పందిరి బీర సాగు లాభదాయకంగా ఉందని మేడ్చల్ జిల్లా షామీర్ పేట మండలం బాబాగూడకు చెందిన రైతు సురేందర్ రెడ్డి చెబుతున్నాడు. ఇతర కూరగాయల పంటల కన్నా పందిరి బీర సాగులో కాస్త ఖర్చు, పని ఎక్కువే అయినా దిగుబడి అధికంగా ఉంటుందని, దాంతో లాభదాయకం అని సురేందర్ రెడ్డి అంటున్నాడు. సాగు చేయాలనే ఉత్సాహం ఉండే యువ రైతులకు కూడా బీరసాగు అనువైనదని సురేందర్ రెడ్డి అంటున్నాడు. పెద్ద పెద్ద చదువులు చదివిన వారు యువకులు ఇప్పుడు అనేక గ్రామాల్లో వ్యవసాయం చేస్తుండడం హర్షించదగ్గ విషయం అని చెబుతున్నాడు. చదువుకున్న యువత పంటల సాగులో పాలీ హౌస్ లాంటి కొత్త కొత్త విధానాలు అవలంబిస్తే.. మరింత లాభదాయకంగా ఉంటుందన్నాడు.సురేందర్ రెడ్డి తన పొలంలో బీర, కాకర పండిస్తున్నాడు. ఏప్రిల్ మొదటి వారంలో కాకర పెడతాడు. కాకర పంట అయిపోయాక అక్టోబర్ నెలలో రెండో పంటగా బీర పెడతాడు. బీర పాదుల కోసం పందిర్లు వేస్తాడు. బాబాగూడలో 4 నుంచి 5 వందల ఎకరాల్లో పందిరి బీర సాగు చేస్తారని సురేందర్ రెడ్డి వెల్లడించాడు.బీర పంటను పందిరి విధానంలో సాగు చేస్తే ప్రభుత్వం ఎకరాకు లక్ష రూపాయలు సబ్సిడీ ఇస్తోందని, అంతకు ముందు ఎకరాకు 60 వేలు మాత్రమే ఇచ్చేదని తెలిపాడు. బీరసాగులో మల్చింగ్ కవర్, డ్రిప్ గ్రోమోర్, కాని ఇతర సంస్థల మల్చింగ్ కవర్ వేస్తే ఒక పంట వరకే పనిచేస్తోందని, అందుకే మల్చింగ్ ఇండియా సంస్థ మల్చింగ్ కవర్ వేస్తున్నామని వివరించాడు.
ఎకరం పోలంలో బీర పంట పది టన్నులు ఆ పైన వస్తే.. ఖర్చులు పోగా మిగులు కనిపిస్తుందని సురేందర్ రెడ్డి చెప్పాడు. అంతకు తక్కువ దిగుబడి వస్తే కష్టంగా ఉంటుందన్నాడు. బీర కిలోకు 40 రూపాయలు ధర వస్తే.. లాభదాయకం అన్నాడు. బీర సాగుకు మందులు, స్ప్రే మందుల ఖర్చు ఎక్కువగా ఉంటుందని సురేందర్ రెడ్డి వివరించాడు. వాతావరణం హెచ్చుతగ్గులైనా తోట నిలకడ ఉండదన్నాడు.
బీర విత్తు నాటినప్పటిన రోజు మొదలు 45 రోజుల నుంచి కోతకు వస్తుందన్నాడు. అప్పుడు మొదలు 75 నుంచి 120 రోజుల దాకా బీర పంట కోస్తూనే ఉండొచ్చనాడు. కోతకు వచ్చింది మొదలు రెండు నెలల పాటు దిగుబడి వస్తుందని సురేందర్ రెడ్డి తెలిపాడు. రెండు నెలల పాటు రెండు మూడు రోజులకోసారి బీర పంటను కోస్తుంటామన్నాడు. ఒక్కో కోతకు ఎకరా నుంచి 10 నుంచి 15 టన్నుల దాకా దిగుబడి వస్తుందని తెలిపాడు. కోత కోతకు ఆ మేరకు దిగుబడి వస్తేనే తాము పెట్టిన ఖర్చులకు గిట్టుబాటు ఉంటుందన్నాడు. బీర సాగులో ఎకరా మీద సుమారు 2 లక్షల రూపాయల దాకా ఆదాయం వస్తుందన్నాడు. కొందరు రైతులకు అంతకన్నా ఎక్కువ దిగుబడి వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయన్నాడు. ఎకరాలో 15 నుంచి 20 టన్నుల దిగుబడి కూడా తీసిన రైతులున్నారన్నాడు.
