మునగాకు పంటతో లక్షలాది రూపాయల ఆదాయం సంపాదించడంతో పాటు ప్రపంచ మార్కెట్‌కు మునగాకు పొడిని ఎగుమతి చేస్తూ విదేశీ మారకద్రవ్యాన్ని కూడా సంపాదిస్తున్న కొందరి గురించి గతంలో తెలుసుకున్నాం కదా.. ఇప్పడు ఉష్ణోగ్రత అధికంగా ఉండే.. నీటి సదుపాయం కూడా అంతగా ఉండని ప్రకాశం జిల్లాలో మునగకాయ పంటతో మంచి లాభాలు ఆర్జిస్తున్న కొందరు రైతుల గురించి తెలుసుకుందాం. రైతులకు మంచి శిక్షణ ఇచ్చి, ప్రోత్సహిస్తున్న సేవ్‌ ఇండియన్ ఫార్మర్స్‌ (సిఫ్‌) కృషిని కూడా తెలుసుకుందాం.

మునగ పంట ఏడాది పొడవునా చేతికి వస్తూనే ఉంటుంది. అనావృష్టి ఉండే ప్రకాశం జిల్లాలో సిఫ్‌ కృషి ఫలితంగా ఇప్పుడు మునగపంట నిత్యం కనిపిస్తూ ఉంటుంది. మొక్కలు నాటిన ఆరు నెలల నుంచి మునగ పంట ప్రారంభం అవుతుంది. ఎనిమిది నుంచి తొమ్మిది సంవత్సరాల వరకూ మునగ పంట వస్తూనే ఉంటుంది. మునగ సాగు కూడా ఎంతో సులువు. ఇతర పంటల సాగులా కాకుండా మునగసాకుకు కొద్ది సమయమే సరిపోతుంది. మునగ చెట్టులోని ప్రతి దానితోనూ ఎంతో ఉపయోగం ఉంది. మనిషి ఆరోగ్యానికి, జీవనానికి అవసరమయ్యే మునగ ఆకులో ప్రొటీన్లు, కార్పొహైడ్రేట్లు, విటమిన్‌ ఏ, విటమిన్‌ సీ, మినరల్స్‌ పుష్కలంగా ఉంటాయి. మునగ పువ్వులో రుచికరమైనవే కాకుండా న్యూట్రిషన్ల కూడా ఉండే ఎంతో విలువైన పదార్థాలు లభిస్తాయి. మునగపువ్వుల రసానికి బ్యాక్టీరియా జబ్బులను నయం చేసే గుణం ఉంది.

మునగకాయల సాగుతో పాటు అంతర పంటలుగా టమోటా, అలసంద, బెండ లాంటి పంటలు కూడా పండించి, మరింతగా లాభాలు ఆర్జించవచ్చు. వాటితో పాటు కొబ్బరి మొక్కలు, మిర్చి, బీన్స్‌, దానిమ్మ, జామ మొక్కల్ని కూడా మునగ చెట్లతో పాటుగా పెంచుకోవచ్చు. హోల్‌ సేల్‌ మార్కెట్లో కిలో మునగ కాయలకు రూ. 10 నుంచి రూ. 50 వరకు ధర పలుకుతుంది. మునగకాయ దిగుబడితో ఏటా లక్షల రూపాయల ఆదాయం లభిస్తుంది.

