కేరళలోని కన్నూరు జిల్లాకు చెందిన ఏవీ ధనంజయన్ ఆర్గానిక్ టెర్రస్ ఫార్మింగ్‌లో దిట్ట. వంటగదిలో మిగిలిన వ్యర్థ పదార్థాలతోనే ధనంజయన్ తన టెర్రస్ పంటలకు ఎరువులు, పురుగులు ఆశించకుండా నివారించే మందులు తయారు చేసుకోవడంలో చక్కని నైపుణ్యం సంపాదించాడు. ధనంజయన్ ఐదేళ్ల క్రితమే కేబుల్ ఆపరేటర్ ఉద్యోగాన్ని వదిలిపెట్టేశాడు. అప్పటికి ధనంజయన్ భార్య జాబ్ చేస్తోంది. పిల్లలు స్కూళ్ల చదువులకు వెళ్లిపోతున్నారు. దీంతో ధనంజయన్‌కు చాలా ఖాళీ సమయమే ఉండేది. టెర్రస్ మీద పంటలు సాగు చేయడాన్ని ధనంజయన్ తనకు ఓ హాబీలా చేసుకున్నాడు. అలా నెలలు గడుస్తున్న కొద్దీ ఆర్గానిక్ విధానంలో టెర్రస్ మీద పంటల సాగుపై మరింతగా ఆసక్తి పెరిగిపోయింది. ఆ క్రమంలో ధనంజయన్ ‘కృషితోత్తమ్’ అనే ఫేస్ బుక్ గ్రూపులో సభ్యుడై ఆర్గానిక్ పంటల సాగులో శాస్త్రీయమైన అవగాహన పెంచుకున్నాడు.
ముందుగా ధనంజయన్.. తమకు ఉన్న 1,000 చదరపు అడుగు విస్తీర్ణం ఉన్న టెర్రస్ మీద గ్రోబ్యాగ్ విధానంలో సాంప్రదాయ విధానాల్లో కూరగాయలు పండించేవాడు. అలా ధనంజయన్ తమ టెర్రస్ మీద 250 గ్రో బ్యాగుల్లో బెండ, వంకాయ, టమాటో, మిర్చి, కాకరకాయలు సాగు చేస్తున్నాడు. అలాగే పాలకూర, క్యాబేజ్, కాలీఫ్లవర్, బ్రొకోలీ, కాప్సికమ్ లాంటి పంటలు కూడా పండిస్తున్నాడు. ధనంజయన్ తన టెర్రస్‌పై రెడ్ లేడీ బొప్పాయి పంట కూడా పండిస్తున్నాడు. ఈ పంటలన్నింటికీ ధనంజయన్ డ్రిప్ ఇరిగేషన్ విధానం అవలంబించి నీటిని బాగా పొదుపు చేస్తున్నాడు. డ్రిప్ ఇరిగేషన్ విధానంలో నీటిని డ్రమ్ముల్లో వారానికి ఒకసారి నింపినా మొక్కలకు చక్కగా సరిపోతుంది. టెర్రస్ మీద ఆర్గానిక్ ఫార్మింగ్‌లో శాస్త్రీయతను జోడించడంతో 2019లో ధనంజయన్‌ను కేరళ ప్రభుత్వం ‘ఉత్తమ టెర్రస్ ఫార్మర్ అవార్డు’ ఇచ్చి సత్కరించింది.
ధనంజయన్ తన వంటి ఇంటి వ్యర్థ పదార్థాలతో తయారుచేసే సేంద్రీయ ఎరువుల ద్వారా మొక్కలకు చక్కని పోషకాలు అందుతాయి. వంట గది వ్యర్థాలే కాకుండా ఎండిన ఆకులు, చిన్న చిన్న మొక్కల కొమ్మలు, పౌల్ట్రీ నుంచి లభించే వ్యర్థాలతో కూడా ధనంజయన్ ఆర్గానిక్ ఎరువులు తయారు చేస్తుంటాడు. ఆకులు, మొక్కల కొమ్మలు, పౌల్ట్రీ వ్యర్థాలను ఉపయోగిస్తే.. ఆర్గానిక్ ఎరువులు మరింత వేగంగా తయారవుతాయి. టెర్రస్‌పై ఆర్గానిక్ వ్యవసాయం చేయడంలో ధనంజయన్‌కు కుటుంబం మద్దతు కూడా పూర్తిగా లభిస్తోంది.