కాకరకాయను తింటే చేదుగా ఉంటుంది. దాన్ని పండించే రైతుకు మాత్రం చక్కని లాభాల తీయ్యదనg అందిస్తుంది. కాకరకాయలో ఎన్నెన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. దీనిలో ఉండే అతి ముఖ్యమైనది డయాబెటీస్‌ను నియంత్రించే లక్షణం. కాకరలోని తక్కువ కేలరీలు, పీచు బరువును తగ్గిస్తాయి. కాకరలోని పీచుపదార్థం జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. మలబద్ధకం సమస్యను నివారిస్తుంది. విటమిన్లు, ఖనిజాలు కాకరలో పుష్కలం కాబట్టి రోగ నిరోధకశక్తి పెంచుతాయి. దీనిలోని విటమిన్ ఏ కంటి ఆరోగ్యాన్ని రక్షిస్తుంది. కాకరలోని పొటాషియం రక్తపోటును నియంత్రించి, గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది. యాంటీ ఆక్సిడెంట్లు, ఇతర పోషకాలు చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. కాకర తిన్నవారి కాలేయం శుభ్రంగా ఉంటుంది.

బాలసానిపల్లికి చెందిన ముమ్మడి శివశంకర్‌ 15 ఏళ్లుగా కాకరపంట సాగు చేస్తున్నారు. టమోటా సాగు కోసం వేసిన బెడ్లపై ఆ పంట తీసేసిన తర్వాత కాకర పాదులు పెంచుతారు ఆయన. దీనివల్ల దుక్కి దున్నే ఖర్చు, స్టేకింగ్ ఖర్చు, అంతగా లేబర్‌ ఖర్చు ఉండదని చెప్పారు. రూ.750కి లభించే 50 గ్రాముల ఈస్ట్‌వెస్ట్‌ ప్రగతి సీడ్స్‌ ఎకరానికి 10 ప్యాకెట్లు సరిపోతాయన్నారు. బెడ్లపై కర్రలను ఐదు అడుగుల దూరంలో పాతుకొని, వాటిని వైరుతో కలుపుకోవాలి. ఒక్కో కర్ర పక్కన ఒక్కో విత్తనం నాటుకుంటే సరిపోతుంది. అయితే.. తాను మధ్యలో కూడా మరో విత్తనం నాటడం వల్ల తీగలు బాగా ఒత్తుగా పెరిగి, దిగుబడి తగ్గిందన్నారు.కాకరపాదులకు సాధారణంగా వర్షాలు పడినప్పుడు బూడిద తెగులు వచ్చే అవకాశం ఉందన్నారు. దాని నివారణ కోసం ప్రతి 15 రోజులకు ఒకసారి మందులు కొట్టాలి. అయితే.. మొక్కలకు 20 రోజులు వచ్చే వరకు ఎలాంటి మందులు కొట్టనక్కరలేదు. అప్పుడప్పుడూ త్రిప్ట్స్‌ కూడా వస్తాయి. కాకరకు ఎరువులు పెద్దగా వేయాల్సిన అవసరం ఉండదు. ఎకరానికి బస్తా వేస్తే సరిపోతుంది. తీగ ఎంత ఎక్కువ పాకితే అంత తక్కువ దిగుబడి వస్తుంది. ఎక్కువ ఎరువులు వేస్తే.. తీగ బాగా పెరిగిపోతుంది. భూమిలో ఉన్న సారాన్ని పీల్చుకునేలా కాకరపాదులకు అలవాటు చేయాలని శివశంకర్‌ చెప్పారు. అత్యుత్సాహంతో ఎక్కువ మందులు వేయవద్దని సూచించారు.అంతకు ముందు టమాట సాగు కోసం నాటిన కట్టెలను తీసి, మరోసారి వాటినే నాటుకోవాల్సి ఉంటుంది. లేకపోతే అవి పడిపోయే అవకాశం ఉంటుంది. ఎకరానికి కాకర విత్తనాలకు దాదాపు రూ.8 వేలు అవుతుంది. విత్తనం నాటిన ఎనిమిది నుంచి 10 రోజులకు మొక్కలు వస్తాయి. విత్తనాలను ముందుగానే నానబెట్టి నాటితే రెండు రోజులు ముందే మొలుస్తాయి. కాకర విత్తనాలు ఏ సీజన్‌లో అయినా నాటుకోవచ్చు. జూన్‌, జులై, ఆగస్టు నెలల్లో కాకరకు ధరలు బాగా ఉంటాయి.కాకరపాదుల నుంచి 60 రోజులకు తొలి కటింగ్‌ వస్తుంది. అక్కడి నుంచి ప్రతి నాలుగు రోజులకు కోతకు వస్తూనే ఉంటుంది. తొలి కటింగ్‌లో తమకు ఒక ఎకరాలో తమకు 45 కిలోల బరువు ఉండే 20 పెట్టెల దిగుబడి వచ్చిందని శివశంకర్‌ అన్నారు. ఎకరం కాకరపాదుల నుంచి కాయలు కోసి, పెట్టెల్లో నింపేందుకు ఐదుగురు మనుషులు సరిపోతారు. తరువాతి కటింగ్‌ నుంచి పట్టుకు 50 నుంచి 60 బాక్సుల కాకారకాయలు కోసినట్లు చెప్పారు. ఇలా తమ ఒకటిన్నర ఎకరంలో పెట్టుబడి అంతా పోగా రూ.6 లక్షలు మిగిలినట్లు శివశంకర్‌ వెల్లడించారు.ఎకరం భూమిలో కాకరపంట సాగుకు రూ.70 వేలు వరకు పెట్టుబడి అవసరం అవుతుంది. తొలిసారిగా కాకరసాగు చేయాలనుకునే రైతులకు అదనంగా కర్రలు కొని, పాతుకునే ఖర్చు అధికం అన్నారు శివశంకర్‌. మార్కెట్‌లో కాకరకాయలు కిలో రూ.20 నుంచి రూ.25 మధ్య ధర రైతుకు వస్తే నష్టం ఉండదు. అంతకు మించి రేటు వస్తే లాభం ఇంరా పెరుగుతుంది. తాము ఎక్కువగా చెన్నై, బెంగళూరు మార్కెట్లలో కాకరకాయలు అమ్ముతామని శివశంకర్‌ తెలిపారు. కాకరకాయలను గోనెసంచుల్లో మార్కెట్‌కు పంపించే బదులు అట్ట బాక్సుల్లో పంపిస్తే.. కిలోకు ఐదు రూపాయలు అదనంగా లభిస్తుందని చెప్పారు. కాకరసాగుతో చెడిన రైతు లేడని శివశంకర్‌ చెప్పారు.