దాల్చినచెక్క రక్తంలోని గ్లూకోజ్ స్థాయిలను నియంత్రిస్తుంది. అజీర్తి నుండి ఉపశమనం కలిగిస్తుంది. జీర్ణక్రియను మెరుగు చేస్తుంది. బరువును తగ్గిస్తుంది. గుండె జబ్బు కారకాలను తగ్గిస్తుంది. గ్యాస్ (అపానవాయువు) నుండి ఉపశమనం కలిగిస్తుంది. దాల్చినచెక్కలోని యాంటీ ఆక్సిడెంట్లు ఫ్రీరాడికల్స్‌తో పోరాడతాయి. దాల్చినచెక్కను పేస్ట్‌గా చేసుకొని జుట్టుకు రాసుకుంటే జుట్టు ఒత్తుగా, దృఢంగా తయారవుతుంది. దాగ్చినచెక్కను పొడి లేదా బెరడు రూపంలో వినియోగించవచ్చు. దాల్చిచెక్కను వంటలలో వినియోగిస్తారు. నీటిలో, పాలలో, టీ ఇతర పానీయాలలో కలిపి తీసుకోవచ్చు. కాకపోతే.. దాల్చినచెక్కను ఎక్కువ మోతాదులో తీసుకుంటే దుష్ఫలితాలు రావచ్చు. అందుకే ముందుగా వైద్యుడిని సంప్రదిస్తే మేలు.ఎన్నెన్నో ఆరోగ్య ప్రయోజలు కలిగించే దాల్చిన చెక్కచెక్క మొక్కల పెంపకం చాలా సులువు. ఎలాంటి మందులు, పురుగుమందులు వేయాల్సిన అవసరం ఉండదు. ఈ మొక్కల పెంపకంలో రైతులకు శ్రమ లేనట్టే. మొక్కలు నాటుకొని, నీరు సరఫరా చేస్తే సరిపోతుంది. అంటే దాల్చినచెక్క మొక్కలు గాలికి పెరుగుతాయన్నమాట. దీన్ని నీడలో, ఎండ తగిలేచోట కూడా పెంచుకోవచ్చు. లేదా పొలానికి సరిహద్దు చుట్టూ కూడా నాటుకోవచ్చు. అంతరపంటగా దాల్చినచెక్క సాగుచేస్తే తోటలో కలుపు రాకుండా నివారిస్తుంది.
దాల్చినచెక్క మొక్కలను నేరుగా పొలంలో పెంచవచ్చు. లేదా పామాయిల్ తోటలో అంతర పంటగా సాగుచేయొచ్చు. రెండు వరుసలలోని నాలుగు పామాయిల్ చెట్ల మధ్య, ఆరు మొక్కల వరకు పిట్ మెథడ్‌లో దాల్చినచెక్క మొక్కలు పెంచుకోవచ్చు. ఎకరం నేలలో అంతరపంటగా 50 పిట్‌లు వేసుకోవచ్చు. అంటే పిట్‌కు 6 చొప్పున 50 పిట్లలో 300 మొక్కలు నాటుకోవచ్చు. ఎకరం పొలంలో పిట్‌లు వేయడానికి నలుగురు కూలీలు సరిపోతారు. మొక్కలు కొని వేసుకుంటే మొత్తం ఖర్చు రూ.20 వేల వరకు అవుతుంది. తర్వాత కాండం నుంచి బెరడును తీసుకోవడానికి మాత్రమే ఖర్చు వస్తుంది.
దాల్చినచెక్క మొక్క మొండిజాతిది. కాబట్టి నీళ్లు ఎక్కువైనా, తక్కువైనా తట్టుకొని పెరుగుతుంది. మూడు అడుగుల ఎత్తున్న దాల్చినచెక్క మొక్కను నాటిన రెండేళ్లకు దిగుబడి ఇస్తుందని తూర్పు గోదావరి జిల్లా కలవలపల్లికి చెందిన రైతు ముళ్లపూడి మురళీకృష్ణ తెలిపారు. తొలి పంట తర్వాత మళ్లీ ఏడాదిన్నరకే ఫలసాయం ఇస్తుంది. మొక్క నాటిన రెండేళ్లకు మొక్కను కట్ చేసుకోవాలి. కట్ చేసిన చోట నుంచి మళ్లీ రెండు కొమ్మలు వస్తాయి. వీటిని ఆ తర్వాత ఏడాదిన్నరకే కత్తిరించుకొని చెక్కను తీసుకోవచ్చు. అక్కడి నుండి ప్రతి సంవత్సరం ఆదాయం వస్తుంది.
కేరళలో ఎక్కువగా సాగుచేసే సిలోన్ చిన్నమాన్ రకం మొక్క ఒక్కొక్కటి రూ.25కు దొరుకుతాయి. దాల్చినచెక్క మొక్కలను గ్రాఫ్టింగ్ ద్వారా, విత్తనాల ద్వారా కూడా తయారుచేసుకోవచ్చు. దాల్చినచెక్క మొక్క కాండం గోధుమ రంగులోకి మారినప్పుడు బెరడును కత్తిరించుకోవచ్చు. పచ్చగా ఉన్న కాండం జోలికి వెళ్లకూడదు. దాల్చినచెక్క మొక్క పెరుగుదల, లావును బట్టి అర కిలో బెరడు దిగుబడి వస్తుంది. మొక్క కాండాన్ని కట్ చేసిన తర్వాత దానికి చిన్నచిన్న కొమ్మలు లేకపోతే.. అడుగున్నర చొప్పున కత్తిరించుకోవచ్చు. కట్ చేసిన దాల్చినచెక్క మొక్క కాండం పైన ఉన్న పొరను బ్లేడుతో తొలగించాలి. తర్వాత బెరడును ప్రత్యేక కట్టర్‌తో కాండం నుంచి తొలగించాలి. మొక్కకు పూత రాక ముందే కాండాన్ని కత్తిరించుకోవాలి. డిసెంబర్ నెలాఖరుకు పూత వస్తుంది. అంటే.. అక్టోబర్, నవంబర్ నెలల్లో కిరాణా షాపుల్లో, పర్చేజ్ షాపుల్లో అమ్ముకోవచ్చు.
దాల్చినచెక్క బెరడు పొడవును బట్టి ధర మారుతుంది. రెండు అంగుళాల బెరడుకు తక్కువ ధర పలికితే అడుగున్నర పొడవున్న బెరడుకు ఎక్కువ వస్తుంది. దాల్చినచెక్క మొక్క ఆకులను ఎండబెడితే బిర్యానీ ఆకులుగా తయారవుతాయి. ఎండబెట్టిన ఆకులు రైతు నుంచి కిలో రూ.20కి కొనుగోలు చేస్తారు.
సిలోన్ చిన్నమన్ దాల్చినచెక్కకు మార్కెట్‌లో కిలోకు రూ.1000 ధర పలుకుతుంది. అదే చైనా చిన్నమన్ అయితే.. రూ.400 వరకు వస్తుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని ఏజెన్సీ ప్రాంతాల్లోను, ప్లెయిన్ నేలల్లో కూడా దాల్చినచెక్క సాగు చేసుకోవచ్చని రైతు మురళీకృష్ణ చెప్పారు.