సుగంధ ద్రవ్యాల్లో అల్లం ఒకటి. దీనిలో విటమిన్ బీ3, విటమిన్ బీ6, విటమిన్ సీ, ఐరన్, పొటాషియం, మెగ్నీషియం, జింక్, ఫోలేట్‌లు ఉన్నాయి. అల్లంతో వికారం తగ్గుతుంది. జీర్ణ ఎంజైమ్‌లను ఉత్పత్తిని అల్లం ప్రేపించి జీర్ణ క్రియను పెంచుతుంది. కడుపు ఉబ్బరం, మలబద్ధకం లాంటి సమస్యలకు చెక్ పెడుతుంది. కడుపులో మంటను తగ్గిస్తుంది. అల్లంను ఆహారంలో తీసుకుంటే మన రోగ నిరోధకశక్తి పెరుగుతుంది. బరువు తగ్గించేందుకు, గుండె ఆరోగ్యం మెరుగయ్యేందుకు అల్లం ఎంతో ఉపయోగపడుతుంది. అధిక రక్తపోటు తగ్గించేందుకు, కొలెస్ట్రాల్ స్థాయిలు పెంచేందుకు పనికివస్తుంది. అల్లంలోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు కీల్ల నొప్పులు, వాపు సంబంధ ఇబ్బందులను తగ్గిస్తుంది. రక్తంలోని చక్కెర స్థాయిలను అల్లం తగ్గిస్తుంది కాబట్టి డయాబెటిస్‌ని నియంత్రిస్తుంది. పూర్వకాలం నుంచి ఔషధాల తయారీలో అల్లం వాడకం ఉంది. నోటిలో దుర్వాసన ఉంటే అల్లం నిర్మూలిస్తుంది. నోటిలోని బ్యాడ్ బ్యాక్టీరియాలను చంపేస్తుంది. ఇలా ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న అల్లం సాగులో కష్టనష్టాల గురించి తెలుసుకుందాం.
విత్తనం నాటిన 8 నెలల్లోనే అల్లం పంట పూర్తవుతుంది. ఎకరానికి వెయ్యి కిలోల విత్తనం అవసరం అవుతుంది. క్వింటాలు విత్తనాల ధర దాదాపు రూ.12 వేలు ఉంటుంది. విత్తనాలకు సుమారు లక్షా 20 వేల రూపాయల ఖర్చవుతుంది. కనీసం 4 లారీల పశువులు, కోళ్ల ఎరువు అవసరం ఉంటుంది. ఎరువు కోసం రూ.50 నుంచి రూ. 60 వేలు అవుతుంది. ఎకరం నల్లరేగడి భూమి నుంచి కనీసం 100 క్వింటాళ్లు, పంట మరికాస్త బాగా వస్తే 150 క్వింటాళ్ల వరకు వస్తుంది. ఎకరం భూమిలో అల్లం పండించి, దిగుబడి వచ్చే వరకు కనీసం రూ.3 లక్షలు ఖర్చు అవుతుంది.
ఎనిమిది నెలలకు అల్లం పంటను తీసేస్తే.. దాన్ని ‘లేప’ అంటారు. అల్లం పంట పూర్తయిన ఎనిమిది నెలల తర్వాత మోడెం పంటగా ఉంచి.. విత్తనంగా అమ్మితే మరింత అధిక ధర వస్తుంది. ఎలాంటి తెగుళ్లు లేకుండా పెరిగిన అల్లం మాత్రమే విత్తనానికి పనికి వస్తుంది..మరో రెండు నెలల తర్వాత అంటే పదో నెల నుంచి అల్లం దుంప నుంచి కొత్త పిలకలు వస్తాయి. వాటిని అలాగే మరో 8 నెలలు పెరగనిస్తే ఎకరానికి 200 క్వింటాళ్ల వరకు దిగుబడి వస్తుంది.అల్లం 8 నెలల పంట. తెగుళ్లు సోకకపోతే మోడెం పంటగా ఉంచుతారు. 8 నెలల తర్వాత అల్లం మొక్క ఆకులన్నీ నేలకు పడిపోతాయి. అయినప్పటికీ అల్లంను భూమి నుంచి తీయకుండా అలానే ఉంచితే ఒక్కొక్క దుంప నుంచి కొత్తగా అనేక పిలకలు పుట్టి, చాలా వేగంగా పెరిగిపోయి, మూడు, నాలుగు నెలలకే మరింత ఎక్కువ దిగుబడి ఇస్తుంది. మొక్కల ఆకులన్నీ నేలపై పడిపోయి, భూమికి ఆచ్చాదనగా ఉంటాయి. మరో నెల రోజుల పాటు అల్లం దుంపలు నిద్రావస్థలో ఉంటాయి. ఆ సమయంలోనే అల్లంను విత్తనంగా అమ్ముకోవాలి. అల్లం విత్తనం నాటుకునే సమయంలో 50 నుంచి 100 గ్రాముల బరువు ఉంటుంది. ఎనిమిది నెలల సాగు కాలంలో ఒక్కో మొక్కకు సుమారు కిలో వరకు బరువున్న అల్లం తయారవుతుంది. తెగుళ్లు సోకకపోతే మొక్కలను 15 నుంచి 18 నెలల వరకు ఉంచుకోవచ్చు.
