ప్రకృతి వ్యవసాయం అనగానే ఏదో ఓ మూలన చిన్నపాటి కమతాల్లో సాగే పంటల సాగు అన్న తేలికపాటి అభిప్రాయాన్ని పటాపంచలు చేశారు హరిశరణ్ దేవగణ్. భారత ప్రకృతి సేద్యం తాలూకు విశిష్టతను ఆయన ఖండాంతరాల్లో సైతం చాటారు. మనది ప్రపంచంలోనే అత్యున్నతమైన సేంద్రియ వ్యవసాయమని ఆయన తిరుగులేకుండా రుజువు చేశారు. ఢిల్లీకి చెందిన హరిశరణ్ దేవగణ్‌ ఉత్తరాదిలో కరణ్ దేవగణ్‌గా పాపులర్. ఢిల్లీ యూనివర్సిటీలో పీజీ చేసిన హరిశరణ్ 2007లో నీష్ అగ్రికల్చర్ లిమిటెడ్ (Niche Agriculture Limited)ను ప్రారంభించారు. రసాయన ఎరువులు, క్రిమి సంహారక మందులు లేకుండా పూర్తి ప్రకృతి వ్యవసాయ విధానాలను అనుసరించడం ఈ సంస్థ మౌలిక సూత్రం. అలాగే ఆధునిక సేద్య పద్ధతులను, సంప్రదాయ విధానాలను మేళవించి వ్యవసాయం చేస్తూ వస్తోంది నిషే అగ్రికల్చర్ లిమిటెడ్.

అనంతపురం జిల్లాలో ప్రకృతి సాగు

ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపూర్‌ జిల్లా రొడ్డంలోను, తమిళనాడులోని మదురైలోను ఆయన చేపట్టిన ప్రకృతి వ్యవసాయం ఇవాళ అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. ఏకంగా 2 వేల హెక్టార్ల విస్తీర్ణంలో హరిశరణ్ ఆర్గానిక్ వ్యవసాయం సాగడం విశేషం. ప్రస్తుతం ఆయన వ్యవసాయ క్షేత్రాల్లో సుమారు 3 వేల రైతు కుటుంబాలకు ఉపాధి లభిస్తోంది. ఆయన తన పొలాల్లో 50కి పైగా పండ్ల రకాలకు, కూరగాయలను, ఆయుర్వేద ఓషధులను సాగు చేస్తున్నారు.
ప్రత్యేకించి దానిమ్మ సాగులో ఆయన మంచి నైపుణ్యం సంపాదించారు. ఇప్పుడు ప్రపంచంలోనే అత్యధికంగా దానిమ్మను ఆర్గానిక్ పద్ధతుల్లో పండిస్తున్న సంస్థగా హరిశరణ్ సంస్థ Niche Agriculture Limited ప్రసిద్ధి పొందింది. అంతేకాదు, భారతదేశంలో అత్యధిక విస్తీర్ణంలో దానిమ్మ సాగు జరుగుతోంది హరిశరణ్ వ్యవసాయక్షేత్రంలోనే. ఏపీకి సంబంధించి అనంతపురం జిల్లాలోని రొడ్డంలో హరిశరణ్ సువిశాల ప్రకృతి వ్యవసాయ క్షేత్రం ఉంది. ఇది హిందూపూర్ పట్టణానికి 35 కి.మీల దూరంలో ఉంటుంది. ఇక్కడ కాసే దానిమ్మ పండ్లు దేశంలోని వివిధ నగరాలకు, విదేశాలకు కూడా ఎగుమతి అవుతున్నాయి.

అనంతపురం జిల్లాలోని వ్యవసాయక్షేత్రంలో హరిశరణ్

మన దేశంలో సాగే దానిమ్మ సాగులో 66 శాతం మహారాష్ట్రలోనే జరుగుతుంది. ఆ తర్వాత స్థానం కర్ణాటకది. అక్కడ 19 శాతం దానిమ్మ సాగవుతోంది. ఇక గుజరాత్‌లో 8 శాతం, ఏపీలో 4 శాతం, తమిళనాడులో 2 శాతం మాత్రమే దానిమ్మను సాగుచేస్తున్నారు. కాగా, ప్రపంచంలో అత్యధికంగా దానిమ్మను దిగుమతి చేసుకుంటున్న దేశం యుఏఈ. విదేశాలకు ఎగుమతికి మంచి అవకాశాలు ఉండడంతో హరిశరణ్ దానిమ్మ పండ్ల తోటల పెంపకంపై దృష్టి కేంద్రీకరించారు. కాత వచ్చాక తెంపి ఆధునిక పద్ధతుల్లో ప్రాసెస్ చేసి ఆయన వివిధ ప్రాంతాలకు పండ్ల తాలూకు సహజమైన రంగు, రుచి, వాసన వంటివి చెడకుండా తగిన జాగ్రత్తలు తీసుకుని పంపిస్తారు.

