Site icon V.E.R Agro Farms

విటమిన్ ‘డి’ పండించే చింతల వెంకట్ రెడ్డి

హైదరాబాద్ నగరానికి చెందిన ఉత్తమ రైతు, పద్మశ్రీ అవార్డు గ్రహీత చింతల వెంకట్ రెడ్డి (70) మరోసారి ప్రముఖంగా వార్తల్లో నిలిచారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2021 ఫిబ్రవరి 28న తన ‘మన్ కీ బాత్’ కార్యక్రమంలో, వెంకట రెడ్డి పేరు ప్రస్తావించి ప్రశంసల వర్షం కురిపించారు. వెంకట రెడ్డి వంటి వ్యక్తుల నుండి ప్రేరణ పొందాలని ఆయన ఉద్బోధించారు.
‘జాతీయ విజ్ఞాన దినోత్సవం’ (National Science Day) సందర్భంగా భారతీయ శాస్త్రవేత్తలు, భారతీయ విజ్ఞాన శాస్త్రం గురించి మరింత తెలుసుకోవలసిన అవసరం ఉందని ప్రధాని వ్యాఖ్యానించారు. యువతరం ఇండియన్ సైన్స్‌పై అధ్యయనం చేయాలనీ, అది ప్రయోగశాలలకు మించినదనీ ఆయన అన్నారు. ‘ల్యాబ్ టు ల్యాండ్’ ప్రాముఖ్యతను గురించి నొక్కి చెప్పిన ప్రధాని హైదరాబాద్‌కు చెందిన ‘విలక్షణ రైతు’ చింతల వెంకట్ రెడ్డి గురించి ప్రస్తావించారు.
విటమిన్ ‘డి’ లోపం గురించి తన డాక్టర్ మిత్రుడి ద్వారా విన్న వెంకట్ రెడ్డి, ఆ తర్వాత దానిపై ఆలోచించడం ప్రారంభించారనీ మోదీ వివరించారు. తన వ్యవసాయ క్షేత్రంలో చేసిన పరిశోధనలు, ప్రయత్నాల ద్వారా ఆయన విటమిన్ ‘డి’ సమృద్ధిగా ఉండే వివిధ రకాల గోధుమలు, బియ్యం పండించగలిగారని ప్రధాని ప్రశంసించారు. ప్రపంచ మేధో సంపత్తి సంస్థ (World Intellectual Property Organisation) నుండి తన ఆవిష్కరణకుగాను వెంకట్ రెడ్డి పేటెంట్ కూడా సాధించారని ఆయన చెప్పారు. గత ఏడాది (2020) వెంకట్ రెడ్డిని ‘పద్మశ్రీ’ అవార్డుతో సత్కరించడం భారత ప్రభుత్వానికి గర్వకారణమని మోదీ అన్నారు. ప్రధాని స్వయంగా వెంకట్ రెడ్డి పేరు ప్రస్తావించడంతో ఆయన మరోసారి జాతీయవార్తల్లో నిలిచారు. ఇది తెలుగువారందరికీ ఎంతో గర్వకారణం.

