కేరళలోని కన్నూరు జిల్లాకు చెందిన ఏవీ ధనంజయన్‌ ఆర్గానిక్‌ టెర్రస్ ఫార్మింగ్‌లో దిట్ట. వంటగదిలో మిగిలిన వ్యర్థ పదార్థాలతోనే ధనంజయన్‌ తన టెర్రస్ పంటలకు ఎరువులు, పురుగులు ఆశించకుండా నివారించే మందులు తయారు చేసుకోవడంలో చక్కని నైపుణ్యం సంపాదించాడు. ధనంజయన్‌ ఐదేళ్ల క్రితమే కేబుల్‌ ఆపరేటర్‌ ఉద్యోగాన్ని వదిలిపెట్టేశాడు. అప్పటికి ధనంజయన్‌ భార్య జాబ్‌ చేస్తోంది. పిల్లలు స్కూళ్ల చదువులకు వెళ్లిపోతున్నారు. దీంతో ధనంజయన్‌కు చాలా ఖాళీ సమయమే ఉండేది. టెర్రస్‌ మీద పంటలు సాగు చేయడాన్ని ధనంజయన్‌ తనకు ఓ హాబీలా చేసుకున్నాడు. అలా నెలలు గడుస్తున్న కొద్దీ ఆర్గానిక్ విధానంలో టెర్రస్‌ మీద పంటల సాగుపై మరింతగా ఆసక్తి పెరిగిపోయింది. ఆ క్రమంలో ధనంజయన్‌ ‘కృషితోత్తమ్‌’ అనే ఫేస్‌ బుక్‌ గ్రూపులో సభ్యుడై ఆర్గానిక్‌ పంటల సాగులో శాస్త్రీయమైన అవగాహన పెంచుకున్నాడు.

ముందుగా ధనంజయన్‌.. తమకు ఉన్న 1,000 చదరపు అడుగు విస్తీర్ణం ఉన్న టెర్రస్‌ మీద గ్రోబ్యాగ్‌ విధానంలో సాంప్రదాయ విధానాల్లో కూరగాయలు పండించేవాడు. అలా ధనంజయన్‌ తమ టెర్రస్ మీద 250 గ్రో బ్యాగుల్లో బెండ, వంకాయ, టమాటో, మిర్చి, కాకరకాయలు సాగు చేస్తున్నాడు. అలాగే పాలకూర, క్యాబేజ్‌, కాలీఫ్లవర్‌, బ్రొకోలీ, కాప్సికమ్‌ లాంటి పంటలు కూడా పండిస్తున్నాడు. ధనంజయన్‌ తన టెర్రస్‌పై రెడ్‌ లేడీ బొప్పాయి పంట కూడా పండిస్తున్నాడు. ఈ పంటలన్నింటికీ ధనంజయన్‌ డ్రిప్‌ ఇరిగేషన్‌ విధానం అవలంబించి నీటిని బాగా పొదుపు చేస్తున్నాడు. డ్రిప్ ఇరిగేషన్ విధానంలో నీటిని డ్రమ్ముల్లో వారానికి ఒకసారి నింపినా మొక్కలకు చక్కగా సరిపోతుంది. టెర్రస్‌ మీద ఆర్గానిక్‌ ఫార్మింగ్‌లో శాస్త్రీయతను జోడించడంతో 2019లో ధనంజయన్‌ను కేరళ ప్రభుత్వం ‘ఉత్తమ టెర్రస్ ఫార్మర్‌ అవార్డు’ ఇచ్చి సత్కరించింది.ధనంజయన్‌ వినియోగిస్తున్న డ్రిప్ ఇరిగేషన్‌ విధానం అందరూ వాడే విధానానికి భిన్నంగా ఉంటుంది. డ్రిప్ ఇరిగేషన్‌ సిస్టంను ఎక్కడికి కావాలంటే అక్కడికి సునాయాసంగా తీసుకువెళ్లవచ్చు. అలాగే దాన్ని ఐదు నిమిషాల లోపే అమర్చుకోవచ్చు కూడా. ఇలాంటి సులభతరమైన డ్రిప్‌ ఇరిగేషన్‌ సిస్టంను కొల్లాంకు చెందిన బిజు జలాల్‌ రూపొందించాడు. ఈ విధానంలో టెర్రస్‌ బేస్‌మెంట్‌ మీద పైపులు, గుడ్డల చుట్టలు పెట్టుకోవాలి. వాటిపైన 100 కిలోల బరువును తట్టుకోగల ట్రేలు పెట్టుకోవాలి. గ్రోబ్యాగ్‌లు లేదా మట్టి కుండల్లో మొక్కలు నాటి ఆ ట్రేలపై ఉంచాలి. ఆ మొక్కలకు పైపుల ద్వారా సన్నగా నీరు సరఫరా అయ్యేలా చూసుకోవాలి.

