కేరళ అంటేనే పచ్చదనాల కనులపంట. అలాంటి కేరళలో.. కొచ్చికి సమీపంలోని అలువ.. ఒక అందాల లంకప్రాంతం. గలగల పారే పెరియార్ నది ఒడ్డున ప్రకృతి సహజమైన సౌందర్యశోభతో అలువ అలరారుతోంది. అంతమాత్రమే కాదు, ఇది సమీకృత సేంద్రియ వ్యవసాయ ప్రయోగాలకు కేంద్రం కూడా. ఎర్నాకులం జిల్లాలోని ఈ అలువలో మన దేశంలోనే మొట్టమొదటి వ్యవసాయ పాఠశాల ఏర్పాటు కావడం విశేషం. దీన్ని స్థాపించి 2019కి వందేళ్లు పూర్తయ్యాయి. అంటే స్వాతంత్ర్యానికి పూర్వమే ట్రావెనకోర్ రాజుల కాలంలో.. 1919లో దీన్ని ప్రారంభించారు.
రైతులకు ఆర్గానిక్ వ్యవసాయ పద్ధతులను నేర్పే పాఠశాలగా దీన్ని ఆనాళ్లలో ఏర్పాటు చేశారు. స్వాతంత్ర్యం వచ్చాక దీన్ని విత్తనాల ఉత్పత్తి కేంద్రంగా అభివృద్ధి పరిచారు. దేశంలో ప్రప్రథమ ఆర్గానిక్ విత్తన క్షేత్రంగా దీనికి 2012లో ధ్రువీకరణ లభించడంతో ఇది జాతీయ స్ఖాయిలో ప్రసిద్ధి పొందింది.
సమీకృత సేంద్రియ వ్యవసాయ విధానం
అలువలోని వ్యవసాయ పాఠశాలలో సమీకృత సాగు మెళకువలపై శిక్షణ ఇస్తారు. ఇక్కడ రసాయన ఎరువులు, క్రిమిసంహారకాలు లేకుండా పూర్తి ఆర్గానిక్ పద్ధతుల్లో సమీకృత వ్యవసాయం జరుగుతుంది. పంటలతో పాటు వాటికి మేలు చేసే జీవవైవిధ్యాన్ని కొనసాగించడమే సమీకృత వ్యవసాయం విశిష్టత. పూర్తిగా ప్రకృతి పద్ధతుల్లో దేశీయ ప్రాచీన విధానాలను అనుసరించి మాత్రమే ఇక్కడ పంటల సాగు జరుగుతుంది. ఇక్కడ మొత్తం 13 ఎకరాల భూమి సాగులో ఉంది. 7.5 ఎకరాల్లో వరి పండిస్తారు. 2.5 ఎకరాల్లో కూరగాయల వంటివి సాగు చేస్తారు. కొబ్బరి, అల్లం, పసుపు, మొక్కజొన్న, బంగాళాదుంపలు, టొమాటో, మిరప, ఎయిర్ పొటాటో వంటివి ఇక్కడ సాగవుతాయి. వీటిల్లో ఎయిర్ పొటాటో అన్నది తీగరకం బంగాళాదుంప. దీనికి పలు ఔషధగుణాలున్నాయని గుర్తించారు.
వరి వంగడాలకు సంబంధించి, గోల్డన్ నవర, జపనీస్ వయొలెట్, వెల్ల తొండు, రక్తశాలి, జైవ, వడక్కన్ వెల్లారి కాయమ వంటి దేశీయ రకాలను సాగు చేస్తున్నారు. ఇక్కడ పండించే వరిని “డక్ రైస్”గా పిలుచుకోవడం ఆసక్తికరం. కుత్తనాడన్ బాతులను ఇక్కడ పంట పురుగుల నివారణకు ఉపయోగించడం వల్ల ఈ వరి రకాలకు “డక్ రైస్”గా పేరు వచ్చింది. వరినాట్లు వేశాక కొద్ది రోజులకు బాతులను చేలల్లోకి వదులుతారు. అవి పంటని పాడుచేసే కీటకాలను తినేస్తాయి. అలాగే ఈ బాతులు తిరగాడడం వల్ల పొలాల్లో నీరు నిలబడకుండా ఉంటుంది. సమీకృత వ్యవసాయంలో ఇది భాగం. పూర్తి ఆర్గానిక్ విధానాల్లో పండించే ఇక్కడి దేశీయ వరి వంగడాలకు రైతుల్లో మంచి ఆదరణ ఉంది.
