మారుతున్న ఈ ఆధునిక కాలంలో ప్రతి మనిషి ప్రకృతి వైపు పరుగులు పెడుతున్నాడు. ప్రతి ఒక్కరిలోనూ తమ ఆరోగ్యం పట్ల శ్రద్ధ మరింతగా పెరుగుతోంది. ఈ కోవలోకే మన తెరవేల్పులు (సినీ నటులు) కూడా వస్తున్నారు. నటీనటులు అనేక మంది కేవలం పట్టణాలు, నగరాలకే పరిమితం కాకుండా గ్రామాలను ఇష్టపడుతున్నారు. మరీ ముఖ్యంగా ఫాంహౌస్‌లు ఏర్పాటు చేసుకుని ఖాళీ సమయాల్లో ప్రకృతితో మమేకం అవుతున్నారు. మరికొందరు నటీనటులు ఫాంహౌస్ ఆవరణలో ప్రకృతి సిద్ధంగా పంటలు పండించుకుని వాటినే వినియోగించి ఆనందంగా గడుపుతున్నారు. ఇలా చేస్తున్న వారిలో బహుభాషా విలక్షణ నటుడు ప్రకాశ్‌రాజ్ ఒకరు. శంషాబాద్ సమీపంలో తన ఫాంహౌస్ ‘లైఫ్ ఎట్ ప్రకాశం’లో లాక్డౌన్ సమయాన్ని తన భార్య పోనీ వర్మ, కొడుకు వేదాంత్‌తో ఆనందంగా గడిపారు.
సినిమాల్లో ఎంత బిజీగా ఉన్నప్పటికీ ఈ విలక్షణ నటుడు ప్రకాశ్‌రాజ్ అప్పుడప్పుడూ ప్రకృతితో మమేకం అయిపోతుంటారు. ఒక్కోసారి ఒంటరిగానే లాంగ్ డ్రైవ్ వెళ్లిపోతారు. పూర్తి ఆహ్లాదాన్ని, ఆనందాన్ని కలిగించే ప్రకృతి మధ్యలోకి వెళ్లిపోతారు. అక్కడే ఓ టెంట్ వేసుకుని తనకు నచ్చినన్ని రోజులు ప్రకృతితో మాట్లాడుతూ గడిపేస్తారు.
సహజసిద్ధంగా తాను పండించే పంటల ఫొటోలను ప్రకాశ్‌రాజ్ అప్పుడప్పుడు తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేస్తుంటారు. నిజానికి సహజ పంటల సాగులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నుంచి ప్రకాశ్‌రాజ్ స్ఫూర్తి పొందారట. పవన్ కళ్యాణ్ కూడా తన ఫాంహౌస్ రకరకాల పంటల్ని సహజ వ్యవసాయ సాగు విధానంలో పండిస్తుంటారు. పలు ఆవులను కూడా పవన్ కళ్యాణ్ పెంచుతున్నారు. ఆవుల్ని, వాటి దూడల్ని కూడా పవన్ కళ్యాణ్ ఎంతో ప్రేమగా సాకుతుంటారు.
ప్రకాశ్‌రాజ్ ఓసారి తన ఫాంహౌస్‌లో పండిన జీడిమామిడి కాయల్ని కోస్తున్న ఫోటో ఒకటి ట్విట్టర్లో పెడితే మంచి స్పందన వచ్చింది. జీడిమామిడి పళ్లు, మామిడికాయలు ఓ బల్లపై పెట్టి, వేదాంత్‌ను ఓ కుర్చీలో కూర్చోబెట్టిన అమ్ముతున్నట్లు ఓ ఫొటోను ప్రకాశ్‌రాజ్ ట్విట్టర్ పెట్టారు.