బీర సాగుకు మెయింటెనెన్స్ ఎక్కువగానే ఉంటుందని సురేందర్ రెడ్డి తెలిపాడు. మెయింటెనెన్స్ సరిగా లేకపోతే పంట పాడయ్యే ప్రమాదం ఉందని చెప్పాడు. బీర సాగు చేసే వారు ఏమాత్రం అశ్రద్ధ చేయకూడదని హెచ్చరించాడు. బీర పాదులకు ఆముదపు పిండి, వేప పిండి, నువ్వుల కేక్, పల్లి కేక్ వేస్తామన్నాడు. ఆయా పిండిలు, కేక్ లు వేస్తే.. బీరకాయ మంచి పచ్చ రంగులో ఉంటుందన్నాడు. అలాంటి బీరకాయలు వినియోగించిన కస్టమర్లు సంతోషంగా ఉంటారన్నాడు. పురుగు మందులు ఎక్కువగా వాడకుడా వేపనూనె లాంటి క్రిమి సంహారకాలు వాడిన పంట మరింత బాగుంటుందన్నాడు. సాధారణంగా చలికాలంలో బీర పంట ఉండదని, అయితే.. పిండిలు, కేక్ లు వాడితే డిసెంబర్, జనవరి నెలల్లో కూడా బీర పంట వచ్చే అవకాశం ఉందని సురేందర్ రెడ్డి తెలిపాడు.
బీర పంటను తాము హైదరాబాద్ బోయిన్ పల్లి హోల్ సేల్ మార్కెట్ కు పంపిస్తామని సురేందర్ రెడ్డి చెప్పాడు. ఒక్కోసారి మార్కెట్ లో రేటు 30కి, 20 రూపాయలకు కూడా పడిపోతుందని, అలాంటప్పుడు దిగుబడి ఎక్కువ వచ్చినా తమకు వర్కవుట్ కాదన్నాడు. వర్షాలు ఎక్కువ కురిసినప్పుడు, బయటి నుంచి బీర కాయలు రానప్పుడు కిలో 40 రూపాయల ధర పలుకుతుందన్నాడు. ఒక్కోసారి 15 రూపాయలు కూడా రావచ్చన్నాడు. డిమాండ్ భారీగా ఉంటే.. 100 రూపాయలు కూడా తమ బీరకు ధర వస్తుందని సురేందర్ రెడ్డి తెలిపాడు.
బీర సాగును తాము నాన్ ఆర్గానిక్ విధానంలో చేస్తున్నామని సురేందర్ రెడ్డి తెలిపాడు. ఆర్గానిక్ విధానంలో బీర సాగు చేయాలంటే.. ప్రభుత్వం సబ్సిడీలో వేప పిండి ఇస్తే.. బాగుంటుందని చెబుతున్నాడు. ఆర్గానిక్ విధానానికి ప్రభుత్వం సబ్సిడీ ఇవ్వడం లేదని అన్నాడు. బీర సాగు చేసే ఎస్సీ, ఎస్టీలకు ప్రభుత్వం సబ్సిడీ ఇస్తోందని, మిగతా రైతులకు ఇవ్వడం లేదని సురేందర్ రెడ్డి తెలిపాడు. మల్చింగ్ కవర్ కు, పందిరి వేయడానికి, డ్రిప్ కోసం గతంలో ప్రభుత్వం సబ్సిడీ బాగానే ఇచ్చేదని ఇప్పుడు తగ్గించిందని చెప్పాడు. మల్చింగ్ కవర్ కోసం ఎకరాకు 10 నుంచి 20 దాకా ఖర్చు అవుతుందని సురేందర్ రెడ్డి వెల్లడించాడు.