విటమిన్ ‘డి’ వంగడాల సృష్టి

విటమిన్ ‘డి’ సూర్యుడి నుండి మనకు లభిస్తుందన్న విషయం తెలిసిందే. మనుషులకు ఈ విటమిన్ సూర్యరశ్మి నుండి అందుతున్నప్పుడు మొక్కలు దాన్ని ఎందుకు పొందుపరచుకోలేవు? మొక్కలను మనం విటమిన్ ‘డి’ అందించే వాహికలుగా ఉపయోగించుకోగలమా?… 2017లో వెంకట్ రెడ్డి మనసులో తలెత్తిన ఈ ప్రశ్నలు సరికొత్త ఆవిష్కరణకు దారిచేశాయి. 
“మొక్కలు తమ మనుగడ కోసం కిరణజన్య సంయోగ క్రియను ప్రాసెస్ చేయగలిగితే, అవి విటమిన్ ‘డి’ని మాత్రం ఎందుకు ఉత్పత్తి చేయలేవు?” అని సికిందరాబాద్‌వాసి అయిన వెంకట్ రెడ్డి ఆలోచించారు.
మన శరీరంలో భాస్వరం, కాల్షియం నియంత్రణలోను, శోషణలోను (absorption) విటమిన్ ‘డి’ ముఖ్యమైన పాత్రను పోషిస్తుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచడానికి సహాయపడుతుంది. విటమిన్ ‘డి’ లోపం మనలో అలసట, ఒళ్లు నొప్పులు, ఎముకల, కండరాల నొప్పులు, కొన్ని సార్లు ఎముకల పగుళ్లకు కారణమవుతుంది. పుట్టగొడుగులు తప్ప వేరే మొక్కలలో విటమిన్ ‘డి’ కనిపించదు. ఈ నేపథ్యంలో మొదట మొక్కల్లో ఉండే విటమిన్ల గురించి వెంకట్ రెడ్డి పరిశీలించారు. ఇందుకు తన డైరీని తిరగేశారు. లోగడ డాక్యుమెంట్ చేసిన తన వ్యవసాయ ప్రయోగాలన్నింటినీ మరోసారి చదివారు. విటమిన్ ఎ, సి (vitamin A and C ) లని అధిక నిష్పత్తిలో సంశ్లేషణ చేసే మొక్కల గురించి కొంత సమాచారం లభించింది. దీంతో ఆ రకాల ద్వారా విటమిన్ ‘డీ’ని మొక్కల్లో సాధించేందుకు ప్రయత్నాలు ప్రారంభించాలని నిర్ణయించుకున్నారు. విటమిన్లను ప్రాసెస్ చేసే సామర్థ్యం ఉండడంతో వెంకట్ రెడ్డి వాటిని ఎంచుకున్నారు. 
తన ప్రయోగాల్లో భాగంగా మూడు మడులలో వరి, గోధుమ వేసి వేర్వేరు పద్ధతుల ద్వారా విటమిన్ డీ కోసం ఆయన ప్రయత్నించారు. మొదటి మడిలో నెయ్యి, జున్ను, గుడ్లు, పాలు, ఇతర జంతు ఆధారిత విటమిన్ ‘డి’ మిశ్రమాన్ని మొక్కలకు అందించారు. మరో మడిలో విటమిన్ ‘డి’ మాత్రలతో తయారు చేసిన ద్రావణాన్ని వాడారు. మూడవ మడిలో క్యారెట్, చిలగడదుంప, మొక్కజొన్న పిండితో తయారు చేసిన కల్కాన్ని(paste) వాడారు. వెంకట్ రెడ్డి రెండేళ్ల పాటు ఇలా పలు ప్రయోగాలూ చేశారు. అయితే చివరికి, చిలగడదుంప, మొక్కజొన్న పిండి, క్యారెట్‌లను ఉడకబెట్టి తయారు చేసిన మెత్తని మిశ్రమం విటమిన్ ‘ఎ’ ని విటమిన్ ‘డి’గా మార్చడంలో మొక్కలకు సహాయపడుతుందని ఆయన గ్రహించారు. కాగా, మిగతా మడులలో చేసిన ప్రయోగాలు ఎలాంటి ఫలితాలు ఇవ్వలేదు.

తన పొలంలో శ్రీ చింతల వెంకట్ రెడ్డి

వెంకట్ రెడ్డికి అంతర్జాతీయ పేటెంట్

2018-2019లో (మొదటి సంవత్సరం) పండిన గోధుమను పరీక్షిస్తే విటమిన్ ‘డి’ తాలూకు 1,606 అంతర్జాతీయ యూనిట్లు (ఐయు) ఉన్నట్లు వెల్లడైంది. ఆపై రెండో సంవత్సరం అది 1,803 IU కి పెరిగింది. 2019లో బాస్మతి బియ్యం 136 IU, 2021లో 287 IU కలిగి ఉన్నట్లు తేలింది. దీంతో ఈ నమూనాలను ఆయన ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం నిపుణులకు, ఇతర ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. వారు కూడా వివిధ నేలల్లో వాటిని పరీక్షించారు. ఫలితాలు కొద్దిపాటి వ్యత్యాసాలతో ఒకే రీతిగా వచ్చాయి. అవన్నీ విటమిన్ ‘డి’ ఉనికిని చూపించాయి. దీంతో వెంకట్ రెడ్డి వెంటనే 2019లో అంతర్జాతీయ పేటెంట్ కోసం జెనీవాలోని World Intellectual Property Organization (WIPO)ని సంప్రదించారు. విధివిధానాలన్నీ పూర్తయ్యాక 2020 ఆగస్టులో ఆయనకు ఆ పేటెంట్‌ లభించింది.
భారతదేశంతో పాటు ఆఫ్రికాలోని ఇతర దేశాలలో ఉన్న పోషకాహార లోపం సమస్యను పరిష్కరించడానికి ఈ కొత్త రకం బియ్యం, గోధుమ వంగడాలు సహాయపడతాయని చింతల వెంకట్ రెడ్డి చెబుతారు. ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించే ఎంఓయు (MoU)కు వెంకట్ రెడ్డి సంసిద్ధత వ్యక్తం చేశారు. “ఈ వంగడాలతో రైతులు వాటిని సాగు చేసుకోగలుగుతారు. విటమిన్ డి కలిగి ఉన్న బియ్యం, గోధుమలను అమ్మడం ద్వారా రైతుల ఆదాయం కూడా పెరుగుతుంది” అని ఆయన అంటున్నారు. ప్రస్తుతం వెంకట్ రెడ్డి అల్వాల్ లోని తన పొలంలో ఈ వంగడాలను సాగుచేస్తున్నారు.

