మెట్టభూమిలో కూడా నీటి వినియోగం ఎక్కువ లేకుండా ఆర్గానిక్‌ విధానంలో మిశ్రమ పంటల్ని సాగుచేస్తూ.. నిరంతరం ఆదాయాన్ని పొందుతున్న రైతు గురించి తెలుసుకుందాం. పంటల సాగులో ఈ ఆదర్శ రైతు పురుగుమందులు కానీ, రసాయన ఎరువులు కానీ వినియోగించడు. భూమి నిరంతరం సారవంతంగా ఉంచేందుకు కేవలం ఆవు పేడను మాత్రమే వినియోగిస్తుంటాడు. మన రైతు సాగుచేసే విధానాలు వ్యవసాయ శాస్త్రవేత్తలు, దేశ విదేశాల్లోని అగ్రనేతల్ని కూడా ఎంతగానో ఆకట్టుకున్నారు. అమెరికా అధ్యక్షుడికి కూడా తన సాగు విధానాలను వివరించేందుకు మన ప్రభుత్వం తరఫున వెళ్లారు. అనేక అవార్డులు ఆయనను వెతుక్కుంటూ వచ్చాయి. ఇంతకీ అలాంటి ఆదర్శ రైతు ఎక్కడో కాదు తెలంగాణలో ఉన్నారు. హైదరాబాద్‌ లోని దిల్‌ సుఖ్‌ నగర్‌ లో నివాసం ఉంటారు 62 ఏళ్ల గుడివాడ నాగరత్నం నాయుడు. తెలంగాణలో రైతుల ఆత్మహత్యలు కొనసాగుతున్న రోజుల్లోనే ఆయన వినూత్నమైన, తెలివైన సాగు విధానాలతో వరి, వేరుశెనగ పంటలు పండించి జాతీయ రికార్డులు సాధించారు.హైదరాబాద్‌ కు 25 కిలోమీటర్ల దూరంలో రంగారెడ్డి జిల్లా తారామతి గ్రామంలో నాగరత్నం నాయుడు వ్యవసాయం చేస్తున్నారు. తన మొత్తం వ్యవసాయంలో ఐదెకరాల్లో వరి సాగుచేస్తున్నారు. మూడు ఎకరాల్లో బొప్పాయి సాగు చేసి, 45 టన్నుల ఫలసాయం సాధిస్తున్నారు. వాటితో పాటుగా 20 విదేశీ రకాల పూల సాగు విజయవంతంగా చేస్తున్నారు. ఈ పూలను ఆయన ప్రతిరోజూ బెంగళూరుకు ఎగుమతి చేస్తున్నారు. వీటితో పాటుగా నాగరత్నం నాయుడు తన క్షేత్రంలో వంగ, బెండ, బీన్స్‌, టమోటా, రకరకాల ఆకు కూరలు సాగుచేస్తున్నారు. నాగరత్నం నాయుడి తోటలో జామ, అరటి, ఐదు రకాల మామిడి, కొబ్బరి, బాదం, నేరేడు, సపోటా పంటలు సహజ పంటల విధానంలో పండిస్తున్నారు. తన వ్యవసాయ క్షేత్రంలో 12 మంది పనివారికి ఉపాధి కల్పిస్తున్న నాగరత్నం నాయుడు ప్రతి నెలా ఇంటికి లక్ష రూపాయల ఆదాయం తీసుకెళ్తున్నారు. కాఫీ, మిరియాలు, యాలకులను తమ ఇంటి అవసరాల కోసం పండిస్తున్నారు.

నాగరత్నం నాయుడు తన 93 ఏళ్ల తల్లి మునిరత్నమ్మ, భార్య సత్యవతితో కలిసి 1989లో రంగారెడ్డి జిల్లా హిమాయత్‌ నగర్‌ మండలంలో ఏమాత్రం వ్యవసాయ యోగ్యంగా లేని బంజరు భూమిని సాగులోకి తెచ్చేందుకు విపరీతంగా కష్టపడ్డారు. ఆ భూమిని పరిశీలించేందుకు నాగరత్నం నాయుడు తన స్నేహితులతో కలిసి వెళ్లినప్పుడు వారు చాలా నిరుత్సాహపరిచారు. అయినా వెనకడుగు వేయని నాయుడు తల్లి, భార్యతో కలిసి ఆ నేలలో ఉన్న రాళ్లు, ముళ్లపొదల్ని తొలగించడం మొదలెట్టారు. ఆ నేలలో సారం పెంచేందుకు ఆవుపేడను వినియోగించారు. అలా ఆ నేలను వ్యవసాయ యోగ్యం చేసేందుకు ఆరేళ్లపాటు శ్రమించి 300 లారీల రాళ్లను వారు తొలగించారు.ఆ బంజరు భూమిలో వ్యవసాయం చేసేందుకు నాగరత్నం నాయుడు ముందుగా పెట్టిన పెట్టుబడి రెండు ఆవులను కొనడం. ఇప్పుడా ఆవుల సంఖ్యను 12కు పెంచారు. తమ క్షేత్రంలో నాగరత్నం నాయుడు ముందుగా వరి మొక్కలు, మట్టి, పోషకాలను చక్కగా నిర్వహించే  ‘శ్రీ కల్టివేషన్‌’ (సిస్టమ్‌ ఆఫ్‌ రైస్‌ ఇన్‌ టెన్సిఫికేషన్‌) సాగు విధానంలో వరి పంట పండించారు. సాధారణ వరిసాగులో ఎకరాలకు 30 కిలోల విత్తనాలు అవసరం అవుతాయి. అయితే.. శ్రీ వరి సాగు విధానంలో కేవలం రెండు కిలోలే సరిపోతాయి. సాధారణంగా రైతులు ఎకరా నేలలో 35 బస్తాల ధాన్యం పండిస్తే.. శ్రీ వరి సాగుతో నాయుడు 2004లో రెట్టింపు దిగుబడి సాధించడం విశేషం.