అల్లం విత్తనాలను మేనెల ఆఖరిలో లేదా జూన్ నెలలో భూమిలో నాటుకోవాలని సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం రంజోల్‌లో అనేక సంవత్సరాలుగా సాగు చేస్తూ.. లాభాలు ఆర్జిస్తున్న రైతు గంజాయి మోహన్ చెప్పారు. తాను తొలిసారి కేరళ నుంచి అల్లం విత్తనాలు కొనుగోలు చేశానన్నారు. తమ ప్రాంతంలో మారన్ రకం అల్లం అనుకూలమైనదన్నారు. రివోడ్ అనే రకం కూడా తాను సాగుచేస్తున్నట్లు చెప్పారు. అల్లంలో ఇంకా మహిమ్, హిమాచల్ ఇలా అనేక రకాలు ఉన్నాయని తెలిపారు. మారన్ రకం సాగుచేస్తే రైతులకు కొంచెం రిస్క్ తక్కువ అన్నారు. ఎకరం భూమిలో వెయ్యి కిలోల విత్తనం అవసరం అవుతుంది.
నేలను దున్నిన తర్వాత ముందుగానే మూడు అడుగుల వెడల్పుతో బెడ్లు వేసుకోవాలి. రెండు బెడ్ల మధ్య బోదె ఉండాలి. ఇలా ఒక బోదె మరో బోదె మధ్య దూరం 5 అడుగులు ఉంచాలి. బెడ్లపైనే పశువుల ఎరువులు వేచాలి. ఎరువులు మట్టిలో 4 అంగుళాల మేర కలిసిపోయేలా రొటావేటర్ వేసి కలపాలి. తర్వాత బెడ్లపై డ్రిప్ వేసి నేలను కొద్దిగా తడిపి, లైన్లు వేసి, సీడ్ పెట్టాలి. అల్లం విత్తనాలను యంత్రాలతో కాకుండా బెడ్లపై మనుషులే నాటాలి. బెడ్‌కు మధ్యలో వేసిన డ్రిప్ లైన్‌కు అటు 6 అంగుళాలు, ఇటు 6 అంగుళాల దూరంలో విత్తనాలు వేసుకోవాలి. అంటే రెండు విత్తనాల మధ్య అడుగు దూరం ఉంటుంది. బెడ్‌పై వరుసగా ఆరు లేదా 7 అంగుళాల దూరంలో లైన్‌గా విత్తనాలు నాటుకోవాలి. మొక్కలు పెరిగే కొద్దే టిల్లర్‌తో బోదెలోని మట్టిని బెడ్‌కు ఎగదోస్తుంటే బెడ్ మరింత ఎత్తుగా తయారవుతుంది. ఇలా పలుమార్లు బోదెలోని మట్టిని పైకి ఎగదోయాలి.అల్లం విత్తనం నాటిన తర్వాత మూడు, నాలుగు నెలలకు బోదెలలో అంతర పంటగా అరటిమొక్కలు నాటుకోవచ్చు. ఒక బోదె విడిచి మరో బోదెలో అరటి మొక్కలు నాటుకోవాలి. అలా చేసినప్పుడు మొక్కకు మొక్కకు మధ్య దూరం 6 నుంచి 7 అడుగులు రావచ్చు. అరట మొక్కల వరుస మధ్యలో 4 అడుగుల దూరం ఉంచాలి. నాటిన తర్వాత అరటి మొక్కల నుంచి 9 నెలల్లో దిగుబడి వస్తుంది. . ఎర్ర గరప నేలలే అల్లం సాగుకు అనుకూలం అంటారాయన. ఎర్ర గరప నేలలో సాగు చేస్తే.. తెగుళ్లు సోకే అవకాశం తక్కువ ఉంటుంది. దిగుబడి కూడా మరింత ఎక్కువ వస్తుంది.
