అల్లంలో అనేక ఔషధ గుణాలు, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు ఉన్నాయి. ఇవి కీళ్లనొప్పులు తగ్గిస్తాయి. కీళ్ల కదలికలను సులభం చేస్తాయి. రక్తాన్ని అల్లం పలచన చేస్తుంది. కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో ఉపయోగపడుతుంది. గుండెపోటు, స్ట్రోక్‌ల ప్రమాదం తగ్గుతుంది. విటమిన్ బీ 3, విటమిన్ బీ 6, విటమిన్ సీ, ఐరన్, పొటాషియం, మెగ్నీషియం, జింక్, ఫొలేట్ ఉన్నాయి. ఆహారంలో అల్లం వాడితే జీర్ణక్రియ మెరుగు పడుతుంది. రోగనిరోధక వ్యవస్థ బలపడుతుంది. గ్యాస్, మలబద్ధకం, అజీర్ణ సమస్యలను నివారిస్తుంది. ఒత్తిడి, అల్జీమర్స్ నుంచి రక్షణ కల్పిస్తుంది. కొవ్వును కరిగిస్తుంది కాబట్టి బరువు తగ్గేందుకు అల్లం చాలా పనిచేస్తుంది. జలుబు, దగ్గు నివారణకు మంచి ఆహారం అల్లం. రక్తంలో సుగర్ స్థాయిలు తగ్గిస్తుంది కాబట్టి అల్లం మధుమేహ రోగులకు వరప్రదాయిని అని చెప్పొచ్చు. చర్మాన్నిఅల్లం ఆరోగ్యంగా ఉంచుతుంది. దీనిలోని యాంటీ ఆక్సిడెంట్లు మూత్ర విసర్జనను మెరుగుపరుస్తాయి. ఇలాంటి మరెన్నో ఆరోగ్య ప్రయోజనాలున్న అల్లం సాగులో కీలక అంశాల గురించి తెలుసుకుందాం.అల్లం విత్తనం నాటినప్పటి నుండి 8 నుంచి 9 నెలల మధ్యలో కోతకు వస్తుంది. అల్లం హార్వెస్ట్ చేసే సమయంలో మార్కెట్‌లో ధర తక్కువ ఉంటే మరికొంత కాలం పైరును అలాగే ఉంచినా నష్టం ఉండదు. మరింత లాభం రావడం రైతుకు కలిసి వచ్చే అంశం అంటారు మహబూబ్‌నగర్ జిల్లా హేమాజీపూర్‌లో మహిం రకం అల్లం సాగులో విజయాలు సాధిస్తున్న యువ రైతు దినేష్. అల్లం మొక్కలను మరింత కాలం ఉంచితే ఇంకా పిలకలు వస్తాయి. ఆ పిలకల ద్వారా అదనంగా అల్లం దుంపలు వస్తాయని తెలిపారు. అల్లానికి పీచు పదార్థం ఎక్కువగా ఉండి, తెగుళ్లు సోకే అవకాశం చాలా తక్కువ. వేరుకుళ్లు, దుంపతెగుళ్లు వచ్చే ఛాన్స్ తక్కువ అని అంటారు సంగారెడ్డి జిల్లా రంజోల్ రైతు మోహన్.
మహిమ్ అల్లం విత్తనం మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌లో దొరుకుతుంది. అక్కడ కిలో అల్లం విత్తనం ధర సుమారు 95 రూపాయలు ఉంటుంది. ఆపైన దూరాన్ని బట్టి రవాణా, ఇతర చార్జీలు ఉంటాయి. ఎకరం భూమిలో 1200 కిలోల అల్లం విత్తనాలు సరిపోతాయి. జూన్‌లో అల్లం విత్తనాలు నాటుకుంటే పంటకు అనుకూల సమయం. అల్లం సాగుచేసే నేలను బెడ్లుగా చేసుకుని విత్తనాలు నాటుకోవాలి. విత్తనాలు నాటిన బెడ్లపై డ్రిప్ ఇరిగేషన్ పైపులు వేసుకోవాలి. బెడ్డుకు బెడ్డుకు మధ్య నాలుగున్నర అడుగుల దూరం వేసుకోవాలి. ఒక్కో బెడ్డు అడుగు భాగంలో ఒక మీటర్, పైన 70 సెంటీమీటర్లు ఉండేలా వాలుగా చేసుకోవాలి. బెడ్ల మీద అల్లం విత్తనాల మధ్య జిగ్ జాగ్‌గా 15 సెంటీమీటర్ల దూరం ఉండేలా నాటుకోవాలి. 20 సెంటీమీటర్లు కూడా పెట్టుకోవచ్చు. ఎకరం భూమిలో 30 నుంచి 35 వేల మొక్కలు పెంచుకోవచ్చు.
