ఆ మారుమూల గ్రామంలో 30 కుటుంబాలు నివసిస్తున్నాయి. ఆ కుటుంబాల నుంచి మొత్తం 20 మంది మహిళలు పుట్టగొడుగుల సాగులో బిజీగా ఉన్నారు. జార్ఖండ్‌ రాష్ట్రం కుంతి జిల్లాలో నక్సలైట్ల ప్రాబల్యం ఎక్కువగా ఉండే గిరిజన గ్రామం సెరెంగ్ధీలోని మహిళలు ఇప్పుడు పుట్టగొడుగుల పెంపకంలో మంచి ప్రావీణ్యం సంపాదించారు. పుట్టగొడుగుల ద్వారా వచ్చే ఆదాయంతో వారు ఆర్థికంగా స్వతంత్రులుగా జీవిస్తున్నారు. పుట్టగొడుగుల పెంపకంలో ఆ మహిళలందరికీ ప్రొఫెషనల్‌ అసిస్టెన్స్‌ ఫర్‌ డెవలప్‌మెంట్‌ యాక్షన్‌ (ప్రధాన్‌) అనే లాభాపేక్ష లేని స్వచ్ఛంద సంస్థ శిక్షణ ఇచ్చింది. గ్రామీణ ప్రాంతాల్లోని మహిళలకు ఇలాంటి శిక్షణను 2016 నుంచి ప్రధాన్‌ ఇస్తోంది.

పుట్టగొడుగుల పెంపకానికి వ్యవసాయ క్షేత్రాలో.. భారీ కమతాలో అవసరం లేదు. ఇంటిలోనో, ఇంటి పరిసరాల్లోనో ఏ కొద్ది స్థలం ఉన్నా పుట్టగొడుగుల సాగును చాలా సులువుగానే చేయొచ్చు. అంతే కాదు పుట్టగొడుగులు, కాయగూరలు, తృణధాన్యాల పంటలు సాగు చేసేందుకు పనిమనుషులతో పెద్దగా పని ఉండదు. సమయం, డబ్బు పెట్టుబడి కూడా అంతగా ఉండదు. దాంతో మహిళలు ఈ పుట్టగొడుగుల సాగు చేయడం ద్వారా ఇంటి అవసరాల్లో తమ వంతు సాయంగా కూడా ఉండొచ్చు.సెరెంగ్ధీ గ్రామానికి చెందిన 34 ఏళ్ల కమలాదేవి తాను పండించిన పుట్టగొడుగులను పావు కిలో చొప్పున ప్యాకింగ్‌ చేసి రాంచి, జంషెడ్‌పూర్‌ లాంటి నగరాల్లో ఒక్కొక్కటి 50 రూపాయల చొప్పున విక్రయిస్తుంది. పుట్టగొడుగుల పెంపకం, విక్రయంలో మంచి పేరు తెచ్చుకున్న కమలాదేవి భర్త కొద్ది సంవత్సరాల క్రితమే మరణించాడు. దీంతో తన కుటుంబానికి చేయూతగా ఉండేందుకు కమలాదేవి తమ ఇంటిలోని ఒక మూలలోనే పుట్టగొడుగుల సాగు చేస్తోంది. అదే గ్రామానికి చెందిన మరో మహిళ ప్రియాంకాదేవి 2018 నుంచీ పుట్టగొడుగుల సాగు చేస్తోంది. ఆమె అనుభవపూర్వకంగా చెబుతున్న మాట ఏమిటంటే.. పుట్టగొడుగుల పెంపకం తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయం తెచ్చిపెడుతుంది అంటోంది. పైగా ఇంట్లోనే ఏదో ఒక మూల కూడా పుట్టగొడుగులు పెంచవచ్చని చెబుతోంది. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో ఇతర ఆదాయ అవకాశాలు అంతగా లభించని వారికి పుట్టగొడుగుల పెంపకంతో ఎంతో ప్రయోజనం అంటోంది.

ఆధునిక జీవన విధానంలో పుట్టగొడుగుల వినియోగం బాగా పెరిగిన ఈ కాలంలో వినియోగదారుల నుంచి డిమాండ్‌ ఎక్కువగానే ఉంటోంది. పుట్టగొడుగుల పెంపకం చాలా సులువు. అమ్మేందుకు మార్కెటింగ్‌ సౌకర్యం కూడా ఎక్కువగానే ఉంది. పైగా జార్ఖండ్‌లోని ముండా, ఒరాఓన్‌ గిరిజనులకు, గిరిజనేతరులకు కూడా పుట్టగొడుగులు సంప్రదాయ ఆహారంగా వస్తోంది. వర్షాకాలంలో సాల్‌ చెట్ల కింద పెరిగే బటన్‌ మష్రూంలు, అరుదుగా లభించే రగ్డ రకాలు కూడా జార్ఖండ్‌ ఆహారపు అలవాట్లలో ముఖ్యమైనవే.నిజానికి సెరెంగ్ధీలో అధిక భాగం బంజరుభూమి. వర్షాలు కురిసినప్పుడు మాత్రమే ఆ భూముల్లో టమోటా, కొద్దిగా ధాన్యం పంటలు పండుతాయి. అంతే తప్ప తమ గ్రామంలో ఇతర పంటలు పండించేందుకు ఆస్కారమే లేదని అంగన్‌వాడి కార్యకర్త కూడా అయిన కమలాదేవి చెప్పింది. దాంతో పాటు తమ గ్రామంలో పంటలకు నీటి వనరులు సమకూర్చడం చాలా ఖర్చుతో కూడిన వ్యవహారం అంటోంది. అలాంటి తమ గ్రామంలో మహిళలు వ్యవసాయాన్ని వృత్తిగా స్వీకరించడం అంటే ఏమాత్రం కుదరదు.