“భారత ప్రభుత్వం ఈ వంగడాలను రైతులకు అందించాలనుకుంటే, సహాయం చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను” అని ఆయన చెబుతున్నారు. ప్రభుత్వం కనుక ఆసక్తి చూపకపోతే, వాటిని బహుళజాతి కంపెనీలకు ఇస్తానంటున్నారు. విటమిన్ డీ వంగడాలను పండిస్తే కోవిడ్ -19 వంటి మహమ్మారులకు ఎదుర్కోగలిగే రోగనిరోధక శక్తిని అవి చేకూర్చగలవని వెంకట్ రెడ్డి సూచిస్తున్నారు. చింతల వెంకట్ రెడ్డి సంప్రదాయ వ్యవసాయ పద్ధతులకు ఎప్పుడూ కొంత భిన్నంగానే నడిచారు. వరి సాగులో భూసారాన్ని పునరుద్ధరించడానికి నాలుగు అడుగుల లోతు నుండి మట్టిని కెళ్లగించి పైకి మార్చాలనీ, అది మంచి ఎరువుగా ఉపయోగపడుతుందనీ సూచించి ఆయన పదిహేనేళ్ల కిందటే వినూత్న వ్యవసాయ ప్రయోగాల బాటన సాగారు. తెగుళ్ళను నివారించేందుకు కూడా ఆయన ఇలాంటి పద్ధతినే అనుసరించారు. నేలని తవ్వి, లోపల అడుగున ఉండే మట్టిని వెలికి తీసి, ఎండనిచ్చి, ఆ తర్వాత దాన్ని నీటిలో కలిపి పిచికారీ చేయాలని వెంకట్ రెడ్డి సూచించారు. ద్రాక్షతోటలో దీన్ని వాడి కూడా చూపించారు. ఈ మిశ్రమం మంచి క్రిమిసంహారకంగా ఉపయోగపడుతుందని ఆయన చెబుతారు. తొలి నుంచీ వెంకట్ రెడ్డి ఇలా ఆర్గానిక్ సాగునే నమ్ముకున్నారు. వ్యవసాయరంగంలో విశేష కృషికిగాను వెంకట్ రెడ్డి లోగడ పలు అవార్డు అందుకున్నారు. 2006లో ఆయన ఉత్తమ రైతు పురస్కారానికి ఎంపిక అయ్యారు. 
ఇదిలావుండగా, లద్దాఖ్‌కు చెందిన ఉర్గైన్ ఫుంట్‌సోగ్, మదురైకి చెందిన మురుగేశన్, యుపిలోని బారాబంకికి చెందిన హరిశ్చంద్ర, గుజరాత్‌ పటాన్ జిల్లాకు చెందిన కమరాజ్ భాయ్ చౌదరి వంటి విలక్షణ ఉత్తమ రైతుల గురించి కూడా మోదీ తన ‘మన్ కీ బాత్’ ప్రసంగంలో ప్రస్తావించారు.

ఆసక్తిగలవారు మరిన్ని వివరాలకు శ్రీ చింతల వెంకట్ రెడ్డి గారిని 9866883336 మొబైల్ నంబర్ ద్వారా సంప్రదించవచ్చు.

శ్రీ వెంకట్ రెడ్డి కృషిపై ప్రధాని మోదీ ప్రశంసలు – ఆడియో కోసం ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి!

https://www.veragrofarms.com/wp-content/uploads/2021/03/PM-Modi-Man-Ki-Baat-1.mp4

Exit mobile version