అల్లం సాగు చేసే బెడ్లను తయారు చేసేటప్పుడు ఏమేమి చేయాలో చూద్దాం. పొలాన్ని మొదటగా బాగా దున్నాలి. ఆ భూమిలో సుమారు 18 నుంచి 22 టన్నుల గోబర్ ఎరువు వేయాలి. దాంతో పాటు ఫాస్పరస్ అధికంగా ఉండే చెరకు పిప్పిని 3 టన్నులు వేస్తే ఫలితం మరింత బాగా ఉంటుంది. చెరకు పిప్పి వేయడం వల్ల అల్లం మొక్కలు చాలా త్వరగా ఎదుగుతాయి. చెరకు పిప్పి కిలో సుమారు రూ. 9కి లభిస్తుంది. గోబర్ ఎరువుకు దాదాపు టన్నుకు వెయ్యి రూపాయల ఉంటుంది. ఆ తర్వాత భూమిని బెడ్లుగా చేసుకుని అల్లం విత్తనాలు నాటుకోవాలి. విత్తనాలు నాటినప్పటి నుంచి 21 రోజుల పాటు భూమిలో తేమను బట్టి సరిపడినంత నీరు సరఫరా చేయాలి.
విత్తనం నాటినప్పటి నుండి మూడు నెలల వరకు అల్లం మొక్కలు ఎదిగే సమయం. మొక్కలు ఎదిగే సమయంలో వారానికి ఒకసారి 19:19:19, లేదా 12:61, మైక్రో ఇంగ్రిడెంట్లు 100 గ్రాములు డ్రిప్ ద్వారా ఎకరానికి మూడు కిలోలు అందించాలి. మొక్కలకు ఏదైనా పురుగు పట్టినా, ఇతర డిసీజ్‌లు వచ్చినా క్లోరోపైరిఫాస్, సీఓసీ లాంటివి స్ప్రే చేసుకోవాలని దినేష్ తెలిపారు. మొక్కల పెరుగుదల సమయం పూర్తయిన తర్వాత భూమిలో అల్లం దుంప బాగా ఎదిగేందుకు ఫాస్పరస్‌ను 6 నుంచి 7 నెలలు వాడాలి. ఇలా అల్లం సాగు, సస్యరక్షణ చేస్తే ఒక్కో మొక్క నుంచి అరకిలో వరకు దిగుబడి వస్తుంది. అంతకు మించి కూడా కొన్ని మొక్కల నుంచి దిగుబడి రావచ్చు. ఒక్కో మొక్కకు అరకిలో అల్లం వచ్చినా 35 వేల మొక్కల నుంచి దాదాపు 17 టన్నులు వస్తుందని దినేష్ వివరించారు. అల్లం 15 టన్నులు దిగుబడి వచ్చినా మంచి పంట కిందే లెక్క.
అల్లం సాగులో ఎక్కువ ఖర్చు వచ్చేది విత్తనానికి. ఎకరానికి లక్ష నుంచి లక్షా పాతిక వేల వరకు అవుతుంది. ఆపైన భూమిని దున్నేందుకు, రోటావేటర్‌తో బెడ్లు చేసేందుకు అయ్యే ఖర్చు రూ.5 నుంచి ఐదున్నర వేల వరకు ఉంటుంది. గోబర్ ఎరువుకు సుమారు 18 నుంచి 20 వేలు అవుతుంది. చెరకు పిప్పికి రూ.2,700 ఉంటుంది. తొలిసారి డ్రిప్ వేసుకుంటే దాని ఖర్చు ఉంటుంది. కూలీలను పెట్టుకుంటే వారికి జీతభత్యాలు ఇవ్వాలి. విత్తనం నాటిన తర్వాత 25 నుంచి 30 రోజుల మధ్యలో సాళ్ల మధ్య మట్టిని ఎగదోసేందుకు మిషన్‌కు అయ్యే ఖర్చు ఎకరానికి రూ.10 ఉంటుంది. అల్లం పైరుకుపై చల్లే పురుగు మందులు, డ్రిప్‌లో వదిలేవి అన్నీ కలిపి రూ.10 వేలు వరకు వస్తుంది. అల్లం పంట తీసేందుకు కూలీలు క్వింటాల్‌కు రూ.500 వరకు తీసుకుంటారు. పంట తీసే కూలీల ఖర్చు ఎకరానికి రూ.7,500 ఉంటుంది. ఇలా ఎకరం నేలతో అల్లం సాగుకు సుమారు రెండు లక్షల వరకు అవుతుంది.
అల్లం పంట 8 నుంచి 9 నెలల మధ్యలో కోతకు వస్తుంది. అయితే.. మార్కెట్‌లో సరైన ధర లేకపోతే మరికొద్ది నెలలు పంట తీయకపోయినా పరవాలేదు. వర్షాలు కురిసినప్పుడు అల్లం ధర స్థానికంగా కాస్త ఎక్కువ లభిస్తుంది. అల్లానికి మార్కెట్‌లో హోల్‌సేల్‌గా కిలోకు రూ.70 నుంచి రూ.110 వరకు ధర పలుకుతుంది. ఇలా చూసుకున్నా ఎకరంలో 15 టన్నులే దిగుబడి వచ్చినా రూ.10.50 లక్షలు ఆదాయం ఉంటుంది. ఖర్చులన్నీ పోగా ఏడాదిలో నికర లాభం ఎక్కువగానే ఉంటుంది.