బీరపాదును నేల మీద పాకిస్తే.. కాయలు వంకరలు వచ్చేవని, పందిరిపై పెంచితే నాణ్యత, సైజ్ కూడా పెరుగుతాయని, మంచి పచ్చ రంగు వస్తుందని సురేందర్ రెడ్డి వివరించాడు. పందిరిపై పెరిగే బీరకు డిసీజ్ లు, దోమల బెడద తక్కువ ఉంటుందన్నాడు. బీరకు చీడ పీడలు, దోమల బెడద వచ్చినప్పుడు రక రకాల మందులు కొట్టినా ఉపయోగం ఉండదని, వైరస్ ఎక్కువైపోయి తోటలకు తోటల్నే పీకేసిన సందర్భాలు ఉన్నాయన్నాడు. అందుకే కొత్తగా క్రాప్ గార్డ్ పేరిట ఎల్లో, బ్లూ కవర్లను బీరకాయలకు తొడుగుతున్నామని, కవర్ పైగ గమ్ రుద్దుతున్నామన్నాడు. చీడపీడలు, దోమలు ఆ గమ్ కు అతుక్కుపోతాయన్నాడు. దాంతో క్రిమి సంహారక మందుల స్ప్రేయడం తక్కువ అవుతోందన్నాడు. క్రాప్ గార్డ్ లు వాడడం వల్ల పంట నిలకడగా వస్తోందన్నాడు.
వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడు బీర విత్తనం కోనేందుకు సబ్సిడీ ఇచ్చేవారని, ఇప్పుడు తెలంగాణ సర్కార్ సబ్సిడీ ఎత్తేసిందని సురేందర్ రెడ్డి తెలిపాడు. దాంతో ఇప్పుడు కిలో బీర విత్తనాలు 8 వేల రూపాయలు అవుతోందన్నాడు. తెలంగాణ ప్రభుత్వం వచ్చాక విత్తనాల మీద సబ్సిడీ ఎత్తేశారన్నాడు. రైతులు విత్తనాలు కొనేందుకు ప్రభుత్వం మరింత ప్రోత్సాహం ఇవ్వాలన్నాడు. అయితే.. అలాంటి ప్రోత్సాహం ఇప్పుడు లేదని విచారం వ్యక్తం చేశాడు. విత్తనాల కోనేందుకు ప్రభుత్వం సబ్సిడీ లాంటి సౌకర్యాలు కల్పిస్తే మరింత మంది రైతులు బీర సాగు చేయడానికి ఉత్సాహంగా ముందుకు వస్తారన్నాడు. టమోటా, ఆనపకాయ, బీర ఇలా ఏ కూరగాయ పండించాలన్నా అన్ని రకాల విత్తనాలకు సబ్సిడీ ఇస్తే బాగుంటుందన్నాడు. అప్పుడే స్థానికంగానే కూరగాయల పంటలు ఎక్కువ వస్తాయని, బయటి రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకోవాల్సిన అవసరం ఉండదని చెప్పాడు.
జిల్లాకు రెండు మూడు కోల్డ్ స్టోరేజ్ లు ఏర్పాటు చేస్తే.. ధర తక్కువ ఉన్నప్పుడు అందులో నిల్వ చేసుకుని కాస్త ధర పెరిగిన తర్వాత అమ్ముకునే సౌలభ్యం రైతులకు ఉంటుందని సురేందర్ అన్నాడు.
పందిరి బీరపాదుల కోసం వేసే పందిరికి ఎకరాకు కనీసం రెండున్నర లక్షల రూపాయల దాకా ఖర్చు వస్తుందని సురేందర్ రెడ్డి అన్నాడు. ప్రభుత్వం లక్ష రూపాయలు సబ్సిడీ ఇచ్చినా ఇంకా లక్షన్నర వరకూ రైతు పెట్టుబడి పెట్టుకోవాలన్నాడు. మొత్తానికి పందిరి బీర సాగును జాగ్రత్తగా చేస్తే అధిక ఆదాయం, ఎక్కువ లాభాలే వచ్చే అవకాశాలు ఉన్నాయని సురేందర్‌రెడ్డి చెప్పాడు.