మొలకల దశలో చిన్న మొక్కలు, కూరగాయలు, మూలికల పెంపకమే మైక్రో గ్రీన్‌ సాగు. పూర్తిగా ఆర్గానిక్‌ విధానంలో ఈ వ్యవసాయం చేయడమే ప్రధాన అంశం. మైక్రో గ్రీన్స్‌న్ ఆహారంగా తీసుకుంటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. వీటిలో విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువ. కొలెస్ట్రాల్‌ తగ్గేందుకు, బరువు, వాపు తగ్గేందుకు బాగా ఉపయోగపడతాయి. సూప్‌లో, సలాడ్‌లు, శాండ్‌విచ్‌లు, ఇతర వంటకాలలో గార్నిషింగ్‌ కోసం మైక్రోగ్రీన్స్‌‌ను వినియోగిస్తారు. వంటకాల రుచిని పెంచుతాయి, చూసేందుకు ఆకర్షణీయంగా ఉంటాయి కాబట్టే మైక్రో గ్రీన్స్‌కు రెస్టారెంట్ల నుంచి మంచి డిమాండ్‌ ఉంటుంది.

బాల్కనీలు, టెర్రస్‌లు లేదా ఇంట్లో ఎక్కువగా వినియోగంలో లేని గదుల్లో అతి తక్కువ పెట్టుబడి, చిన్నపాటి స్థలంలో మైక్రో గ్రీన్స్‌ సులువుగా సాగు చేయవచ్చు. నెలలో మూడు నుంచి నాలుగుసార్లు మైక్రో గ్రీన్స్‌ సాగు చేసుకోవచ్చు.తక్కువ పెట్టుబడితో కేవలం 7 నుంచి 10 రోజులలోనే మైక్రో గ్రీన్స్‌ పంట దిగుబడి చేతికి వచ్చేస్తుంది. ఈ సాగుకు నీటి అవసరం చాలా తక్కువ. నీటిని స్ప్రే బాటిల్‌తో మొక్కలకు అందించవచ్చు. ఎక్కువ నిర్వహణ పనిలేదు. ఆర్గానిక్‌ విధానంలో సాగు కాబట్టి రసాయన ఎరువులు వాడే పనిలేదు. మైక్రో గ్రీన్స్‌ సాగులో సేంద్రీయ నత్రజని, పచ్చి ఎరువు వాడాలి.ఆధునిక సమాజంలో ఆరోగ్యం కోసం పరితపించే ప్రతి ఒక్కరూ మైక్రో గ్రీన్స్‌ వాడుతున్నారు. మైక్రో గ్రీన్స్‌లో అద్భుతమైన ప్రోటీన్‌ ఉంటాయి. రెండు మూడు కిలోల కూరగాయలలో లభించే పోషకాలు కేవలం 100 గ్రాముల మైక్రో గ్రీన్స్‌లో లభిస్తాయి. మైక్రో గ్రీన్స్‌ ఫార్మింగ్‌లో రాగులు, బఠాణి, ముల్లంగి, మెంతులు, ఆవాలు, మిల్లెట్లు అంటే చిరుధాన్యాలు, పాలకూర లాంటి 75 రకాల పంటలను పండించవచ్చు.  ఆరోగ్య ప్రయోజనాలతో పాటు తక్కువ పెట్టుబడి, ఎక్కువ లాభం వచ్చే మైక్రో గ్రీన్స్‌ ఫార్మింగ్‌ గురించి తెలుసుకుందాం.10X10 అడుగుల గదిలో మైక్రో గ్రీన్స్‌ సాగు కోసం తొలిసారి రూ.10 వేలు వరకు ఖర్చవుతుందని ఈ సాగులో అనుభవం సాధించిన వారు చెబుతున్నారు. పది అడుగుల స్థలంలో 100 ట్రేలలో మైక్రో ఫార్మింగ్‌ చేసేందుకు ఈ ఖర్చు వస్తుంది. అంతకు తక్కువ ట్రేలలో ఫార్మింగ్ చేయాలనుకుంటే మరింత తక్కువే పెట్టుబడి అవుతుంది. ఇందుకు కావాల్సినవి ర్యాక్‌లు, చిన్న చిన్న రంధ్రాలు ఉన్న ప్లాస్టిక్‌ ట్రేలు,  నాణ్యమైన విత్తనాలు, కోకో పిట్‌, ఆర్గానిక్‌ ఎరువులు, నీటిని స్ప్రే చేసేందుకు బాటిల్‌ స్ప్రేయర్‌, నీరు, కరెంట్‌ సగటున రూ.500 మాత్రమే ఖర్చు అవుతుంది.. మైక్రో గ్రీన్స్‌ ఫార్మింగ్‌లో తొలిసారిగా ట్రేల కోసం పెట్టే పెట్టుబడి, రెండో సాగు నుంచి ఉండదు.