కరోనా వైరస్‌ ప్రపంచం మొత్తాన్నే అతలాకుతలం చేసింది. మనుషుల్లో తమ మీద, తమ ప్రాణం మీద అభిమానాన్ని, ఆశను పెంచింది. కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలకు లాక్‌డౌన్‌ రుచి చూపించింది. అయితే.. ఈ లాక్‌డౌన్ సమయం ఎంతో మంది సెలబ్రిటీలను ప్రకృతి వైపు, ప్రకృతి పంటల వైపు అడుగులు వేయించింది. పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తున్న అనేక మంది వర్క్‌ ఫ్రం హోం కారణంగా సహజ పంటలు పండించడం ఓ హాబీగా, అవసరంగా మార్చుకున్నారు. దీంతో ఖర్చు తగ్గించుకోవడమే కాకుండా.. ఆరోగ్యకరమైన పండ్లు, కూరగాయలు ఇంటి వద్దనే పండించుకుంటున్నారు.

ఇదే కరోనా లాక్‌డౌన్‌ కాలం పలువురు బాలీవుడ్‌, టాలీవుడ్‌, కోలీవుడ్‌, శాండిల్‌వుడ్‌ నటీ నటులు పెరట్లో లేదా తమ ఇళ్ల పైభాగాల్లో సహజ పంటలు పండిస్తున్నారు. ఆర్గానిక్ పంటలు పండిస్తున్నారు ఒకప్పటి బాలీవుడ్‌ నటిమణి ప్రీతీ జింటా. ‘ఘర్‌ కి ఖేతీ’ లేదా కిచెన్‌ గార్డెన్ పేరుతో తాను చేస్తున్న ఆర్గానిక్‌ వ్యవసాయం, అందులో తాను పండించిన పంటల గురించి ఎప్పటికప్పుడు సోషల్‌ మీడియా ఇన్‌స్టాగ్రామ్‌లో ఫొటోలతో సహా పోస్టులు పెడుతుంటారు.తన భర్త జేన్‌ గుడ్‌ఇనహ్‌తో కలిసి ప్రీతి జింటా ప్రస్తుతం అమెరికాలోని లాస్‌ ఏంజిల్స్‌లో నివాసం ఉంటున్నారు. ఈ లాక్‌డౌన్ సమయంలో తాను తన పెరట్లో ఆర్గానిక్‌ విధానంలో టమాటా, పచ్చిమిర్చి, కాప్సికమ్‌, పలురకాల ఆకుకూరల్ని తన కిచెన్‌ గార్డెన్‌లోనే పండిస్తున్నారు. ఇంటివద్దే తనకు సహజసిద్ధమైన పంటలు పండించడం తన తల్లి నేర్పించారని ప్రీతి జింటా చెబుతున్నారు. ప్రకృతికి దగ్గరగా జీవించడం తనకు నేర్పిన తన తల్లికి ప్రీతి జింటా కృతజ్ఞతలు చెప్పారు. కిచెన్ గార్డెన్‌లో తాను పండించిన నిమ్మకాయలు, టమాటా, కాప్పికమ్‌, పచ్చిమిర్చిని చూసి ఎంతగానో మురిసిపోతున్నారు ప్రతీజింటా. తాను పండించిన సహజ పంటలు త్వరలోనే తన కిచెన్‌లోకి చేరతాయంటూ ఆనందాన్ని వ్యక్తం చేశారు.
తమ కిచెన్‌ గార్డెన్‌లో పండించిన పంటలంటే తనకు ఎంతో ఇష్టమని ప్రీతి జింటా అంటున్నారు. లాక్‌డౌన్ సమయంలో తాను చేసిన ఓ మంచి పని కిచెన్ గార్డెనింగ్ చేయడమని చెబుతున్నారు ప్రీతి. తన కిచెన్ గార్డెన్‌లో పండిస్తున్న పంటల్ని చూస్తే తనకు ఎంతో ఉత్సాహంగా ఉంటుందని, గర్వంగా కూడా అనిపిస్తుందని ప్రీతి జింటా ఆనందంగా చెబుతారు. కిచెన్‌ గార్డెన్‌ ద్వారా తాను ప్రకృతికి చాలా దగ్గరగా ఉంటానని తాను ఎప్పుడూ ఊహించుకోలేదంటారు. తన కిచెన్ గార్డెన్‌లో ఉంటే మనసు ఎంతో ప్రశాంతంగా ఉంటుందని చెబుతారు. ముఖ్యంగా ప్రకృతి సిద్ధంగా పంటలు పండించడంలో ఉండే ఆ ఆనందమే వేరంటారు. కిచెన్‌ గార్డెన్‌లోని మొక్కలకు చేసే ప్రతి పనీ తనకు ఎంతో తృప్తిని ఇస్తుందని ప్రీతి అంటారు. మొక్కలను పెంచేందుకు చేసే ప్రతి పనిలోనూ తాను చెప్పలేనంత ఆనందాన్ని పొందుతున్నానంటారు ప్రీతి. భూమాతకు ఇంత దగ్గరగా ఉంటానని ఎప్పుడు అనుకోలేదని ప్రీతి పేర్కొంటారు.‘దిల్‌ సే’, ’లక్ష్య’, ’సలాం నమస్తే’, ’దిల్‌ చాహతా హై’ లాంటి సినిమాల్లో నటించిన ప్రీతి జింటా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. తెలుగులో కూడా ప్రీతి జింటా కొన్ని చిత్రాల్లో నటించి మెప్పించారు. వెంకటేష్‌తో కలిసి ‘ప్రేమంటే ఇదేరా’ మూవీలో నటించారు. తెలుగులో ‘రాజకుమారుడు’ సినిమాలోనూ ప్రీతి జింటా నటించారు. కొన్ని ఇంగ్లీషు మూవీల్లో కూడా ప్రీతి కనిపించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here