‘లడ్డూ కావాలా.. నాయనా…’ అంటూ ఓ సినిమాలో అన్నట్లు.. త్వరలోనే ‘డ్రాగన్‌ ఫ్రూట్‌ కావాలా నాయనా..’ అనే రోజులు వచ్చే అవకాశాలున్నాయి. డ్రాగన్‌ ఫ్రూట్‌ లో పోషకాలు పుష్కలంగా లభిస్తాయి. మిగతా పండ్ల కన్నా కాస్త ఖరీదు ఎక్కువే అయినా.. దీనిలో లభించే పోషకాల గురించి వింటే.. శెభాష్‌ అనక మానరు. ఇప్పుడిప్పుడే భారత దేశంలో మరీ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఈ డ్రాగన్ ఫ్రూట్ల గురించి ప్రజల్లో అవగాహన కలుగుతోంది. ఈ క్రమంలోనే అనేక నగరాలు, పట్టణాల్లోని అనేక ఫ్రూట్‌ స్టాళ్లలోనూ, రోడ్ల పక్కన కూడా గన్‌ ఫ్రూట్లు అమ్మకానికి దొరుకుతున్నాయి. డ్రాగన్ ఫ్రూట్‌ కాక్టస్‌ జాతికి చెందిన మొక్క. తెలుగులో ఈ జాతి మొక్కల్ని బ్రహ్మజెముడు అని కూడా అంటారు.

డ్రాగన్‌ ఫ్రూట్‌ లో కేలరీలు తక్కువ ఉంటాయి. ఖనిజాలు, పీచు పదార్థమూ, ఐరన్‌, ప్రొటీన్లు, పిండి పదార్తాలు, మెగ్నీషియం, విటమిన్‌ సీ. విటమిన్‌ ఇ, కెరోటినాయిడ్లు, పాలీఫెనాల్స్‌ వంటి పోషక పదార్తాలు ఇందులో ఎక్కువగా ఉంటాయి. గుండె జబ్బులు, కేన్సర్‌, సుగర్‌ వ్యాధి ఉన్న వారు డ్రాగన్‌ ఫ్రూట్‌ తింటే అందులో సహజంగా ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ఎంతో మేలు చేస్తాయని పరిశోధనల్లో తేలింది. డ్రాగన్‌ ఫ్రూట్‌ తినే వారికి రోగ నిరోధక శక్తి పెరుగుతుందంటున్నారు.ఆరోగ్యాన్ని, ఆదాయాన్ని బాగా అందించే డ్రాగన్‌ ఫ్రూట్‌ పంట పండించేందుకు పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసేవారు, విదేశాల్లో మంచి జీతాలు సంపాదించే వారు, చివరికి వృద్ధులు కూడా ఇప్పుడిప్పుడే డ్రాగన్‌ ఫ్రూట్‌ పంట పండించేందుకు బాగా ఆకర్షితులు అవుతున్నారు. అలాంటి వారిలో కేరళకు చెందిన 72 ఏళ్ల జోసెఫ్‌ ఒకరు. పుష్కలంగా పోషకాలు లభించడంతో పాటు, ఖరీదు ఎక్కువ కూడా డ్రాగన్‌ పంట పండించే రైతుగా జోసెప్‌ ను మార్చేశాయి. నిజానికి జోసెఫ్‌ అమెరికా వెళ్లినప్పుడు ఓసారి డ్రాగన్ ఫ్రూట్‌ తిన్నారట. దాని రుచికి జోసెఫ్‌ ఫిదా అయిపోయారట. ఏడేళ్ల క్రితమే జోసెఫ్‌ అమెరికలో డ్రాగన్‌ ఫ్రూట్‌ ను 7 డాలర్లకు కొని తిన్నానని చెప్పారు.నిజానికి జోసెఫ్‌ గతంలో హైదరాబాద్‌ లో మెషిన్‌ టూల్‌ పరిశ్రమ నిర్వహించేవారు. ఇప్పుడాయన విరామ జీవితం గడిపేందుకు తన సొంతూరు కొట్టాయం సమీపంలోని చెంగనస్సెరీ వెళ్లి స్థిరపడ్డారు. అయినప్పటికీ డ్రాగన్ ఫ్రూట్‌ ఆయనను మళ్లీ తీరిక లేని సక్సెస్‌ ఫుల్‌ రైతుగా మార్చేసింది.  ఈక్వెడార్‌, తైవాన్‌, బ్రెజిల్‌, ఫిలిప్పీన్స్‌, ఆస్ట్రేలియా, అమెరికా తదితర దేశాల నుంచి డ్రాగన్‌ మొక్కలు తెప్పించిన జోసెఫ్‌ ముందుగా తన ఇంటి ఆవరణలోని అర ఎకరం స్థలంలో నాటారు. అలా ఇప్పుడాయన 100 రకాల డ్రాగన్‌ ఫ్రూట్‌ మొక్కల్ని పెంచుతున్నారు. వివిధ రకాల డ్రాగన్‌ ఫ్రూట్‌ మొక్కలతో జోసెఫ్‌ ఇంటి ఆవరణ ఎంతో చూడముచ్చటగా ఉంటుంది. జోసెప్‌ తనకు నచ్చిన కొన్ని డ్రాగన్ మొక్కల్ని సంకరం చేసి, 10 కొత్త వంగడాలను రూపొందించేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నారు.

