అనేక సవాళ్లు, వెక్కిరింపులను ఎదుర్కొంటూనే ఐటీ ఇంజనీర్‌ రోజా రెడ్డి ఆర్గానిక్‌ ఫార్మింగ్‌ లో అగ్రిప్రెన్యూర్‌ గా ఎదిగింది. ఇప్పుడామే ఏటా కోటి రూపాయల దాకా ఆదాయం సంపాదిస్తోంది. అంతేకాకుండా ఇతర రైతులను కూడా ఆర్గానిక్‌ ఫార్మింగ్‌ లో మెళకువలు చెబుతూ వారి ఆదాయం కూడా అనేక రెట్టు పెరిగేలా చేస్తోంది.

రోజా రెడ్డి బెంగళూరులోని ప్రముఖ టెక్నాలజీ సంస్థ ఐబీఎంలో సాఫ్ట్‌ వేర్ ఇంజనీర్‌ గా ఉద్యోగం చేసేది. నిజానికి చాలా మంది యువతీ యువకులకు సాఫ్ట్‌ వేర్ జాబ్ అంటే ఓ చక్కని కల. అయితే.. సాఫ్ట్‌ వేర్‌ జాబ్‌ చేస్తున్న రోజా రెడ్డికి ఇంకా ఏదో సాధించాలనే కోరికతో ఉండేది. 2018 వేసవి కాలంలో రోజారెడ్డి కర్ణాటకలోని చిత్రదుర్గ జిల్లా, చల్లకరిగె తాలూకాలోని తన సొంతూరు దొన్నెహళ్లి వెళ్లింది. అప్పటికే వ్యవసాయంలో బాగా నష్టాలు రావడంతో రోజా రెడ్డి తండ్రి, సోదరుడు తమ వ్యవసాయ భూమిని అమ్మేయాలని చూస్తున్నారు.

అయితే.. రోజారెడ్డికి వ్యవసాయం పట్ల ఆసక్తి బాగా ఉంది. తండ్రి, సోదరుడు పొలాన్ని అమ్మేసేందుకు యత్నిస్తుండడంతో వ్యవసాయం చేసేందుకు తానే ఉద్యోగం వదిలేయాలని నిర్ణయానికి వచ్చింది. తన కుటుంబ వ్యవసాయ క్షేత్రాన్ని నిలబెట్టాలని నిర్ణయించుకుంది. అలా నిర్ణయించుకున్న రోజారెడ్డి ఆర్గానిక్‌ విధానంలో వ్యవసాయం చేయడం ప్రారంభించి, మూడేళ్లలోనే తమ పొలం నుంచి కోట్ల రూపాయల ఆదాయం సంపాదించింది.దొన్నెహళ్లిలో ఆర్గానిక్‌ వ్యవసాయం చేయడం మొదలుపెట్టిన తొలి అగ్రిప్రెన్యూర్‌ రోజారెడ్డి. తమకు ఉన్న 20 ఎకరాల్లో సగం నేలలో మాత్రమే దానిమ్మ, టమోటా సాగు చేసింది. అప్పటికే తన తండ్రి, సోదరుడు రసాయనాలు వాడి చేసిన సాగు కారణంగా నేలలోని సారం పోయింది. పంటల దిగుబడి కూడా బాగా తగ్గిపోయింది. దాంతో పాటు నీటి ఎద్దడి కూడా వారి పొలంలో వ్యవసాయం చేయడం మరింతగా కష్టంగా మారిపోయింది.

ఇంతటి దుర్భర పరిస్థితుల్లో రోజారెడ్డి సాఫ్ట్‌ వేర్ జాబ్‌ వదిలేసి ఆర్గానిక్‌ ఫార్మింగ్‌ చేస్తానంటూ ఎగతాళి చేశారు. రోజారెడ్డి ఆర్గానిక్‌ విధానంలో వ్యవసాయం చేయాలని నిర్ణయించుకోవడానికి కూడా కారణం ఉంది. ఆమె తాత గతంలో సహజ సాగు పద్ధతిలో పంటలు పండించడం చూసింది. అయతే.. రోజా తండ్రి, సోదరుడు పొలంలో బాగా రసాయనాలు వాడి సాగు చేశారు. దీంతో నేల మొత్తం నిస్సారం అయిపోయి, పంట దిగుబడి తగ్గిపోయింది. అలాగే.. తాము పండించిన పంటను విక్రయించేందుకు సరైన మార్గాలు కూడా వారికి తెలియలేదు. వ్యవసాయంలో విపరీతమైన నష్టాలు రావడంతో భూమిని అమ్మేసి, పని వెదుక్కునేందుకు నగరం వెళ్లిపోవాలని సిద్ధపడ్డారు.