అల్లంను ఒకే భూమిలో ప్రతి సంవత్సరం కాకుండా మూడునాలు గేళ్లు విడిచి, మళ్లీ వేసుకోవచ్చు. అంటే పంట మార్పిడి చేస్తే.. తర్వాత సాగుచేసే అల్లం పంటలే మరింత ఎక్కువ దిగుబడి వస్తుంది. అలాగే.. అల్లం పంటను 8 నెలలు పూర్తయిన తర్వాత, మొక్కల ఆకులు పడిపోయి, భూమికి ఆచ్ఛాదనగా మారుతుంది కదా.. ఆ తర్వాత కొత్తగా వచ్చే పిలకలు బలంగా, ఆరోగ్యంగా ఎదిగేందుకు మళ్లీ ఎరువులు అందించాలి.నిజానికి అల్లం పంటకు ప్రధానంగా వేరు కుళ్లు, దుంప కుళ్లు, కాండం కుళ్లు తెగుళ్లు సోకుతాయి. ఈ తెగుళ్లు సోకితే వాటి నివారణ కోసం రైతుకు ఖర్చు కొద్దిగా ఎక్కువ అవుతుంది. మందులు వాడినా ఒక్కోసారి అవి నివారణ కాకపోవచ్చు. అల్లం సాగుచేసే భూమిలో నీరు ఎంత వచ్చినా మడి నుంచి దిగువకు వెళ్లిపోయేలా బెడ్‌లను ఒక వైపునకు ఏటవాలుగా తయారు చేసుకోవాలి. ఒకవేళ్ల భూమిలో నీళ్లు నిల్వ ఉంటే వేరు, దుంప, కాండం కుల్లు తెగుళ్లు సోకుతాయని మోహన్ వివరించారు.
ఈ పంట సరైన విధంగా ఎదగాలంటే మైక్రో న్యూట్రియంట్ పోషకాలు, నత్రజని, పొటాష్, భాస్వరం కూడా చాలా అవసరం. వర్షాకాలంలో తప్ప మిగతా కాలాల్లో మొక్కలకు రోజు విడిచి రోజు ఎరువులను డ్రిప్ ద్వారా అందిచాల్సి ఉంటుంది. మొక్కలకు 45 రోజుల నుంచి ఎరువులు అందించడం మొదలుపెట్టాలి. నల్లరేగడి నేలలో అల్లం పంటకు మూడు రోజులకు ఒకసారి బెడ్ తడిసేలా నీరు అందిస్తే.. సరిపోతుంది. నీటిని మడిలో పారిస్తే.. ఎక్కడైనా కొన్ని మొక్కలకు కుళ్లు తెగులు సోకితే మిగతా మొక్కలకు కూడా పాకుతుంది. అదే డ్రిప్ ద్వారా నీరు అందిస్తే… ఇతర మొక్కలకు పాకే అవకాశం ఉండదు. తెగులు సోకిన మొక్కలను భూమి నుంచి తొలగించి దూరంగా వేస్తే సరిపోతుంది. క్రిమి కీటకాల నివారణ కోసం డ్రిప్ ద్వారానే పెస్టిసైడ్స్ అందించుకోవచ్చు.
అల్లం పంట తీసే సమయంలో పొలం వద్దకే వ్యాపారులు వచ్చి కొనుగోలు చేసి, తీసుకెళ్తారని మోహన్ వెల్లడించారు. లేదంటే హైదరాబాద్‌లోని ఉస్మాన్‌గంజ్‌లో తాము అమ్ముతామని అన్నారు.పెళ్లిళ్లు, జాతరలు జరిగే, పచ్చళ్లు పెట్టే మార్చి నెలాఖరు నుంచి ఏప్రిల్ నెలల్లో అల్లం పంట తీస్తే.. డిమాండ్ ఎక్కువ ఉంటుంది. ధర కూడా అధికంగా వస్తుంది. నీటి ఇబ్బంది ఉన్నవారు అల్లం పంటను జూన్ వేస్తారని, తమ పొలం వద్ద నీటి ఇబ్బంది లేదు కాబట్టి మేనెలలోనే విత్తనాలు వేస్తామన్నారు. మిగతా కాలంలో అల్లం విత్తనాలు అందుబాటులో ఉండవని మోహన్ చెప్పారు.
అల్లానికి క్వింటాలు సుమారు రూ.10 నుంచి రూ. 12 వేలు పలుకుతుంది. సగటున ఎకరం నేలలో అల్లం సాగుకు అన్నీ కలుపుకొని సుమారు రూ.3 లక్షలు ఖర్చవుతుంది. 100 క్వింటాళ్లు దిగుబడి వచ్చినా రూ.12 వేల ధర ప్రకారం రూ.12 లక్షలు ఆదాయం వస్తుంది. ఖర్చులు రూ.3 లక్షలు పోగా రూ.9 లక్షలు వస్తుందని మోహన్ వెల్లడించారు. ఒక్కోసారి అల్లం ధర రూ.35 నుంచి రూ.40 వచ్చినా కూడా నష్టం రాదన్నారు