‘ఆంధ్ర గో-పుష్టి’ బ్రాండ్‌ (Andhra Go-Pushti)తో ఆర్గానిక్ A2 ఆవు పాలను, ఇతర పాల ఉత్పత్తులను మార్కెట్ చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. రైతు భరోసా కేంద్రాల (RBK) ఉత్పాదక సరఫరా వ్యవస్థ ద్వారా ఈ సేంద్రియ ఆవు పాల విక్రయాన్ని నిర్వహించాలన్నది ప్రభుత్వ ఉద్దేశ్యం. ఏ2 పాల ఉత్పత్తి నిర్వహణ కోసం పశుసంవర్ధకశాఖ అసిస్టెంట్లకు, వలంటీర్లకు లీటరుకు రూపాయి చొప్పున ప్రోత్సాహకంగా డెయిరీ నిర్వాహకుల చేత ఇప్పించాలని ప్రభుత్వం భావిస్తోంది. అలాగే అమూల్, ఫిషరీస్, జనతా బజార్ల వంటి అవుట్‌లెట్లు, ఈ-మార్కెట్ వేదికల ద్వారా ‘ఆంధ్ర గో-పుష్టి’ బ్రాండ్ పాలను మార్కెటింగ్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అవసరమైన ధ్రువపత్రాలు లభించాక జైవిక్ ఖేతీ ఈ-కామర్స్‌ వేదిక ద్వారా కూడా ఈ పాలను విక్రయిస్తారు. ఏ2 పాల బ్రాండింగ్ కోసం హైదరాబాద్‌లోని NINతో ఏపీ పశుసంవర్ధకశాఖ ఒక ఎంఓయు కూడా కుదుర్చుకుంటుంది.
Food Safety and Standards (Organic Foods) Regulations-2017 ప్రకారం ఆర్గానిక్ ఆహారోత్పత్తులన్నిటికీ జైవిక్ భారత్ లోగో (JAIVIK BHARAT logo)తో పాటు National Center of Organic Farming (NCOF) సర్టిఫికేషన్ లోగో అవసరం. కనుక ఈ లోగోలను ఉపయోగించుకునేందుకుగాను అవసరమైన ప్రక్రియను పశుసంవర్థక శాఖ ప్రారంభిస్తుంది.
ఏ 2 పాల ఉత్పత్తి కోసం ప్రత్యేకంగా స్వదేశీ గోవుల పెంపకం యూనిట్లను ఏర్పాటు చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు సంబంధించి తాజా మార్గదర్శకాలను కూడా విడుదల చేసింది. వ్యవసాయ పశుసంవర్థక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్య మార్గదర్శకాలు నిర్దేశిస్తూ జీవో (G.O.MS.No. 9) జారీ చేశారు. లోగడ నేషనల్‌ అడాప్షన్‌ ఫండ్‌ ఫర్‌ క్లైమేట్‌ చేంజ్‌ (NAFCC) కింద నెల్లూరు, విజయనగరం, అనంతపురం జిల్లాల్లో రూ.5.40 కోట్ల అంచనా వ్యయంతో 18 స్వదేశీ గోవుల పెంపకం యూనిట్లు, మిగతా పది జిల్లాల్లో రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక సహకారంతో రూ.12 కోట్ల అంచనా వ్యయంతో 40 యూనిట్లు ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. కాగా, తాజా గైడ్‌లైన్స్‌లో RKVY, NAFCC పథకాలను ఏకీకృతం చేసి అన్ని జిల్లాల్లోనూ ఒకే రీతిన మొత్తం 58 యూనిట్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇందుకు సంబంధించిన లబ్ధిదారుల ఎంపిక కోసం జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో కమిటీలను ఏర్పాటు చేశారు. ఈ కమిటీలో ఆర్బీకే జాయింట్ కలెక్టర్, జెడ్పీ సీఈఓ, అగ్రికల్చర్ జేడీ, జిల్లా కోఆపరేటివ్ ఆఫీసర్ నామినేట్ చేసే కోఆపరేటివ్ సభ్యులు నలుగురు, హార్టికల్చర్ ఏడీ లేదా డీడీ, పశుసంవర్థకశాఖ జేడీ, వ్యవసాయ మార్కెటింగ్ శాఖ ఏడీ, ఫిషరీస్ ఏడీ, డీఎల్‌బీసీ జిల్లా అధికారి, NABARD జిల్లా అధికారి సభ్యులుగా ఉంటారు. ఇవి జిల్లాలవారీగా ఏర్పాటు అవుతాయి.

