తమిళనాడుకు చెందిన రామస్వామి సెల్వం ఓ ఆర్గానిక్‌ వ్యవసాయ రైతు. సాంప్రదాయ వ్యవసాయానికి చేసే పెట్టుబడి ఖర్చు కన్నా ఆర్గానిక్‌ సాగులోకి అడుగుపెట్టిన తర్వాత ఆయనకు దాదాపు 30 శాతం ఖర్చు తగ్గిపోయింది. దాంతో ఆయన మరింత ఎక్కువగా లాభాలు ఆర్జిస్తున్నారు. ఈరోడ్‌ జిల్లాలోని తలవుమలై గ్రామానికి చెందిన రామస్వామి సెల్వం ఆర్గానిక్‌ రైతుగా ఇప్పుడు అందరికీ సుపరిచితం అయ్యారు. రామస్వామి సెల్వం 16 ఎకరాల్లో వరి, నువ్వులు, వేరుశెనగ, మామిడి, కొబ్బరి, ఇతర పండ్ల జాతులతో పాటు పశువులకు కావాల్సిన పచ్చి గడ్డి కూడా సేంద్రీయ విధానంలోనే సాగుచేస్తున్నారు. ఆర్గానిక్‌ సాగు విధానం ద్వారా సెల్వం తమ వ్యవసాయ క్షేత్రంలో అధిక దిగుబడి సాధిస్తున్నారు. దాంతో పాటుగా ఆయన సాగు పెట్టుబడి ఖర్చులు కూడా బాగా తగ్గిపోయాయి.

సాంప్రదాయ పంటల నుంచి తాము ఆర్గానిక్‌ విధానంలోకి మారినప్పుడు తమకు సాగు పెట్టుబడి తక్కువ అయిందని రామస్వామి సెల్వం చెప్పారు. ఆర్గానిక్‌ విధానంలోకి మారిన తొలి రోజుల్లో తాము బహుళ పంటలు సాగు చేశామని తెలిపారు. అన్నీ కలిపి 20 నుంచి 25 రకాల మొక్కలను ఒకేసారి తమ వ్యవసాయ క్షేత్రంలో నాటుకున్నామన్నారు. ఆ పంటలు కోసిన తర్వాత మిగిలిన మొక్కలతో పాటుగా దున్నేశామని, తద్వారా భూమిలో సూక్ష్మ పోషక స్థాయిలో బాగా పెరిగాయన్నారు. ఇదే విధంగానే తాము గత 24 సంవత్సరాలుగా వ్యవసాయం చేస్తున్నామని రామస్వామి సెల్వం వెల్లడించారు.

రసాయనాలతో లేదా సేంద్రీయ రహిత వ్యవసాయం చేయడానికి ప్రత్యేకమైన విత్తనాలు, రసాయన ఎరువులు, పురుగుమందులు అవసరం అవుతాయి. అయితే.. ఆర్గానిక్‌ ఫార్మింగ్‌ లో అయితే.. మన వ్యవసాయ భూమిలోనే లభ్యమయ్యే సహజ వనరులతోనే సాగు చేస్తాం కనుక పెట్టుబడి ఖర్చు బాగా తగ్గిపోతుందని రామస్వామి సెల్వం చెప్పారు. పంటల రొటేషన్‌ ద్వారా కర్బనం, నత్రజని లాంటివి పంటలకు సహజసిద్ధంగానే లభిస్తాయన్నారు. దీంతో గతంలో తగ్గిపోయిన భూసారం మళ్లీ మన పొలానికి తిరిగి వస్తుందన్నారు. ఒకసారి భూసారం పెరిగిందంటే.. సాగుబడిలో ముఖ్యమైన పనివారి కోసం చేసే ఖర్చు దానంతట అదే తగ్గిపోతోందని సెల్వం చెప్పారు. భూసారాన్ని పెంచితే.. పొలంలో మన కష్టపడి చేయాల్సిన అవసరం తగ్గిపోతుందన్నారు. నిజానికి అనేక సంవత్సరాలుగా విచ్చలవిడిగా రసాయనాలతో వ్యవసాయం చేస్తున్న కారణంగా తమిళనాడులో భూమి నాణ్యత బాగా తగ్గిపోయిందన్నారు. అదే ఆర్గానిక్‌ విధానంలో పంటలు పండించిన భూమి బంజరుగా మారే అవకాశం ఉండదని, ఆర్గానిక్‌ సాగుతో భూసారం తిరిగి వస్తుందని రామస్వామి వివరించారు.రామస్వామి సెల్వం తమ వ్యవసాయ క్షేత్రంలో వాడే వర్మీ కంపోస్ట్‌ ను, ద్రవరూప ఎరువు పంచగవ్య లాంటి వాటిని తానే తయారుచేసుకుంటారు. ఆవు పేడ, గోమూత్రం, పాలు, పెరుగు, అరటి, లేత కొబ్బరి, నెయ్యితో ద్రవరూప ఎరువును రామస్వామి సెల్వం తయారు చేసుకుంటారు. భూసారాన్ని రక్షించే, ఎన్నో పోషక విలువలు గల వర్మీ కంపోస్ట్‌ ను క్షేత్రంలో కుళ్లిన పదార్థాలు, వానపాములతో కలిపి తయారుచేస్తారు. రామస్వామి సెల్వం సతీమణి పూన్‌ గోడి కూడా వర్మీ కంపోస్ట్‌ శిక్షకురాలు. వర్మీ కంపోస్ట్‌ ను తక్కువ ఖర్చుతోనే తయారు చేసే విధానాన్ని ఆమె రూపొందించారు. ఆమె తమ వ్యవసాయ క్షేత్రంలో రూపొందించిన ‘ఓపెన్‌ బెడ్‌’ వర్మీ కంపోస్ట్‌ తయారీ విధానం ఎంతగానో విజయవంతం అయింది. దీంతో అనేక మంది ఇతర రైతులు కూడా పూన్‌ గోడి వర్మీ కంపోస్ట్‌ తయారీ విధానాన్నే అనుసరిస్తున్నారు. మొక్కలు బాగా ఎదగడం కోసం తొలి రోజుల్లో ఉసిరి ఆకులు, మజ్జిగతో పులియబెట్టిన ద్రవాన్ని పిచికారి చేశామని రామస్వామి సెల్వం తెలిపారు. అలా కొన్నేళ్లు చేస్తూ భూసారాన్ని పెంచామని, ఇప్పుడు పంచగవ్యతోనే తమ భూమిలో సారం ఇంకా పెరిగిందంటున్నారు. వివిధ రకాల పంటలు వేసే పంట మార్పిడి విధానం వల్ల కలుపు మొక్కల్ని సులువుగా నివారించవచ్చంటున్నారు.