డ్రాగన్  ఫ్రూట్‌ పూత వచ్చిన 65 రోజులకు కోతకు వస్తుంది. జోసెఫ్‌ పండిస్తున్న 100 రకాల డ్రాగన్‌ ఫ్రూట్లలో జేకే 1 పటోరా 2 రకం అన్నింటికన్నా తియ్యగా ఉంటుంది. ఇప్పుడు జోసెఫ్‌ తన నర్సరీలోని రంగు, రుచిని బట్టి ఒక్కో డ్రాగన్‌ మొక్కను వంద నుంచి 4 వేల రూపాయల దాకా అమ్ముతుంటారు.

ఇక ఈ యువ రైతు గురించి తెలుసుకుంటే ఆశ్చర్యం కలగక మానదు. ఈ యువకుడు మంచీ జీతం, జీవితాన్ని వెతుక్కుంటూ విదేశాలకు వెళ్లాడు. వెళ్లిన అతను మళ్లీ వెనక్కి వచ్చేశాడు. వ్యవసాయం చేస్తానని చెప్పగానే తన కుటుంబ సభ్యులు, మిత్రులు, శ్రేయేభిలాషులు కూడా పిచ్చోడన్నారు. ప్రస్తుత కాలంలో వ్యవసాయం ఏమాత్రం లాభదాయం కాదుకదా.. కనీసం పెట్టుబడి కూడా వచ్చే అవకాశాలు తక్కువని నిరాశపరిచారు. అయినప్పటికీ తాను అనుకున్నది చేశాడు హర్యానాలోని కర్నాల్‌ కు చెందిన కులదీప్‌ రాణా. డ్రాగన్‌ ఫ్రూట్‌ పంట పండిస్తున్నాడు.  లక్షల సంపాదించడమే కాకుండా అనేక మంది రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నాడు. కులదీప్‌ రాణా 2019లో విదేశాల నుంచి తిరిగి వచ్చేశాడు. 50 సెంట్లలో డ్రాగన్‌ సాగు ప్రారంభించాడు. గత మూడేళ్లలో 7 నుంచి 8 లక్షల రూపాయల ఆదాయం సంపాదించాడు. దాంతో తన సాగు విస్తీర్ణాన్ని ఇప్పుడు రెండు ఎకరాలకు పెంచాడు. ఒక్కో గ్రాగన్ మొక్క నుంచి 8  నుంచి 10 కాయలు పండుతాయి.

భూమిలో స్తంభాలు పాతి వాటికి దగ్గరగా డ్రాగన్ ఫ్రూట్ మొక్కల్ని నాటాలి. అలా నాటిన డ్రాగన్ మొక్క శాఖలుగా విస్తరిస్తుంది. ఒక్కొక్క స్తంభం సమీపంలోని మొక్క నుంచి సుమారు 10 నుంచి 12 కిలోల ఫ్రూట్స్‌ పండుతాయి. ఒక్కో డ్రాగన్‌ ఫ్రూట్‌ 300 నుంచి 400 గ్రాముల బరువు ఉంటుంది. వీని 80 నుంచి 100 రూపాయల మధ్య ధర పలుకుతుంది.

డ్రాగన్ ఫ్రూట్‌ ను సలాడ్‌ లు, షేక్‌ లు, జ్యూస్‌ లు, జెల్లీల్లో ఇంకా అనేక విధాలుగా వాడుతుంటారు. ఖరీదు ఎక్కువే అయినా.. ఆరోగ్యాన్నిచ్చే డ్రాగన్ ఫ్రూట్‌ కు ఇప్పుడు మార్కెట్‌ లో మంచి డిమాండ్‌ ఉంది. మన శరీరంలో సుగర్‌ స్థాయిల్ని తగ్గించే గుణం ఈ పండులో ఉంది. కొలెస్టరాల్‌ ను అదుపుచేయడంలో డ్రాగన్ ఫ్రూట్‌ పనితీరు ఎంతో బాగుంటుంది. డ్రాగన్ ఫ్రూట్‌ తింటే గుండె ఆరోగ్యంగా ఉంటుంది. యాంటీ కేన్సర్‌ గుణాలను ఈ పండు కలిగి ఉంది.

సహజ సిద్ధంగా ఆర్గానిక్‌ సాగు విధానంలో సాగు చేసే డ్రాగన్‌ పంటకు తెగుళ్లూ సోకే అవకాశం చాలా తక్కువ. వ్యాధుల సమస్య కూడా ఉండదు. దీంతో డ్రాగన్ పంట సాగుబడి ఖర్చు చాలా తక్కువ ఉంటుంది. దీంతో పాటు డ్రాగన్ పంటకు నీటి సదుపాయం కూడా అంత ఎక్కువ అవసరం ఉండదు.  అందువల్ల డ్రాగన్‌ ఫ్రూట్‌ పండించే రైతులకు లాభాలు కూడా మెండుగానే వస్తాయి.

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here