ఆర్గానిక్ బియ్యం రకాలకు అంతర్జాతీయంగా డిమాండ్ పెరుగుతోంది. యూరోపియన్ యూనియన్, మధ్య ప్రాచ్యం, తూర్పు ఆసియా దేశాలలో సేంద్రియ బియ్యం రకాలకు మంచి గిరాకీ ఉంటోంది. అందుకే ఆంధ్రప్రదేశ్ నుండి సేంద్రియ బియ్యం రకాలను ఎగుమతి చేయడానికి Agricultural and Processed Food Products Export Development Authority (APEDA) ఒక రోడ్ మ్యాప్‌ సిద్ధం చేసింది. అపెడా చైర్మన్ ఎం. అంగముత్తు ఒక ఆంగ్ల దినపత్రికతో మాట్లాడుతూ ఈ విషయం వెల్లడించారు.
“COVID-19 తరువాత, యూరోపియన్ యూనియన్‌తో సహా అనేక దేశాలు భారతదేశంలో సేంద్రియ వ్యవసాయ పద్ధతుల ద్వారా పండించిన వరి రకాల కోసం చూస్తున్నాయి. దీంతో అటువంటి బియ్యాన్ని ఎగుమతి చేయడం కోసం మేము ఆంధ్రప్రదేశ్‌ను ఎంచుకున్నాము” అని ఆయన చెప్పారు.
“వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ పరిధిలోని APEDA ఎగుమతిదారులు-దిగుమతిదారులకు మధ్య సమన్వయకర్తగా ఉంటుంది. ఎగుమతిదారులు ఎగుమతులు చేసేందుకు ధ్రువీకరణ పత్రాలు అవసరం. వాటిని అపెడా సమకూర్చేదుకు సహాయపడుతుంది. ధ్రువీకరించబడిన తర్వాత ఆర్గానిక్ బియ్యం రకాలను ఎగుమతి చేసుకునే వెసులుబాటు ఉంటుంది” అని అంగముత్తు వివరించారు.
“ప్రపంచవ్యాప్తంగా 170 దేశాలకు భారతదేశం ప్రధాన బియ్యం ఎగుమతిదారుగా ఉన్నప్పటికీ, వియత్నాం, థాయిలాండ్, ఫిలిప్పీన్స్ మనకు ప్రధాన పోటీదారులుగా ఉన్నాయి. భారతదేశం ఎటువంటి బ్రాండింగ్, ప్రమోషన్, అదనపు విలువ జోడింపు లేకుండా బియ్యాన్ని ఎగుమతి చేయడమే దీనికి కారణం” అని అంగముత్తు తెలిపారు.
అందుకే యుద్ధప్రాతిపదికన భారతీయ బియ్యం రకాలను బ్రాండింగ్ చేయడానికి ఒక వ్యూహం సిద్ధం చేయబడిందని ఆయన చెప్పారు. ఏదేమైనా, ప్రపంచ పోటీదారుల సవాలును ఎదుర్కొనేందుకు ఉత్పత్తి వైవిధ్యీకరణ కీలక వ్యూహంగా ఉంటుందని ఆయన అన్నారు.
ఈ నేపథ్యంలో 100 మంది ఆంధ్రా రైతులు లేదా రైతు ఉత్పత్తి సంస్థలను ఎగుమతిదారులుగా మార్చేందుకు APEDA ప్రయత్నిస్తోందని ఆయన తెలిపారు. బియ్యంతో పాటు ఉద్యానవన పంటలు, మొక్కజొన్న వంటి ఉత్పత్తులను కూడా ఎగుమతి చేయడానికి వారిని సన్నద్ధం చేస్తున్నామనీ, వారిని ప్రపంచ మార్కెట్‌కు అనుసంధానించడానికి అపెడా సిద్ధంగా ఉందనీ అంగముత్తు చెప్పారు.
సేంద్రియ బియ్యం రకాల ఎగుమతికి APEDA ఆంధ్రప్రదేశ్‌ను ఎంచుకోవడం మన రైతులకు ప్రయోజనం కలిగిస్తుందని భావిస్తున్నారు. దీంతో అంతర్జాతీయంగా ఆంధ్రాబియ్యం రకాలకు మున్ముందు మరింత గిరాకీ పెరిగే అవకాశం ఉంటుంది. ఈ మధ్య ఆంధ్రప్రదేశ్‌లో ఆర్గానిక్ పద్ధతులను అనుసరించి వరిని పండించడం పెరిగింది. అనేక రకాల వరి వంగడాలను మన రైతులు సాగు చేస్తున్నారు. వాటికి దేశంలోనే కాక అంతర్జాతీయంగా మార్కెట్ లభించడం ఒక సానుకూల పరిణామం.

ఆసక్తిగలవారు మరిన్ని వివరాలకు ఈ క్రింది చిరునామాను సంప్రదించవచ్చు.
APEDA HYDERABAD OFFICE
8th Floor, Chandra Vihar Building,
M.J.Road, Hyderabad-500001
Phone: +91- 040-24745940
Fax: +91- 040-24745947
E-mail: apedahyd[AT]apeda[DOT]gov[DOT]in

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here