చిన్నప్పటి నుంచీ తాను కంటున్న కలను ఓ 27 ఏళ్ల బందరుబాబు 2017లో నెరవేర్చుకున్నాడు. ప్రకృతి సాగులో మమేకమై తానే ఓ సరికొత్త ఆర్గానిక్ ప్రపంచాన్ని తన టెర్రస్ మీదే సృష్టించుకున్నాడు. కుటుంబ అవసరాలకు కావాల్సిన పండ్లు, కూరగాయలు తానే సేంద్రీయ విధానంలో పండించుకుంటున్నాడు. తనతో పాటు ‘బందరు బృందావనం’ పేరుతో ఫేస్బుక్లో ఓ గ్రూప్ సృష్టించాడు. ఆ గ్రూపులో సమాచారం, వీడియోలు పెట్టి ప్రకృతి వ్యవసాయం వైపు వందలాది మంది అడుగులు వేసేలా చేస్తున్నాడు. ఈ నాటి మన కథకు బందరుబాబు అదేనండీ అన్నా మణిరత్నం మన హీరో.
నెలకు కేవలం 500 లేదా 600 రూపాయల ఖర్చుతో జీవామృతం, పంచకావ్య లాంటి ఆర్గానిక్ ఎరువులు సొంతంగా తయారు చేసుకుంటున్నాడు బందరుబాబు. కొద్దిపాటి ఖర్చుతో తన టెర్రస్ గార్డెన్‌పై ఎర్రజామ (రెడ్ గువా), సీతాఫలం లాంటి పండ్ల జాతులు, టమాటా, వంకాయ లాంటి కూరగాయల మొక్కలు, తోటకూర, గోంగూర, పాలకూర లాంటి ఆకు కూరల జాతులు, మల్లెపూవు లాంటి పూలమొక్కలు, జుట్టుకు మేలు చేసే భృంగరాజ్, ఉప్పిచెట్టు (సోర్సోప్), బోన్సాయ్ మొక్కలు ఎన్నో పెంచుతున్నాడు. ఇలా తన 675 చదరపు అడుగుల టెర్రస్‌పై 100 రకాలకు పైగా మొక్కల్ని మణిరత్నం పెంచుతున్నాడు.
మొదట మణిరత్నం తన టెర్రస్‌పై తులసి మొక్కలు పెంచడం ద్వారా ఆర్గానిక్ ఫార్మింగ్ ప్రారంభించాడు. తర్వాత మల్లె లాంటి పలు పూలమొక్కల విత్తనాలు, టమాటా, వంకాయ లాంటి కాయగూరల విత్తనాలు సంపాదించి టెర్రస్‌పై పాత ప్లాస్టిక్ డబ్బాలు, బకెట్లలో నాటాడు. ఆ మొక్కల నుంచి వచ్చే పంటలను మణిరత్నం కుటుంబం నిత్యం వినియోగిస్తోంది. మొక్కలకు జీవామృతం, పంచకావ్య లాంటి ఆర్గానిక్ ఎరువులు మాత్రమే వాడుతున్నాడు. ఈ ఆర్గానిక్ ఎరువుల తయారీకి ముందుగా మణిరత్నం తన ఇంటి చుట్టుపక్కల ఆవులున్న వారి నుంచి పేడ, ఆవు మూత్రం తీసుకుని టెర్రస్‌పైనే పాత డబ్బాల్లో వాటిని నిల్వ ఉంచేవాడు. వాటిలో నీరు కలిపి పలుచగా చేసి ప్రతి నెలా 150 లీటర్ల జీవామృతం తయారుచేసేవాడు. ఆ జీవామృతాన్ని ప్రతి 14 రోజులకు ఓసారి మొక్కలకు వేస్తాడు. తాను ఆర్గానిక్ పార్మింగ్ ప్రారంభించిన తొలి రోజుల్లో తమ చుట్టుపక్కల వారు ఆవుపేడ, మూత్రాన్ని ఉచితంగానే ఇచ్చేవారని మణిరత్నం చెప్పాడు. కరోనా లాక్డౌన్ సమయంలో ఆర్గానిక్ ఎరువులు కొనేందుకు కూడా బయట దొరకనప్పుడు తమ వంట ఇంట్లో మిగిలిన పదార్థాలనే కంపోస్ట్ ఎరువుగా తయారు చేసి వినియోగించినట్లు వెల్లడించాడు.
భవిష్యత్తులో తమ గ్రూపు ద్వారా మరింత ఎక్కువ మంది తమ తమ ఇళ్లలో ఆర్గానిక్ పంటల సాగు చేసేలా చేయాలని ఆశాభావంతో మణిరత్నం ఉన్నాడు. తద్వారా మంచి జీవన విధానం అలవాటు అవుతుందని, ఆరోగ్యకరమైన సమాజం వస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాడు మన బందరుబాబు అన్నె మణిరత్నం.
You can join Mani’s FB group Bandar Brundavanam here.
Or contact on mobile number: +918885382341