ఇంత భారీ ఎత్తున నాయుడు వరి పంట దిగుబడి సాధించిన విషయం బాగా ప్రచారం జరిగింది. ముఖ్యమంత్రి, కేంద్ర మంత్రులు నాయుడిని ప్రశంసలతో ముంచెత్తారు. నాగరత్నం నాయుడి విశేష కృషి, సాధించిన విజయంతో తారామతిపేటకు చక్కని తారురోడ్లు ఏర్పాటయ్యాయి. అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి నాగరత్నం నాయుడి వ్యవసాయ క్షేత్రాన్ని సందర్శించడంతో ఆయన పేరు మరింత మందికి తెలిసింది. వివిధ దేశాల నుంచి 40 మందికి పైగా వ్యవసాయ శాస్త్రవేత్తలు నాయుడి వ్యవసాయ క్షేత్రానికి క్యూకట్టారు. అంతే కాదు.. 2006లో అమెరికా అధ్యక్షుడు జార్జి డబ్ల్యూ బుష్‌ ను కలుసుకునేందుకు ఏపీ ప్రభుత్వం నాగరత్నం నాయుడ్ని ఎంపిక చేసి పంపింది. ఆ సందర్భంగా అమెరికా అధ్యక్షుడికి శ్రీ వారి సాగు గురించి నాయుడు వివరించి చెప్పారు.నీళ్లు, విద్యుత్‌ ఎక్కువ అవసరం అవుతుండడంతో ప్రస్తుతం నాయుడు వరి సాగుకు బదులు పండ్లు, కూరగాయలతో మిశ్రమ పంటలు వేస్తున్నారు. కేవలం వరిపంట పైనే ఆధారపడితే.. కష్టాలు ఎదుర్కోవాల్సి వచ్చేదన్నారు నాయుడు. మిశ్రమ పంటలు, ఆర్గానిక్‌ వ్యవసాయం, మెట్టభూముల్లో నీటి ఆదా విధానాలు అనుసరించడం ద్వారా నాగరత్నం నాయుడు సాగు ఖర్చును బాగా తగ్గించుకున్నారు. నాయుడు అనుసరిస్తున్న వ్యవసాయ విధానాలు అనేక మందిని ప్రభావితం చేస్తున్నాయి. నాగరత్నం నాయుడు వ్యవసాయ విధానంలో తన అనుభవాలను వ్యవసాయ విశ్వవిద్యాలయాలు, పరిశోధనా స్థానాల్లో విద్యార్థలకు వివరిస్తున్నారు. ఇలా ఇప్పటి వరకు ఆయన భారతదేశ వ్యాప్తంగా 50 వేల మంది వ్యవసాయ విద్యార్థులకు చక్కని అవగాహన కల్పించారు. గుజరాత్‌, కర్ణాటక, మహారాష్ట్ర, ఉత్తర ప్రదేశ్, ఉత్తరాంచల్‌, మధ్యప్రదేశ్‌, హర్యానా రాష్ట్రాల్లోని వ్యవసాయ సంఘాల్లో ఉపన్యాసాలు ఇచ్చారు. అలాగే దక్షిణాఫ్రికా, ఇథియోపియా, బంగ్లాదేశ్‌, మలేసియా, థాయ్‌ లాండ్‌, సింగపూర్‌, చైనా దేశాల్లో కూడా నాగరత్నం నాయుడు తన ఉపన్యాసాల ద్వారా వేలాది మందిని ప్రభావితం చేశారు.

మిశ్రమ పంటల సాగులో సాధించిన విజయాలకు గాను అంతర్జాతీయ పురస్కారాలతో పాటు 300 కు పైగా రాష్ట్ర, జాతీయ అవార్డులు నాగరత్నం నాయుడిని వరించాయి. వేరుశెనగ సాగులో ఆర్గానిక్‌ వ్యవసాయ విధానంలో కేవలం 2 కిలోల విత్తనాలతో 110 కిలోల కాయల పంట సాధించినందుకు నాగరత్నం నాయుడికి 2007లో బంగ్లాదేశ్‌, 2008లో ఇక్రిసాట్‌ గౌరవించాయి. నెదర్లాండ్ ప్రభుత్వం ఉత్తమ శ్రీ రైతు అవార్డు అందజేసింది. వ్యవసాయంలో అందరూ అసాధ్యం అన్నదాన్ని సుసాధ్యం చేసి చూపించడం తనకు ఇష్టం అని నాగరత్నం నాయుడు చెబుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here