వక్కల వినియోగం అత్యంత ప్రాచీన కాలం నుంచీ ఉంది. హిందువులు పూజలలో తమలపాకులలో వక్కలు పెట్టి తాంబూలం పెడతారు. వక్కలలో బీ 6, సీ విటమిన్లు, భాస్వరం, కాల్షియం, రాగి, ఇనుము లాంటి ఖనిజాలు ఎక్కువగా ఉంటాయి. వక్కలు జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. అందుకే తాంబూలంలో, కిళ్లీలు, లేదా పాన్లలో వక్కలను వాడుతుంటారు. వికారం, విరేచనాలను తగ్గించేందుకు ఇవి ఉపయోపడతాయి. వక్కలకు ఆయుర్వేదంలో విలువైనవిగా పరిగణిస్తారు. వక్క మొక్క చాలా మొండిది. ఒకవేళ ట్రాక్టర్ తొక్కినా బతికేస్తుంది.
వక్క మొక్కలు నాటిన తర్వాత కొన్ని నాలుగైదు ఏళ్లలోనే తొలి ఫలసాయం ఇస్తాయి. మరికొన్ని ఏడెనిమిది ఏళ్లకు దిగుబడి ఇస్తాయి. వక్క చెట్టు వగరుగా ఉంటుంది. కాబట్టి చీడ పీడల బెడద ఉండదు. తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని కొన్ని ప్రాంతాలు వక్క సాగుకు అనువైనవని శాస్త్రవేత్తలు చెబుతారు. మొక్కలు కొని తేవడం, నాటడం, కొద్దిగా పశువుల పెంట, తగినంత నీటి సదుపాయం ఇస్తే సరిపోతుంది. ఆధునిక రైతులు కొందరు కొద్ది మొత్తంలో రసాయన ఎరువులు వాడుతున్నారు. వక్క పంట కోత కోసే కూలీల ఖర్చు కూడా రైతుకు ఉండదు. వక్కపంటను కొన్న వ్యాపారులే కోయించుకుంటారు. కనీసం లారీ వక్క కాయలు ఉంటే వ్యాపారులు లేదా దళారులు రైతు వద్దకే వచ్చి కొనుగోలు చేస్తారు. అంతకు తక్కువ ఉంటే స్థానికంగా కూడా కొనేవారు ఉంటారు.ఆంధ్రప్రదేశ్లోని ఏలూరు జిల్లా కామవరపుకోట మండలం కళ్లచెరువులోని రైతు శ్రీనివాసరావు ఐదేళ్లుగా వక్కసాగును విజయవంతంగా చేస్తున్నారు. మిగతా మెట్ట పంటల కన్నా వక్క చెట్ల పెంపకానికి పెట్టుబడి తక్కువ, ఆదాయం బాగుంటుందని ఆయన చెప్పారు. ఎకరం వక్క తోట నుంచి తొలిసారి పంటగా 4 టన్నుల పచ్చికాయలు వస్తాయని భావిస్తున్నారు. ఆ నాలుగు టన్నుల వక్క కాయలను తోట వద్దకే వచ్చిన వ్యాపారులు లక్ష రూపాయలకు ముందుగానే కొన్నారని చెప్పారు. ఆ తర్వాతి నుంచి ఎకరానికి 4 నుంచి 5 లక్షల వరకు ఆదాయం వచ్చే అవకాశం ఉందని అన్నారు. అనంతపురం జిల్లా మడకశిర, కర్ణాటకలలో వక్క రైతులు ఎకరానికి ఐదు లక్షలకు పైగా ఆదాయం సంపాదిస్తున్నారని తెలిపారు. వక్క మొక్కలు నాటిన 8వ ఏట నుంచి పూర్తిస్థాయి దిగుబడి ఇస్తుంది.
వక్క చెట్టుకు ఏప్రిల్ నెలలో పూత మొదలవుతుంది. సెప్టెంబర్ నెలలో కాయలు కోతకు వస్తాయి. చెట్టు ముదిరే కొద్దీ గెలలు బలంగా, ఎక్కువ కాయలు వస్తాయి. సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ నెలల్లో ఒక్కో నెలకు ఒక కోత వస్తుంది. తూర్పు గోదావరి జిల్లా అంబాజీపేటలో వక్కలకు మార్కెట్ ఉంది. లేదంటే కర్ణాకట వ్యాపారులు కొనుగోలు చేస్తారని శ్రీనివాసరావు చెప్పారు. వక్క కాయలకు అంతకంతకూ పెరుగుతూనే ఉంటుంది కానీ తగ్గడం లేదన్నారు. మిగతా పంటల కన్నా వక్కసాగు లాభదాయకంగా ఉందని తెలిపారు.
వక్క మొక్కలను 9X8 అడుగుల దూరంలో నాటుకోవాలి. ఇలా వేస్తే.. ఎకరం నేలలో 600 మొక్కలు నాటుకోవచ్చు. గాలి, వెలుతురు ఎక్కువ వచ్చి, దిగుబడి ఎక్కువ కావాలంటే 9X9 అడుగుల దూరంలో నాటితే మంచిది. ఒక్కో చెట్టుకు ఏడాదికి తట్టెడు పశువుల ఎరువు, 50 గ్రాముల డీఏపీ వేస్తే సరిపోతుందన్నారు. నీరు ఎక్కువ కాకుండా, తక్కువ కాకుండా చూసుకోవాలి. ఉష్ణోగ్రత 40 నుంచి 45 డిగ్రీల వరకు వక్క మొక్కలు తట్టుకొని బతుకుతాయి. అంతకు ఉష్ణోగ్రత పెరిగితే కాయలు రాలే అవకాశం ఉంటుంది. మే, జూన్ నెలల్లో వర్షాలు కురిస్తే.. వక్క పంట దిగుబడి చాలా ఎక్కువ ఉంటుందని శ్రీనివాసరావు చెప్పారు. ఒకటి నుంచి రెండేళ్లు వచ్చిన వక్క మొక్కలను ఒక చోట నుంచి తీసి, మరోచోట నాటినా బతుకుతుంది.
