నానాటికీ పెరుగుతున్న ప్లాస్టిక్ వ్యర్థాల వల్ల పర్యావరణానికి వాటిల్లుతున్న ముప్పుపై ప్రపంచవ్యాప్తంగా ఆందోళన వ్యక్తమవుతోంది. దీంతో పలు దేశాలు సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌ను నిషేధించడం ప్రారంభించాయి. ఈ నేపథ్యంలో పర్యావరణ అనుకూల ప్రత్యామ్నాయాలను గుర్తించాల్సిన అవసరం పెరిగింది. ఈ దృష్ట్యా సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌కు పర్యావరణ అనుకూలమైన జీరో-వేస్ట్ ప్రత్యామ్నాయాన్ని అందించే ప్రయత్నాలు వేగం పుంజుకున్నాయి. మన దేశంలో కూడా ఈ దిశగా పరిశోధనలు సాగుతున్నాయి. ఇందులో భాగంగా తమిళనాడు విరుధూనగర్ జిల్లాలోని వట్రాప్ అనే మారుమూల గ్రామానికి చెందిన ఓ యువ శాస్త్రవేత్త టెనిత్ ఆదిత్య (20) ‘అరటి ఆకు సాంకేతికతను’ (Banana Leaf Technology) కనుగొన్నారు. ఈ సాంకేతికత అరటి ఆకులలోని సహజ లక్షణాలను (physical properties) పెంచి, వాటిని ప్లాస్టిక్‌కు, కాగితానికి ప్రత్యామ్నాయంగా మలచడంలో సహాయపడుతుంది. అరటి ఆకులను ఈ సాంకేతిక పరిజ్ఞానంతో కనుక ప్రాసెస్ చేస్తే మూడేళ్ల దాకా అవి చెడిపోకుండా ఉండడం విశేషం. ప్లాస్టిక్ సంక్షోభాన్ని పరిష్కరించడంలోనే కాక కాగితాల తయారీ కోసం చెట్లను నరికివేయకుండా ఉండడానికి కూడా ఇది తోడ్పడుతుంది. అంతేకాదు, వాడేసి పారేసాక కూడా అవి పశుగ్రాసంగా సైతం ఉపయోగపడతాయి. ఈ సాంకేతిక పరిజ్ఞానంతో అరటి ఆకుల వాణిజ్య వినియోగం పెరిగేకొద్దీ అది రైతులకు అదనపు ఆదాయాన్ని కూడా సమకూర్చగలుగుతుంది.
నిజానికి ఆదిత్య తన 10 ఏళ్ల వయస్సు నుంచే ఈ సాంకేతిక పరిజ్ఞానం కోసం ప్రయత్నాలు ప్రారంభించారు. తమ గ్రామంలో రైతులు పెద్ద పెద్ద అరటి ఆకులను తెంపి, వాటిలో కొంత భాగాన్ని మాత్రమే ఉపయోగించుకోవడం ఆదిత్య చూశారు. గ్రామంలోని చాలా మంది రైతులు నిరుపేదలుగా ఉన్నారని, వారు ఆదాయం పెంచుకునేందుకు మార్గాలు అన్వేషిస్తున్నారని ఆదిత్య గమనించారు. వృథాగా పారేసే అరటి ఆకులతో రైతులకు అదనపు ఆదాయం కల్పించవచ్చని ఆదిత్యకు తోచింది. దీంతో తన వయస్సులో ఉన్న చాలా మంది పిల్లలు ప్రాథమిక గణితం, సైన్సు పాఠాలు నేర్చుకుంటున్నప్పుడు, ఆదిత్య స్కూలు వేళల తర్వాత అరటి ఆకులపై ప్రయోగాలు ప్రారంభించారు. అరటి ఆకులను ప్లాస్టిక్‌కు కనుక ప్రత్యామ్నాయంగా ఉపయోగించగలిగితే రైతుల ఆదాయం పెరగడంతో పాటు, పర్యావరణ సమస్యకు కూడా పరిష్కారం లభిస్తుందని ఆదిత్య గ్రహించారు.

సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఫలితంగా సంక్షోభం
ఆదిత్య తన 18 సంవత్సరాల వయస్సులోనే, టెనిత్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ (Tenith Innovations Private Limited) పేరుతో ఒక స్టార్టప్ ప్రారంభించారు. దానికి తనే CEO కూడా. ‘అరటి ఆకు సాంకేతిక పరిజ్ఞానం’ కనిపెట్టడంతో ఈ టీనేజ్ శాస్త్రవేత్త అనేక జాతీయ మరియు అంతర్జాతీయ ప్రశంసలు సైతం అందుకున్నారు.