ఆర్గానిక్ పంటల సాగు ద్వారా పెట్టుబడి ఖర్చు తగ్గడమే కాకుండా, పంట దిగుబడి పెరుగుతుందని, మంచి నాణ్యత పంట వస్తుందని, వాటికి మార్కెట్‌ లో మంచి ధర కూడా పలుకుతుందని రామస్వామి సెల్వం వెల్లడించారు. తాను ఆర్గానిక్‌ విధానంలో ఒక ఎకరంలో ధాన్యం పంట పండించేందుకు 16,890 రూపాయలు ఖర్చు పెట్టానని, అదే రసాయనాలు వాడి మరో రైతు ధాన్యం పండించడానికి 34,200 రూపాయలు ఖర్చు చేయాల్సి వచ్చిందని రెండు విధానాల్లో అయ్యే ఖర్చును సెల్వం సరిపోల్చి చెప్పారు. తమ ఎకరం పొలంలో 2,200 కిలో ధాన్యం పండితే.. రసాయనాలు వాడిన భూమిలో 2,700 కిలోల దిగుబడి వచ్చిందన్నారు. రసాయనాలు వాడిన ధాన్యాన్ని కిలో ఒక్కింటికి 10.25 రూపాయలే వస్తే.. తన ఆర్గానిక్‌ ధాన్యం కిలోకు 14.20 ధర పలికిందని రామస్వామి తెలిపారు. తద్వా రా తనకు 14,350 రూపాయల లాభం చవిచూస్తే.. పొరుగు రైతుకు కేవలం 6,525 రూపాయలు మాత్రమే లాభం వచ్చిందన్నారు. వేరుశెనగ పంటల్లో తనకు, పొరుగు రైతుకు వచ్చిన లాభం మధ్య తేడా గురించి కూడా రామస్వామి వివరంగా చెప్పారు. అందుకే అటు ఆర్థికంగా, ఇటు పర్యావరణ పరంగా కూడా ఆర్గానిక్‌ సాగు విధానం ఎంతో మేలు అని రామస్వామి స్పష్టంగా చెబుతున్నారు. ఆర్గానిక్‌ వ్యవసాయ విధానాల గురించి రైతుల్లో అవగాహన కల్పించేందుకు రెండు దశాబ్దాలుగా అవిరళ కృషిచేస్తున్న వ్యవసాయ శాస్త్రవేత్త జి.నమ్మాళ్వార్‌ తో రామస్వామి సెల్వంకు మంచి అనుబంధం ఉంది. ఆయన సూచనలు, సలహాలతో రామస్వామి ఆర్గానిక్‌ వ్యవసాయంలో మంచి ఫలితాలు రాబడుతున్నారు. చక్కని దిగుబడులు సాధిస్తున్నారు. మెరుగైన లాభాలు ఆర్జిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here