ఇడుక్కికి చెందిన పన్నూజ్ జాకబ్ ఉద్యోగం నుంచి రిటైర్ అయిన తర్వాత హాబీగా వ్యవసాయం చేస్తున్నాడు. ఇప్పుడు ‘మంగలం ఫుడ్స్’ బ్రాండ్ పేరుతో రోజూ 20 కిలోల తాజా ఆర్గానిక్ కూరగాయలు అమ్ముతున్నాడు. తద్వారా జాకబ్ కు చక్కని వ్యాపకం దొరికినట్లయింది. దాంతో పాటు ఆదాయమూ బాగానే సంపాదిస్తున్నాడు. జాకబ్ కుటుంబ నేపథ్యం వ్యవసాయమే.
ఆర్గానిక్ వ్యవసాయాన్ని హాబీగా చేయాలని జాకబ్ నిర్ణయించుకున్నాడే కానీ.. తొలి రోజుల్లో భారీ స్థాయిలో వ్యవసాయం చేసేందుకు అతనికి భూమి దొరకడం సమస్యగా మారింది. దాంతో తమ ఇంటి టెర్రస్ పైనే మెల్లిగా కూరగాయల సాగు మొదలుపెట్టాడు. తమ ఇంటికి ఎదురుగా ఉండే మూడు అంతస్థుల భవనాన్ని అద్దెకు తీసుకున్నాడు జాకబ్. దానిపై ఉన్న 3,500 చదరపు అడుగుల టెర్రస్ పైనే తాను అనుకున్న విధంగా ఆర్గానిక్ కూరగాయల సాగు చేయడం ప్రారంభించాడు. ప్రతి పనిని ఎంతో క్రమశిక్షణతో, పరిశుభ్రంగా నిర్వహించే తాను ఆ చిన్న టెర్రస్ పైనే శ్రద్ధగా కూరగాయల సాగు మొదలెట్టినట్టు జాకబ్ తెలిపాడు.
అలా ఏళ్లు గడిచిన కొద్దీ జాకబ్ తన మిద్దె తోటలో గుమ్మడి, కాలీఫ్లవర్ లాంటి రకాలు కూడా పండిస్తున్నాడు. వాటితో పాటు ఆనప, కాకర, పొట్లకాయ లాంటి తీగ జాతి కూరగాయలు కూడా సాగుచేస్తున్నాడు. వాటిని తన సొంత బ్రాండ్ ‘మంగలం ఫుడ్స్’ పేరుతో తాను నిర్ణయించిన ధరల ప్రకారం విక్రయిస్తున్నాడు. అలా జాకబ్ ప్రతి రోజూ 20 నుంచి 25 కిలోల తాజా ఆర్గానిక్ కూరగాయలు అమ్ముతున్నాడు. జాకబ్ తాను తమ టెర్రస్ పై పండించిన తాజా కూరగాయలను నీట్ గా ప్యాక్ చేసి, సమీపంలోని సూపర్ మార్కెట్ కు తీసుకెళ్లి కొన్ని గంటల్లోనే అమ్మేస్తున్నాడు.
జాకబ్ పండిస్తున్న ఆర్గానిక్ కూరగాయలంటే జనం ఎంతో ఇష్టపడి కొనుగోలు చేస్తుంటారు. మార్కెట్ లో కిలో టమోటా ధర రూ.10 ఉన్నా లేదా రూ.100 ఉన్నా జాకబ్ పండించే ఆర్గానిక్ టమోటా మాత్రం 90 రూపాయలకే అమ్ముతుంటాడు. అయినా.. వినియోగదారులు జాకబ్ పండించిన టమోటాలనే ఎంతో ఇష్టపడి ఖరీదు చేస్తుండడం విశేషం. అదే విధంగా తాను పండించే మిర్చిని రూ. 120కి, బెండకాయలను రూ.70కి అమ్ముతానని జాకబ్ తెలిపాడు. మామిడి, చికూ లాంటి పండ్ల జాతులను కూడా జాకబ్ తన టెర్రస్ గార్డెన్ లో సాగు చేస్తున్నాడు. జాకబ్ టెర్రస్ తోటలో వినియోగించిన మట్టినే మళ్లీ మళ్లీ వినియోగిస్తుంటాడు. ఒక పంట పండించిన తర్వాత జాకబ్ ఆ మట్టికి ఆర్గానిక్ ఎరువులను కలుపుతుంటాడు. అలా కలిపిన మిశ్రమాని మళ్లీ పోషకాలు వచ్చే దాకా జాకబ్ తన టెర్రస్ లో ఓ మూలకు పోగుపెడుతుంటాడు.