పింక్ పనసలో ఆరోగ్య లాభాలు ఎన్నో ఉన్నాయి. దీనిలో సీ, ఏ విటమిన్‌లు అధికంగా ఉంటాయి. మనలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. నిజానికి పనసలో పీచుపదార్థం చాలా ఎక్కువ. తద్వారా జీర్ణక్రియ మెరుగవుతుంది. మలబద్ధకాన్ని నివారిస్తుంది. పనసలో ఉండే పొటాషియం, ఫైబర్‌లు రక్తపోటును నియంత్రిస్తాయి. గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి. కార్బొహైడ్రేట్లు, ప్రోటీన్ల కారణంగా మనకు కావాల్సినంత శక్తిని అందిస్తాయి. పనసలో ఉండే పిండి పదార్థం బ్లడ్ షుగర్ లెవెల్స్‌ను నియంత్రిస్తుంది. దీనిలోని యాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని రక్షిస్తుంది. యాంటీ ఆక్సిడెంట్లు, ఫైటో న్యూట్రియంట్లు క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తాయి. పనసలో లభించే ఫోలేట్ మహిళలలో సంతానోత్పత్తిని వృద్ధి చేస్తుందని ఆరోగ్య నిపుణులు చెప్పారు. పింక్ పనస నాటిన 15 నెలల్లోనే ఫలాలు ఇస్తుంది. ఐదారు అడుగుల ఎత్తు ఎదిగినప్పటి నుంచే కాయలు కాస్తుంది. సాధారణ పనస చెట్లు ఐదారు ఏళ్ల నుంచి కాపు మొదలు పెడతాయి. 15 నుంచి 20 కిలోల బరువు ఉంటే ఫలాలను ఇచ్చే ఈ చెట్లు పైభాగంలో మాత్రమే కాస్తాయి. పైగా వీటిలో పాలు, బంక కలగలిసిన గ్లూ ఎక్కువ. అదే పింక్ పనస అయితే.. గ్లూ తక్కువ ఉంటుందని గుంటూరు జిల్లా భట్టిప్రోలు మండలం పెదలంకలో శిల్పా నర్సరీ యజమాని సురేంద్ర వెల్లడించారు.
పనసకాయ కూరను మహారాష్ట్ర మొదలు ఉత్తరాది ప్రజలు పనసకాయ కూరను చాలా ఇష్టంగా తింటారు. వారు కూర కోసం పెద్ద కాయల కంటే అరకిలో మొదలు కిలో ఉన్న కాయలు తీసుకుంటారు. ఒక పింక్ పనస చెట్టుకు 70 కాయలు కాస్తే.. అవి పెరిగి పెద్దవైతే చెట్టు ఆ బరువును తట్టుకోలేకపోవచ్చు. వాటిలో కిలో బరువు వచ్చే సరికి 60 కోసి, మార్కెట్‌లో రైతు కిలోకు కనీసం రూ.20 చొప్పున అమ్మినా ముందే ఆదాయం చేతికి వస్తుంది. మిగతా పది కాయలు పెద్దవై, పండ్లు అయితే.. మరింత ఆదాయ లభిస్తుంది.పింక్ పనస మొక్కలు థాయ్‌లాండ్ నుంచి వస్తాయి. దీని తొనలు ముదురు పసుపు రంగులో ఉంటాయి. ఒక కోణంలో చూస్తే.. లేత పింక్ రంగులో కనిపిస్తాయి. మామూలు పనస తొనలు పసుపుపచ్చ రంగులో ఉంటాయి. దీంతో పింక్ పనస తొనలను సులువుగా గుర్తించవచ్చు. ఈ తొనలు చాలా తియ్యగా ఉంటాయి. వీటిని తిన్నవారు మళ్లీ మళ్లీ కావాలని కోరుకుంటారు.
పనస మొక్క నీటి సదుపాయం అంతగా లేని నేలల్లో బాగా పెరుగుతుంది. ఎక్కువ నీరు ఉంటే దీని కాయలు కుళ్లిపోతాయి. చెట్టు కూడా చచ్చిపోయే అవకాశాలు ఎక్కువ. పింక్ పనస రాతి భూములు, ఇసుక భూములు, ఎందుకూ పనికి రాదనుకునే చౌడు భూముల్లో కూడా పెరుగుతుంది. ఎసిడిక్ కాకుండా 9 నుంచి 9.50 చౌడు శాతం ఉన్నా ఇది ఎదుగుతుంది.పింక్ పనస మొక్కలను ఒకదానికి మరో దానికి మధ్య దూరం 15 అడుగులు, సాలుకు సాలుకు దూరం 15 అడుగుల దూరంలో నాటుకోవాలి. ఈ విధంగా ఎకరం నేలలో 200 మొక్కలు వేసుకోవచ్చు. 18 నెలల నుంచీ పింక్ పనస కాపు వస్తుంది. రెండో సంవత్సరం నుంచి 100 కిలోలు, మూడో ఏట 150, నాలుగో సంవత్సరం 200 దిగుబడి ఇస్తుంది. ఏడాది పొడవునా పింక్ పనస కాపు కాస్తుంది. ప్రతి నెలా ఆదాయం ఇస్తూనే ఉంటుంది.
కాయలు మొక్క మొదలులోనే కాస్తాయి. కాబట్టి వర్షం కురిసినప్పుడు మట్టి పడి కాయల అందం తగ్గుతుంది. కనుక మొక్కను నాటే సమయంలో దాని చుట్టూ మల్సింగ్ కానీ, కలుపు మొక్కలతో మ్యాట్ వేసుకోవాలి. పింక్ పనస చెట్టుకు పురుగులు, తెగుళ్ల బాధ ఉండదు. మొక్కకు పశువుల ఎరువు ఎక్కువగా వేసుకోవచ్చు. మొక్కలకు వేసవి కాలంలో రోజుకు ఒకసారి డ్రిప్ ద్వారా నీరు అందించవచ్చు. వర్షాలు మొదలైన జూన్, జులై నుంచి జనవరి వరకు నీటి అందించే అవసరం ఉండదు.
పింక్ పనస మొక్క ఒక్కొక్కటీ రిటైల్‌గా రూ.200కు లభిస్తుంది. హోల్‌సేల్‌లో అయితే.. రూ. 150కే దొరుకుతుంది. పది లేదా ఆపైన ఎక్కువ ఎకరాలలో పింక్ పనస మొక్కలు నాటాలనుకునే ఔత్సాహిక రైతులకు మరి కాస్త తక్కువ ధరకు కూడా దొరుతుతాయి. ఒక్కో మొక్క రూ.150కి కొంటే.. ఎకరంలో 200 మొక్కలు నాటితే రూ.30 వేలు అవుతుంది. పింక్ పనస తోటలో కలుపు తీయాల్సిన అవసరం ఉండదు. అయితే.. అది పెరిగిపోకుండా ట్రిమ్మింగ్ చేస్తే సరిపోతుంది. ఏడాదిన్నరలోనే ప్రతిఫలం వస్తుంది కాబట్టి పెట్టుబడి త్వరగా రికవరీ అవుతుంది. దోరగా పండిన పనస పండును మార్కెట్ పంపాలి. నాలుగైదు రోజులు అది నిల్వ ఉంటుంది. కూర కోసం అయితే.. అరకిలో, కిలో సైజు వచ్చేసరికి మార్కెట్‌కు పంపాలి.
ఇతర వివరాల కోసం నర్సరీ యజమాని సురేంద్రను 9949614751లో సంప్రదించవచ్చు.