ధనంజయన్‌ తన వంటి ఇంటి వ్యర్థ పదార్థాలతో తయారుచేసే సేంద్రీయ ఎరువుల ద్వారా మొక్కలకు చక్కని పోషకాలు అందుతాయి. వంట గది వ్యర్థాలే కాకుండా ఎండిన ఆకులు, చిన్న చిన్న మొక్కల కొమ్మలు, పౌల్ట్రీ నుంచి లభించే వ్యర్థాలతో కూడా ధనంజయన్‌ ఆర్గానిక్‌ ఎరువులు తయారు చేస్తుంటాడు. ఆకులు, మొక్కల కొమ్మలు, పౌల్ట్రీ వ్యర్థాలను ఉపయోగిస్తే.. ఆర్గానిక్ ఎరువులు మరింత వేగంగా తయారవుతాయి. టెర్రస్‌పై ఆర్గానిక్‌ వ్యవసాయం చేయడంలో ధనంజయన్‌కు కుటుంబం మద్దతు కూడా పూర్తిగా లభిస్తోంది.ధనంజయన్‌ తమ టెర్రస్‌పై మొక్కలకు వినియోగించగా మిగిలిన ఆర్గానిక్‌ ఎరువులను ఇతరులకు అమ్మి చక్కని లాభాలు సంపాదిస్తున్నాడు. ఆర్గానిక్‌ ఎరువులను 4 కిలోల బ్యాగుల్లో నింపి, కిలోకు రూ.30 చొప్పున విక్రయిస్తుంటాడు. తమ టెర్రస్‌ మొక్కలకు వినియోగించగా మిగిలిన ఆర్గానిక్‌ ఎరువులను ధనంజయన్‌ ఫేస్‌ బుక్‌ వేదికగా విక్రయిస్తుంటాడు. తన ఆర్గానిక్‌ ఎరువులకు సంబంధించి గొప్ప ఫీడ్‌ బ్యాక్‌ కూడా రైతులు ధనంజయన్‌కు ఫేస్‌ బుక్‌ ద్వారా ఇస్తుంటారు. ఆర్గానిక్‌ ఎరువులతో పాటుగా ధనంజయన్‌ ఆర్గానిక్‌ పెస్ట్‌ కంట్రోల్‌ స్ప్రేలు, ఆర్గానిక్‌ విత్తనాలు, మొక్కల్ని కూడా అమ్ముతుంటాడు. అలా ధనంజయన్‌ దుకాణాల్లోను, తోటల్లో కన్నా తక్కువ ధరకే తన ఉత్పత్తులను విక్రయించడంతో డిమాండ్‌ కూడా ఎక్కువగానే ఉంది. నెలకు సుమారు వెయ్యి కిలోల వరకు ధనంజయన్‌ తన ఆర్గానిక్‌ ఎరువులను విక్రయిస్తున్నాడు. ఈ మొత్తం పని అంతా ధనంజయన్‌ ఒక్కడే చేయడం విశేషం. టైమ్‌ పాస్‌ కోసం హాబీగా ప్రారంభించిన టెర్రస్‌పై ఆర్గానిక్‌ సాగు ఇప్పుడు ధనంజయన్‌కు చక్కని లాభాల పంట పండిస్తోంది.టెర్రస్‌పై ఆర్గానిక్‌ పంటల సాగు చేయాలనే ఉత్సాహం ఉన్న ఎవరైనా ధనంజయన్‌ను ఆయన ఫేస్‌ బుక్‌ ద్వారా కాంటాక్ట్‌ చేసి ఉత్పత్తులను కొనుగోలు చేయవచ్చు.

 

 

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here