంధమైన, వాతావరణ మార్పులు, పంటలపై క్రిమి కీటకాల దాడులు లాంటి సమస్యలపై తీవ్రంగా ఆలోచించాడు. ఆ క్రమంలో కొద్దిపాటి నేలలోనే మల్టీలేయర్‌ ఫార్మింగ్‌ అనే ఆలోచన ఆకాశ్‌ మదిలోకి వచ్చింది.మల్టీలేయర్‌ ఫార్మింగ్‌ ఆలోచన రాగానే.. ఆకాశ్‌ ముందుగా భూమిపైన, మరొకటి కాస్త ఎత్తులో కలిపి రెండు రకాల పంటల సాగు ప్రారంభించాడు. తొలిసారిగా ఆకాశ్‌ టమాటా- కాకరకాయ పంటలు సాగుచేశాడు. అలాగే మరికొన్ని ఇతర కాంబినేషన్లను కూడా ప్రయోగాత్మకంగా చేశాడు. అయితే.. కొత్తరకం సాగులో ఆకాశ్‌ ముందుగా ఎదురైన సవాల్‌ గడ్డి, కలుపుమొక్కలు. గడ్డి, కలుపుమొక్కలు ఆకాశ్‌ సాగుచేసిన పంటల్ని బలహీన పరిచాయి. కలుపుమొక్కలు, గడ్డిని తొలగించేందుకు చాలా ఖర్చు కూడా చేయాల్సి  వచ్చింది. ఈ క్రమంలో ఆకాశ్‌ మరింత చురుగ్గా ఆలోచించాడు. కలుపు, గడ్డిమొక్కల్ని నివారించేందుకు వేగంగా ఎదిగే పాలకూర, కొత్తిమీర, మెంతికూర లాంటి ఆకుకూరల మొక్కల్ని నాటాడు. దీంతో కలుపు మొక్కలు పెరగకుండా చేయగలిగాడు. ఆకుకూరల సాగుతో ఆకాశ్‌ పొలంలో 80 శాతం గడ్డి, కలుపు మొక్కల సమస్య తీరిపోయింది.

ఆకాశ్‌ కు ఎదురైన ఆ తర్వాతి చాలెంజ్‌ పెద్దమొత్తంలో భూమి లేకపోవడం. ప్రారంభంలో ఆకాశ్‌ కు సొంతంగా భూమి లేదు. దాంతో భూమి విలువ ఆకాశ్‌ కు బాగా తెలిసింది. తొలి రోజుల్లో ఒక్కో రైతుకు రెండు నుంచి ఐదెకరాల లోపే భూమి మాత్రమే ఉండేది. రైతుల తరాలు మారిన తర్వాత ఆ కొద్దిపాటి భూమి పంచుకోవడంతో ఒక్కొక్కరి వద్ద కొద్దిగానే వచ్చేది. ఇలా రైతుల వద్ద భూమి పరిమాణం తగ్గిపోవడం కూడా కొద్ది నేలలో ఎక్కువ పంటలు ఎలా పండించాలనే ఆలోచన ఆకాశ్‌ చేసేలా చేసింది. మల్టీలేయర్‌ ఫార్మింగ్‌ ఆలోచన ఆకాశ్‌ లో రావడానికి నగరాల్లోని బహుళ అంతస్థుల భవనాలే కారణం. కొద్దిపాటి స్థలంలో ఎక్కువ మంది నివాసం ఉండడం అనే ఆలోచనే ఆకాశ్‌ లో మల్టీలేయర్‌ సాగు ఆలోచన వచ్చేలా చేసింది.మల్టీలేయర్‌ ఫార్మింగ్ కోసం ఆకాశ్‌ ఆరున్నర అడుగుల ఎత్తులో వెదురుగడలతో ఒక నిర్మాణం చేశాడు. దానిపైన జాలీ లాంటిది ఏర్పాటు చేశాడు. అలా జాలీ ఏర్పాటు చేయడంతో నేలపైన పాక్షికంగా ఎండ పడేది. కొంతమేర నీడ కూడా ఉండేది. వెదురుగెడలు, జాలీ నిర్మాణంపైన ఆకాశ్‌ తీగపాదులు పెంచాడు. దీంతో ఒకే పొలంలో ఆకాశ్‌ మూడు రకాల పంటల సాగు ప్రారంభించాడు. వాటితో పాటు మరింత ఎత్తుగా పెరిగే సీజనల్‌ మామిడి, బొప్పాయి, సపోటా లాంటి చెట్లను నాలుగో పంటగా వేశాడు.

ఇలా మల్టీలేయర్‌ పంటల సాగుతో భూమిలోని నీరు ఆవిరైపోకుండా రక్షించుకోవచ్చు. ఖాళీగా ఉన్న భూమి కన్నా మల్టీలేయర్‌ ఫార్మింగ్‌ ద్వారా 80 శాతం నీటిని ఆవిరైపోకుండా కాపాడుకోవచ్చు. ఒక్క పంట పండించే భూమి 100 లీటర్ల నీటి వినియోగం జరిగిందనుకుంటే.. మల్టీలేయర్‌ విధానంలో 30 శాతం నీటితోనే నాలుగు రకాల పంటలు పండించవచ్చని ఆకాశ్‌ నిరూపించాడు. నాలుగు రకాల పంటల్ని మల్టీలేయర్‌ క్రాప్‌ విధానంలో పండించడం ద్వారా మరింత అధిక ఆదాయం వస్తుంది. మల్లీలేయర్‌ ఫార్మింగ్‌ ద్వారా ఆకాశ్ చౌరసియా ఏటా 30 లక్షల రూపాయల ఆదాయం సంపాదిస్తున్నాడు. ఆకాశ్‌ ఆచరిస్తున్న వ్యవసాయ విధానం కూడా పర్యావరణ అనుకూలమైనది. రసాయనాలు వాడని ఆరోగ్యాన్నిచ్చే ఆహారపంటలే పండిస్తున్నాడు.మంచి ఆహారం ప్రతి ఒక్కరి హక్కు అని, అలాంటి మంచి ఆహారాన్ని సమాజానికి అందించే పనిచేయడం అంటే తనకు ఎంతో శక్తిని, ఆనందాన్ని ఇస్తోందని ఆకాశ్‌ సంతోషంగా చెబుతున్నాడు. తన మాదిరిగానే మరింత ఎక్కువ మంది రైతులు రసాయన రహిత పంటలు పండిస్తే.. మరింత మందికి మంచి ఆహారం అందుతుందని అంటున్నాడు.

మల్టీలేయర్ ఫార్మింగ్‌ లో రైతులకు ఆకాశ్‌ స్వయంగా అవగాహన కల్పించడంతో పాటుగా మరింత ఎక్కువ మంది రైతులకు అవగాహన కల్పించేందుకు ఓ యూట్యూబ్‌చానల్‌ కూడా నడిపిస్తున్నాడు. తద్వారా మల్లీలేయర్ ఫార్మింగ్‌ పై ఆకాశ్‌ యూటూబ్‌ చానల్‌ లో ఔత్సాహిక రైతులకు అవసరమైనంత సమాచారాన్ని పొందుపరుస్తున్నాడు. మల్టీలేయర్‌ ఫార్మింగ్‌ విధానంపై ఎక్కువ మంది రైతుల్లో అవగాహన కలిగి మరింత అధికమొత్తంలో ఆచరిస్తారని ఆశాభావాన్ని ఆకాశ్‌ చౌరసియా వ్యక్తం చేస్తున్నాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here