కుంతి తోర్పా సెల్ఫ్‌ హెల్ప్‌ గ్రూపు సభ్యులు 2016లో అగ్రి- హార్టికల్చర్‌ కో ఆపరేటివ్‌ సొసైటీగా ఏర్పాటు చేయడంలో ప్రధాన్ సహాయం చేసింది. కుంతి, ముర్హు, అర్కి, తోర్పా బ్లాక్‌లలో మహిళా సెల్ఫ్‌ హెల్ప్‌ గ్రూపు రిజిస్టరైన సంస్థ. పుట్టగొడుగుల సాగులోను, అందుకు అవసరమైన ముడి సరుకులు, ఇతర వస్తువులు కొనుగోలు చేయడంలో గిరిజన మహిళలకు ఈ కో ఆపరేటివ్‌ సంస్థ సహాయ సహకారాలు అందిస్తుంది. అలాగే తాము ఉత్పత్తి చేసిన పుట్టగొడుగులను నేరుగా విక్రయించుకోలేని వారికి తోడ్పాటు ఇస్తుందని కుంతి ప్రధాన్‌ బృందం కో ఆర్డినేటర్‌ విజయ్‌ కుమార్‌ విరు తెలిపారు. తమ సమయాన్ని, డబ్బును పెట్టుబడి పెట్టేందుకు మహిళలకు చాలా సందేహాలు ఉంటాయి. అయితే.. వారికి సక్రమంగా శిక్షణ ఇస్తే.. తోడ్పాటు అందిస్తే పోషకాలు పుష్కలంగా లభించే పుట్టగొడుగుల పెంపకానికి ముందుకు వస్తారన్నారు. వాస్తవానికి కుంతిలో మహిళలు, పిల్లల్లో హిమోగ్లోబిన్‌ స్థాయిలో పెంచేందుకు ప్రధాన్‌ సంస్థ తన కార్యకలాపాలు ప్రారంభించింది. ఆ ప్రాంతంలో ముఖ్యంగా మహిళలు, పిల్లల్లో రక్తహీన సమస్య చాలా ఎక్కువ. అందుకే వారికి వారే సొంతంగా ఆహారం తయారు చేసుకోవాలని, కొనుక్కునే పద్ధతికి స్వస్థి పలకాలని చెబుతూ వచ్చామని విరు వివరించారు. జాతీయ ఆరోగ్య సర్వే ప్రకారం జార్ఖండ్‌లోని 70 శాతం 6 ఏళ్ల పిల్లల్లోను, 65 శాతం మంది మహిళల్లోను రక్తహీనత ఉంది.ఓయ్‌స్టర్‌ పుట్టగొడుగులు 55 నుంచి 70 శాతం తేమ ఉండి, 20 డిగ్రీల ఉష్ణోగ్రతలో బాగా పెరుగుతాయి. పుట్టగొడుగుల సీజన్‌ ఆగస్టులో ప్రారంభమై మార్చి వరకు కొనసాగుతుందని ప్రియాంక చెబుతోంది. అయితే.. ఇప్పుడు తాము వేసవి కాలంలో కూడా పుట్టగొడుగులు పెంచుతున్నామన్నది. వరిగడ్డిని రెండు అంగుళాల పొడవున ముక్కలుగా కోసుకోవాలి. అలా కోసిన గడ్డి ముక్కల్ని కొన్ని గంటల పాటు వేడినీటిలో నానబెట్టాలి. తర్వాత ఆ గడ్డి ముక్కల్ని 70 శాతం తేమ వచ్చే వరకు గాలిలో ఆరబెట్టాలి. దాన్ని పాలిథిన్‌ సంచుల్లో నింపి, ఆ సంచులకు చిల్లులు కూడా పెట్టాలి. గడ్డి ముక్కలు నింపిన ఆ ప్లాస్టిక్‌ సంచుల్ని గట్టిగా కట్టి 24 నుంచి 30 డిగ్రీల సెల్సియన్‌ ఉష్ణోగ్రత ఉండే తేమతో కూడిన చీకటి ప్రదేశంలో ఉంచాలి. ఆ ప్లాస్టిక్ సంచుల్లోని గడ్డిముక్కలపై 20 రోజుల్లో ఫైబర్‌ ఏర్పాటవుతుంది. మరికొన్ని రోజుల్లో కొద్దికొద్దిగా పుట్టగొడుగుల మొలకలు కనిపిస్తాయి. అలా 35 రోజుల్లో పుట్టగొడుగుల మొదటి పంట చేతికి వస్తుంది. మరో 35 నుంచి 40 రోజుల్లో రెండో పంట కూడా వస్తుంది. అనంతరం మూడోది చివరి పంట కూడా చేతికి వస్తుంది.

పుట్టగొడుగులు పంట వెంటనే అమ్మలేకపోయినప్పుడు వాటిని ఆరబెట్టి దాచి ఉంచుతామని కమలాదేవి చెప్పింది. ఆరబెట్టిన పుట్టగొడుగుల్ని వాడుకునే కొద్ది సమయం ముందు వేడినీటిలో వేసుకోవాలని చెప్పింది. సూప్‌లు, సాస్‌లు లాంటి వంటకాల్లో వాడినప్పుడు.. పుట్టగొడుగులు మరింత రుచిగా ఉంటాయని కమలాదేవి తెలిపింది. తమ గ్రామంలోని ఇంకా ఎందరో మహిళలు ఇప్పుడు పుట్టగొడుగుల పెంపకం ద్వారా చక్కని ఆదాయం సంపాదిస్తున్నారని ప్రియాంకాదేవి వెల్లడించింది.

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here