వక్క మొక్కలు నాటిన తొలి రెండు సంవత్సరాలు అంతర పంటగా అరటి వేసుకోవచ్చని శ్రీనివాసరావు అన్నారు. అరటి ఏడెనిమిది నెలల్లో పెరిగిపోతుంది కాబట్టి వక్క మొక్కలకు ఎలాంటి ఇబ్బందీ ఉండదు. తొలిసారి నాటి అరటి మొక్కలు పంట ఇచ్చిన తర్వాత వాటిని కొట్టేస్తారు. వాటి పిలికల వల్ల కూడా వక్క పంటకు నష్టం ఉండదు. వక్క తోటలో అంతర పంట కావాలంటే వేసుకోవచ్చు. లేకపోయినా నష్టం ఏమీ ఉండదన్నారు శ్రీనివాసరావు. పచ్చి వక్క కాయలు టన్నుకు సుమారు రూ.60 వేలు వరకు ధర వస్తుంది. ఎండబెట్టిన కాయలకైతే రూ.50 వేలు వరకు ఆదాయం ఉంటుంది. కాయలను నోటితో కొరికితే పగిలిపోకుండా ఉంటే చెట్టు నుంచి గెలలు కోస్తారు.
వక్కమొక్కలు వగరుగా ఉంటాయి కాబట్టి వాటిని పశువులు కానీ, మేకలు, గొర్రెలు కూడా తినవు. వక్క మొక్కలను ఎలాంటి పురుగులూ ఆశించవు. అందుకే పురుగు మందుల ఖర్చు కూడా ఉండదు. వక్క మొక్కల ఆకులు తయారైన తర్వాత వాటంతట అవే రాలిపోతాయి. ఆ ఆకులే మళ్లీ భూమికి సేంద్రీయ ఎరువుగా పనికి వస్తాయి. రాలిన ఆకులను నేలను చిన్న ట్రాక్లర్తో తొక్కించినా, లేదా అలానే వదిలేసినా కూడా వాటి నుంచి పోషకాలు భూమిలోకి చేరిపోతాయి. నాలుగేళ్లు దాటిన వక్కచెట్ల మట్టలను ఒక్కొక్కటి రూ.1.50 కు కొంటున్నారని శ్రీనివాసరావు చెప్పారు. వాటిని విస్తరాకుల తయారీకి వినియోగిస్తున్నారన్నారు. ఒక్కో చెట్టు నుంచి ఏడాదికి ఐదారు మట్టలు రాలిపోతాయి. వీటి వల్ల రైతుకు అదనపు ఆదాయం ఉంటుంది.
అనంతపురం జిల్లా గుమ్మగట్ట మండలం తాళ్లకెరలోని రైతు మహమ్మద్ బాషా రెండు దశాబ్దాలకు పైగా వక్కసాగు చేస్తున్నారు. ఎకరం నేలలో తాము 8X8 అడుగుల దూరంలో సుమారు వెయ్యి మొక్కలు నాటినట్లు చెప్పారు. కొందరు రైతులు 6X6 అడుగుల దూరంల కూడా పెడుతున్నారన్నిరు. కర్ణాటకలోని శివమొగ్గ నుంచి వక్క మొక్కలు తెచ్చామన్నారు. అప్పుడు ఒక్కో మొక్క ఖరీదు రూ.20 ఉందని వెల్లడించారు. ఆ తర్వాత తర్వాత వాటి ఖరీదు రూ.40 నుంచి 50 రూపాయల వరకు ఉందన్నారు. వక్క విత్తనం తెచ్చుకొని, నారు అభివృద్ధి చేసుకుంటే ఒక్కో దానికి రూ.5 ఖర్చవుతుంది. వక్క మొక్కలకు నాలుగు రోజులకు ఒకసారి మూడు నుంచి మూడున్నర లీటర్ల నీరు ఇవ్వాలన్నారు.
పశువుల ఎరువులు వేసిన పూర్వకాలంలో ఒక్కో వక్కచెట్టు 70 ఏళ్ల వరకు కూడా దిగుబడి ఇచ్చేవని కర్ణాటక రాష్ట్రం దావణగెరె రైతు డాక్టర్ నెక్కంటి రామాంజనేయస్వామి చెప్పారు. రైతులు ఇప్పుడు రసాయన ఎరువులు వేస్తుండడంతో వాటి జీవనకాలం తగ్గిందన్నారు. వక్కకు మార్కెట్లో ఎప్పుడూ డిమాండ్ ఉంటుందని తెలిపారు. తక్కువ పెట్టుబడితో దశాబ్దాల తరబడి ఆదాయం వస్తుండడంతో కొందరు రైతులు కొబ్బరితోటలను తీసేసి, వక్క తోటలు పెంచుతున్నట్లు చెప్పారు.