మునగసాగు చేసే రైతుకు కేంద్ర ప్రభుత్వం పనికి ఆహారం పథకం కింద ఎకరానికి రూ.50 వేల రూపాయలు పెట్టుబడి సాయంగా అందజేస్తుంది. ఈ సాయం స్మాల్ స్కేల్ ఫార్మర్స్ అంటే ఐదెకరాల లోపు వ్యవసాయం ఉన్న రైతులు అర్హులు అవుతారు. అలాంటి ఒక్కో రైతుకు ఒక ఎకరానికి కేంద్రం పెట్టుబడి సాయం అందిస్తుంది. మునగ విత్తనాలు నాటిన తొలి ఏడాది రూ.25 వేలు, మరుసటి ఏడాద మరో రూ.25 వేలు కేంద్రం ఇస్తుందన్నారు. భూమిలో గుంతలు తీసి, మునగమొక్కలు పెట్టినప్పుడు, ఆర్గానిక్, లేదా రసాయన ఎరువులు వాడేందుకైనా ఒక ఎకరానికి ఈ మొత్తం కేంద్రం అందజేస్తుంది.బొప్పాయి, డ్రాగన్ ఫ్రూట్ లాంటి పంటలకు కూడా సర్కార్ పెట్టుబడి సాయం అందిస్తుంది. పనికి ఆహారం పథకం కింద ఎక్కడెక్కడ మునగ సాగు జరుగుతోందో గ్రామ సభలలో అగ్రికల్చర్ ఫీల్డ్ ఆఫీసర్లు చెబుతుంటారు. రైతులు ఏయే పంటలు పండించడంలేదో.. భవిష్యత్తులో ఎలాంటి రకాలకు కొరత రాకూడదో అలాంటి వాటికి కేంద్ర ప్రభుత్వం ఆర్థికంగా సాయం అందిస్తుంది. దేశంలో నానాటికీ సాగు తగ్గిపోతున్న వరికి కొంతమొత్తంలో పెట్టుబడి సాయం అందించే పరిస్థితి రావచ్చని 12 ఏళ్లుగా కూరగాయలు పండిస్తున్న రైతు రమేష్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. ఆక్వా, హార్టీకల్చర్ లాంటి ఇతర పంటలపై అన్నదాతలు ఎక్కువ మొగ్గు చూపుతుండడంతో వరి సాగు అంతకంతకూ తగ్గిపోతుండడం తెలిసిన విషయమే. పంటలకు ప్రభుత్వం నుంచి సబ్సిడీ ఎలా పొందాలో చాలా మంది రైతులకు తెలియడం లేదు. పలువురు మండల ఆఫీసు అధికారులకు కూడా ఏయే పంటలకు ప్రభుత్వం సబ్సిడీ ఉంటుందో పూర్తిగా తెలియకపోవచ్చు.
ఎకరం నేలలో వెయ్యి మొక్కలు నాటుకోవచ్చు. అంతకు మించి మొక్కలు నాటుకోవచ్చు కానీ తర్వాత వచ్చిన కలుపుగడ్డిని దున్నేందుకు ఇబ్బంది అవుతుంది. ఎకరానికి అరకిలో మునగ విత్తనాలు సరిపోతాయని గుంటూరు జిల్లా నిడుముక్కల మునగరైతు బండ్ల రామ్మోహన్‌రావు తెలిపారు. సాలుకు సాలుకు మధ్య 100 నుంచి 110 అంగుళాల దూరం పెట్టుకోవాలన్నారు. మొక్కకు మొక్కకు మద్య 80 నుంచి 94 అంగుళాల దూరంలో నాటుకోవాలని చెప్పారు. మునగ మొక్కలను రెండేళ్లు ఉంచితే ఆదాయం బాగా వస్తుంది. ఆపైన దాన్ని ఉంచితే మగపువ్వులు ఎక్కువ వస్తున్నట్లు శాస్త్రీయంగా నిర్ధారణ అయిందని చెప్పారు. అందుకే ప్రతి ఏటా కొత్తగా విత్తనాలు నాటుకుంటే ఫలితం ఆశించిన స్థాయిలో ఉంటుందన్నారు.