ఒక్కో లబ్ధిదారుకు 25 దేశీ ఆవులు

జిల్లాల వారీగా ఎంపిక చేసే లబ్ధిదారుకు ఒక్కొక్క స్వదేశీ ఆవుకు రూ.70 వేల చొప్పున మొత్తంగా రూ.17.50 లక్షలను మంజూరు చేస్తారు. ఈ మొత్తంతో 25 గిర్, సాహివాల్, ఒంగోలు, పుంగనూరు తదితర జాతులకు చెందిన ఆవులను వీరికి అందజేస్తారు. ఇలా 58 యూనిట్ల కోసం రూ.10.15 కోట్లు ఖర్చు చేస్తారు. అలాగే ఈ ఆవుల కోసం నిర్మించే షెడ్లు, ఫెన్సింగ్‌, ఇతర వసతుల కోసం ఒక్కో యూనిట్‌కు రూ.10 లక్షల చొప్పున రూ. 5.80 కోట్లు మంజూరు చేస్తారు. ఆవుపాలు, పాల ఉత్పత్తుల తయారీ కోసం ఉపయోగించే డిస్టిల్లరీ వంటి యంత్ర పరికరాల కొనుగోలు కోసం ఒక్కో యూనిట్‌కు రూ.1,12,750 చొప్పున రూ.65.54 లక్షలు ఖర్చు చేస్తారు. కాగా, నిర్వహణవ్యయాల కింద ఒక్కో యూనిట్‌కు రూ.1,37,250 చొప్పున రూ.79.46 లక్షలు అందజేస్తారు. ఒక్కో యూనిట్‌ వ్యయం రూ.30 లక్షలుగా నిర్ణయించారు. ఇందులో లబ్ధిదారులు రూ. 3 లక్షల చొప్పున భరించాలి. 60 శాతం సబ్సిడీ కింద రూ. 18 లక్షలను RKVY& NAFCC నిధుల నుంచి సమకూర్చుతారు. 30 శాతం మొత్తాన్ని అంటే రూ.9 లక్షలను వాణిజ్య బ్యాంకుల నుంచి రుణంగా మంజూరు చేస్తారు. మొత్తం మీద స్వదేశీ ఆవుల పెంపకం పథకానికి 17 కోట్ల 40 లక్షల రూపాయలు వెచ్చిస్తారు. రాష్ట్ర స్థాయిలో పశుసంవర్ధకశాఖ అసిస్టెంట్ డైరెక్టర్ (Farms) ఈ పథకానికి నోడల్ ఆఫీసర్‌గా వ్యవహరిస్తారు.
ఇదిలావుండగా, కృష్ణాజిల్లా కంచికచర్ల మండలం పరకలపాడుకి చెందిన ‘సురభి గోశాల’ నిర్వాహకులు వి. రవికుమార్‌ను ఈ పథకానికి కన్సల్టెంట్‌గా నియమించారు. లబ్ధిదారులకు తగిన సలహాలు, సూచనలు అందజేయడం ఆయన బాధ్యత. కాగా, విశాఖపట్నం SMILE అడిషనల్‌ డైరెక్టర్‌ (పశుసంవర్ధకశాఖ)‌కు సమన్వయ బాధ్యతలు అప్పగించారు. ఆంధ్ర గో-పుష్టి బ్రాండ్‌ పాల ఉత్పత్తిలో భాగంగా పశుసంవర్ధక శాఖ ఆర్గానిక్ డెయిరీ కౌ ఫార్మింగ్‌కు సంబంధించి రైతులకు శిక్షణ, వర్క్‌షాప్స్ వంటివి నిర్వహిస్తుంది.
ఈ పథకానికి లబ్ధిదారుగా ఎంపిక కావాలంటే, దరఖాస్తుదారుకు పశువుల షెడ్లు వేసుకునేందుకు, పశుగ్రాసానికిగాను 2 నుండి 5 ఎకరాల భూమి ఉండాలి. భూమిని లీజుకు తీసుకుని ఉన్నా ఫర్వాలేదు. ఆర్గానిక్ డెయిరీ నిర్వహణలో అనుభవం ఉండాలి. స్వదేశీ గోజాతులను పెంచేందుకు ఆసక్తి కలిగిన బృందాలు కూడా లబ్ధిదారులు కావచ్చు. అయితే ఆ బృందంలో కనీసం నలుగురైనా సభ్యులుగా ఉండాలి.
జెర్సీ వంటి హైబ్రీడ్ ఆవుల పాలలో ఉండే ఏ1 ప్రొటీన్ హానికారకమైందన్న వాదన ఉంది. దానికి భిన్నంగా స్వదేశీ గోవులు ఇచ్చే పాలలో ఉండే ఏ 2 ప్రొటీన్ ఆరోగ్యకరమని నిపుణులు చెబుతున్నారు. దీంతో మార్కెట్‌లో ఇటీవల ఏ 1 ఆర్గానిక్ ఆవుపాలకు గిరాకీ పెరిగింది. కేంద్ర ప్రభుత్వం కూడా స్వదేశీ గో సంతతిని పెంచాలని భావిస్తోంది. దీనికి అనుగుణంగా ఏపీ ప్రభుత్వం కూడా అడుగులు వేస్తోంది. మొత్తం మీద ప్రభుత్వం దేశీ ఆవుపాలతో ప్రత్యేకంగా ఒక ఆర్గానిక్ బ్రాండ్‌ను ప్రమోట్ చేయడం విశేషం.

దేశీ ఆవుల పథకం G.O.MS.No.9 కోసం ఇక్కడ క్లిక్ చేయండి!

Andhra Go-Pushti Brand A2 Milk

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here