అనంతపురం జిల్లాలోని వ్యవసాయక్షేత్రంలో…

వేలాది ఆవులతో గోశాల

నీష్ అగ్రికల్చర్ లిమిటెడ్ వ్యవసాయక్షేత్రాల్లో 6,200 దేశీ గోవులను పెంచుతుండడం మరో విశేషం. గుజరాత్‌కు చెంజిన గిర్, ఏపీకి చెందిన ఒంగోలు, పంజాబ్‌కు చెందిన సాహివాల్, రాజస్థాన్‌కు చెందిన రాఠీ వంటి దేశవాళీ గోజాతులు ఆయన గోశాలల్లో ఉన్నాయి. ఈ గోవుల నుండి లభ్యమయ్యే పాలతో ఆయన శుద్ధమైన నెయ్యిని కూడా తయారు చేసి విక్రయిస్తారు. అలాగే ఆయన పొలాలన్నిటికీ ఉపయోగించే సహజ ఎరువు జీవామృతమే. దేశీ ఆవుల పేడలో కాల్షియం, జింక్, ఫాస్పరస్, ఐరన్, మేగ్నీషియం, కాపర్, కోబాల్డ్, పొటాషియం, నైట్రోజన్, మాంగనీస్ వంటి 24 రకాల పోషకాలు ఉంటాయని ఆయన స్వయంగా పరిశోధనశాలల్లో ప్రయోగాలు చేయించి నిర్ధారించుకున్నారు.
గోమూత్రాన్ని ఆయన ఆర్గానిక్ పెస్టిసైడ్‌గా వాడతారు. ఆర్గానిక్ ఎరువులు, క్రిమి సంహాకర మందులు భూసారాన్ని నిలిపి ఉంచుతాయని ఆయన చెబుతారు. నీష్ వ్యవసాయక్షేత్రంలో పంటల తాలూకు వ్యర్థాలను సేకరించి వెర్మి కంపోస్టు కూడా తయారు చేస్తారు.

వంద ఎకరాల విస్తీర్ణంలో ప్రకృతి వ్యవసాయం చేయడానికి 1000 కేజీల దేశవాళీ ఆవు పేడ, 1000 లీటర్ల దేశీ గోమూత్రం, 100 కిలోల బెల్లం, 200 కిలోల పప్పు దినుసుల పిండి, 20,000 లీటర్ల నీరు కలిపిన మిశ్రమం అవసరమని హరిశరణ్ వివరిస్తారు. ఇదే ఆయన తన పొలాల్లో వాడే జీవామృతం. ప్రధానంగా ఆయన సుభాష్ పాలేకర్ గారి పద్ధతులనే తమ పొలాల్లో అనుసరిస్తారు. ప్రత్యేకించి గిర్ ఆవుల పాలలోను, మూత్రంలోను ఔషధ లక్షణాలు ఎక్కువగా ఉంటాయని ఆయన చెబుతారు. ఆయన తన వ్యవసాయక్షేత్రాల్లో క్రిమిసంహారకంగా గోమూత్రాన్ని వేపాకు కషాయంతో కలిపి పంటలపై పిచికారీ చేయిస్తారు. ఫంగీ, బ్యాక్టీరియాలను నివారించేందుకు పులియబెట్టిన ఆవుమజ్జిగను వాడతారు.

GM విత్తనాలకు నో!

