కొత్త సాగు చట్టాల తర్వాత మద్దతుధర కొనసాగింపుపై రైతాంగంలో పలు సందేహాలు తలెత్తాయి. భవిష్యత్తులో మద్దతు ధర ఉండదేమోనన్న భయాందోళనలతో పంజాబీ రైతులు ఢిల్లీని ముట్టడించారు. అయితే కనీస మద్దతు ధరను ఇక ముందు కూడా కొనసాగిస్తామని కేంద్ర ప్రభుత్వం రైతులకు భరోసా ఇస్తోంది. అందుకు అనుగుణంగా ప్రస్తుతం అన్ని పంటలకూ ఎంఎస్‌పి చెల్లించి కొనుగోళ్లు జరుపుతోంది. 2020-21 ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్ (కెఎంఎస్)లోగతంలోలాగే ఎంఎస్‌పి పథకాల ప్రకారం ప్రభుత్వం రైతుల నుండి పంటలను కొనుగోలు చేస్తోంది. ఖరీఫ్ 2020-21 కోసంగాను చేపట్టిన వరి సేకరణ సజావుగా సాగిందని కేంద్రం వెల్లడించింది.

2020 డిసెంబర్ 17నాటి వరకు పంజాబ్, హర్యానా, ఉత్తర ప్రదేశ్, తెలంగాణ, ఉత్తరాఖండ్, తమిళనాడు, చండీగఢ్, జమ్మూ & కాశ్మీర్, కేరళ, గుజరాత్, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, బిహార్ రాష్ట్రాలలో 405.31 లక్షల మెట్రిక్ టన్నుల (LMT) వరి కొనుగోలు జరిగిందని కేంద్రం ప్రకటించింది. గత ఏడాది 327.65 ఎల్‌ఎమ్‌టి కొనుగోలుతో పోలిస్తే ప్రస్తుత సీజన్‌లో అది 23.70% పెరిగింది. మొత్తం 405.31 ఎల్‌ఎమ్‌టి కొనుగోలులో, పంజాబ్ ఒక్క రాష్ట్రంలోనే సేకరణ అవధి ముగిసిన 2020 నవంబర్ 30నాటికి 202.77 ఎల్‌ఎమ్‌టిని కొనుగోలు చేసింది, ఇది దేశంలో మొత్తం సేకరణలో 50.02%. సుమారు 47.17 లక్షల మంది రైతులు ఇప్పటికే కొనసాగుతున్న కెఎంఎస్ సేకరణ కార్యకలాపాల ద్వారా రూ.76524.14 కోట్ల మేర లబ్ధి పొందారని కేంద్రం వివరించింది.రాష్ట్రాల ప్రతిపాదనల ఆధారంగా 2020 ఖరీఫ్ సీజన్‌లో తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణ, గుజరాత్, హర్యానా, ఉత్తర ప్రదేశ్, ఒడిశా, రాజస్థాన్ రాష్ట్రాల కోసం 48.11 ఎల్ఎమ్‌టిల పప్పుధాన్యాలు, నూనె గింజలు కొనుగోలుకు అనుమతి లభించింది. మద్దతు ధర పథకం (పిఎస్ఎస్) కింద ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు మరియు కేరళ రాష్ట్రాలకు 1.23 ఎల్‌ఎమ్‌టి కొబ్బరి కురిడి (శాశ్వత పంట) కొనుగోలుకు అనుమతి ఇవ్వడం జరిగింది.
2020 డిసెంబర్ 17 నాటికి ప్రభుత్వం తన నోడల్ ఏజెన్సీల ద్వారా 187459.80 మెట్రిక్ టన్నుల పెసర్లు, మినుములు, వేరుశనగ గుండ్లు, సోయాబీన్లను తమిళనాడు, మహారాష్ట్ర, గుజరాత్, హర్యానా, రాజస్థాన్‌లలో కొనుగోలు చేసింది. కాగా దీని ద్వారా 1,03,669 మంది రైతులకు రూ.1005.55 కోట్ల మేరకు లబ్ధి చేకూరింది.

అదేవిధంగా, రూ. 52.40 కోట్ల ఎంఎస్‌పి విలువ కలిగిన 5089 మెట్రిక్ టన్నుల కొబ్బరి కురిడీ (శాశ్వత పంట)ని ప్రభుత్వం కొనుగోలు చేసింది. దీని ద్వారా కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లోని 3961 మంది రైతులకు లబ్ధి చేకూరింది. కొబ్బరి, మినపపప్పులకు సంబంధించి, చాలా రాష్ట్రాల్లో ధరలు ఎంఎస్‌పి కంటే ఎక్కువగానే ఉన్నాయి. ఖరీఫ్ పప్పుధాన్యాలు, నూనెగింజలకు సంబంధించి సేకరణ ప్రారంభించడానికి అవసరమైన ఏర్పాట్లు జరుగుతున్నాయి.
పంజాబ్, హర్యానా, రాజస్థాన్ మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, కర్ణాటక రాష్ట్రాల్లో ఎంఎస్‌పి ప్రాతిపదికన సీడ్ కాటన్ సేకరణ కార్యకలాపాలు సజావుగా జరుగుతున్నాయి. 2020 డిసెంబర్ 17 నాటికి రూ. 16057.63 కోట్ల విలువైన 55,75,090 కాటన్ బేల్స్ కొనుగోలు జరిగింది. దీని ద్వారా 10,80,015 మంది రైతులకు లబ్ధి చేకూరిందని కేంద్ర ప్రభుత్వం వివరించింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here