మూడింతల దిగుబడి
అలువ కేంద్రంలో పంచగవ్యం, మైక్రోరిజ, వెర్మిన్ వాష్ టానిక్, ఫిష్ అమినో యాసిడ్, కునపజల వంటి పెస్ట్ ప్రొటెక్షన్ ప్రాడక్టులను తయారు చేస్తున్నారు. ఈ వ్యవసాయ క్షేత్రంలో కుత్తనాడన్ బాతులతో పాటు కాసర్‌గాడ్ పొట్టిరకం ఆవులను, మల్‌బారీ మేకలను, కోళ్లను, శునకాలను, తేనెటీగలను కూడా పెంచుతున్నారు. మలబారీ మేకలను కేవలం ఎరువు కోసం పెంచుతారు. అలాగే కాసర్‌గాడ్ ఆవుల పాలను కూడా పితకరు. పంచగవ్యం తయారీలో మాత్రమే ఈ ఆవుల పేడను, మూత్రాన్నీ వాడతారు. మిగతా ఆవుల పాలను, పెరుగును పంచగవ్యంలో కలుపుతారు. కునప్పజల అనే పేరుతో తయారయ్యే ఎరువును పదిహేను రోజుల వ్యవధిలో పంటలపై చల్లుతారు. దీని వల్ల దిగుబడి మూడింతలవుతుందని ఈ కేంద్రం వ్యవసాయ అధికారిణి లిస్సీమోల్ జే వడకుత్తు చెబుతున్నారు.
అలాగే దుంపల సాగులో Mycorrhiza అనే మిశ్రమాన్ని ఇక్కడ ఉపయోగిస్తారు. ఇది ఫంగస్‌లను నివారించడమే కాకుండా దిగుబడిని పెంచుతుందని లిస్సీమోల్ వివరిస్తున్నారు. పంట వేసేటప్పుడే నేలలో ఐదు గ్రాముల Mycorrhizaను కలిపి వేస్తే దుంపల దిగుబడి పెరుగుందని ఆమె సూచిస్తున్నారు.
పంటకు మేలు చేసే కీటకాలను ఆకర్షించడం కోసం ఇక్కడ పొద్దు తిరుగుడు, మందార, మల్లె వంటి మొక్కలను పెంచుతారు. అలాగే చిత్రమూలం (plumbago indica) మొక్కలను విరివిగా పెంచితే ఎలుకల బాధ ఉండదని ఇక్కడ కనుగొన్నారు.
ఎర్ర బియ్యం సాగు
ఈ వ్యవసాయక్షేత్రంలో పండే ‘రక్తశాలి’ వరి వంగడం ఎర్రరంగులో ఉంటుంది. ఇది వేనాడ్ గిరిజనులు అనాదిగా సాగుచేస్తూ వచ్చిన రకం. ఇందులో అనేక పోషకాలు ఉన్నట్లు శాస్త్రవేత్తలు నిర్ధారించారు. అలాగే ‘ప్రత్యాశ’ అనే మరో రకం వరి బియ్యం కూడా ఇక్కడ పండుతుంది. ఇందులో 30 శాతం పొట్టును తీయకుండా అలాగే ఉంచేసి విక్రయిస్తారు. ఈ రకం వరి కూడా ఆరోగ్యానికి మంచిదని చెబుతారు. మొత్తం 48 రకాలైన దేశీయ వరి విత్తనాలు ఇక్కడ దొరుకుతాయి. ఆసక్తి కలిగిన రైతులకు, రైతు సంఘాలకు వీటిని అందజేస్తారు. వరిసాగు చరిత్రను తెలియజెప్పే మ్యూజియం కూడా ఇక్కడ ఏర్పాటు కానుంది.
శుద్ధమైన కొబ్బరి నూనె, మామిడికాయ పచ్చడి, ఆర్గానిక్ అటుకులు, బాతు గుడ్లు వంటివాటిని కూడా ఇక్కడ కొనుగోలు చేయవచ్చు. ఈ వ్యవసాయ పాఠశాల నదీతీరంలో పచ్చటి పొలాల మధ్య ఉండడాన బోటింగ్ వంటివి ఏర్పాటు చేసి ఆహ్లాదకరమైన టూరిస్టు కేంద్రంగా కూడా దీన్ని అభివృద్ధి పరుస్తున్నారు. దేశంలో సమీకృత సేంద్రియ సాగును గురించి ప్రామాణికంగా బోధించే కేంద్రాల్లో ఇంతకన్నా సుందరమైన ప్రదేశం మరొకటి లేదంటే అతిశయోక్తి కాదు. ఎప్పుడో ట్రావెన్‌కోర్ రాజుల కాలంలో ఏర్పాటైన ఈ వ్యవసాయ పాఠశాల ఇప్పటికీ అదే స్ఫూర్తితో రైతన్నలకు సేవలందించడం విశేషం.
ఆసక్తిగలవారు మరిన్ని వివరాలకు ఈ చిరునామాను సంప్రదించవచ్చు.Lissymol J Vadakuttu, Agricultural Officer, STATE SEED FARM, ALUVA, KERALA, Ph. No. +91 9383471192, aluvaseedfarm@gmail.com
అలువ వ్యవసాయక్షేత్రం పాఠశాలలో కనువిందు చేసే బాతులు :