పొలాల్లో ఒకే రకం పంటను సాగు చేయడం సరైన పద్ధతి కాదని హరిశరణ్ చెబుతారు. రైతులు తాము వేసే పంటలను మార్చుతుండడం, అంతర పంటలు వేయడం అన్ని విధాలుగానూ మంచిదంటారు. దీని వల్ల భూసారం పెరిగి చీడపీడల బెడద తగ్గుతుందని ఆయన వివరిస్తారు. నీష్ అగ్రికల్చర్ లిమిటెడ్ వ్యవసాయక్షేత్రాల్లో ఎక్కడా జన్యూ మార్పిడి చేసిన విత్తనాలను (Genetically modified -GM) ఉపయోగించదు. సర్టిఫైడ్ నాన్ జీఎం విత్తనాలనే వాడుతుంది.
ఎన్నో శ్రమలకోర్చి చేస్తున్న ప్రకృతి వ్యవసాయం వల్ల హరిశరణ్ సంస్థ ఇప్పుడు దానిమ్మ తోటల సాగులో అంతర్జాతీయ స్థాయికి ఎదిగింది. అయితే ఆయన మొదట తన ఆర్గానిక్ వ్యవసాయాన్ని చిన్నస్థాయిలోనే మొదలుపెట్టారు. మార్కెట్‌ లోతుపాతులను అధ్యయనం చేశారు. ఒక రైతుగా వ్యవసాయంలోని సాధకబాధకాలను ప్రత్యక్షంగా తెలుసుకున్నారు.
నీష్ సంస్థ పండించే దానిమ్మ పండ్లలో పలురరాకాలైన కాన్సర్లను, మధుమేహాన్ని నివారించే గుణాలున్నాయని హరిశరణ్ చెబుతారు. ఆర్గానిక్ పద్ధతిలో పండించడం వల్ల తమ దానిమ్మ చాలా రుచికరంగా కూడా ఉంటుందంటారు. పలు దేశాలకు ఆయన వాటిని పెద్దయెత్తున ఎగుమతి చేస్తున్నారు.
హరిశరణ్‌కు గోవులంటే ఎంతో ప్రీతి. ఆయన ఆవును గోమాతగా పేర్కొంటారు. వాటి సంరక్షణ కోసం ఆయన అనంతపూర్, మదురైలలో గోశాలలను కూడా నడుపుతున్నారు. ఈ గోశాలల్లో యజమానులు వదిలేసిన ఆవులు, జబ్బు చేసిన గోవులు, ముసలివైన వందలాది పశువులకు ఆశ్రయం కల్పిస్తున్నారు.

రైతునని చెప్పుకోవడమే ఇష్టం!

గంజాయి జాతికి చెందిన Cannabis (Hemp) పై ఆయన సంస్థ పరిశోధనలు జరుపుతోంది. ప్రభుత్వం కనుక అనుమతినిస్తే పారిశ్రామిక అవసరాల కోసం ఈ వెరైటీని పెద్దయెత్తున సాగు చేసేందుకు సర్వసన్నద్ధంగా ఉంది.
ఇక 2016లో హరిశరణ్ Niche Film Farms ఏర్పాటు చేసి సినిమా, ఎంటర్‌టైన్‌మెంట్ రంగాల్లోకి సైతం ప్రవేశించారు. బాలీవుడ్, హాలీవుడ్ సినిమాలను ఈ సంస్థ నిర్మిస్తుంది. డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. “London Has Fallen” అనే అమెరికన్ యాక్షన్ థ్రిల్లర్‌ను ఈ సంస్థే పంపిణీ చేసింది. అలాగే Niche Racing పేరుతో గుర్రాల రేసింగ్‍ రంగంలోకి కూడా ఆయన ప్రవేశించారు. మన దేశంలో నిర్వహించిన 200లకు పైగా రేసుల్లో ఆయన గుర్రాలు గెలిచి హరిశరణ్ సత్తా చాటాయి.

ఎన్ని ఇతర వ్యాపారాలు ఉన్నా తాను పదహారణాల రైతునని చెప్పుకోవడమే హరిశరణ్‌కు ఇష్టం. ఎక్కడికి వెళ్లినా ఆయన తనని తాను వ్యవసాయదారుడిగానే పరిచయం చేసుకుంటారు. తన పొలాల్లో ఈ పంజాబీ కండల వీరుడు స్వయంగా దుక్కి దున్నడం, తోటలకు నీరు పెట్టడం, పండ్లు తెంపడం లాంటి వ్యవసాయం పనులు చేయడం ఆసక్తికరం. రైతులతో ఆయన కలివిడిగా, వారిలో ఒకరుగా మసలుతారు. వారి కష్టనష్టాలకు మానవతాహృదయంతో స్పందిస్తారు. తను వ్యవసాయం చేసే పరిసర ప్రాంతాల్లో రైతులను ఎట్టి పరిస్థితుల్లోనూ ఆత్మహత్యలకు పాల్పడనివ్వబోనని ఆయన దృఢంగా చెబుతారు. కార్పొరేట్ స్టైల్లో భారీ యెత్తున ప్రకృతి వ్యవసాయం చేస్తూ అందరికీ నవతరానికి స్ఫూర్తిని అందిస్తున్న హరిశరణ్‌ దేవగణ్‌ను మన “బాహుబలి రైతు”గా పిలుచుకోవచ్చునేమో!

ఆసక్తిగలవారు మరిన్ని వివరాల కోసం ఈ చిరునామాను సంప్రదించవచ్చు.

Niche Agriculture Pvt Ltd.
731, S.G.Shopping Mall, DC Chowk,
Rohini, Delhi – 110085
info@nicheagriculture.com
+91 8802456789

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here