ఆ సమయంలో తానే తమ పొలంలో ఆర్గానిక్‌ వ్యవసాయం చేయాలని రోజారెడ్డి తీసుకున్న నిర్ణయం కారణంగా వారి భూమిని అమ్మకుండా నిలబెట్టుకున్నట్లయింది. కుటుంబాన్ని కూడా మంచి ఆర్థిక స్థితిలో ఉంచగలిగింది. నిజానికి రోజారెడ్డి నిర్ణయాన్ని ఆమె తండ్రి, సోదరుడు కూడా తొలుత తీవ్రంగా వ్యతిరేకించారు. ఇక దొన్నెహళ్లి గ్రామస్థులైతే రోజారెడ్డిని చూసి నవ్వుకున్నారు. రోజారెడ్డి నిర్ణయం పట్ల చివరికి వ్యవసాయశాఖ అధికారులు కూడా పెద్దగా పట్టించుకోలేదు. ఆర్గానిక్‌ వ్యవసాయం గురించి తెలుసుకునేందుకు వ్యవసాయశాఖ అధికారులను సంప్రదించినప్పుడు.. తనను వారు చాలా నిరుత్సాహపరిచారని రోజారెడ్డి చెప్పారు.ఏదేమైనప్పటికీ ఆర్గానిక్‌ వ్యవసాయమే చేయాలని రోజారెడ్డి గట్టిగా నిర్ణయించుకుంది. తమ పొలంలో నిష్ప్రయోజనంగా పడిఉన్న పది ఎకరాల్లో ఆర్గానిక్ వ్యవసాయం చేస్తానని తన తండ్రికి రోజారెడ్డి నచ్చజెప్పింది. ఇక అప్పటి నుంచి తమ ప్రాంతంలో ఎవరెవరు ఆర్గానిక్ వ్యవసాయం చేస్తున్నారో.. వారందరి జాబితా తయారు చేసుకుంది. ఒక్కొక్కరి వద్దకు స్వయంగా వెళ్లి, ఆర్గానిక్‌ వ్యవసాయంలో వారు అవలంబిస్తున్న విధానాలను వారి నుంచి అడిగి తెలుసుకుంది. అలా కొందరు రైతులు ఆర్గానిక్‌ వ్యవసాయంలో తనకు బాగా మార్గదర్శనం చేశారని రోజారెడ్డి వెల్లడించింది.

ఆర్గానిక్‌ వ్యవసాయం చేయడానికి అనువుగా ముందుగా నేలను రోజారెడ్డి సిద్ధం చేసుకుంది. తర్వాత మహారాష్ట్ర నుంచి మంచి నాణ్యమైన విత్తనాలు కొనుగోలు చేసింది. అలా కాప్సికమ్‌, బ్రొకోలి, గుమ్మడి, టమోటా, వంకాయ, బీన్స్‌, క్యారట్‌, బీట్‌ రూట్‌, పొట్ల, కాకర, మెంతికూర, తోటకూర, పాలకూర, ముల్లంగి, మిర్చి, కాలీఫ్లవర్‌, క్యాబేజి, పుదీనా లాంటి  40 రకాల కాయగూరలు, ఆకుకూరల విత్తనాలు సేకరించి, తమ పొలంలో నాటింది.