ప్లాస్టిక్ ప్లేట్లు, స్ట్రాస్, కప్స్, పాలిథిన్ బ్యాగ్స్ వంటివాటిని ఒకసారి మాత్రమే ఉపయోగించి పారేయడం పరిపాటి. దీంతో ప్లాస్టిక్ వ్యర్థాలు పేరుకుపోతున్నాయి. ఇది దాదాపు అన్ని దేశాల్లోనూ ఒక పెను సమస్యగా పరిణమించింది. ఈ నేపథ్యంలో, ఆదిత్యకు అరటి ఆకులను ప్లాస్టిక్‌కు ప్రత్యామ్నాయం చేయాలనే ఆలోచన వచ్చింది. అయితే అందుకు మొదట అరటి ఆకులు త్వరగా పాడైపోకుండా ఉండాలి. కొన్నాళ్ల పాటైనా చెడిపోకుండా వాటిని జనం ఉపయోగించగలగాలి. ఈ ఆలోచనతోనే ఆదిత్య అరటి ఆకులను చెడిపోకుండా ఉంచగలిగే సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి పరచారు. ఈ సాంకేతికత వల్ల అరటి ఆకులను ఏ రసాయనాలనూ ఉపయోగించకుండా మూడేళ్ల పాటు వాడుకోవచ్చు. ఇది దాని మన్నికను కూడా పెంచుతుంది. ఇలా ప్రాసెస్ చేసిన ఆకులు హెచ్చు ఉష్ణోగ్రతలను కూడా తట్టుకోగలవు. ఇవి అసలు ఆకుల కంటే ఎక్కువ బరువు కలిగి ఉంటాయి. ఈ ఆకులతో ప్లేట్లు, కప్పుల తయారీకయ్యే వ్యయం చాలా తక్కువ. వాడేసాక చివరికి వాటిని ఎరువుగానో లేదా పశుగ్రాసంగానో కూడా ఉపయోగించవచ్చు. ఆదిత్య ప్రాసెసింగ్ సాంకేతిక పరిజ్ఞానంలో ఇన్ని లాభాలు ఉన్నాయి.
ఆదిత్య టెక్నాలజీకి అంతర్జాతీయ అవార్డులు
ఈ బనానా లీఫ్ టెక్నాలజీ ఆవిష్కరణకుగాను ఆదిత్య ఏడు అంతర్జాతీయ అవార్డులు, రెండు జాతీయ అవార్డులు అందుకున్నారు. ప్రతిష్టాత్మకమైన అంతర్జాతీయ గ్రీన్ టెక్నాలజీ అవార్డు, టెక్నాలజీ ఫర్ ది ఫ్యూచర్ అవార్డు వంటి పురస్కారాలు ఆదిత్యకు లభించాయి.
ఆదిత్య కనుగొన్న బనానా లీఫ్ టెక్నాలజీ పూర్తిగా సెల్యులార్ పర్యావరణ అనుకూల సాంకేతిక పరిజ్ఞానం. సహజమైన ప్రాసెసింగ్ ప్రక్రియలతో దీన్ని రూపొందించారు. ఈ సాంకేతిక పరిజ్ఞానంలో జీవకణాల జీవప్రక్రియ నిలిచిపోతుంది. అంటే అరటి ఆకులు పండిపోవడమో, పాడైపోవడమో జరగకుండా ఈ ప్రక్రియ నిరోధిస్తుంది. ప్రాసెస్ చేసిన ఈ ఆకులు 100 శాతం బయో-డిగ్రేడబుల్‌గా ఉంటాయి. ఇవి పూర్తిగా ఆరోగ్యకరమైనవి, పర్యావరణానికి అనుకూలమైనవి. పునర్వినియోగం సాధ్యం కాని వాటికి ఇవి మంచి ప్రత్యామ్నాయం.
సాధారణంగా, ఆకులు, కొమ్మలు, రెమ్మలు కొన్ని రోజుల్లోనే పాడైపోతాయి. చెట్ల నుంచి తెంపాక అవి పొడిబారి ఎండిపోతాయి. చిరిగి ముక్కలై పోతాయి. అందువల్ల అవి ప్లాస్టిక్స్ లేదా కాగితాలకు ప్రత్యామ్నాయం కాలేకపోతున్నాయి. సాధారణ పరిస్థితులలో అరటి ఆకులు మూడు రోజుల్లోనే ఎండిపోతాయి. అయితే ఆదిత్య టెక్నాలజీ ఈ సమస్యను అధిగమిస్తుంది. అది ఆకులను ఎండనివ్వకుండా ఉంచుతుంది.
ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి అరటి ఆకులతో ఐస్ క్రీమ్ కోన్స్, ఎన్వలప్స్, గిఫ్ట్ ర్యాప్స్, ప్లేట్స్, స్పూన్స్, కప్స్ వంటివి తయారు చేయవచ్చు. అలా సింగిల్-యూజ్ ప్లాస్టిక్‌కు ఇది తక్కువ ఖర్చుతో కూడిన ప్రత్యామ్నాయం అవుతుంది. ఈ టెక్నాలజీ ద్వారా అరటి ఆకులను ప్రాసెస్ చేసేందుకు అయ్యే ఖర్చు కూడా చాలా తక్కువ అని ఆదిత్య చెబుతున్నారు. అరటి ఆకు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి అరటి ఆకుల నుండి స్ట్రా తయారు చేయడానికి 10 పైసలు మాత్రమే ఖర్చవుతుండగా, ప్లాస్టిక్ స్ట్రా తయారీకి 70 పైసలు ఖర్చవుతుందని ఆయన తెలిపారు. అదేవిధంగా అరటి ఆకు నుండి ఒక ప్లేట్ తయారీకి సుమారు ఒక రూపాయి ఖర్చవుతే, ప్లాస్టిక్ ప్లేట్ తయారీకి రూ. 4 దాకా ఖర్చవుతుందని ఆదిత్య వివరిస్తారు.

బనానా లీఫ్ టెక్నాలజీకి పేటెంట్
బనానా లీఫ్ టెక్నాలజీకి సంబంధించి టెనిత్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్‌కు పేటెంట్ కూడా లభించింది. అయితే ఆదిత్య కంపెనీ బనానా లీఫ్ టెక్నాలజీతో ఉత్పత్తులను తయారు చేయడం లేదు. టెక్నాలజీ డెవలపర్లం కాబట్టి ప్రోటోటైప్‌లను ఉత్పత్తి చేసి తయారీదారులకు లైసెన్స్‌లు మాత్రం ఇస్తామని ఆదిత్య చెబుతున్నారు. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా మూడు కంపెనీలు ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తున్నాయి. వాటిల్లో రెండు USA, కెనడాలకు చెందినవి కాగా, మరొకటి థాయిలాండ్‌కు చెందింది. ప్రస్తుతం భారతదేశంలోని కొన్ని కంపెనీలతో కూడా ఆదిత్య ఈ టెక్నాలజీపై చర్చలు జరుపుతున్నారు.
ఇదిలావుండగా, బనానా లీఫ్ టెక్నాలజీ విషయంలో కొన్ని పరిమితులు కూడా ఉన్నాయి. ఉత్తర భారతదేశంలో అరటి ఆకులు అంతగా అందుబాటులో ఉండవు. అందువల్ల ఈ సాంకేతికత ఉత్తరాది ప్రాంతాలలో వాణిజ్యపరంగా చూస్తే ఖరీదైనదిగా మారుతుంది. దీంతో తయారీదారులు, వినియోగదారులను ఇది అంతగా ఆకర్షించకపోవచ్చునని కొందరు అభిప్రాయపడుతున్నారు. అలాగే అరటిచెట్ల నుండి పెద్ద యెత్తున ఆకులను సేకరించడంపై కూడా అభ్యంతరాలున్నాయి. అలా చేయడం వల్ల చెట్లకు హాని కలుగుతుందని కొందరు వాదిస్తున్నారు.
కానీ అరటి చెట్లకు సహజంగానే ఎక్కువ ఆకులు ఉంటాయి, కనుక మార్కెట్ డిమాండ్‌ను సులభంగా తీర్చగలమని ఆదిత్య అంటున్నారు. పునర్వినియోగం సాధ్యంకాని వాటికి బదులుగా ఈ అరటి ఆకులను ఉపయోగించినట్లయితే పర్యావరణానికి తప్పక మేలు కలుగుతుందని ఆదిత్య చెబుతున్నారు. కాగితం, కార్డ్‌బోర్డు, ప్లాస్టిక్ వినియోగం వల్ల ఎన్నో బిలియన్ల చెట్లు నాశనం అవుతున్నాయనీ, దాన్ని బనానా లీఫ్ టెక్నాలజీ ద్వారా నిరోధించవచ్చని ఆయన సూచిస్తున్నారు. మరోవైపు, ప్లాస్టిక్ కవర్లను వాడి పారేసినప్పుడు పశువులు, మేకలు వాటిని తింటున్నాయి. దీంతో అవి తీవ్ర అస్వస్థతకు, కొన్న సందర్భాల్లో మరణానికి సైతం గురవుతున్నాయి. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వ్యర్థాలు కాలుష్య సమస్యను నానాటికీ జటిలం చేస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో ఆదిత్య కనిపెట్టిన బనానా లీఫ్ టెక్నాలజీ ప్లాస్టిక్ సమస్యకు ఒక మంచి పరిష్కారం అవుతుంది.
ఆసక్తిగలవారు మరిన్ని వివరాలకు ఈ క్రింది చిరునామాను సంప్రదించవచ్చు.
contact@bananaleaftechnology.com
tenith@bananaleaftechnology.com
+91 94439 62244
LOCATION
Tenith Innovations Pvt Ltd
20/25 B, Nadar Street, Watrap
Virudhunagar Dist – 626 132
Tamil Nadu, India
www.bananaleaftechnology.com, www.tenithinnovations.com