మునగ విత్తు పెట్టిన 15 నుంచి 18 రోజుల లోపల మొలక వస్తుంది. అంతవరకు భూమిలో ఉన్న విత్తనాలకు ప్రతిరోజు నీరు పోస్తూనే ఉండాలి. నీరు సరిగా అందకపోతే ఈ ఏడాది పెట్టిన మునగ విత్తనం మరుసటి ఏడాదికి కూడా పాడవకుండా భూమిలో అలాగే ఉంటుంది. ఇదే మునగ విత్తనం ప్రత్యేకత అన్నారు రమేష్‌రెడ్డి. ఒక అడుగు ఎత్తు వచ్చిన తర్వాత మునగ మొక్కను విరిచినా చనిపోదు. భూమిలోపల వేరు ఉన్నంత వరకు మునగమొక్క చిగురిస్తూనే ఉంటుందన్నారాయన. ఎలాంటి నేలలో పెట్టినా మునగచెట్టు బతుకుతుంది. అయితే ఎర్ర గరప నేలలైతే పంట దిగుబడి అధికంగా వస్తుందన్నారు రామ్మోహన్‌రావు. ఆయన 33 సంవత్సరాలుగా మునగసాగులో మంచి అనుభవం గడించారు.
మునగచెట్టు విత్తు నాటిన ఆరు నుంచి ఎనిమిది నెలల్లో పంట కోతకు వస్తుంది. నర్సరీలలో కవర్లతో పెంచిన మునగమొక్కలను అలాగే గుంతలలో పెడితే చెట్టు బాగానే ఉంటుంది కానీ పంట మాత్రం ఏడాది అయినా రాదు. నేరుగా భూమిలో విత్తనం నాటితేనే కాపు కాస్తుంది. భూమిలో విత్తు నాటితేనే చెట్టు బాగుంటుంది. అధిక లాభాలు ఇస్తుంది. అలా అదును చూసి రెండు ఎకరాల 10 గుంటల్లో మునగ సాగు చేస్తే ఖర్చులన్నీ పోగా రూ.4.50 లక్షలు మిగిలిందన్నారు రమేష్‌రెడ్డి. మునగతోటలో అంతర పంటలుగా టామాటా, చిక్కుడు, క్యాబేజి, మిర్చి, ఉల్లి లాంటి పంటలు సాగుచేసుకోవచ్చన్నారు.వేలాది రూపాయల ఖర్చుతో రసాయన ఎరువులతో సాగు చేస్తే.. రైతుకు మిగిలేది ఉండదని రైతు రమేష్‌రెడ్డి చెప్పారు. సాంప్రదాయ పద్ధతిలో కూరగాయల సాగు చేసి ఆయన మంచి లాభాలు ఆర్జిస్తున్నారు. పంటలకు ఎన్ని ఎరువులు వాడినా పశువుల ఎరువు తప్పనిసరి అన్నారు రమేష్‌రెడ్డి. తాను కూరగాయల సాగు కోసమే ప్రత్యేకంగా ఆవులను పెంచుతున్నట్లు చెప్పారు. వ్యాపార పరంగా మునగ లాంటి కూరగాయలు పండించే వీలు, సమయం లేని వారు తమ కుటుంబ అవసరాల కోసమైనా ఇంటి పెరట్లో, టెర్రస్ మీద కూడా ఆర్గానిక్ విధానంలో కూరగాయలు పండించుకోవాలని సూచించారు రమేష్‌రెడ్డి
వివరాల కోసం రైతు రమేష్‌రెడ్డిని 9704137827 నెంబర్‌లో సంప్రదించవచ్చు.