రోజారెడ్డి ఏడాది కాలంలోనే ఆర్గానిక్‌ విధానంలో పలు రకాల పంటల సాగులో చక్కని అనుభవం సంపాదించింది. తమ ప్రాంతంలోనే నైపుణ్యం గల ఆర్గానిక్‌ రైతుగా అవతారం ఎత్తింది. దాంతో పాటు తమ పంట ఉత్పత్తులను మార్కెట్ చేయడంలో చక్కని అవగాహన కూడా సంపాదించుకుంది. రోజారెడ్డి ఆర్గానిక్‌ వ్యవసాయం చేస్తానని చెప్పిన తొలిరోజుల్లో ఆమెను ఎగతాళి చేసిన అనేక మంది ఇతర రైతులు కూడా ఆమె సాధించిన విజయాలు కళ్లారా జూసి ఇప్పుడు వారు కూడా ఆర్గానిక్ వ్యవసాయం చేస్తున్నారు. రోజారెడ్డిలోని కృషి, పట్టుదల వారిని బాగా ప్రబావితం చేయడమే వారంతా ఆర్గానిక్ వ్యవసాయంలో దిగడానికి కారణం అయింది. రోజారెడ్డిని తొలిరోజుల్లో నిరుత్సాహ పర్చిన వ్యవసాయ అధికారులు కూడా ఆమె సాధించిన విజయాలు ప్రత్యక్షంగా చూడమని, ఆమె ద్వారా అవగాహన కల్పించుకోవాలని తమ క్షేత్రానికి పంపుతున్నారని ఆమె సగర్వంగా చెబుతోంది. ఆర్గానిక్ సాగు విధానంలో సాధించిన విజయాలకు గుర్తింపుగా స్థానిక ప్రభుత్వం 2021లో ‘ఉత్తమ మహిళా వ్యవసాయవేత్త అవార్డు’ అందజేసి గౌరవించారు.రోజారెడ్డి సొంతూరు ఉండే ప్రాంతం తీవ్రమైన నీటి ఎద్దడిని ఎదుర్కొనేది. అలాంటి చోట భూమిలోని నీటి నిల్వల్ని కాపాడేందుకు, సంప్రదాయ నీటి వనరులను పునరుద్ధరించేందుకు రోజారెడ్డి కాస్త ఎక్కువ శ్రమ చేయాల్సి వచ్చింది. తమ ప్రాంతలో భూగర్భజలాలు విపరీతంగా పడిపోయేవని రోజారెడ్డి పేర్కొంది. రైతులందరూ బోర్ వెల్స్‌ వేసేందుకు విపరీతంగా ఖర్చుచేసేవారు. నీటి కోసం ఒక్కొక్కరు కనీసం వెయ్యి అడుగుల లోతు వరకు బోర్‌ వెల్‌ వేయాల్సి వచ్చేది. తాను కూడా తమ పొలంలో మూడు బోర్‌ వెల్స్ వేయించినట్లు రోజారెడ్డి తెలిపింది. అలాగే.. తమ పొలంలో వర్షపునీటిని నిల్వ చేయడం కోసం మూడు నీటికుంటలు తవ్వించింది. రోజారెడ్డిని చూసిన ఇతర రైతులు కూడా తమ తమ పొలాల్లో నీటికుంటలు తవ్వించుకున్నారు. వారందరి నీటికుంటల్లో వర్షపునీరు నిల్వ చేసినందు వల్ల ఆ ప్రాంతంలో భూగర్భ జలమట్టం కూడా పెరిగిందని రోజారెడ్డి వివరించింది.

తమ ప్రాంతంలోని రైతుల రసాయనాల కారణంగా పంట దిగుబడులు తగ్గిపోతుండడంతో మరింత ఎక్కువగా డబ్బులు ఖర్చుచేసి ఉత్పత్తులు పెంచుకోవాలనే చూసేవారు కానీ తమ ఉత్పత్తులను మార్కెటింగ్‌ చేయడంపై సరైన అవగాహన కల్పించుకోలేకపోయారని రోజారెడ్డి పేర్కొంది. దాంతో పాటు వ్యవసాయంలో వస్తున్న కొత్త టెక్నాలజీ గురించి కానీ, ఆధునిక సాగు విధానాల గురించి కూడా వారు తెలుసుకునేవారు కాదు. పంట పండించేందుకు విపరీతంగా ఖర్చుపెట్టేవారు కానీ.. వాటిని సక్రమంగా విక్రయించుకునే మార్గాలేంటో తెలుసుకునే అవకాశం ఉండేది కాదు. దాంతో వారు తమ పంట ఉత్పత్తులను వచ్చిన దానితోనే తృప్తి పడి తక్కువ ధరకే మధ్య దళారులకే ఇచ్చేసేవారు. దళారులను నమ్మి రైతులు ఎలా నష్టపోతున్నారో వారికి అర్థమయ్యే విధంగా ఉదాహరణలతో సహా వివరంగా చెప్పి, రోజారెడ్డి రైతులందరి వద్ద ఎంతో విశ్వాసం సంపాదించుకుంది.ఆర్గానిక్‌ వ్యవసాయం మొదలుపెట్టినప్పటి నుంచి రోజారెడ్డి మూడేళ్లలో అంటే 2021లో తమ పొలానికి ఆర్గానిక్ సర్టిఫికేసన్‌ సంపాదించింది. పంటలకు నీటి సరఫరా సక్రమంగా అందించేందుకు రోజారెడ్డి తమ పొలంలో డ్రిప్‌ ఇరిగేషన్‌ ఏర్పాటు చేసింది. ఆరు ఆవులను కొనుగోలు చేసిన రోజారెడ్డి వాటి పేడ, గోమూత్రంతో జీవామృతం, ఆర్గానిక్‌ ఎరువు, నీమాస్త్ర, అగ్నిఅస్త్ర లాంటి ఆర్గానిక్‌ పురుగుమందులను తయారు చేసి, వ్యవసాయంలో వినియోగించింది.