మైక్రో గ్రీన్స్‌ ఫార్మింగ్‌ను ఫుల్‌టైమ్‌గానే కాకుండా పార్ట్‌ టైంనూ చేయొచ్చు. గృహిణులు, రిటైర్‌ అయినవారు, విద్యార్థులు, జాబ్‌ చేస్తున్న వారు, పాకెట్‌ మనీ కోసం కూడా ఈ సాగు చేసుకోవచ్చు. మైక్రో గ్రీన్స్‌ మొక్కలపై రోజూ ఉదయం, సాయంత్రం రెండుసార్లు నీరు స్ప్రే చేస్తే సరిపోతుంది. ఎక్కువ సూర్యరశ్మి ఈ పంటకు అవసరంలేదు. మొలకల మొక్కలకు రెండు ఆకులు వచ్చే సరికే హార్వెస్ట్‌ చేసుకోవచ్చు. ఆదాయం తీసుకోవచ్చు. ఇవి ఎక్కువ ఎత్తు పెరగాల్సిన అవసరం లేదు కాబట్టి ర్యాక్‌లలో అంచెలంచెలుగా పెట్టుకోవచ్చు.మైక్రో గ్రీన్స్‌లో మంచి దిగుబడి కావాలంటే నాణ్యమైన సేంద్రీయ విత్తనాల ఎంపిక చాలా ముఖ్యం. మట్టి లేదా కోకో పిట్‌ కావాలి. చిన్న రంధ్‌రాలు ఉన్న ప్లాస్టిక్ ట్రేలు తీసుకోవాలి. నీటిని స్ప్రే చేసేందుకు స్ప్రేయింగ్‌ బాటిల్‌ కావాలి. ఇవన్నీ మార్కెట్‌లో సులువుగానే దొరుకుతాయి. అంతకు ముందుగా ఎంత స్థలంలో, ఎన్ని ట్రేలలో మైక్రో గ్రీన్స్‌ ఫార్మింగ్‌ చేయాలో నిర్ణయించుకోవాలి. లేయర్లుగా ఈ మొక్కలను పెంచితే తక్కువ స్థలంలోనే ఎక్కువ దిగుబడి, ఆదాయం సంపాదించవచ్చు.విత్తనాలను ఆరు నుంచి 8 గంటలు నానబెట్టాలి. ట్రేలలో కోకో పిట్‌ నింపుకోవాలి. ఆ ట్రేలలో విత్తనాలను సమాన దూరంలో చల్లాలి. దానిపైన న్యూస్‌పేపర్‌ వేసి, రెండు నుంచి మూడు రోజులు కప్పి ఉంచాలి. విత్తనాలపై రోజుకు రెండుసార్లు నీరు స్ప్రే చేయాలి. మూడు రోజుల తర్వాత న్యూస్‌ పేపర్ తీసేసి, ఐదు నుంచి పది రోజులు ఓపెన్‌గా ఉంచి, పంట కోసుకోవచ్చు.మైక్రో గ్రీన్స్‌ ఫార్మింగ్‌ కోసం 100 ట్రేలకు రూ.5 వేలు అవుతుంది. కోకో పిట్‌కు రూ.1000, విత్తనాలకు రెండు నుంచి నాలుగు వేలు కావాలి. నీరు, కరెంట్‌ కోసం సగటున రూ.500 ఖర్చవుతుంది. మొత్తం అన్నింటికీ రూ.8 నుంచి రూ.10 వేలు అవుతుంది. ఒక నెలలో కనీసం 3 నుంచి 4 సార్లు పంట దిగుబడి తీసుకోవచ్చు. ఆ తర్వాత నుంచి వేసే బ్యాచ్‌లకు కూడా అవే ట్రేలను వాడతాం కాబట్టి వాటి ఖర్చు ఉండదు. ట్రేలకు తొలిసారి పెట్టిన ఖర్చు రూ.5 వేలు ఉండదు కాబట్టి తర్వాతి బ్యాచ్‌లను కేవలం మూడు నుంచి 5 వేలతోనే చేసుకోవచ్చు.ఒక్కో మైక్రో గ్రీన్స్‌ ఫార్మింగ్‌ ట్రే నుంచి 250 గ్రాముల చొప్పున 100 ట్రేలలో కలిపి 25 కిలోల దిగుబడి వస్తుంది. కిలో మైక్రో గ్రీన్స్‌ పంటకు రూ.400 నుంచి 600 వరకు ధర పలుకుతుంది. నెలలో నాలుగుసార్లు హార్వెస్ట్‌ చేస్తే.. 100 కిలోలు వస్తుంది. కిలో రూ. 400కు అమ్మినా రూ.40 వేలు వస్తుంది. నెలలో నాలుగు బ్యాచ్‌లకు కలిపి రూ.25 వేలు ఖర్చయినా రూ.15 వేలు లాభం. ఇలా ఏడాదిలో రూ.1.80 లక్షలు ఉంటుంది.మైక్రో గ్రీన్స్‌ను రెస్టారెంట్లు, ఫుడ్‌ షాపులలో, కేవలం ఆర్గానిక్‌ ఆహారాలు అమ్మే షాపులలో, ఆన్‌లైన్‌ ద్వారా, ఆర్గానిక్‌ ఉత్పత్తుల ఎగ్జిబిషన్‌లలో అమ్మవచ్చు. స్టార్టప్‌ బ్రాండ్‌గా కూడా విక్రయించవచ్చు. అయితే.. సాగులో కాస్త అనుభవం పెరిగిన తర్వాత వాటిని చక్కగా ప్యాకింగ్ చేసి, సొంత బ్రాండ్‌ పేరుతో అమ్మవచ్చు. ఇలా తక్కువ పెట్టుబడి, తక్కువ స్థలంలోనే మంచి ఆదాయం సంపాదించవచ్చు.