తమ భూమి స్వభావం గురించి స్పష్టంగా తెలుసుకునేంత చదువు రైతులకు ఉండరు. తమ భూముల్లో పంటలు పండిస్తారు కానీ.. అదే నేలలో సమర్థవంతమైన పంటలు పండించడంపై వారు అంతగా శ్రద్ధ పెట్టరు. తాము ఎప్పుడూ వాడే విత్తనాలు, ఎరువులు మాత్రమే వినియోగిస్తారు. వాటిని మార్చాలంటే భయపడిపోతారు. అందుకు వారి వద్ద చాలినంత డబ్బు, తగిన మార్గదర్శకత్వం లేకపోవడం కూడా సాగుబడిలో మార్పులు చేయడానికి ముందుకు రారు. అలాంటి వానిరి సిఫ్‌ చక్కని మార్గనిర్దేశనం చేస్తోంది. నీటి సౌకర్యం అంతగా లేని భూముల్లో కూడా చక్కని పంటలు సాగు చేసేలా, తద్వారా మంచి లాభాలు ఆర్జించేలా చేస్తోంది. సిఫ్‌ మార్గనిర్దేశనంలో విజయాలు సాధించి, అప్పులతో అల్లాడిపోయే స్థితి నుంచి, డ్రిప్ ఇరిగేషన్ విధానంలో మునగకాయల పంట గురించి, మునగ పంటతో ఆర్థికంగా ఉన్నత సాధించిన కొందరు రైతుల గురించి సిఫ్‌ ఆంధ్రప్రదేశ్‌ విభాగం కో ఆర్డినేటర్‌ నాగిరెడ్డి ప్రభాకర్‌ రెడ్డి మాటల్లో తెలుసుకుందాం.ఇరిగల బ్రహ్మారెడ్డి: వెంకటాపురం గ్రామానికి చెందిన ఇరిగల బ్రహ్మారెడ్డికి మూడు ఎకరాల మెట్ట భూమి ఉంది. సిఫ్‌ ఇచ్చిన శిక్షణ అనంతరం డ్రిప్ ఇరిగేషన్‌ మునగ పంట సాగు చేసిన బ్రహ్మారెడ్డి ఇప్పుడు మునగపంటకు ఓ మోడల్‌ రైతుగా మారిపోయాడు. 40 డిగ్రీల ఉష్ణోగ్రతలో కూడా బ్రహ్మారెడ్డి బ్రహ్మాండమైన పంట దిగుబడి సాధిస్తున్నాడు. మునగపంట చేతికి వచ్చిన తొలి ఏడాదే బ్రహ్మారెడ్డి లక్ష రూపాయల సంపాదించాడు. మరుసటి ఏడాది భూమిలో నీటి స్థాయిలు తగ్గిపోయినప్పటికీ కూడా మరో లక్ష రూపాయలు కళ్ల జూశాడు. తనను మునగపంట సాగుచేసేలా ప్రోత్సహించిన సిఫ్‌ సంస్థకు బ్రహ్మారెడ్డి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాడు.చక్కర భూపాల్‌ రెడ్డి: ప్రకాశం జిల్లాలో రెండెకరాల భూమి ఉన్న భూపాల్‌రెడ్డి కూడా ఇతర రైతులకు ఉదాహరణగా నిలిచే రైతే. సిఫ్‌ నుంచి సూచనలు, సలహాలు తీసుకుని తన పొలంలో క్రాస్‌ కల్టివేషన్ విధానంలో మునగతో పాటుగా మిర్చి, బీన్స్‌ పంటలు వేశాడు. 2019 జనవరిలో తన రెండెకరాల్లో 2 వేల కిలోల మునగకాయలు దిగుబడి సాధించాడు. మునగ సాగు కోసం రూ.35 వేలు పెట్టుబడి పెట్టిన భూపాల్‌రెడ్డి లక్షా 30 వేల రూపాయల ఆదాయం సంపాదించాడు. డ్రిప్‌ ఇరిగేషన్‌ విధానంలో సిఫ్‌ తనకు ఇచ్చిన శిక్షణతో ఇదంతా సాధించానని, అప్పులన్నీ తీరిపోయాయని భూపాల్ రెడ్డి సంతోషంగా చెప్పాడు.వెంకటేశ్వర్లు: అత్యంత పేదరికంలో మగ్గిపోయే వెంకటేశ్వర్లు కూడా మునగాపంట సాగు తర్వాత విజేతగా నిలిచాడు. వాస్తవానికి తన కుటుంబానికి సరైన ఆహారం కూడా సమకూర్చలేని పేదరికంలో ఉండేవాడట. ఆర్థిక ఇబ్బందుల వల్ల తమ పొలాన్ని పంట ఏదీ వేయకుండా బీడుగా వదిలిపెట్టేయాలనుకున్నాడట. అయితే.. సిఫ్‌ ఇచ్చిన ప్రోత్సాహం, శిక్షణ కారణంగా మునగపంట సాగు చేశానని, ఇప్పుడు తన కుటుంబం పస్తులు ఉండకుండా కడుపు నిండా తినగలుగుతోందని చెప్పాడు. తన రెండు ఎకరాల్లో మునగపంట సాగు కోసం 35 వేలు ఖర్చు పెట్టగా తొలిసారి 35 వేల రూపాయల లాభం వచ్చిందట.సెట్టివారి శ్రీను: ప్రకాశం జిల్లా గిద్దలూరుకు చెందిన సెట్టివారి శ్రీనుకు ఎకరం నర పొలంలో సిఫ్‌ సూచనలు, సలహాలతో మునగపంట డ్రిప్ ఇరిగేషన్‌ విధానంలో సాగుచేశాడు. మునగ మొక్కలు నాటిన ఆరు నెలల్లో మూడు నాలుగు దఫాలుగా మునగకాయల్ని మార్కెట్‌లో విక్రయించాడట. తద్వారా తన పెట్టుబడి ఖర్చులు పోగా 80 వేల రూపాయల లాభం కూడా వచ్చిందన్నాడు. మునగ కాయలకు మార్కెట్‌లో ఉన్న ధర ఆధారంగా ప్రతిసారి 25 నుంచి 35 వేల రూపాయల దాకా ఆదాయం వస్తోందన్నాడు.నారాయణరెడ్డి: రెండు ఎకరాలు ఉన్న నారాయణరెడ్డి కుటుంబం ఇంతకు ముందు ఆర్థికంగా చాలా కష్టాలు పడేదట. అయితే.. సిఫ్‌ పరిచయం అయ్యాక తమ పొలంలో మునగ సాగు చేయడంతో తమ జీవితాలే మారిపోయాయని సంతోషంగా చెప్పాడు నారాయణరెడ్డి. 2019 నుంచీ నారాయణరెడ్డి తాను పండించిన మునగపంటను స్థానిక మార్కెట్లో విక్రయిస్తున్నాడు.

ఎందరో రైతులకు సేవ్‌ ఇండియా పార్మర్స్‌ సంస్థ చేదోడువాదోడుగా ఉంటోంది. ఎన్నో పోషక విలువలున్న మునగపంట దిగుబడులు వారు సాధించేలా సహాయం చేస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here