కూరగాయలతో పాటు జామ, అరటి, దానిమ్మ తదితర పండ్ల జాతి మొక్కల్ని కూడా రోజారెడ్డి చక్కగా సాగుచేస్తోంది. తమ ఉత్పత్తులకు స్థానికంగానే కాకుండా మంగళూరు, మణిపాల్‌, ఉడుపి, బెంగళూరుల్లో కూడా వినియోగదారుల నుంచి మంచి గిరాకి ఉంది. ఆయా ప్రాంతాల్లో తమ ఉత్పత్తులను వినియోగదారులకు సకాలంలో సరఫరా చేయడం కోసం రోజారెడ్డి ఒక వ్యాన్‌ కొనుగోలు చేయడమే కాకుండా మరో రెండు వాహనాల్ని అద్దెకు తీసుకుంది. వినియోగదారులు తమకు కావాల్సిన వాటిని ఆర్డర్ పెట్టేందుకు వీలుగా రోజారెడ్డి ఓ యాప్‌ రూపొందించింది. అలా ఇప్పటికే 500 మంది వినియోగదారులు యాప్‌ ద్వారా ఆర్డర్లు పెడుతున్నారు. వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోందని రోజా సంతోషంగా వెల్లడించింది. మంగళూరు, బెంగళూరుల్లో తన ఉత్పత్తులను విక్రయించేందుకు మూడు రిటైల్‌ అవుట్‌ లెట్లతో టైఆప్ అయింది. వాటిలో వారంలో మూడు, నాలుగు సార్లు 1500 కిలోల చొప్పున కూరగాయల విక్రయం జరుగుతోంది. అలా 2021-22 సంవత్సరంలో రోజారెడ్డి ఆదాయం కోటి రూపాయలకు చేరింది. 2021లో రోజారెడ్డి తమ పంట ఉత్పత్తుల విక్రయం కోసం ‘నిసర్గ నేటివ్ ఫార్మ్‌’ పేరిట సొంత బ్రాండ్‌ ఏర్పాటు చేసుకుంది.

ఆర్గానిక్‌ సాగులో తనకు సహాయం చేసేందుకు, ఉత్పత్తులను శుభ్రం చేసేందుకు, సార్టింగ్ చేసి, ప్యాకింగ్‌ చేసేందుకు 20 మందిని నియమించుకుంది. తన పంట ఉత్పత్తులే కాకుండా.. ఇతర రైతులు కూడా తనతో పాటుగా తమ పంటల్ని విక్రయించుకునేందుకు కలిసిరావాలని కోరింది. అలా సుమారు 20 మంది వరకు ఇతర రైతులు రోజారెడ్డితో కలిసి తమ తమ పంటల్ని అమ్ముకుని చక్కని ఆదాయాలు సంపాదిస్తున్నారు.

రోజారెడ్డి ఇప్పటికీ ప్రతిరోజూ కనీసం ఎనిమిది గంటల పాటు పొలంలో పనిచేస్తూ ఉంటుంది. మంచి జీతం, ఎయిర్‌ కండిషన్ గదుల్లో చేసే జాబ్‌ వదిలేసి, ఆర్గానిక్‌ వ్యవసాయం చేస్తున్న రోజారెడ్డి చాలా సంతోషంగా ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here